కొంచెం కొత్తచూపు ఇవ్వు

Special Story Written By Neeti Suryanarayana Sharma In Funday On 10/11/2019 - Sakshi

నేతి సూర్యనారాయణ శర్మ

కుమారిల భట్టు తుషాగ్నిలో ప్రవేశించి శరీరాన్ని విడిచిపెట్టేశాడు. శంకరుని నోటివెంట నిర్వాణ షట్క రూపంలో ఆత్మబోధను వింటూ విరాడ్రూపంలో మమేకమయ్యాడు. భట్టపాదుని సూచన మేరకు శంకరుడు శిష్యసమేతంగా మాహిష్మతికి ప్రయాణమయ్యాడు. పురాణకాలంలో మాహిష్మతి వేయి చేతుల కార్తవీర్యార్జునునికి రాజధాని. చారిత్రక యుగంలో ఉజ్జయిని రాజధానిగా అవంతీ రాజ్యం ఏర్పడింది. విక్రమ శక సృష్టికర్త అయిన విక్రమాదిత్యుని కంటే పూర్వుడైన శ్రీహర్ష విక్రమాదిత్యుడు ఇప్పుడు అవంతిని పాలిస్తున్నాడు. అతడు శంకరునికి సాక్షాత్తూ గురుపుత్రుడే. గోవింద భగవత్పాదుని పూర్వాశ్రమనామం చంద్రశర్మ. ఆయన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రకాంతల యందు వరుసగా భర్తృహరి, విక్రమార్కుడు, భట్టి, వరరుచి అనే నలుగురు కుమారులను కన్నాడు. భర్తృహరి కొంతకాలం రాజ్యం చేసి విరాగి అయ్యాడు. విక్రమార్కుడు సింహాసనానికి వచ్చాడు. కాగా ఉజ్జయినికి పొరుగునే నర్మదా తీరంలో మాహిష్మతి ఉంది. దానికి ప్రభువు అమరుకుడు.

ప్రయాగ నుంచి సుమారు నూటతొంభై యోజనాల దూరంలో ఉన్న మాహిష్మతికి శంకర ప్రస్థానం రేవాఖండానికి సాగుతోంది. కొంత మైదానాల్లోనూ, మరికొంత నదీగర్భంలోనూ... వైశాఖ, జ్యేష్ఠమాసాలు కావడం వల్ల నర్మదలో అక్కడక్కడ నీటిచెలమలే ఉన్నాయి. ఆ తడీపొడీ ఇసుకలో దూరతీరాలు మెల్లగా చేరువవుతున్నాయి. బృందంగా సాగుతున్న ప్రయాణం మౌనంగానే ముగిసిపోదు. శిష్యుల పెదాలమీద నిర్వాణషట్కం నర్తిస్తోంది. ‘అహం నిర్వికల్పో నిరాకార రూపో’ స్తోత్రం సాగుతుంటే శంకరుని వైపుకు జరిగి నడుస్తున్నాడు విష్ణుశర్మ.

‘‘ఆచార్యదేవా! ఏమిటీ స్తోత్రం? ఇంత అసంబద్ధంగా ఉంది?!’’ అని అడిగాడు. ‘‘నేను నిర్వికల్పుణ్ణి... నిరాకార రూపుణ్ణి అంటూనే సర్వేంద్రియాలకూ ప్రభువును అని ప్రకటించడం ఎలా పొసగుతుంది? నిరాకారానికి ఇంద్రియాలుండనే ఉండవు కదా!’’ అని సందేహం వెలిబుచ్చాడు.‘‘అక్కడ ఉన్నది... అహం నిర్వికల్పో నిరాకారరూపో అని. నువ్వు చెప్పిన తర్కం సరైనది కావాలంటే రూపో అన్న రెండు అక్షరాలూ వ్యర్థపదాలు కావాలి కదూ విష్ణూ!’’ అన్నాడు పద్మపాదుడు జోక్యం చేసుకుంటూ.

శంకరుడు చిరునవ్వు నవ్వి, ‘‘విష్ణూ! ఈ నిర్వాణషట్కాన్ని భట్టపాదుని వంటి ఉత్తమాధికారిని ఉద్దేశించి చెప్పాను. నువ్వొక పని చెయ్యి. దీన్ని అవరోహణ క్రమంలో వ్రాయి. అంటే ఆరో శ్లోకాన్ని మొదటిగా, అయిదో శ్లోకం రెండుగా అలా వ్రాయి. అప్పుడు మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నుంచి చింతన ప్రారంభించు. ఒక్కొక్క అంశాన్ని గురించి అభ్యాసపూర్వకంగా తర్కించు. ఈ నిర్వాణ షట్కాన్ని ఆరోహణ, అవరోహణ క్రమాల్లో సాధన చేసినప్పుడు మాత్రమే మధ్యమ, మందాధికారులకు కూడా సంపూర్ణ ఆత్మతత్త్వం ఆవిష్కృత మవుతుంది’’ అని వివరించాడు. ‘‘చంపేశారు పోండి. అప్పుడు మొదటికే మోసం వస్తుంది’’ అన్నాడు విష్ణుశర్మ ఆదుర్దాగా. అందరూ అతని కేసి వింతగా చూశారు. ‘‘అవును మరి. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవేవీ ఆత్మ కావన్నారు. నిజానికి నాలుగూ ఒక్కటే కదా!’’ అన్నాడు విష్ణుశర్మ. ‘‘కాదు. మనస్సుకు చంద్రుడు, బుద్ధికి బ్రహ్మ, చిత్తానికి వాసుదేవుడు, అహంకారానికి రుద్రుడు అధిపతులు. నాలుగూ వేర్వేరు తత్త్వాలే’’ అన్నాడు పద్మపాదుడు అందుకుని.
‘‘సరిపుచ్చుకుంటున్నారు’’ సణిగాడు విష్ణుశర్మ.
శంకరుడు మందహాసం చేసి మరోసారి నిర్వాణషట్కాన్ని అభ్యాసం చేసే విధానాన్ని ఇటునుంచి నిర్వచించడం ప్రారంభించాడు....
‘‘నిరంతరమూ కదలాడుతుండే ఆత్మదీపాన్ని ఆకట్టి పెట్టుకోవాలని మనసుకి ఒకటే ఆరాటం. ప్రాణమనే రాటకు కట్టివుంచినా అదెప్పుడూ సంచలించిపోతూనే ఉంటుంది. మనసుతో పోటీపడే శక్తి బుద్ధికి లేదు. పదును తగ్గితే... పస కోల్పోతే... బుద్ధి నిన్ను రక్షించలేదు. దేనినుంచి కావాలి రక్షణ... నిన్ను నీవు గుర్తు తెచ్చుకోవడంలో ఎదురయ్యే ఏమరుపాటు నుంచి. ఇతరులకు నీ రూపం ఒకలా కనిపిస్తుంది.  నీకేమో అద్దంలో మరోలా తోస్తుంది. కళ్లు మూసుకుంటే ఇతరులు గుర్తొచ్చినట్లు నీకు నువ్వు ఎంతకీ గుర్తు రావు. నీ బొమ్మ ఏదో నీకు నీ చిత్తం చూపించదు. దృక్‌ దృశ్య వివేకాన్ని రేకెత్తనివ్వని అహం స్ఫురణ నిన్ను బయటికి చూస్తున్నంతగా లోనికి చూడనివ్వదు. చిత్త విభ్రమాలు, బుద్ధి జాడ్యాలు, మనోవికారాలను విడిచిపెట్టాలంటే నీ లోకసంచారం కట్టిపెట్టి కాస్త ఇటుగా నీ లోపలికి చూడు. కంటితో చూస్తున్నది... చెవులతో వింటున్నది అంతా నిజం కాదు. వాస్తవ తత్త్వబోధ తలకెక్కాలంటే నీ నాలుకను అటువైపు తిప్పు.

జన్మాంతరాల నుంచి వెంటబడుతున్న విషయ వాసనలను ఏవగించుకో. నోరార శివుని పాడు. అనిత్యమైన సుఖభోగాలను ఒక్కటొక్కటిగా త్యజించు. అలవాటు పడ్డ ప్రాణం కనుక వదిలిపెట్టిన చోటల్లా కొన్ని ఖాళీలు కనిపిస్తాయి. ఆ శూన్యమే చిదాకాశం. దానిని మహదాకాశంలో లయం చేసేవరకూ... అక్కడ ఆత్మదీప స్వరూపుడై శివుడొచ్చి కూర్చునే వరకూ శాంతి లేదు. తొమ్మిది చిల్లులున్న నీ దేహం ఆ దీపంపై బోర్లించి ఉంచిన ఒక మట్టికుండ. సాధకునికి అలసట లేదు. ప్రాణభీతి లేదు. వాయుప్రస్తారాన్ని అవలోకన చేస్తూ ప్రాణాయామంతో నాడీశోధన చేయి. అన్నమయ కోశంలో రసము, రక్తము, మాంసము, మేద, మజ్జ, అస్థి, శుక్రములనే సప్తధాతువులతో ఏర్పడిన స్థూల శరీరం నువ్వు కాదని ఎరుక పడుతుంది. ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాల్లో స్వేచ్ఛావిహారం చేసే సూక్ష్మశరీరం నీ ప్రభుత్వాన్ని అంగీకరిస్తుంది. మాటతోనూ, చేతులు కాళ్లతోనూ, పాయువు, ఉపస్థలతోనూ జీవుడు చేస్తున్న ప్రతిపనినీ పరికిస్తూ సుఖదుఃఖాలను తాననుభవించే కారణ శరీరం ఆనందమయ కోశంలో ఉంటుంది. నిజానికి పాపం దానికి ఇప్పటివరకూ దుఃఖమే కానీ ఆనందం తెలియదు. జన్మకు వచ్చిన ప్రతివాడికీ దుఃఖమే ఉంటుందని భావిస్తోంది. దానిని చిదానందరూప శివుడు అంటే జ్ఞానానందాన్ని పొందుతున్న వానిగా మలుచుకో. 
జీవుడు చేస్తున్న పుణ్యపాపాలు, సుఖదుఃఖాలు ఆత్మకు చెందవు. మంత్రాలు జపిస్తే, తీర్థాల్లో మునిగితే, వేదాలు వంటబట్టించుకుంటే, యజ్ఞయాగాలు చేస్తే పాపాలు తగ్గి, పుణ్యాలు పెరుగుతాయి. దుఃఖాలు పోయి సుఖాలే సుఖాలు వెంటపడి వస్తాయి అనుకుంటూ ఉంటారు. నిజం చెప్పాలంటే పుణ్యం చేయకపోవడమే పాపం. సుఖం లేకపోవడమే దుఃఖం. ఎలాగంటే వెలుగు లేకపోవడమే చీకటి. వేడిమి లేకపోవడమే చలి. చీకటి, చలి అంటూ ప్రత్యేకంగా లేవు.

కానీ జీవుడెప్పుడూ ప్రతి విషయాన్నీ రెండుగా చూస్తున్నాడు, అనుభవంలోకి తెచ్చుకుని దుఃఖిస్తున్నాడు. నేను మంచినే చేస్తున్నాను. దీనివల్ల అందరికీ మంచి జరుగుతుంది. ఆ పుణ్యం నాకు చెందుతుంది అనుకుంటూ కర్మలతో బంధాన్ని వేసుకుంటూనే ఉన్నాడు. ఈ పాశమే అరిషడ్వర్గాలనే పాకుడు మెట్లను సృష్టించి జీవుణ్ణి వేధిస్తోంది.  ధర్మార్థ కామ మోక్షాలలో నాలుగో పురుషార్థాన్ని దూరం చేస్తోంది. ఇంకో జన్మంటూ ఉంటే మనిషిగా మాత్రం పుట్టించకు స్వామీ! అని మొక్కుకుంటాడు మానవుడు. దైవమెప్పుడూ నీ కోరిక కాదనడు. నువ్వేం చెప్పినా వింటాడు. సరేనంటాడు. కానీ నిన్ను తనలో కలిపేసుకోమంటే అప్పుడేమంటాడు... సముద్రం తనను వెతుక్కుంటూ వచ్చిన ప్రతి నదినీ కలిపేసుకుంటుంది. కానీ మబ్బుల్లా మార్చి జన్మస్థానానికి పంపేస్తూ ఉంటుంది. దైవమూ అంతే! తన గర్భరత్నమై ప్రకాశించే వరకూ జీవుణ్ణి పరీక్షిస్తూనే ఉంటాడు. మృత్యుభయంతోనూ, మరణించి ఏమవుతానో అనే శంకతోనూ కొట్టుమిట్టాడుతుంటాడు మానవుడు. జాతిభేదాలను అనుసరించి, మతాన్ని బట్టి మోక్షమని వంచనలో పడతాడు. పూర్వజన్మల గురించి, పరజన్మల గురించి వృథా చింతనతో సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటాడు. నిజానికి కర్మబంధాలే కానీ, జన్మబంధాలు జీవుణ్ణి అనుసరించవు. కదాచిత్తుగా ఒకప్పుడు ఏ జన్మాంతరాలలోనో ఒక ఆత్మీయుడు ఎదురుపడితే ‘తత్త్వమసి’ అని నువ్వు గుర్తుపట్టగలవు. ఆ స్ఫురణ అప్పుడైనా, ఇప్పుడైనా శివుడే కానీ నువ్వు కావు.

పట్టుమని పది దేహాలతో ఉన్న నిన్ను ఒక్క దేహంలోకి మార్చి అమ్మ కడుపులో పడవేసిన వాడు పరమాత్మ. నీనుంచి తన తత్త్వాన్ని మరుగు పరిచి, ఊరికే నువ్వూ తానూ వేరంటాడు. అది నిజం కాదు.  పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, మనోవాక్కాయాలనే మూడు అంతఃకరణలు, పంచప్రాణాలు, పంచభూతాలు... వీటన్నింటినీ ఒకే సమూహంగా స్వీకరించినప్పుడు ఇవన్నీ కలిసి అయిదు సంఖ్య వస్తుంది. ఆ అయిదుతో పాటు అవిద్య, కామం, కర్మలను కలిపి పురి పేని కట్టిన కండె నుంచి సాలీడు దారంలా జీవుని ప్రయాణం సాగుతోంది. అంటే మొత్తం ఎనిమిది దేహాలతో జీవుడు రూపొందుతాడు. చిత్తంలో ఉంటూ బుద్ధి కుశలతతో, మనస్సు రూపొందించుకున్న తొమ్మిదో దేహం ఉంది. దానికి చిదాభాసుడు అని పేరు. వాడిని కలుసుకున్నా నువ్వు చిదానంద రూపుడైన శివుడు కాలేవు. ఆ తొమ్మిదింటికీ వేరే అయినా అది నువ్వే అయిన ప్రత్యగాత్మ పదోశరీరంగా ఉంది. నీలోపల చైతన్యాన్ని, వెలుగును నింపుతున్న శివస్వరూపం అదే. అదిగో... దానికీ నీకూ తేడా ఏమీ లేదని చెప్పడమే అద్వైత బోధ.’’ నర్మదలోని ఇసుక రేణువులు సైతం పరవశిస్తున్నాయి. శిలలన్నీ బాణలింగాలై చెవులప్పగించాయి. శంభుమూర్తి శివుడే శంకరుడై నడయాడుతుండగా స్పృశించిన ఏటిగాలులు లయబద్ధంగా తాళమేస్తున్నాయి.

గ్రీష్మ సూర్యుని ప్రతాపాన్ని చల్లబరుచుకున్నట్లున్నాడు. ఆకాశంలో సన్నని చినుకు బయలుదేరింది. ఆషాఢ మేఘాలు తమ ముందస్తు రాకను ప్రకటించాయి. శంకరుడు ముగింపునిస్తూ, ‘‘మందాధికారులైన వారు ఇలా ఆత్మవిచారణ చేసినప్పుడు నిర్వాణ షట్కం నిర్వికల్ప సమాధిని అనుగ్రహిస్తుంది’’ అన్నాడు. మగధ సామ్రాజ్యపు సరిహద్దులు వెనకబడ్డాయి. హైహయ, చేది వంశాలు ఒకప్పుడు ఏలిన విదిశా నగరానికి దక్షిణ దిక్కుగా సరిహద్దుల మీదుగా శంకరయతి బృందం  సాగిపోతోంది. శిష్యులంతా మౌనంగా ఉన్నారు. విష్ణుశర్మ మాత్రం, ‘‘నిప్పుల్లో దూకి అన్యాయంగా ప్రాణం తీసుకున్న కుమారిల భట్టును ఉత్తమాధికారి అన్నారు. మందాధికారుల కోసం స్తోత్రం తిరగవేసి రాసి వుంచమన్నారు. మరి మధ్యమాధికారుల సంగతేమిటి?’’ ప్రశ్నించాడు ఆచార్యుణ్ణి. ‘‘తర్కబుద్ధి, వివేచన కలిగిన మధ్యమాధికారులు స్తోత్రాన్ని రెండువైపులా చూస్తారు’’ అని సమాధాన మిచ్చాడు శంకరుడు. ‘‘ఇంతకూ నా అసలు సందేహాలు రెండున్నాయి. మిమ్మల్నింకా అడగనే లేదు’’ అంటున్నంతలోనే అతనికేదో ఎదురుదెబ్బ తగిలింది. కుడికాలి బొటనవేలు చితికి రక్తమోడుతోంది.

శంకరుడు స్వయంగా ఉపచారాలు చేస్తున్నాడు. అంత నొప్పినీ పక్కన పెట్టి, ‘‘అడగమంటారా?’’ అన్నాడు విష్ణుశర్మ. శంకరుడు చిరునవ్వు నవ్వాడు. ‘‘మొదటి శ్లోకంలోని రెండోపాదం ‘న చ శ్రోత్ర న జిహ్వా న చ ఘ్రాణ నేత్రే’ అన్నారు కదా! పంచ జ్ఞానేంద్రియాల్లో త్వక్‌ అంటే చర్మాన్ని ఎందుకు విడిచిపెట్టేశారు? ఛందస్సులో పట్టలేదా?!’’ బెరుకుగా అడిగాడు విష్ణుశర్మ. తల పక్కకు తిప్పిన శంకరుడు సమాధానమేదీ చెప్పలేదు. అతడి చూపులు అల్లంత దూరాన నిలిచివున్నాయి. అక్కడేదో జంతు కళేబరం పడివుంది. దానిని కాకులు పొడుచుకు తింటున్నాయి.
‘‘త్వగింద్రియం నామ త్వగ్వ్యతిరిక్తం త్వగాశ్రయం సర్వ శరీర వ్యాపకం స్పర్శగ్రహణ శక్తిమత్‌ ఇంద్రియం త్వగింద్రియమితి... త్వగింద్రియం అంటే బాహ్యంగా కనిపించే చర్మం కాదు. ఆ చర్మాన్ని ఆశ్రయించి శరీరమంతా వ్యాపించి ఉష్ణ, శీతలత్వాలను గ్రహించే ఒకానొక తత్త్వం మాత్రమే. తళుకు బెళుకు సోయగాల పట్ల వ్యామోహం విడిచిపెట్టు. స్పర్శ తత్త్వపు లోపలి పొరల్లోకి ప్రవేశించి చూడు’’ అంటూ ఆత్మానాత్మ వివేకాన్ని స్మరించాడు నిత్యానందుడు.

‘‘సరే... ఒప్పుకున్నాను. ఇది చెప్పండి మరి. మూడోపాదంలో ‘న చ వ్యోమ భూమీ ర్నతేజో న వాయుః’ అన్నారు. ఇక్కడ జలం అనగా నీళ్లనెందుకు వదిలేశారు? నాలుగింటిని విడివిడిగా చెబుతూ, ఒక్కటి మాత్రం విడిచిపెట్టేస్తే ఎవరికైనా సందేహం రావడం సహజమే కదా! వీటితో పాటు మిగిలిన ఆ ఒక్కటీ కాదనుకుంటే సరిపోతుందా?’’ మళ్లీ ప్రశ్నించాడు విష్ణుశర్మ. ఈ ప్రశ్నకు సమాధానం పద్మపాదుడు అందించాడు. ‘‘దేవతలు కాంతి రూపులు. కాంతికి వెలుగు, కిరణాలు అంటే తేజస్సు, ఓజస్సు రెండూ ఉంటాయి. ఆ కాంతిని యథాతథంగా చూడడానికి మానవుల చర్మచక్షువులకు శక్తి సరిపోదు. అందుకే దేవతార్చనలో భాగంగా ఆ కాంతికి వస్త్రాన్ని అందించే ఉద్దేశ్యంతో జల సమర్పణ చేస్తారు. నీళ్లు వస్త్రమెలా అవుతాయి? కాంతిని పోగొట్టకుండా కనిపించేలా ఎలా చేస్తాయి? అన్న విషయాలు బృహదారణ్యకోపనిషత్తులో రుషులు చర్చించే ఉన్నారు. అక్కడ శంకరులు భాష్యంలో చూపిన ఉదాహరణ... ఆహారాన్ని స్వీకరించడానికి, ముందు వెనుక శ్రోత్రియులు చేసే ఆచమనం ప్రాణదేవతకు వస్త్రసమర్పణ భావన. అసలు మంత్రార్థం వేరైనా, క్రియకు అంతరార్థం ఇదే.’’ గుండెలు బాదుకున్నాడు విష్ణుశర్మ. ‘‘నిర్వాణషట్కం నిలువు దోపిడీ. అన్నవస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలు పోయేట్లున్నాయి’’ అన్నాడు.

‘‘శంకరుని సన్నిధికి మించిన అభయం లేదు. అద్వైతం కలిగించే నిర్భయత్వం వైరాగ్యాన్ని పండిస్తుంది. అది లేనివాడికి రంగు, రుచి, వాసన, శబ్దాన్వయం అంతుబట్టవు. లింగాన్ని ముట్టుకున్నా, జంగాన్ని పట్టుకున్నా శివత్వమూ, శుచిత్వమూ అంటుకోవు’’ అన్నాడు హస్తామలకాచార్యుడు. నడక ముందుకు సాగుతూనే ఉంది. నర్మద ఒడ్డున ఎవరో పిండరూపంలోని పితృదేవతలకు తిలతర్పణలు విడుస్తున్నారు. సన్యాసుల రాక గమనించగానే మంత్రం చెబుతున్న బ్రహ్మగారు ఆ పిండాలపై ఒక వస్త్రం కప్పాడు. ఆషాఢంతో పాటు అతడు మాహిష్మతీ నగరంలో ప్రవేశించాడు. ఆకాశ హర్మ్యాలతో, అందమైన ఉద్యానవనాలతో, విశాలమైన రాచబాటలతో అక్కడ సర్వత్ర లక్ష్మీప్రసన్నంగా ఉంది. రాజవీధికి కుడివైపున బ్రాహ్మణవీధిలో ప్రవేశించారు వారంతా. ఆ అపరాహ్ణ వేళలో అక్కడ నీటికోసం బిందె చంకన పెట్టుకుని వచ్చిన ఎవరో పరిచారికను విష్ణుశర్మ అడిగాడు.
‘‘అమ్మా! మండన మిశ్రుల వారి ఇల్లెక్కడ?’’ అని. 
‘‘ఏ ఇంటిముంగిట చిలకలు, గోరువంకలు సైతం శాస్త్రచర్చలు, తర్కవాదాలు చేస్తూ ఉంటాయో... అదే మండన మిశ్రుల వారిల్లు’’ అని చెప్పిందామె. – సశేషం
‘‘శంకరుని సన్నిధికి మించిన అభయం లేదు. అద్వైతం కలిగించే నిర్భయత్వం వైరాగ్యాన్ని పండిస్తుంది. అది లేనివాడికి రంగు, రుచి, వాసన, శబ్దాన్వయం అంతుబట్టవు. లింగాన్ని ముట్టుకున్నా, జంగాన్ని పట్టుకున్నా శివత్వమూ, శుచిత్వమూ అంటుకోవు’’ అన్నాడు హస్తామలకాచార్యుడు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top