తల్లి

Master Hamid is a teacher in a school in Delhi - Sakshi

కథా ప్రపంచం

మాస్టర్‌ హమీద్‌ ఢిల్లీలో బారహటోటేలోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడు. అతడి అసలు నివాసస్థానం రషీదాబాదులోని పహాడి మొహల్లా. అతని తండ్రి రషీదాబాద్‌లో కంచరపని చేస్తూ ఉండేవాడు.హమీద్‌ బాల్యంలో తన పేటలోని మసీదులోనూ, తరువాత కొద్దిరోజులు ముల్లా సాహెబ్‌ బడిలోనూ, ఆ తరువాత తండ్రిగారి ఇష్టప్రకారం కొంతకాలం తాలూకా స్కూలులోనూ చదువుకున్నాడు.హమీద్‌ ఉర్దూ పాసయిన రోజుల్లో రషీదాబాద్‌లో ప్లేగువ్యాధి వ్యాపించి హమీద్‌ తండ్రిని బలిగొన్నది.ఆయన అంత్యకర్మలన్నీ పూర్తి చేసిన తరువాత హమీద్‌ తల్లి దగ్గర లెఖ్ఖ చూసుకుంటే డెబ్బై రూపాయలు మిగిలినవి. మిడిల్‌ ప్యాసయిన తరువాత హమీద్‌కు ఇంగ్లీష్‌ గూడా చదువుకొందామని అభిలాష కలిగినది. కాని ఎలాగా చదువుకోడం?వీరి పేటలో ఉండే ఒకాయన ఢిల్లీలో పోలీసుగా ఉండడంవల్ల హమీద్‌ రెండుమూడుసార్లు ఢిల్లీని గురించి విని ఉన్నాడు. అందువల్ల తల్లి దగ్గర పదిహేను రూపాయలు తీసుకొని మెల్లగా ఢిల్లీ చేరుకున్నాడు.పోలీసు కానిస్టేబుల్‌ నవరుల్లాఖాన్‌ ఇల్లు ఎలాగా తెలుసుకోవడం!చచ్చిచెడి అతని  ఇల్లు తెలుసుకున్నాడు.

నవరుల్లాఖాన్‌ హమీద్‌ తండ్రిని బాగా ఎరుగును. అందువల్ల అతను హమీద్‌ను ఆదరించి తన ఇంట్లో ఉండి చదువుకోడానికి అవకాశం కలుగజేశాడు. నవరుల్లాఖాన్‌ ఇంట్లోనే ఉంటూ హమీద్‌ మూడు సంవత్సరాల్లో పదో క్లాసుకు వచ్చాడు.లెక్కల్లో హమీద్‌ నిధి.ఒక సహాధ్యాయుడికి పాఠం చెప్పడం ప్రారంభించి నెలకు ఏడు రూపాయలు సంపాదించడం ఆరంభించాడు. ఏడు రూపాయలు తన భోజనానికి సరిపోతవి గనుక వేరుగా ఉంటానని తాను ఎంత బ్రతిమిలాడినా నవరుల్లాఖాన్‌ అంగీకరించనందున, హమీద్‌ విధిలేక అక్కడే ఉండిపోయాడు.ఆవిధంగా పదినెలల్లో హమీద్‌ డెబ్బయి రూపాయల రొక్కం సంపాదించాడు. తల్లి దగ్గరి నుండి తెచ్చినవి పది రూపాయలు మిగిలి ఉన్నవి. ఒకసారి తల్లి రెండు రూపాయాలు మనియార్డర్‌ పంపించింది. మొత్తం అతని దగ్గర ఎనభైరెండు రూపాయాలు పోగుపడినవి.స్కూలుకు వేసవి సెలవులు ఇచ్చారు.నవరుల్లాఖాన్‌ కూడా సెలవు పెట్టాడు.ఇద్దరూ కలిసి రషీదాబాద్‌ వచ్చారు.అప్పటికి హమీద్‌ తల్లి దగ్గర భర్త అంత్యక్రియలు చేయగా మిగిలిన డబ్బు పన్నెండు రూపాయలు మిగిలి ఉన్నాయి.

ఇంటి ముందు ఉన్న పనసచెట్టు అమ్మడం వల్ల ప్రతి సంవత్సరం పాతికరూపాయల ఆదాయం వస్తూ ఉండేది.ఇంటికి పోయేటప్పటికి తల్లి హమీద్‌కు వివాహసంబంధం మాట్లాడి సిద్ధం చేసి పెట్టింది. ఆ డబ్బు హమీద్‌ దగ్గర ఉన్న డబ్బు అంతా ఖర్చు పెట్టి ఏదోవిధంగా హమీద్‌ఖాన్‌ వివాహం పూర్తి చేసింది. పెళ్లి అయిన ఏడో రోజున తిరిగి  హమీద్‌ ఢిల్లీకి వెళ్లాడు. ఆ సంవత్సరం పరీక్షల్లో పాసయ్యాడు.ఇక ఉద్యోగం! ఒక ప్రైవేటు స్కూల్లో కోద్దిరోజులు నౌకరీ కుదిరింది. తరువాత ఇంకొక స్కూళ్లో, ఆ తరువాత ఇంకొంక స్కూల్లో, చివరకు ఒక స్కూల్లో అతని పనిచూసి సంతోషించి ఆ స్కూలు ప్రధానోపాధ్యాయుడు అతడి ఉద్యోగం ఖాయం చేశాడు.నెలకు ఇరవైరూపాయల జీతం. ఇక వేరే కాపురం పెడతానని హమీద్‌ నవరుల్లాఖాన్‌ను అడిగాడు.ఒంటరి కాదు. భార్యను కూడా తీసుకొని రమ్మని నవరుల్లాఖాన్‌ మూడురూపాయల అద్దెకు ఒక చిన్న ఇల్లు కుదిరించి పెట్టాడు. హమీద్‌ఖాన్‌ రషీదాబాద్‌ వెళ్లి భార్యను తీసుకొచ్చి ఆ ఇంట్లో కాపురం పెట్టాడు.రషీదాబాద్‌లో తల్లి ఒంటరిగా ఉండిపోయింది.

హమీద్‌ భార్యను ఢిల్లీ తీసుకొనివచ్చి ఏడు సంవత్సరాలు గడిచింది. అతనికి ముగ్గురు మొగపిల్లలూ, ఒక ఆడపిల్లా పుట్టారు. వారిలో ఒక మగపిల్లవాడూ, ఆడపిల్లా చనిపోయారు. హమీద్‌ భార్యకు కూడా చాలా జబ్బు చేసింది. ఒకసారి హమీద్‌కు ఎండదెబ్బ తగిలి పదిహేనురోజులు మంచంలోనే ఉండిపోయాడు. అటు స్కూల్లో పని పెరిగిపోయింది. ఇటు జీతం మప్పైరూపాయలయింది. పది రూపాయలు ప్రైవేటు చెప్పి సంపాదించేవాడు. కాని ఢిల్లీలో ఆ డబ్బు అతనికి ఏమాత్రం సరిపోయేది కాదు. తల్లి రషీదాబాద్‌ రమ్మని ఉత్తరాల మీద ఉత్తరాలు రాసేది. కాని డబ్బు లేక తల్లిని చూడాలని ఎంత కుతూహలమున్నా హమీద్‌ రిషీదాబాదుకు పోలేకపోయాడు.రోజు ఉదయమే లేచి మసీదుకు పోయి నమాజు చేసుకోవడం, ఇంటికి తిరిగి వచ్చిన తరువాత ఖురాన్‌లో నుండి ఒక అధ్యాయం పారాయణం చేయడం అతని అలవాటు. మసీదు నుంచి ఇంటికి వస్తూ ఉన్నప్పుడు రోజూ ముసలిచాకలి జానకి నడుము వంగిపోయి కర్రపోటు వేసుకుంటూ చాకిరేవుకు పోతూ కనబడేది, కాని ఎందువల్లనో అయిదు రోజుల నుంచి  జానకి కనబడడం లేదు. హమీద్‌కు ఆశ్చర్యం వేసింది. జానకి కనబడని రోజే లేదు. ఎందువల్ల కనపడడం లేదో తెలుసుకుంటానని జానకి ఇంటికి వెళ్లాడు.

జానకి ఏమైందని అక్కడి వాళ్లను ప్రశ్నిస్తే నిన్నరాత్రి చనిపోయిందని వాళ్లు జవాబు చెప్పారు.జానకి చనిపోయిందని వినగానే హమీద్‌ గుండె గుభీలుమన్నది. జానకికి హమీద్‌కు ఏమి సంబంధం ఉన్నదో భగవంతునికి తెలియాలి! స్కూలుకు పోయాడు. అక్కడ అతనికి ఏమీ తోచలేదు. ఏదోవిధంగా కాలక్షేపం చేసి స్కూలు వదిలిపెట్టగానే ఇంటికి చేరాడు.‘‘ఒంట్లో బాగలేదా?’’ అని అడిగింది భార్య.ఏమీ వినిపించుకోలేదు, తెల్లవార్లూ అతనికి నిద్రపట్టలేదు. మర్నాడు బక్రీదు. స్కూలుకు సెలవ, స్టేషన్‌కు పోయి రషీదబాద్‌కు టికెట్‌ కొన్నాడు. రైల్లో పడ్డాడు. బక్రీదురోజు పగలల్లా రైల్లోనే గడిచింది. నమాజు లేదు. ఖుర్బానీ లేదు. ముసలితల్లి ధ్యాసే. కళ్ల ముందు ముసలితల్లి కనిపించడం ఆరంభించింది. తెల్లబడిపోయిన వెంట్రుకలు, ముడతలు పడిపోయిన శరీరం, వంగిపోయిన నడుము, భార్య, పిల్లల మీద మక్కువ వల్ల హమీద్‌ ముసలితల్లిని మరిచిపోలేదు. నాలుగైదు సార్లు ఏడెనిమిది రూపాయలు తల్లికి మనియార్డర్‌ కూడా పంపించాడు. ఆ డబ్ము పంపినప్పుడల్లా, తనూ, తన పిల్లలు చాలా ఇబ్బంది పడేవాళ్లు, తన తల్లికి ఉత్తరాలు రాసినప్పుడు పిల్లల చేత కూడా ఆ ఉత్తరాల మీద ఏవో గీతలు గీయించేవాడు.

ఆ పిచ్చిగీతలు చూసి తన తల్లి సంతోషించవలెనని తన అభిప్రాయం. అతని భార్య కూడా రాయడం నేర్చుకుంది. అత్తగారికి సలాములు తెలియపరుస్తూ ఉండేది. వచ్చే సంవత్సరం పంటరోజుల్లో తప్పక వస్తానని రాసేవాడు. కుటుంబంతో పోవాలి. పళ్ళు ఫలాలు తీసుకొని పోవాలి. అందుకు డబ్బు కావాలి. వచ్చే జీతంతో తిండి గడపడమే కష్టంగా ఉండేది. అందువల్ల ఎప్పటికప్పుడు ప్రయాణాన్ని ఆపుకునేవాడు. కాని జానకి మరణవార్త విని గుండె పగిలినట్లయి ఆగలేక ఒంటరిగా బయలుదేరాడు.బక్రీదునాడు సూర్యస్తమయం సమయానికి హమీద్‌ రషీదబాదు చేరాడు. పై నుండి భోరున వర్షం కురవడం ఆరింభించింది. అతనికి స్మృతి వచ్చినట్లయింది, గొడుగు మాత్రం చేతిలో ఉన్నది. అయ్యో! బట్టలన్నా తెచ్చుకోలేదు అనుకున్నాడు. గొడుగు వేసుకొని బయలుదేరాడు. జనం నివసించే చోట నీళ్లు నిలవకూడదనే ఆరోగ్యసూత్రం గ్రామస్తులకు అర్థమయ్యేది కాదు, అర్థమైనా  వాళ్లు పట్టించుకునే వాళ్లు కారు. మోకాళ్లలోతు నీళ్లలో పడుతూ, లేస్తూ మెల్లగా ఇంటికి చేరుకున్నాడు. తలుపు లోపల వేసి ఉన్నది. తలుపు తట్టాడు.

‘‘అమ్మా! అమ్మా!’’ అని పెద్దగా పిలిచాడు.లోపల నుంచి  ఒక లావుపాటివాడు వచ్చి తలుపు తెరిచాడు. బక్రీదు పిండివంటలన్నీ తిని అరగడానికి నిద్రబోయి అప్పుడే లేచినట్లు కనపడ్డాడు, హమీద్‌ను గుర్తుపట్టి మూడుసంవత్సరాల క్రితం ఆ ఇల్లును కొన్నట్లున్నూ, హమీద్‌ తల్లి దర్జీ ఆమె ఇంట్లో ఉన్నదని చెప్పాడు. తలుపు వేసుకొని లోపలికి వెళ్లిపోయాడు.హమీద్‌కు అడుగు ముందుకు పడలేదు. ఇల్లు కూడా అమ్మవలసినంత కష్టంలో తల్లి పడిపోయింది కాబోలు అనుకున్నాడు. పనసచెట్టు ఆదాయంతో కాలక్షేపం చేస్తున్నదనుకొని  చాలా పొరపాటు చేశాననుకున్నాడు.ఆ తల్లికి ముఖం చూపించడం ఎలా?ఎంత స్వార్థం తనలో బలిసిపోయింది. తన పిల్లలు మంచినీ, తన మంచినీ తను చూసుకున్నాడేగాని ముసలితల్లి గురించి ఆలోచించనైనా లేదుగదా అని పశ్చాత్తాపపడ్డాడు. మెల్లగా దర్జీ ఆమె ఇంటిదగ్గరకు కాళ్లీడ్చుకుంటూ చేరాడు. తలుపు తట్టబోయినాడు. చెయ్యి లేవలేదు.దర్జీ సోతీ వచ్చి తలుపు తీసింది. హమీద్‌ను గుర్తుపట్టింది.‘‘హమీద్‌ వచ్చాడు. హమీద్‌ వచ్చాడు’’ అంటూ లోపలకు పరుగెత్తింది.

హమీద్‌ తల్లి ఈమధ్య అశక్తత వల్ల ఇంట్లో అటూ ఇటూ మనలడం కూడా మానుకున్నది. ఆమె కళ్లు కూడా ఏమీ కనిపించేవికావు. కాని హమీద్‌ వచ్చాడనడంతోనే ఆ సంతోషంలో ఎక్కడి నుండి శక్తి వచ్చిందో గభీమని లేచి వాకిట్లోకి దూకి హమీద్‌ను ఆలింగనం చేసుకొన్నది. వెక్కి వెక్కి ఏడ్చింది.ఆమె శరీరంలో ఎముకలు తప్పా ఏమీలేవు.తల మీద వెంట్రుకలు తెల్లబడిపోయినవి. నడుము వంగిపోయింది. మెడ శిరస్సు భారాన్ని కూడా సహించలేకుండా ఉన్నది. ప్రేమ వల్లనో, ముసలితనం వల్లనో ఆమె శరీరం వణకనారంభించింది.చాలాసేపూ ఇద్దరూ మాట్లాడలేకపోయారు. చివరికి తల్లి మెల్లగా కంఠం పెకిలించుకొన్నది.‘‘నాయనా! చాలా దూరం నుండి వచ్చావు. బట్లలన్నీ తడిసిపోయాయి. బట్టలు మార్చుకో. టీ తీసుకొని వస్తాను. పిల్లలంతా కులాసాగా ఉన్నారా!’’ అని ప్రశ్నించింది.‘‘అమ్మా! ఇల్లు అమ్మివేశావా? నాకు చెప్పలేదేమిటి?’’ అని అడిగాడు.‘‘నాయనా! నీకు తెలిస్తే మాత్రం నువ్వేమీ చేస్తావు. నీకు మాత్రం కష్టాలు తక్కువ ఉన్నవి గనుకనా! ఈ దర్జీ సోతి నాకు చాలా సహాయం చేస్తున్నది.

నీ కష్టాలు నీకు గాక నా బాధ కూడా నీకెందుకు నాయనా? ఈ జన్మలో నిన్ను చూడలేమో అనుకున్నాను. నువ్వు వచ్చావు’’ అన్నది.హమీద్‌ కళ్ల వెంట బొటా బొటా నీళ్లు కార్చాడు. ఇల్లు నలువైపులా కలయజుశాడు. ఎదుట మంచం మీద దర్జీ ఆమె ఇద్దరు పిల్లలూ నిద్రబోతున్నారు. ఒక పిల్లవాడు కింద ఆడుకుంటున్నాడు.దర్జీ సోతి పొయ్యి రాజేస్తున్నది. ఆమె కొనుక్కున్న రవిక వీపు మీద చిరిగిపోయి ఉన్నది. బట్టలు మాత్రం తెల్లగా ఉన్నవి. బక్రీదు పండుగ కదూ!‘‘అమ్మా! రోజూ నువ్వు ఇక్కడనే నిద్రపోతుంటావా?’’‘‘కాదు నాయనా! ఆమె ఈ గదిలో పిల్లలతో పడుకుంటుంది. నేను అవతలి గదిలో పడుకుంటాను’’ అన్నది తల్లి.‘‘అమ్మా! నీవు ఇంకా పనిచేస్తూనే ఉన్నావా? చేతులు పనిచేయనిస్తున్నాయా’’‘‘చేతులు బాగానే ఉన్నవిగాని కళ్లు మాత్రం నెలరోజుల నుండి కనబడడం లేదు నాయనా’’‘‘కళ్లు కనబడడం లేదా?’’ అన్నాడు ఆతురతతో హమీద్‌.తల్లి హమీద్‌ తలను చేతితో నిమిరింది. చేయి బుగ్గలదాకా పోనిచ్చింది. అతని తలను తన హృదయానికి హత్తుకుంది. చిరునవ్వు నవ్వింది.‘‘కళ్లు కనబడడం లేదా అంటున్నావా నాయానా! నీవు కనబడుతూనే ఉన్నావు. రోజూ సూర్యుడు కనబడతాడు. అంతే, మిగిలిన వస్తువులు ఏమీ కనబడవు. చిన్నపిల్లవాడు కులాసాగా ఉన్నాడ? వాడి వయస్సెంత?’’ అని అడిగింది.

‘‘సంవత్సరంన్నర’’‘‘అయితే చొక్కా, టోపీ వాడికి సరిపోతవి’’ అంటూ ఒక పాత బట్టల మూట విప్పి అందులో నుండి ఒక చొక్కాను, బుటేదారీ పనిచేసియున్న ఒక టోపీని బయటకు తీసింది.‘‘మజీద్‌ కోసం ఇవి తయారుచేశావా?’’ అని హమీద్‌ కన్నీళ్లు కార్చాడు.‘‘కాదు నాయానా! సలమా కోసం కుట్టి తయారుచేశాను. పంపుదామంటే నీవు రానేలేదు. తరువాత సలామా చచ్చిపోయిందని ఉత్తరం రాశావు’’ అని చొక్కా వంక చూసి కన్నీళ్లు పెట్టుకొన్నది. లేచి లోపలికి వెళ్లిపోయింది. టీ తెచ్చి ఇచ్చింది. తాగాడు. తల్లి మంచం మీద కూర్చొని ఉండిపోయినాడు.ఏమిటేమిటో ఆలోచనలు!హమీద్‌ తనను తాను మరచిపోయినాడు.అలా రెండు గంటలు గడిచింది.పక్క ఇంటి నసీబన్‌ కూడా వచ్చింది.నసీబన్, హమీద్‌ తల్లి, సోతి వంట ఇంట్లో ఏమిటేమిటో చేస్తూ ఉండిపోయినారు.సుమారు  ఎనిమిది గంటలకు హమీద్‌ తల్లి బయటికి వచ్చి–‘‘నాయానా! భోజనానికి లేవమ’’న్నది.అప్పటికి హమీద్‌కు కొద్దిగా నిద్రపట్టింది. ఉలిక్కిపడి లేచాడు.బీదస్థితిలో ఉన్నది గనుక తల్లి జొన్నరొట్టె తయారుచేసి ఉంటుందనుకున్నాడు.

కాని వడ్డించిన పదార్థలను చూసి ఆశ్చర్యపడ్డాడు.కబాబు, మేక గుండెకాయ కూర, పరాఠాలు, మినప్పప్పు పప్పు, మామిడికాయ పచ్చడి, ఒక కప్పులో మీగడ, ఒక ప్లేటులో పండిన మామిడి పండు ముక్కలు ఘుమఘుమలాడుతున్నవి. ఇంత బీదతనంలో ఉన్న తల్లి ఈ సామానంత ఎలా సేకరించిందా అని ఆలోచించాడు. భోజనం చేశాడు.భోజనం చేస్తున్నంతసేపూ తల్లి దగ్గర కూర్చొని లోకాభిరామాయణం చెప్పింది. కొసరి కొసరి వస్తువులు వడ్డించింది. తృప్తిగా భోజనం చేశాడు. లేచి చేతులు కడుక్కొని మంచం మీదకు చేరాడు.దర్జీ ఆమె, నసీబన్‌ ఇద్దరూ బయటకు వెళ్లి కొంత సేపట్లో తిరిగివచ్చారు.తల్లి హమీద్‌ దగ్గరకు వచ్చింది.‘‘నాయనా! ఒక్కమాట చెపుతాను. వింటావా?’’ అని అడిగింది.హమీద్‌ ముఖం వెలవెలబోయింది. గుండె దడదడలాడింది.బహుశా తల్లి తనతో కూడా ఢిల్లీ వస్తానంటుందనుకున్నాడు. లోలోపల అనేక ఆలోచనలు! తనకు వచ్చే జీతం చాలా కొద్ది, ఢిల్లీలో ఆ కొద్ది జీతం మీద అంతమందీ బతకడం ఎలాగా? భార్య, పిల్లలూ, తల్లీ ఇంత మందిని తను పోషించగలడా! తల్లివంక అలాగే చూస్తూ ఉండి పోయినాడు.

‘‘నాయనా నీవు పట్టణంలో ఉండేవాడివి. నౌకరీదారుడివి. నేను పరాయివాళ్ల పంచల్లో తలదాచుకొంటున్నాను. నీకు ఎలా మర్యాద చేయగలను? నసీబన్‌ను పంపించి ఖాన్‌సాహెబ్‌గారి ఇంట్లో ఒక గది బాగు చేయించాను. మంచం, పక్కా వేయించాను. కాని నీవు నాతోబాటే ఉంటే బాగా ఉంటుందని నా మనస్సు కోరుతున్నది. ఈ ముసలిముండతో కూర్చోమంటే నీకు మనస్సుకు ఏమి కష్టం కలుగుతుందోనని చూస్తున్నాను. భయపడుతున్నాను. నాయనా! నా కోరిక పూర్తి చేస్తావా?’’ అని భయపడుతూ అడిగింది.‘‘అదుగో, మంచం కూడా తెప్పించాను’’ అని ఎదుట పరిచి ఉన్న మంచం చూపించింది.తల్లి మాటలకు హమీద్‌ గుండె కరిగిపోయింది.నోట నుండి మాట రాలేదు.‘‘అమ్మా! నీ దగ్గర  ఉండకపోతే నేను ఇంకెక్కడకు పోతాను?’’ అన్నాడు.తల్లి ఆనందభరితురాలయింది.హమీద్‌ శిరస్సును ఆఘ్రాణించింది. నసీబన్‌ను పిలిచి మంచం తన గదిలో వేయించింది. ఒక మూట విప్పి తెల్లటి దుప్పటి బయటకు తీసింది. ఆ దుప్పటి మీద రకరకాల లతలు కుట్టి ఉన్నవి. ఆ మూటలో నుంచి రెండు దిండ్లు బయటకుతీసింది.

తెల్లటి గలీబులు కుట్టి ఉన్నవి.చిన్న సీసాలో నుంచి తీసి గలీబులకు అత్తరు రాసింది.మంచం కింద ఒక పీక్‌దాసును పెట్టించింది. ఢిల్లీపూల నల్ల చెప్పుల జోడు–కొత్తది–మంచం కాళ్ల వైపున పెట్టి ‘‘నాయనా! అలిసిపోయినావు. ఈ మంచం మీద పడుకొని నిద్రబొమ్మన్న’’ది.హమీద్‌ ఈ తమాషా అంతా చూస్తున్నాడు.యా అల్లాహ్‌! ఈ సామానంతా ఎలా వచ్చింది? చివరకు తల్లిని అడిగాడు. రషీదాబాద్‌ కూడా చిన్న బస్తీలాంటి గ్రామమే. అన్నీ ఈ ఉళ్లోనే దొరికినవని జవాబు చెప్పింది.‘‘అమ్మా! భోజనం సంగతి సరే. ఈ చెప్పులు, ఈ పీక్‌దాసు, ఈ దుప్పటి ఇవన్నీ ఎలా కొన్నావు?’’తల్లి వేడి వేడి కన్నీళ్లు కార్చింది.మాతృదేవతా వాత్సల్యం అనుపమానం!‘‘ఏడు సంవత్సరాలు ఎదురు చూశాను. ఇల్లు అమ్మాను. పొట్ట బిగించుకొని నీ కోసం, నీ పిల్లల కోసం ఈ వస్తువులన్ని సేకరించాను. నీ కోసం ఎదురు చూసి చూసి కళ్లు కాయలు గాచినవి. నాయానా! ఈ వస్తువుల్ని సేకరించడానికి ఏడు సంవత్సరాలు పట్టింది. సలమాను చూడనే లేదు’’ అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది.తల్లి మాటను విని శాంతిదేవత ఆ చిన్నగది నిండా తన రెక్కలను విప్పింది. ఇక ఎవరూ మాట్లాడలేదు.తెల్లవారింది. హమీద్‌ తల్లి ఇక కళ్లు తెరవలేదు.
 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top