శైలజారెడ్డి కూతురు

Special chit chat with anu emmanuel - Sakshi

బాలనటిగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన అను ఇమ్మాన్యుయేల్‌ మలయాళ చిత్రం ‘యాక్షన్‌ హీరో బిజూ’తో హీరోయిన్‌ అయింది. మజ్ను, కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్, అజ్ఞాతవాసి, శైలాజారెడ్డి అల్లుడు...  చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అను అంతరంగ తరంగాలు...

►మనం ఎప్పుడూ ఒకేలా ఉండమనే విషయాన్ని బలంగా నమ్ముతాను. రకరకాల అనుభవాలు మనల్ని  ఆకర్షణీయంగా తీర్చుదిద్దుతాయి. రెండు సంవత్సరాల క్రితం వరకు తెలుగులో నా డైలాగులను నేను చెప్పుకోవడం కష్టంగా ఉండేది. ఇప్పుడు అలాంటి కష్టం లేదు. త్వరలో తెలుగును ధారాళంగా మాట్లాడగలననే నమ్మకం ఉంది.

►నటన నా జీవితాన్నే మార్చేసింది. ఒకప్పుడు  ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడేదాన్ని. ఇప్పుడు నా పనులు నేనే సొంతంగా చేసుకోగలుగుతున్నాను. ‘శైలజారెడ్డి అల్లుడు’లో పొగరున్న యువతిగా నటించాను. నిజజీవితంలో కూడా నాకు పొగరు ఉంది. అయితే దాన్ని నేను ‘హెల్తీ ఇగో’ అంటాను. నాకే కాదు ప్రతి ఒక్కరికీ ఇది ఉండాలి.

►వేరే కథానాయికతో కలిసి పనిచేయడం వల్ల నేనేమీ ‘అభద్రత’కు గురికాను. మన గురించి మనకు స్పష్టత లేనప్పుడే అభద్రతాభావన ముందుకొస్తుంది. నేను నటించే సినిమా ఏమిటో దానిలో నా పాత్ర ఏమిటో నాకు స్పష్టంగా తెలుసుకాబట్టి అభద్రత అనే సమస్యే ఎదురుకాదు.

►పాత్రలో ఎంత దమ్ము ఉంది, ఎంత గొప్పగా ఉంది అనేది విషయం కాదు. సినిమా ఆడకపోతే మన కష్టం, ప్రతిభ కనిపించకపోవచ్చు. అంతమాత్రాన యాంత్రికంగా నటించలేము కదా! ఫలితం ఎలా ఉన్నా ప్రయత్నలోపం ఉండకూడదని నమ్ముతాను. నా పాత్ర అద్భుతంగా ఉండటం వల్ల సినిమా ఆడదు... సినిమా అనేది రకరకాల పాత్రల ప్యాకేజీ.

►నటి అన్నాక కమర్షియల్‌ సినిమాలతో పాటు నటనకు ఆస్కారం ఉన్న నాన్‌ కమర్షియల్‌ సినిమాలు కూడా చేయాలి. అయితే కెరీర్‌ నిర్మాణదశలో ప్రయోగాత్మక చిత్రాలు, పాత్రలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. కొన్ని అవకాశాలు అనుకోకుండా తలుపుతట్టి ఎక్కడికో తీసుకువెళతాయి. ‘మహానటి’లాంటి సినిమా చేయాలని ఉంది.

►జయాపజయాలు మన అధీనంలో ఉండవు. కాబట్టి ఫెయిల్యూర్స్‌ గురించి అతిగా ఆలోచించను. కెరీర్‌ ప్రారంభంలో సహజంగానే కొన్ని తప్పులు చేస్తాం. నేను అలాగే చేశాను. అంతమాత్రాన ‘ఇక అంతా అయిపోయింది’ అని డీలాపడే మనిషిని కాదు. ఇండస్ట్రీలో పోటీ గురించి చెప్పాలంటే, మెడికల్‌ ఎంట్రన్స్‌లాంటి పోటీ కాకపోయినా పోటీ అనేది ఉండాలి. 
అలా ఉంటే మరింత మెరుగవుతాం. 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top