లడ్డూ... చేస్తారా మేడమ్... | Sakshi
Sakshi News home page

లడ్డూ... చేస్తారా మేడమ్...

Published Sun, May 29 2016 2:40 AM

లడ్డూ... చేస్తారా మేడమ్...

పనీర్ లడ్డూ
కావలసినవి: పాలు - 4 కప్పులు, తాజా నిమ్మరసం - రెండున్నర టేబుల్ స్పూన్లు, పంచదార పొడి - 5 టేబుల్ స్పూన్లు (తీపి తక్కువ కావాలంటే 3 టేబుల్ స్పూన్లు వాడొచ్చు), యాలకులపొడి - అర టీ స్పూన్, రోజ్‌వాటర్ - 1 టీ స్పూన్ (కావాలనుకుంటేనే), కుంకుమ పువ్వు - చిటికెడు, పిస్తా (చిన్న ముక్కలుగా చేసినవి) - పావుకప్పు, నెయ్యి - 1 టీ స్పూన్
 
తయారీ: ముందుగా పాలను ఓ గిన్నెలో పోసి మరిగించాలి. స్టౌ ఆన్‌లో ఉన్నప్పుడే అందులో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి కలపాలి. దాంతో పాలు విరిగిపోతాయి. ఒకవేళ విరగకపోతే మరో స్పూన్ నిమ్మరసం వేయాలి. అలా పాలు విరిగిపోయే వరకు నిమ్మరసాన్ని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు స్టౌ సిమ్‌లో పెట్టి ఆ పాలను మరో రెండు నిమిషాలు మరిగించాలి. అప్పుడు ఆ మిశ్రమం చిక్కగా అవుతుంది.

అందులో పంచదార పొడి వేసి బాగా కలిపి, రెండు నిమిషాల తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. ఇప్పుడు దాంట్లో యాలకులపొడి, రోజ్‌వాటర్, కుంకుమ పువ్వు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టేయాలి. మిశ్రమం పూర్తిగా చల్లారాక అందులో పిస్తా ముక్కలు వేసి మళ్లీ కలపాలి. ఇప్పుడు అరచేతికి నెయ్యి రాసుకొని ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకొని గుండ్రంగా చేసుకోవాలి. ఆపైన వాటిని డబ్బా లేదా ప్లేట్‌లోకి తీసుకొని డీప్‌ఫ్రిజ్‌లో రెండు గంటలు పెట్టాలి. అంతే.. పసందైన పనీర్ లడ్డూ రెడీ.
 
నో బేక్ ఎనర్జీ బైట్స్       
కావలసినవి: ప్లెయిన్ ఓట్స్ - 1 కప్పు, సెమీ-స్వీట్ చాక్లెట్ చిప్స్ (షాపుల్లో దొరుకుతాయి) - అరకప్పు, అవిసె గింజలు - అరకప్పు, పీ నట్ బటర్ - అరకప్పు (కావాలనుకుంటేనే), తేనె - ముప్పావు కప్పు, వెనీలా ఎసెన్స్ - 1 టీ స్పూన్, బాదం గింజలు - పావుకప్పు, జీడిపప్పు - పావుకప్పు
 
తయారీ: ముందుగా అవిసె గింజలను మిక్సీలో వేసి పౌడర్‌గా చేసుకోవాలి (లేదంటే గింజలను అలాగే వేసుకోవచ్చు). మరోవైపు బాదం గింజలను, జీడిపప్పును చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓ బౌల్‌లో ఓట్స్, సెమీ- స్వీట్ చాక్లెట్ చిప్స్, అవిసె గింజల పొడి, పీ నట్ బట్టర్, తేనె, వెనిల్లా ఎసెన్స్, బాదం, జీడిపప్పు ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతితో తీసుకొని ఉండలుగా చేసుకోవాలి. ఎవరికి నచ్చిన సైజులో లడ్డూలను చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ లడ్డూలను ఒక ప్లేట్ లేదా ట్రేలో పెట్టి డీప్ ఫ్రిజ్‌లో పెట్టేయాలి. గంట తర్వాత వాటిని సర్వ్ చేస్తే పిల్లలు భలే ఇష్టంగా తింటారు. జిమ్‌బాడీని మెయిన్‌టెయిన్ చేసే వాళ్లకు కూడా ఈ ఎనర్జీ బైట్స్ బాగా ఉపయోగపడతాయి.
 
లెమన్ కొకోనట్ బ్లిస్ బాల్స్
కావలసినవి: ఎండుకొబ్బరి తురుము - రెండున్నర కప్పులు, బాదం గింజలు - అరకప్పు, తేనె - 2-3 టేబుల్ స్పూన్లు, కొబ్బరినూనె - 2 టేబుల్ స్పూన్లు, తాజా నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్
 
తయారీ: ముందుగా బాదం గింజలను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆపైన ఓ బౌల్ తీసుకొని, అందులో రెండు కప్పుల కొబ్బరి తురుము, బాదం గింజలు, తేనె, కొబ్బరి నూనె, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని మిక్సీలో వేసి ఓ రౌండ్ తిప్పుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకొని గుండ్రంగా చేసుకోవాలి.

మొత్తం సుమారు పది లడ్డూలు అయ్యేలా చూసుకోవాలి. వాటిని మిగిలిన అర కప్పు కొబ్బరి తురుములో దొర్లించాలి. ఇప్పుడు వాటిని ఏదైనా ట్రే లాంటి దాంట్లో దూరం దూరంగా పెట్టి డీప్ ఫ్రిజ్‌లో పెట్టాలి. గంట తర్వాత వాటిని బయటికి తీసి సర్వ్ చేసుకోవచ్చు. ఈ లెమన్-కొకోనట్ బ్లిస్ బాల్స్ పిల్లలకు ఎంతో ఆరోగ్యకరం కూడా. డైయాబెటిస్‌తో  బాధపడేవారు సైతం వీటిని నిశ్చింతగా లాగించేయొచ్చు.

Advertisement
 
Advertisement
 
Advertisement