సాయి వాణి యదార్థ భవిష్యవాణే

Saipatham Antarvedam 47 - Sakshi

 ∙సాయిపథం – అంతర్వేదం 47

ఎన్ని అవయవాలు మన శరీరంలో దాగి ఉన్నా.. మనం ఎవరమో, ఎలాంటి లక్షణాలు కలవాళ్లమో ఎదుటివాళ్లకి తెలియపరచుకునేందుకు లేదా తెలిసేందుకు అదే విధంగా ఆ ఎదుటివాళ్లని గురించిన ఓ అవగాహన మనకి కలిగేందుకూ ప్రధానంగా సహకరించేది నోరు మాత్రమే. ఆ నోటి నుంచి వెలువడే మాట ప్రకారమే కార్యకలాపాలన్నీ సాగుతాయి.అయితే ఈ మాటని సంస్కృత భాషలో ‘వాక్కు’ అంటారు. ఆ వాక్కుని వినగానే దాని నుంచి వచ్చే భావాన్ని ‘అర్థం’ అంటారు. ఈ వాక్కు, అర్థం అనే రెండింటి గురించీ అలాగే రెండింటి మధ్య ఉండే సంబంధం కొద్దిపాటిగా తెలిస్తే తప్ప ఈ వ్యాసం, తద్వారా సాయితత్త్వం మనకి తెలియదు. కాబట్టి క్లుప్తంగా తెలుసుకోవలసిందే. లౌకికానాం హి సాధూనా మర్థం వాగనువర్తతేఋషీణాం పునరాద్యానాం వాచ మర్ధోను ధావతిఇది మహాకవి చెప్పిన మాట.లౌకికులమైన మనం ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు, అది ఏ విధంగా ఎదుటివాడికి అర్థాన్నియ్యాలో, ఎలా బోధపడాలో దాన్నంతా ముందుగా మనం ఆలోచించి, అనుకుని, అదే అర్థం వచ్చేలా దానికి సరిపోయిన మాటల్ని (వాక్కు) ఒకచోట చేర్చి ఆ మాటలనే మాట్లాడతాం.‘అయం ఘటః’ ఇది ఓ కుండ అని ఈ మాటకి అర్థం. ‘నల్లగా ఉన్నదీ, ఏదో ఓ వస్తువుని దానిలో ఉంచుకునేందుకు వీలైనదీ, మట్టితో చేయబడినదీ అయిన ఇది కుండ’ అని ఇంత అర్థాన్ని లోపల అనుకుని దానికి సరిపడిన ఘటం (కుండ) అనే వాక్కుని అంటాం. ఇది మనకి అనుభవంలో తెలిసిన విషయం– నిత్యవ్యవహారంలో సాగుతున్న అంశం కూడా.అదే మరి ఋషులుగానీ మాట్లాడవలసివస్తే.. వాళ్లు మనలా అర్థాన్ని లోపల కుదుర్చుకుని, దానికి సరిపడ్డా వాక్కులని (మాటల్ని) కూర్చుకుని మాట్లాడరట. వాళ్లు ముందుగా వాక్కుని (మాటని) అనేస్తారు. ఆ మీదట ఆ వాక్కుని బట్టి అర్థం ఏర్పడుతుందట.

కద్దిగా వివరించుకుంటే.. ఓ ఋషి ఓ వ్యక్తిని ‘త్వం రాక్షసో భవ!’ నువ్వు రాక్షసుడివి అయిపోదువుగాక! అని అన్నట్లయితే, ఆ ఋషి ఈ వ్యక్తిని చూసి ముందుగా ఈ అర్థాన్ని లోపల అనుకుని దానికి సరిపోయినట్లుగా వాక్కులని అనడమన్నమాట. కడుపు మండిన ఆవేదనతో ఈ వాక్కులని అనగానే ఎదుటివ్యక్తిలో రాక్షస లక్షణాలు(కోరలూ, కొమ్ములూ మిడిగుడ్లూ, భయంకర వికృతదేహం, తుమ్మముళ్లు వంటి రోమాలూ, వికటాట్టహాసం...) అలా చూస్తూ ఉండగానే ఒకటికొకటిగా ప్రవేశిస్తూ క్షణాల్లో రాక్షసుడిగా అతడు కనిపించేస్తాడన్నమాట. ఇలాంటి సంఘటనలని మనం నిత్యం అనేక పురాణకథల్లో వింటూనే ఉంటాం కదా!సాయి చరిత్రతో ఏమిటి సంబంధం?ఇదేదో వినడానికి బాగానే ఉంది గానీ.. దీనికీ– సాయి చరిత్రకీ సంబంధమేమిటి? అని అనిపిస్తుంది కదా! ఏ ఋషులైతే రాబోయే సంఘటనలని తమ తపశ్శక్తితో ముందుకు ముందే దర్శించగలరో అలాంటి శక్తే సాయికి కూడా ఉందనే విషయాన్ని సాక్ష్యాధారాలతో నిరూపించడానికీ, అలా నిరూపించి సాయి తపశ్శక్తి స్థాయి ఎంతటిదో తెలియజేయడానికీనూ.ఈ తీరుగా నిరూపించని పక్షంలో– సాయికి రాబోయే కాలంలో ఏం జరగబోతోందో ఎలా తెలుసు? అని ఎవరైనా అడిగితే – ఆయన దేవుడు గదా! ఆయనకి తెలియనిదేముంటుంది? అని టక్కున సమాధానం చెప్పేస్తారు. ఇంకాస్త లోతుకి దిగి అవతలి వ్యక్తి ‘ఆయనే గనుక దేవుడయ్యుంటే ఎవరికీ కనిపించకుండా ఉండాలిగా!? తన దైవమహిమతో ఎవరికీ అసలు కష్టాలే రాకుండా చేసేయొచ్చు కదా!? అయినా కాలకృత్యాలు చేస్తుండే ఎవరూ దైవం కానేకాడంటూ మీ పురాణాలే చెప్పాయిగా!?’ అంటూ ప్రశ్నిస్తే సమాధానాన్ని చెప్పలేక – అలా మాట్లాడితే కళ్లుపోతాయి! అయినా ఇలాంటి దుర్విమర్శలని విన్నా కూడా పాపమే! అంటూ వెళ్లిపోతూ కనిపిస్తారు ఎందరో భక్తులు.

ప్రతి పనికీ ఒక హేతువు ఉండి తీరుతుంది. ఆ దృష్టితో దాదాపుగా ఎవరూ ఆలోచించరు. సాయి నిజానికి మనిషే అయినా ఆ అతీంద్రియ శక్తి ఎలా వచ్చింది అనే ధోరణితో ఆలోచిస్తేనూ, ఆ అతీంద్రియశక్తికి సంబంధించిన సాక్ష్యాలని తెలుసుకుంటేనూ ఆయన ఎలా అందరికంటే ఉన్నతస్థితిని సాధించగలిగాడో మనకి అర్థమవుతుంది. దాంతో సాయి గురించి చేసే దుర్విమర్శలనీ, అలాగే వ్యతిరేక ప్రచారాలనీ తిప్పికొట్టగలగడమే కాక, హేతుబద్ధమైన సమాధానాలని చెప్పి సాయికున్న గొప్పదనాన్ని ధైర్యంగా నిరూపించగలం. అందుకే సాయికున్న అతీంద్రియశక్తి ఎలా ఆయనకి లభించిందో మనం తప్పక తెలుసుకుని ఉండాల్సిందే! ఈ దృష్టితో పరిశీలిస్తున్నాం కాబట్టి ముందుగా ఆయనకున్న అతీంద్రియ శక్తిని నిరూపించే ఒకటి రెండు సంఘటనలని వివరించుకుని, ఆ శక్తి లభించడం వెనకున్న కారణాన్ని తెలుసుకుందాం! ఆగవయ్యా బాబూ! ఆగు!! సాయి తన మసీదుకి ఎవరొచ్చినా జాతి, మత, కుల, స్త్రీ, పురుష, ముసలి, యువక, వితంతు భేదాలని వేటినీ పరిగణించకుండా అందరినీ – భోజనం చేసి మాత్రమే వెళ్లండి – అని చెప్పేవాడు. దాదాపుగా భోజన సమయానికి వచ్చి ‘రైలు వెళ్లిపోతుంది... అవతల పనుంది...’ అంటూ ఎవరైనా వెళ్లినట్లయితే అనుకున్న రైలు దాటిపోవడం లేదా ఆలస్యం కావడం కారణంగా ఇటు భోజనం అటు ప్రయాణమనే రెండూ సాగక కచ్చితంగా ఇబ్బందికి గురవుతూ ఉండేవారు భక్తులు. ఇది ఏ ఒక్కరికో కలిగిన అనుభవం కాదు. అందుకే సాయి మాటని వింటే దాన్ని ఓ ఆదేశంగానే భావించే వారు తప్ప ఎవరూ ధిక్కరించి వెళ్తూ ఉండేవారు కానే కాదు. అందరినీ ఉద్దేశించి చెప్పే మాట కంటే ప్రత్యేకంగా ఎవరితోనైనా సరే ఏదైనా చెప్తే ఇక ఆ మాటకి పర్యవసానం మరింత తీవ్రంగా ఉండేది. పాటిల్‌ తాత్యాకోతే అనే సాయి సన్నిహిత భక్తుడు వారం వారం జరిగే సంతకి వస్తూ ఉండేవాడు. ఆ వచ్చినప్పుడు సాయిని దర్శించి షిర్డీకి 3 మైళ్ల దూరంలోని కోపర్‌గావ్‌ సంతకి వెళ్తూండేవాడు. అలా ఒకసారొచ్చి వీధిలోనే టాంగాని నిలిపి సాయి వద్ద కొచ్చి పాదాభివందనం చేసి తాను వెళ్లడానికి అనుమతినీయవలసిందని సాయిని కోరాడు.

సాయి చిరునవ్వు నవ్వుతూ – ‘ఎందుకలా తొందరపడుతూ టాంగాని కూడా అక్కడే నిలిపి.. వచ్చీ రాగానే వెళ్లిపోతావెందుకు? కాస్త ఆగవయ్యా బాబూ! ఆగు! ఒక్క నిముషం ఉండు! సంతదేముంది? ఎక్కడికీ పోదు! తర్వాత వెళ్దువుగానీ ఆగు! ‘ఇప్పుడు మాత్రం నువ్వు షిర్డీని దాటి ఊరు బయటికెళ్లకు!’ అని ఇంత వివరంగా అన్నాడు అతనితో. అయినా పాటిల్‌ తొందరని తన ముఖంలో చూపిస్తూ మళ్లీ ఓ నమస్కారాన్ని చేసి – తప్పనిసరిగా వెళ్లాల్సిందే! – అనే నిర్ణయంతో మసీదుమెట్లని దిగుతూ ఉంటే సాయి గమనించాడు. ‘సరే! తొందరగా వెళ్లాలంటున్నావుగా! శ్యామాని నీ వెంట తీసుకెళ్లు. ఒంటరిగా ప్రయాణం చెయ్యకు!’ అని మళ్లీ అన్నాడు సాయి. అలా రెండుమార్లు సాయి వద్దేవద్దని చెప్పడంలోని ఆంతర్యం పాటిల్‌కి అర్థం కాలేదు. సాయి కూడా వివరించి చెప్పనూ లేదు.సాయి మాటని ఓ ఆజ్ఞగా భావించే శ్యామా ఈ పాటిల్‌తో బయలుదేరడానికి సిద్ధపడుతూ ఉంటే.. అంత అవసరమేముంది? వద్దులే! అన్నట్లు చేసంజ్ఞ చేసి చెప్తూ తానొక్కడే బయలుదేరాడు కోపర్‌గావ్‌ అనే సంత జరిగే ప్రదేశానికి. టాంగాకున్న రెండు గుర్రాల్లో ఒక దాన్ని ఈ మధ్యే కొన్నాడు. దానికి వేగంగా పరిగెత్తి తన శక్తిని చూపించుకోవాలనే అత్యుత్సాహం తప్ప మరేదీ తెలియదు. టాంగాని అదిలించగానే బయలుదేరాయి గుర్రాలు.తీవ్రమైన వేగంతో గుర్రాలు పరుగెత్తడం ప్రారంభించాయి. ఎత్తుపల్లాల గురించి పాటిల్‌ పగ్గాలు లాగి వేగాన్ని తగ్గించాడు. మళ్లీ ఆ పల్లాన్ని దాటాక చురుగ్గా లాగవలసిందని సూచించడం కోసం గుర్రాలు రెండింటినీ తన చేతి కొరడాతో పెద్ద దెబ్బ తగులకుండా కొట్టాడు. మొదటి గుర్రానికి ‘కొరడా – దానితో కొడతారు’ అనే జ్ఞానముంది గానీ.. ఈ కొత్తగా వచ్చిన రెండో గుర్రానికి ఆ ఆలోచన లేదు– అదే ప్రథమానుభవం కావడంతో.

అంతకుముందు రెండు మూడు సంతలకి వెళ్లిన కారణంగా ఆ తోవ ఈ రెండో గుర్రానికి తెలిసి అదే మార్గంలో వెళ్తున్నా – ఈ కొరడా దెబ్బ తనకి మొదటిసారి అయ్యేసరికి విపరీతమైన వేగంతో పరిగెట్టేది కాస్తా ఒక్కసారిగా మోకాళ్ల మీద కూచుండిపోయింది. దాంతో టాంగా మొత్తం ఓ పక్కకి ఒరిగిపోయింది. అకస్మాత్తుగా జరిగిన సంఘటన అయిన కారణంగా పాటిల్‌కి నడుము విరిగినట్లే అనిపించింది. ఏం జరిగిందో అర్థం కావడానికి రెండు మూడు నిమిషాలు పట్టింది.మెల్లగా టాంగాని దిగాడు పాటిల్‌. ఇక ఎవరూ తనకి గుర్తు రాలేదు. సాయి మాటలే చెవిలో వినపడసాగాయి. ‘ఆగవయ్యా బాబూ ఆగు!... పోనీ నీతో శ్యామాని కూడా తీసుకెళ్లుతోడుగా! ఒంటరిగా మాత్రం వెళ్లకు! ఊరుదాటి బయటికి వెళ్లకు!’ అనేవే. పాటిల్‌కి సాయి మాటల్లోని అర్థం, భావార్థం, తాత్పర్యం కూడా స్పష్టంగా తెలిసినట్లయింది. తానే తనలో చిరునవ్వు నవ్వుకున్నాడు– సాయిని గురించి తెలిసి కూడా ఇలా ఎందుకు చేశానా? అని. వెంటనే సాయినామస్మరణని అనేక పర్యాయాలు చేసుకుని, సంతపని చేసుకుని కృతజ్ఞతలని సాయికి మనసులోనే తెలియజేసుకుంటూ ఆ ప్రదేశాన్ని వీడి వెళ్లిపోయాడు. ఇదేమిటి? మళ్లీ చేశానా?ఈ సంఘటన జరిగి కొంతకాలం అయిపోయింది. మళ్లీ ఇదే పాటిల్‌ షిర్డీకి సమీపంలో ఉన్న ‘కొల్లార్‌’ అనే గ్రామానికి టాంగా మీద బయలుదేరాడు. మార్గం మధ్యలో ఉన్న షిర్డీకి వెళ్లి మసీదులో ఉన్న సాయిని దర్శించి పాదాభివందనం చేసి సాయి ఆజ్ఞ కోసం కళ్లలోకి చూస్తూ – ‘దేవా! ఇలా వెళ్లి అలా తిరిగొచ్చేస్తాను’ అన్నాడు నోరు తెరిచి. సాయి ఆ పాటిల్‌ని చూస్తూ ‘వెళ్లు అనలేదు, వెళ్లద్దు అని కూడా అనలేదు. వెళ్లద్దని కిందటిసారిలా అనలేదు. ‘అంతే కాకుండా మరొకరిని తోడుగా తీసుకెళ్లు అదీ కాక ఊరిని దాటి వెళ్లద్దు’ వంటి మాటలేమీ అనలేదు. దాంతో పాటిల్‌ దాన్ని సాయి వ్యతిరేకత అలాగే సాయి ఆజ్ఞా అనే రెండు లేనట్లుగా భావిస్తూ బయల్దేరాడు పూర్వంలాగానే.

పూర్వపు టాంగా కాదిది. ఇది దానికంటే చిన్నది. అంతేకాక తేలికైనది కూడా. గుర్రాలు మాత్రం బలిష్ఠంగా ఉన్నవి. యవ్వనంలో కూడా ఉన్నవీ అయిన కారణంగానూ, టాంగా తమకి సరిపోయిన బలంగా ఉన్నది కాకపోయిన కారణంగానూ వేగంగా లాగుతూ పరిగెత్తసాగాయి. రెండింటికి రెండూ పోటీపడుతూ గోతులు, గొçప్పులు, చిన్న చిన్న నీటి కాలవలూ వచ్చినా కూడా లెక్కచేయకుండా పరిగెత్తేయడంతో పాటు వేగాన్ని తగ్గించడం కూడా లేకుండా సాగిపోతూ సాగిపోతూ పెద్ద గోతిలో కూలబడిపోబోయి ఓ క్షణంలో పక్కకి తిరిగి మార్గం పక్కన ఉన్న తుమ్మచెట్టుని గుద్దుకుని ఆగిపోయాయి. తుమ్మ చెట్టు విరిగిందంటే గుర్రాల వేగాన్ని లెక్కించుకోవచ్చు. టాంగా కూడా బాగా దెబ్బతింది. అక్కడి నుండి తిరిగి పాటిల్‌ తన గ్రామాన్ని చేరడానికి çపడ్డ శ్రమ ఇంతా అంతా కాదు.తన నడుం విరక్కుండా, కాళ్లూ చేతులూ ఇతర భాగాలకీ ఏ దెబ్బలూ తగలకుండా సాయిౖ దేవుడే రక్షించాలనే దృఢవిశ్వాసం కలిగిన పాటిల్‌ ఇక ఎప్పుడూ సాయి ఆజ్ఞని పాటించి తీరాల్సిందే! అని దృఢనిశ్చయానికి వచ్చేశాడు. సాయి మాట్లాడిన ప్రతి మాటనీ బాగా విశ్లేషించుకుని స్పష్టంగా అర్థం చేసుకున్నాకనే ఏ పనినైనా చేయాలని నిశ్చయించేసుకున్నాడు. అప్పుడనుకున్నాడు పాటిల్‌– ఇదేమిటి? ఒక్కసారి బుద్ధొచ్చాక కూడా మళ్లీ ఇదే తప్పు చేశానా? అని.మరొక్క సంఘటనఒకసారి ఒక ఆంగ్లేయుడు సాయి దర్శనానికొచ్చాడు. ఒకరి నుంచి సిఫారసు ఉత్తరం కూడా తీసుకొచ్చి బాబాను దర్శించుకోవాలనుకుంటున్నానని చెప్పాడు అక్కడి వారితో. వారంతా అన్నారు ‘సాయి అనుమతీ, ఆజ్ఞా లేనిదే మసీదు మెట్లని ఎక్కనేలేవు’ అని. మూడు మార్లు తీవ్ర ప్రయత్నం చేసినా సాయి అనుమతినీయలేదు.3 రోజుల పాటు ఓ గుడారాన్ని వేసుకున్నా అతనికి సాయి అనుమతి లభించనే లేదు. ఇక నిరాశతో ఇంటికి వెళ్లిపోదామనుకున్న వేళ – మెట్లు దిగి వెళ్తున్న సాయి దర్శనం అతనికి లభించింది.

అనుమతిని కోరాడు సాయిని. – ‘అంత తొందరెందుకు? రేపు వెళ్లచ్చు కదా!’ అన్నాడు సాయి అతనితో. అయినా అతను ‘‘4 రోజుల పాటు ఉన్నాను. దర్శనం కూడా అయ్యింది. ఇంకా దేనికి ఉండటం?’’ అనుకుంటూ బయల్దేరబోతుంటే– భక్తులందరూ సాయి అనుమతిని పొందాకే వెళ్లడం మంచిదని ఏకగ్రీవంగా చెప్తూ ఒకటి రెండు దుస్సంఘటనలని వివరించి చెప్పారు కూడా! అయినా అతడు విరమించలేదు ప్రయాణాన్ని.ఆ ఆంగ్లేయుడు టాంగాని ఎక్కి వెళ్తూ ఉంటే గుర్రాలు మొదట్లో మెల్లగానే ప్రయాణించసాగాయి. తర్వాత వేగాన్ని పుంజుకున్నాయి. అలా వెళ్తూన్నప్పుడు ఓ వ్యక్తి సైకిలు మీద గుర్రాలకి అడ్డంగా మార్గాన్ని దాటుతూ వేగంగా వెళ్లిపోయాడు. ఎప్పుడూ అలాంటి రాకని ఎరుగని గుర్రాలు ఒక్కసారిగా బెదిరిపోయాయి. దాంతో టాంగా అదుపు తప్పింది. ఆంగ్లేయుడు నేలమీద పడిపోయాడు. లేచే సత్తువ లేకపోయింది. ఎవరో సహాయపడి మొత్తానికి అతడ్ని అతను కోరిన చోటుకి పంపారు. ఆసుపత్రిలో పడి కొంతకాలం పాటు చికిత్స చేయించుకున్నాడు కూడా.అప్పుడు అతనికి అర్థమైంది – సాయి వాక్కుకి ఉన్న శక్తి ఏమిటో!ఎక్కడిది ఈ శక్తి?‘మననాత్‌ త్రాయతే ఇతి మంత్రః’ ఏ దైవనామాన్నయితే నిరంతరం మననం చేస్తారో ఆ కారణంగా అలా మననం చేసిన వ్యక్తికి ఓ శక్తి వచ్చి చేరుతుంది. ఆ శక్తి ఆ తీరుగా మననం చేసిన వ్యక్తి మాటలోకి వెడుతుంది. దాంతో ఆ వ్యక్తికి జరగబోయే సంఘటనతో పాటూ తాను ఏదంటే అదే జరిగే అతీంద్రియశక్తి అబ్బుతుంది. అందుకే అలాంటి వ్యక్తులు మనలా కాక ఆచి తూచి మాట్లాడుతూ ఉంటారు.సాయి నిరంతరం ‘అల్లాహ్‌ హో మల్లిక్‌!’ అనే నామాన్నే ఒకప్పుడు 12 ఏళ్ల పాటు నేలమాళిగలో, ఆ మీదట వేపచెట్టు కింద, ఆ తర్వాత అడవిలో, ఆ తర్వాత కూడా ఎప్పుడూ విరామం దొరికితే అప్పుడు మననం చేస్తూ ఉండటంతో ఆ శక్తి వాక్కుకొచ్చింది. అదీ నిజమైన కారణం– అదే యథార్థ కారణం.పైవారం సాయి మసీదులో కనిపించే హిందూ సంప్రదాయాలు (సాయిలో సన్యాసధర్మం మసీదులో హైందవ ధర్మం).– సశేషం
- డా. మైలవరపు శ్రీనివాసరావు 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top