గోదావరి నేర్పిన అడుగులివి...


అందమైన గోదావరిని చూస్తే... గుండె పొంగక మానదు.

ఎలాంటి వారికైనా మనసు నుంచి కవితా ప్రవాహం వెల్లువలా పారుతుంది.

గోదావరి పరవళ్లను తమ కలంలో ఇంకించి,

తమ సాహిత్య ప్రవాహంతో ఓలలాడించిన సినీ గేయ రచయితలు చాలా మందే ఉన్నారు.

 వారు రాసిన కొన్ని సినీ గేయాలను...వాటికి అనుగుణంగా పడిన సొగసైన అడుగులను చూద్దాం.


 

ఆ కుర్రాడికి పదేళ్లుంటాయి. పుష్కరాలెలా ఉంటాయో వినడం తప్పించి, చూడలేదు. తల్లిదండ్రులతో పుష్కరాలకు వచ్చాడు. ఆ గోదారమ్మ ఒడిలో సేదతీరి, తమ కోరికలను చెప్పుకోవడానికి వచ్చిన వేలాది భక్తులను చూసి అతనూ తన్మయత్వానికి లోనయి చేతులు జోడిస్తాడు. ఈ పుష్కర గోదావరిని చూసి పైన ఉన్న ముక్కోటి దేవతలు పొగిడే లా పాట అందుకుంటాడు. ‘‘వేదంలా ఘోషించే గోదావరి... అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి’’... అని ఆరుద్ర ‘ఆంధ్రకేసరి’ చిత్రం కోసం రాసిన ఆ పాట... గోదావరి గురించి తలుచుకోగానే ప్రార్థనా గీతంలా శ్రోతల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది.

 ‘ఆంధ్రకేసరి’లో అన్నపూర్ణ, బాలనటుడు హరీశ్

 

ఆ చిన్నది గోదారి తీరంలో పుట్టి పెరిగింది. తనతో పుట్టి పెరిగిన మావ అంటే మక్కువెక్కువ. ఎప్పటికైనా అతనినే పెళ్లాడాలనే కోరిక. ఇలాంటి ఓ అమ్మాయి మనసును... ‘‘గోదారి గట్టుందీ గట్టు మీద సెట్టుందీ సెట్టు కొమ్మన పిట్టుందీ  పిట్ట మనసులో ఏముంది? అని దాశరథి కలం నుంచి జాలు వారింది. ‘మూగమనసులు’ సినిమాలోని ఈ  పాట నిజంగా అజరామరమే.

‘మూగమనసులు’లో జమున

 

ఆ అమ్మాయి పరిగెడుతోంది. తన మనసైన వాడు ఎక్కడ ఉన్నాడా అని వెతుకుతోంది. అప్పుడే దూరంగా ఆ గోదావరి మీద పడవలో ఉన్నాడు. తన ప్రియురాలు పిలవగానే...తన మనసులో ప్రేమను పాటగా మార్చి, పాడుతున్నాడిలా...

 ‘‘కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది

 గోదావరి వరదలాగ కోరిక చెలరేగింది’’

అంటూ ‘ఉయ్యాల జంపాల’ చిత్రంలో ఆరుద్ర రాసిన ఈ పాట మదిలో గిలిగింతలు పెడుతుంది.

‘ఉయ్యాల జంపాల’లో జగ్గయ్య

 

గోదావరి తీరంలో జరిగిన విషాద గాథ ‘సితార’ చిత్రం. రాజవంశం నీడలో సమాధి అయిపోయిన ఓ సితార జీవితం. ప్రాణంగా పెంచిన అన్న, అంతకన్నా ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి దూరం అయిన బాధలో అన్నిటికీ దూరంగా వచ్చేసిన ఆమె సినీ మాయా ప్రపంచంలో అడుగుపెడుతుంది. కథానాయికగా వెలుగుతూ మనుషుల స్వార్థానికి బలవుతుంది. ఏ గతాన్నైతే దాచాలనుకుందో అదే కళ్లెదుట నిలబడి వెక్కిరిస్తుంటే భరించలేకపోయింది,ఆ యువతి మనోగతాన్ని వేటూరి...

‘‘వెన్నెల్లో గోదావరి అందం... నది కన్నుల్లో కన్నీటి దీపం’’ అని ఆవిష్కరించారు.

‘సితార’లో భానుప్రియ

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top