దానివల్ల  బిడ్డకు ప్రమాదమా? 

Fundy health counseling 11 nov 2018 - Sakshi

సందేహం 

నా వయసు 40, నేను ఈ మధ్యకాలంలో చాలా బరువు తగ్గిపోయాను. కారణమేమిటో అర్థం కావట్లేదు. సిస్ట్‌ క్యాన్సర్‌ లక్షణాల్లో బరువు తగ్గిపోవడం ఉంటుందని ఓ పుస్తకంలో చదివాను. అసలు ఎలాంటి లక్షణాల ద్వారా సిస్ట్‌ క్యాన్సర్‌ వచ్చిందని తెలుసుకోవచ్చు? సిస్ట్‌ క్యాన్సర్‌ ఏ కారణాల వల్ల వస్తుంది. నివారణ చర్యలను వివరంగా తెలియజేయగలరు. – జి.బిందు, హైదరాబాద్‌
సిస్ట్‌ క్యాన్సర్‌ అన్నారు కానీ అది ఎక్కడ అనేది వివరంగా రాయలేదు. సిస్ట్‌ క్యాన్సర్‌ అని ప్రత్యేకంగా ఏమీ ఉండదు. శరీరంలో ఎక్కడైనా కూడా సిస్ట్‌లు తయారు అవుతాయి. మరీ గట్టి పదార్థాలు కాకుండా ఏదైనా ద్రవంతో నిండిన తిత్తులను సిస్ట్‌లు అంటారు. ఇవి చర్మంపైన రావచ్చు. అన్ని అవయవాలలో ఎక్కడైనా ఏర్పడవచ్చు. ఇది ఎందుకు..? ఎలా ఏర్పడతాయి..? అనే విషయాలు కచ్చితంగా చెప్పలేము. చాలావరకు సిస్ట్‌లు అపాయం కానివే ఉంటాయి. కొన్ని మట్టుకే క్యాన్సర్‌గా మారే అవకాశాలుంటాయి. సెబేసియస్‌ సిస్ట్, ఒవేరియన్‌ సిస్ట్, ఎండోమెట్రియల్‌ సిస్ట్, చాక్లెట్‌ సిస్ట్‌ వంటివి ఎన్నో మన శరీరంలో ఏర్పడుతుంటాయి. ఇవన్నీ క్యాన్సర్‌లు అవ్వాలని ఏమి లేదు. క్యాన్సర్‌ సిస్ట్‌ లక్షణాలు ప్రాధమిక స్టేజీలో పెద్దగా కనిపించవు. అవి మెల్లగా పెరుగుతూ ఉండి మిగితా అవయవాలకు పాకేటప్పుడు ఇవి ఏ అవయవంలో వచ్చాయనేదాని బట్టి లక్షణాలు ఉంటాయి. కడుపులో నొప్పి, కడుపు బరువుగా ఉండటం, ఆకలిలేకపోవడం, నీరసం, బరువు తగ్గటం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు క్యాన్సర్‌ పాకే కొద్ది.. ఏర్పడతాయి. ఇవి అనేక వేరే కారణాల వల్ల కూడా రావచ్చు. కాబట్టి చాలావరకు వీటిని అశ్రద్ధ చెయ్యడం, లేదా నిర్ధారణ ఆలస్యం కావచ్చు. సిస్ట్‌ క్యాన్సర్‌లు అన్నింటికి నివారణ మార్గాలు చెప్పలేము. చెడు అలవాట్లు లేకుండా.. పౌష్టిక ఆహారం తీసుకుంటూ.. వ్యాయామాలు  చేసుకుంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించినప్పుడు కొంతవరకు కొన్ని రకాల క్యాన్సర్‌లకు నివారణ మార్గం అవుతుంది.

నా వయసు 27 సంవత్సరాలు. నేను ప్రస్తుతం ప్రెగ్నెంట్‌. నాకు కామెర్లు వచ్చాయి. దీనివల్ల కడుపులో బిడ్డకు ప్రమాదం ఉంటుందా? ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి? అలాగే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి వివరంగా తెలియజేయగలరు. – జి.సృజన, కరీంనగర్‌
గర్భంలో ఉన్నప్పుడు అనేక రకాల కారణాల వల్ల.. లివర్‌ పనితీరులో మార్పుల వల్ల.. బైలురూబిన్‌ పదార్థం రక్తంలో ఎక్కువగా చేరుకుని జాండిస్‌ అంటే పచ్చకామెర్లు ఏర్పడతాయి. వీటిలో ముఖ్యంగా హెపటైటిస్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల, రక్తంలో మార్పులవల్ల, హీమోలైటిక్‌ జాండిస్, జ్వరాలు, గాల్‌బ్లాడర్‌ స్టోన్స్, బీపీ పెరగడం వల్ల, కొన్ని మందుల వల్ల, హార్మొన్లలో మార్పుల వల్ల జాండిస్‌ రావచ్చు. మాములు వారిలో కంటే గర్భిణిలలో జాండిస్‌ వస్తే అది చాలా ప్రమాదకరం. కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా అవుతుంది. ప్రెగ్నెన్సీలో జాండీస్‌ వల్ల తల్లిలో లివర్‌ పనితీరు సరిగా ఉండదు. అంతే కాకుండా ఇతర అవయవాల పనితీరు దెబ్బతింటాయి. రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడే క్లాటింగ్‌ ఫ్యాక్టర్స్‌ సరిగా పనిచేయవు. దానివల్ల గర్భిణీలలో అధిక బ్లీడింగ్, బిడ్డ కడుపులో చనిపోవడం, కిడ్నీలపై ప్రభావం, అవి దెబ్బతినటం, తల్లి కోమాలోకి వెళ్లిపోవటం, ప్రాణాపాయం వంటి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడవచ్చు. నీకు కామెర్లు ఏ కారణం చేత వచ్చాయి అని తెలుసుకోవటానికి డాక్టర్‌ పర్యవేక్షణలో అనేక రక్తపరీక్షలు చెయ్యించుకుని నిర్ధారణ చెయ్యించుకోవాలి. కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవలసి ఉంటుంది. ఆహారంలో ఎక్కువగా ద్రవాలు, నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పండ్లరసాలు, ప్రొటీన్‌ కలిగిన పోషకపదార్ధాలు తీసుకోవటం అన్నివిధాలా మంచిది. డాక్టర్‌ దగ్గరికి రెగ్యులర్‌ చెకప్స్‌కి వెళ్లటం, రక్తపరీక్షలు క్రమం తప్పకుండా చెయ్యించుకుంటూ ఉండటం ముఖ్యం. జాండిస్‌ తీవ్రతను బట్టి చికిత్స తీసుకుంటూ కాన్పును అన్ని వసతులు ఉన్న హాస్పిటల్‌లో చేయించుకోవడం మంచిది. అశ్రద్ధ చేస్తే పెను ప్రమాదం తప్పదు.

నా వయసు 25, నాకు ఈ మధ్యకాలంలో అవాంఛిత రోమాలు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఈ విషయం నా ఫ్రెండ్‌కి చెబితే.. ‘నువ్వు ఈ మధ్యకాలంలో లావు కూడా అయ్యావు కదా! నీకు పాలిసిస్టిక్‌ ఓవేరియన్‌ సిండ్రోమ్‌ వచ్చి ఉంటుంది’ అని చెప్పింది. పాలిసిస్టిక్‌ ఓవేరియన్‌ సిండ్రోమ్‌ గురించి వివరంగా తెలియజేయగలరు. దీనివల్ల పురుషలక్షణాలు వస్తాయట నిజమే? వివాహం చేసుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయా?– కె.ఎన్, పిడుగురాళ్ల
గర్భాశయం ఇరువైపుల ఉండే అండాశయాలలో అండాలు పెరిగే చిన్న ఫాలికల్స్‌ ఉంటాయి. కొందరిలో ఈ ఫాలికల్స్‌ ఉండవలసిన సంఖ్య కంటే ఎక్కువగా చిన్న చిన్న నీటి బుడగలు లాగా ఉంటాయి. వీటినే పాలిసిస్టిక్‌ ఓవరీస్‌ అంటారు. ఇది హార్మొన్ల అసమతుల్యత వల్ల, ఇన్సులిన్‌ రెసిస్టెన్సీ వల్ల, జన్యుపరమైన కారణాల వల్ల, అధిక బరువు, జీవనశైలిలో మార్పులు, మానసిక ఒత్తిడి వంటివి ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల ఏర్పడతాయి. ఇవి ఉన్నవారిలో టెస్టోస్టిరాన్‌ అనే పురుష హార్మోన్‌ ఆడవారిలో ఉండవలసినదానికంటే ఎక్కువగా విడుదల అవుతుంది. దీని ప్రభావం వల్ల అవాంఛిత రోమాలు, (పై పెదవిపైన, చెంపలపైన, గడ్డాలపైన, ఇతర శరీరభాగాలపైన) మొటిమలు, మెడచుట్టూ చర్మం నల్లగా మందంగా తయారుకావడం తలపైన జుట్టు రాలడం, పీరియడ్స్‌ క్రమం తప్పడం వంటి ఎన్నో లక్షణాలు ఏర్పడవచ్చు. దీనినే పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌ అంటారు. వివాహం తర్వాత హార్మొన్ల సమతుల్యత సరిగా లేకపోవడంత వల్ల, పీరియడ్స్‌ సక్రమంగా రాకపోవడం, అండం తయారు కాకపోవడం, దాని వల్ల పిల్లలు పుట్టడానికి ఇబ్బందులు ఏర్పడవచ్చు. గర్భందాల్చిన తర్వాత, అబార్షన్లు, షుగర్‌ రావటం వంటి సమస్యలు రావచ్చు. అశ్రద్ధ చేస్తే, తర్వాత కాలంలో షుగర్, బీపీ వంటి సమస్యలు చిన్న వయసులోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌ ఉన్నవారు వాకింగ్‌తో పాటు వ్యాయామాలు చెయ్యడం, బరువు పెరగకుండా చూసుకోవడం, ఆహారంలో నియమాలను పాటించడం వంటి జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల పాలిసిస్టిక్‌ సిండ్రోమ్‌ యొక్క లక్షణాలు ఇంకా ఎక్కువ పెరగకుండా చూసుకోవచ్చు. డాక్టర్‌ పర్యవేక్షణలో లక్షణాల తీవ్రతను బట్టి మందులు వాడుకోవడం అన్నివిధాలా మంచిది.
డా‘‘ వేనాటి శోభ
బర్త్‌రైట్‌ బై రెయిన్‌బోహైదర్‌నగర్‌
హైదరాబాద్‌
\

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top