స్వర్గం నుంచి దిగి వచ్చి'నది'!

స్వర్గం నుంచి దిగి వచ్చి'నది'! - Sakshi


విహారం

‘భవబంధాలకు దూరంగా ఏకాంతంగా తపస్సు చేసుకుంటున్న మునిపుంగవుడిలా ఉంటుంది’ ‘ప్రకృతిలో చలనమే కాదు చిత్రలేఖనం కూడా అంతర్లీనమై ఉంది అని చెప్పడానికి ఇదో ఉదాహరణ’ ‘ఇంద్రధనసులు ఆకాశంలోనే కాదు...నదిలో కూడా కనిపిస్తాయి’ ‘స్వర్గం నుంచి దిగి వచ్చిన నది’  ‘కానో క్రిస్టేల్స్’ నది గురించి ఇలా భావుకతతోనో, కవితాత్మకంగానో  చెబుతుంటారు పర్యాటకులు. ‘మోస్ట్ బ్యూటిఫుల్ రివర్ ఇన్ ది వరల్డ్’గా ప్రఖ్యాతిగాంచిన ‘కానో క్రిస్టేల్స్’ నది  కొలంబియాలోని సెరనియ దె లా మకరెనా పర్వత శ్రేణుల మధ్యలో ఉంది.

 

జూలై, నవంబర్ మాసాల మధ్యలో  ప్రకృతిదేవత తన కుంచెతో చిత్రాలు గీస్తుందని, దాని ఫలితమే కానో క్రిస్టేల్స్ నది, దాని పరిసర ప్రాంతాల అందమనే నమ్మకం ఉంది. ఆకుపచ్చ, పసుపుపచ్చ, నీలి, ఎరుపు, నలుపు వర్ణాలతో ఈ నది పంచరంగుల నది అని పేరు తెచ్చుకుంది. ఈ ప్రకృతి వర్ణమాల అనేది యాదృచ్ఛికంగా ఏర్పడింది కాదని, ఆ రంగుల వెనుక పరమార్థం ఉందని తాత్వికకోణాన్ని జోడించేవారు కూడా ఉన్నారు.

 

పసుపు రంగు....ఆనందం, ఆశావాదదృక్పథాన్ని, ఆకుపచ్చ రంగు...సమన్వయ శక్తి, సామరస్య దృష్టిని, నీలిరంగు... నిజాయితీ, నమ్మకాలను, నలుపురంగు... శక్తి, నియంత్రణను,ఎరుపు రంగు... నాయకత్వ లక్షణాలు, అంకితభావాన్ని ప్రతిబింబిస్తుందనే తాత్విక అర్థం ఉంది. ప్రకృతి ఆరాధకులు అందమైన ప్రకృతి చిత్రాలను మాత్రమే చూసి ఆనందించగా, కొందరు  మాత్రం ఈ పంచరంగుల నదిని వీక్షించడం వల్ల ఆ రంగులలోని సానుకూల అంశాలు, శక్తులు తమలో వచ్చి చేరుతాయని విశ్వసిస్తారు.

 

నది గర్భంలో పెరిగే మకెరేనియ క్లవిగేరాలాంటి తాజా నీటి మొక్కల వల్లే నది పంచరంగుల్లో కనిపిస్తుంది. సూర్యకాంతి ప్రకారం కూడా నదీ రంగుల అందాలు మారుతుంటాయి. కొలంబియన్ జర్నలిస్ట్, అన్వేషకుడు ఆండ్రూ హుర్టాడో గార్షియా ఈ పంచరంగుల నది సౌందర్యాన్ని గురించి ప్రపంచానికి  మొట్ట మొదటిసారిగా పరిచయం చేశాడు. పర్యావరణ రక్షణ చర్యలు, ఉగ్రవాద కార్యకలాపాల దృష్ట్యా ఈ నది 2009 వరకు ‘నో-గో ఏరియా’గా ఉండేది. ఇప్పుడు ఈ ప్రాంతం  కొలంబియా మిలటరీ అధీనంలో ఉంది. ఈ నది పుణ్యమా అని లా మకరెనా నేషనల్ అండ్ ఎకోలాజికల్ రిజర్వ్ పార్క్ కూడా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా  ఎందరో పర్యాటకులను ఆకర్షిస్తున్న ఈ నది దగ్గరికి వెళ్లడానికి రోడ్డు మార్గం లేదు. చిన్నదైన   లా మకరెనా  విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి నడిచికాని, గుర్రం మీదకాని నది సమీపానికి చేరాల్సి ఉంటుంది.



‘‘ఇది నదే అని నమ్మడానికి చాలాసేపు పడుతుంది’’ అంటాడు ఒక పర్యాటకుడు ఆశ్చర్యంగా. రంగుల విచిత్రాలు మాత్రమే కాదు...ప్రాచీన శిలల గంభీర మౌనం, సరిగమల జలపాత సౌందర్యం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ‘‘అక్కడి నుంచి బయటి రాగానే ఒక అందమైన కల నుంచి మేలుకున్నట్లుగా అనిపిస్తుంది తప్ప వాస్తవదృశ్యాలను దర్శించినట్లు అనిపించదు.  మడుగులు, గుహలు నాటకీయంగా కనిపిస్తాయి’’ అని కానో క్రిస్టేల్స్ గురించి చెబుతాడు బ్రిటన్ రచయిత టామ్ హాల్. రకరకాల కారణాల రీత్యా  ‘మీ భద్రతకు మా పూచీ లేదు’ అని ఈ ప్రాంతాన్ని కొలంబియా ప్రభుత్వం ‘రెడ్ జోన్’గా ప్రకటించింది. అయినప్పటికీ ఈ పంచరంగుల నదిని  చూడడానికి పర్యాటకులు ఉత్సాహపడుతూనే ఉన్నారు. అక్కడి ఊహలతో గుసగుసలాడుతూనే ఉన్నారు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top