
నారాయణుని నక్షత్రోత్సవ వైభవం
ఉత్సవాలదేవుడైన శ్రీవేంకటేశ్వరస్వామికి ఆలయంలో ప్రతినెలా ఆయా మాసాల్లో వచ్చే ప్రత్యేక నక్షత్రాలతో కూడిన రోజుల్లో ప్రత్యేక ఉత్సవాలు, పూజాకైంకర్యాలు, ఊరేగింపులు నిర్వహిస్తారు.
ఉత్సవాలదేవుడైన శ్రీవేంకటేశ్వరస్వామికి ఆలయంలో ప్రతినెలా ఆయా మాసాల్లో వచ్చే ప్రత్యేక నక్షత్రాలతో కూడిన రోజుల్లో ప్రత్యేక ఉత్సవాలు, పూజాకైంకర్యాలు, ఊరేగింపులు నిర్వహిస్తారు.
రోహిణీ నక్షత్రోత్సవంలో...
ద్వాపరయుగం నాటి శ్రీకృష్ణుడే శ్రీవేంకటేశ్వరుడని భక్తుల నమ్మకం. అందువల్లే ప్రతినెలా రోహిణీనక్షత్రంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తారు. ఆ రోజు వేకువజాము అభిషేకం తర్వాత రుక్మిణీ కృష్ణులకి అభిషేకం నిర్వహిస్తారు. రుక్మిణీసమేత శ్రీకృష్ణుడిని బంగారు వాకిలిలో శ్రీపీఠంపై అధిరోహింపచేసి విశేష ఆభరణాలు, పూమాలలతో అలంకరిస్తారు. ఛత్రచామర, మంగళవాద్య, వేదపారాయణ, దివ్యప్రబంధ పఠనామృతం నడుమ వృష, తురగ, గజ, భక్తబృందాలు గోవింద నామస్మరణల మధ్య ఉత్సవవర్లు ఆలయం వెలుపలకు వస్తారు. కొలువు మండపంలో సహస్ర దీపాలంకరణ సేవలో గోవిందుడి లీలల్ని గాయకులు కీర్తిస్తుండగా, పండితులు వేదగానం సాగిస్తుండగా ఉత్సవవర్లు ఊయలూగుతూ దివ్యదర్శనమిస్తారు. తర్వాత ఆలయ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారు. సాయంత్రం వేళ ఆలయ ప్రవేశం చేసిన రుక్మిణీ కృష్ణులకు బంగారు వాకిలి వద్ద నైవేద్య హారతులతో ఆస్థానం నిర్వహిస్తారు. తీర్థ ప్రసాద వితరణ తర్వాత రుక్మిణీ శ్రీకృష్ణులు ఆనందనిలయంలోకి ప్రవేశించటంతో రోహిణీ నక్షత్రోత్సవం ముగుస్తుంది.
ఆరుద్ర నక్షత్రోత్సవం
విశిష్టాద్వైత మత ప్రచారకులైన రామానుజుల వారి జయంతి ఉత్సవాలే ఆరుద్రా నక్షత్రోత్సవాలు. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమితో మొదలై, ఆరుద్రానక్షత్రానికి ముగిసేటట్లు ఉత్సవాలు నిర్వహిస్తారు. వీటినే ‘భాష్యకార్ల ఉత్సవాలు’ అని కూడా అంటారు. ప్రతినెలా ఆరుద్రనక్షత్రం రోజున శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామితోపాటు రామానుజుల వారిని ఆలయ పురవీధుల్లో ఊరేగిస్తారు. స్వామిమీద ఉన్న పుష్పమాలలు, స్వామికి సమర్పించిన శేషహారతి, శఠారి మర్యాదలు రామానుజులవారికి సమర్పిస్తారు. బంగారు తిరుచ్చిపై శ్రీదే వి, భూదేవిలతో కలసి స్వామివారు, అభిముఖంగా మరొక పీఠంపై శ్రీరామానుజులవారు ఆలయ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఆ తర్వాత రామానుజులవారు, స్వామివారు ఆనంద నిలయంలోకి ప్రవేశించటంతో ఉత్సవం ముగుస్తుంది.
పునర్వసు నక్షత్రోత్సవం
నాటి రాముడే నేటి వేంకటేశుడని చెప్పేందుకు ప్రతి ఏడాది శ్రీరామ నవమి నాడు ఆస్థానం, మర్నాడు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు. శ్రీరామచంద్రుడు జన్మించిన పునర్వసు నక్షత్రంలో ఆలయంలో ప్రతినెలా విశేష పూజలు నిర్వహిస్తారు. శ్రీ సీతారామలక్ష్మణస్వామిని శ్రీపీఠంలో అధిరోహింప చేసి విశేష ఆభరణాలు, పూలమాలలతో అలంకరిస్తారు. ఉత్సవవర్లు కొలువు మండపంలో సహస్ర దీపాలంకరణ సేవలో పూజలందుకుంటారు. తర్వాత ఆలయ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశాక ఉత్సవవర్లు ఆలయ ప్రవేశం చేయటంతో పునర్వసు నక్షత్రోత్సవం ముగుస్తుంది.
శ్రవణ నక్షత్రోత్సవం
సాక్షాత్తూ శ్రీ స్వామివారు ఆవిర్భవించిన శ్రవణ నక్షత్రంలో ప్రతినెలా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉత్సవవర్లను శ్రీపీఠంలో అధిరోహింప చేసి విశేష ఆభరణాలు, పూలమాలలతో అలంకరిస్తారు. కొలువు మండపంలో దీపాలంకరణ సేవలో పూజలందుకున్న తర్వాత శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప ఆలయ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేసిన అనంతరం ఉత్సవవర్లు ఆలయ ప్రవేశం చేయటంతో శ్రవణ నక్షత్రోత్సవం ముగుస్తుంది.