Sakshi News home page

నమ్మకం: ‘తుమ్ము’ అపశకునమా!

Published Sun, Sep 15 2013 2:09 AM

నమ్మకం: ‘తుమ్ము’ అపశకునమా!

జర్మనీలోని కొన్ని ప్రాంతాల్లో తుమ్ము గురించిన ఓ విచిత్రమైన నమ్మకం ఉంది.  ఒక వ్యక్తి వాతావరణం గురించి మాట్లాడుతున్నప్పుడు రెండో వ్యక్తి కనుక తుమ్మితే... వాతావరణం సరిగ్గా లేదని, ఏవైనా ఉపద్రవాలు కూడా సంభవించవచ్చని నమ్ముతారు. ఇంత వింత ఎలా ఏర్పడిందనే దానికి నిదర్శనాలు లేవు!
 
 జలుబు చేస్తే తుమ్ములొస్తాయి. ఇది చిన్న అనారోగ్య సూచన. దుమ్ము రేగి నాసికను తాకినా తుమ్ములొస్తాయి.  ఇది ఓ క్రియకు ప్రతిస్పందన. అలాంటి తుమ్ముకీ మనిషి అదృష్టానికీ సంబంధం ఏమిటి? మనిషనేవాడికి తుమ్ములు రాక మానవు. మరి అత్యంత సహజమైన ఈ ప్రక్రియ చుట్టూ అసహజమైన నమ్మకాలు ఎలా ఏర్పడ్డాయి? అవి నమ్మకాలా? మూఢనమ్మకాలా?
 
 బయటకు వెళ్లేటప్పుడు ఎవరైనా తుమ్మితే ఠక్కున ఆగిపోతారు కొందరు. కాసేపు ఆగి, మంచినీళ్లు తాగి కానీ కదలరు. అదేమిటంటే అపశకునం అంటారు. నిర్లక్ష్యం చేస్తే అదృష్టం టాటా చెప్పి వెళ్లిపోతుందని, దురదృష్టం దర్జాగా వచ్చి తిష్ట వేస్తుందని అంటారు. కొందరైతే ప్రాణాపాయం ఏర్పడుతుందని కూడా భయపడుతుంటారు. ఓ చిన్న తుమ్ముకి ఇన్ని జరుగుతాయా అంటే సమాధానం చెప్పరు. కానీ కచ్చితంగా ఏదో జరుగుతుందని మాత్రం నమ్ముతారు. ఆ నమ్మకంలో నిజమెంత?
 
 హిందూ మతస్తుల్లో బయటకు వెళ్లేటప్పుడు తుమ్మడం మంచిది కాదు అనే నమ్మకం బలంగా ఉంది. అనారోగ్యం వల్ల వచ్చే తుమ్ములను ఎవరూ పట్టించుకోరు. కానీ బయటకు బయలుదేరుతున్నప్పుడు ఎవరైనా తుమ్మితే మాత్రం కంగారు పడిపోతారు. అపశకునమంటూ భయపడి పోతారు. అలాగే గడపకు అవతల ఒక కాలు, ఇవతల ఒక కాలు ఉన్నప్పుడు తుమ్మితే ఆయుక్షీణమంటారు. అయితే... ఇలా ఎందుకు అంటారు అన్నదానికి సశాస్త్రీయమైన ఆధారాలను మాత్రం ఎవరూ చూపించలేక పోతున్నారు.
 
 అలాగే బైబిల్ ప్రకారం దేవుడు మనిషిని మట్టితో తయారు చేసి, అతడి నాసికా రంధ్రాల్లో జీవ వాయువును ఊది ప్రాణం పోశాడు. దీన్ని బట్టి యూదుల్లో ఒక నమ్మకం ఏర్పడింది. జీవం ఎలా అయితే ముక్కుద్వారా శరీరంలో ప్రవేశించిందో, అలాగే బయటకు పోతుందని వాళ్లు నమ్మేవారు. తుమ్మినప్పుడు వేగంగా బయటకు పోయే గాలితో పాటు శరీరంలోని జీవం బయటకు పోతుందని, అంటే ఆ వ్యక్తి చావుకు దగ్గరైనట్లేనని ఓ నమ్మకం వారిలో ప్రబలింది. ఈ నమ్మకం నుంచే, ఎవరైనా తుమ్మినప్పుడు ‘గీసుంథైత్’ అనడం మొదలైంది. అంటే ‘మంచి ఆరోగ్యం కలుగును గాక’ అని అర్థం. మనవాళ్లు కూడా ‘చిరంజీవ’ అంటారు కదా... అలా అన్నమాట!
 
 అయితే ఎలా వచ్చిందో కానీ... ఈ నమ్మకం మధ్యలోకి దెయ్యం వచ్చి చేరింది తరువాతి కాలంలో. తుమ్ముతో మనిషి ఆత్మ బయటకు పోతుందని, తద్వారా దురాత్మ (ప్రేతాత్మ?) వచ్చి శరీరంలో తిష్ట వేస్తుందని అనుకోవడం మొదలయ్యింది. అందుకే ఎవరైనా తుమ్మితే ‘గాడ్ బ్లెస్ యూ’ అనేవారు. నీ శరీరంలో దెయ్యం చేరకుండా దేవుడు నిన్ను కాపాడతాడు అని చెప్పడమే ఆ దీవెన వెనుక ఉద్దేశం. ఈ నమ్మకం ఎంత బలంగా స్థిరపడిపోయిందంటే... చాలా దేశాల వారు ఎవరైనా వ్యక్తి తుమ్మితే, అతడి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసేవారట.
 
 దేవుడికి మొక్కులు మొక్కుకుని, బలులు కూడా ఇచ్చేవారట. అయితే ఇదంతా నాగరికత తెలియని కాలంలోజరిగింది. కొన్నేళ్ల తరువాత జర్మన్లతో పాటు మరికొన్ని దేశాల వారు కూడా ఇది కేవలం ఓ మూఢ నమ్మకమంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. తుమ్ము కేవలం ఆరోగ్యానికి సంబంధించినదేనని, తుమ్మితే హెల్త్ చెకప్ చేయించుకోవాలే తప్ప అనవసరమైన భయాలకు పోకూడదని వివరించారు. అప్పట్నుంచి ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చింది. తుమ్ముని అపశకునంగా కాక, శారీరకంగా జరిగే అతి సాధారణ ప్రక్రియగా చూడటం మొదలైంది. కాలం గడిచేకొద్దీ తుమ్ము చుట్టూ ఉన్న అపనమ్మకాలు, మూఢనమ్మకాలు చాలా వరకూ తొలగిపోయాయి. కానీ ఇప్పటికీ కొన్నిచోట్ల మాత్రం ఈ నమ్మకం సజీవంగానే ఉంది!

Advertisement
Advertisement