మరాఠీ దెయ్యం

Funday story of the week 09 dec 2018 - Sakshi

ఈవారం కథ

ఊరికొసానున్న మంత్రాల పుల్లయ్య ఇంటిముందర కూర్చోని పుల్లలేసినప్పుడంతా కొరివి దెయ్యం తలమంటలా భగ్గునలేస్తున్న చలిమంటవొంకే చూస్తున్నాడు గోవిందు. కడపెళ్లిన నరసప్ప తిరిగిరావడం కోసం సాయంత్రం నుంచి ఎదురుచూస్తా పెద్దూర్లోనే ఉండిపోవాల్సొచ్చింది.మామూలుగా ఐతే పెద్దూరొచ్చిన చెర్లోపల్లెవాళ్లంతా వెల్తురుండగానే తిరిగెళ్లిపోతారు. మూడు మైళ్ల దారంతా తోటలు, వంకలు, డొంకలు, రాత్రైతే దెయ్యాల భయం.గోవిందుకు ఇవ్వాల్సిన బెల్లం డబ్బు ఇవ్వకుండా నరసప్ప సంవత్సరం నుంచి తిప్పుకుంటున్నాడు. అది చేతికొస్తే గాని మరుసటి కారుకు విత్తనాలు కొనలేడు  గోవిందు.తప్పనిసరై ఉండిపోయాడు.అతనికి అసహనంగా ఉంది.ఆరోజు పట్టుకోకపోతే నరసప్ప మళ్లీ వారందాకా దొరకడు. అమావాస్య చీకటి కమ్ముకుంటావుంది. ఇంకా ఆలస్యమైతే తోడులేకుండా ఒక్కడే వాళ్లవూరు వెళ్లలేడు.‘‘నర్సప్ప రావాల్సిన లాస్ట్‌ బస్సు అడ్డరోడ్డు కాడికి వచ్చేసింటాదిగదా మామా’’ అడిగాడు గోవిందు, పొలాల్లో గొర్రెల మంద బెరుగ్గా అరవడం, కీచురాళ్ల చప్పుడు పెరగడం గమనిస్తూ.‘‘నీ పెండ్లానికి నీకునాలుగురోజులాయె మాటల్లేవంటాండావు. యేమైండాది?’’ అన్నాడు పుల్లయ్య బీడిని వెలిగిస్తూ.ఎర్రగా మెరుస్తున్న అతని పళ్లు, సారాకళ్లు, జులపాలు, బుర్రమీసాలు చూస్తూ ‘దయ్యం కంటే ఈనేబైంకరంగా వుండాడే’ అనుకున్నాడు గోవిందు.‘నెల్రోజుల్నించి దాని అన్న ఖాయిలాతో కడపాస్పత్రిలో జేరివుండాడు. దాని గొలుసు, గాజులు నాతో మాటైనా చెప్పకుండా వాళ్లన్న కంపించింది.తాళిబొట్టొకటే మిగిలుండాది.ఈతూరి యెరువుల ఖర్చులకు కుదవ నా తలకాయ బెట్టాల్సిందే’’ నిట్టూర్చాడు గోవిందు.‘‘యెట్లైనా నీ పెండ్లానికి ధైర్ణమెక్కువేబ్బీ’’ అన్నాడు బీడి పొగ వదుల్తూ పుల్లయ్య.‘దాని మొఖం. సస్తే సీకట్లో అడుగు బైటపెట్టదు, ఆడోల్ల ధైర్ణాన్ని నువ్వే పొగడాల...ఈరాత్రి ఇంటికి బోయినాక దాని కత వుంది’’అన్నాడు గోవిందు కోపంగా.‘‘నీ పెండ్లామ్మీదైతే వొంటికాలు మీద లేస్తాండావుగానీ, నర్సప్పను దుడ్లు గెట్టిగా అడగాలంటే నీకు బయ్యేం’’ అని నవ్వి–‘‘మనిసికి బయం నరాల మూలాల్లోనే వుంటాది. తెల్సినా నీ వొశంలో వుండదు. బతకి బట్టగట్టాలంటే బయంగూడా అవుసరమబ్బీ’’ అన్నాడు పుల్లయ్య.
సగం కాలిన పుల్లల్ని జవిరి కుప్పగా మంటలో వేశాడు గోవిందు.

మంట భగ్గుమంది.‘‘అందుకేనేమో నర్సప్ప అందర్నీ ఆడిస్తావుండాడు. మాసువుల్లో యేసిన బెల్లం. వాయన టౌన్లో అమ్ముకొనే ఆర్నెల్లయ్యుండాది. నా దుడ్లు నాకిచ్చేదానికి ఇన్ని తూర్లా తిప్పుకునేది. ఈ పొద్దెట్లైనా బాకీ వసూలు చేస్కోవాల’’ నరసప్ప మిద్దె వైపు చూసి అన్నాడు గోవిందు.ఊరివైపు నుంచి చలిమంట దగ్గరకు నీడలా నడిచొచ్చి నిలబడ్డాడు నరసప్ప పొలాలు చూసుకునే సిలారు.వొంగి మంటకు అరచేతులు పెట్టి ‘‘యేం గోవిందన్నా పెండ్లైనోడివి వూరికి బోకుండా ఈడ దయ్యాలాయన్తో చలిగాచుకుంటా వుండావా. ఇనేవోడుంటే ఈన యెన్ని గ్యాసు దయ్యాలకతలైనా చెప్తాడు’’ అనినవ్వాడు.అతని వైపు చురచురా చూశాడు పుల్లయ్య.‘‘మీ సౌకారొచ్చేది ఆల్చెమౌతాదాబ్బీ’’ అడిగాడు అతని కోసమే చూస్తున్న గోవిందు.‘‘ఆయన అనుకోకండా కడపలోనే కూతురింట్లో నిల్చిపోయినాడు.ఇప్పుడే రాజరత్నం సారు చెప్పిపాయె. మన్నాడొస్తాడంటన్నా’’ అన్నాడు సిలారు చేతులు మొహానికి రుద్దుకుంటూ, గోవిందు నిస్సత్తువగానిట్టూర్చి ‘కత మొదుటికొచ్చింది’ అనుకున్నాడు.‘‘మీవూరోళ్లు రాగిమానుకిందుండిరే’’ అని ఊరివైపు చూసి,‘‘యెళ్లిపోయినట్టుండార్నా. నువ్వు బిన్నే నాలుగడుగులేస్తే అందుకోవచ్చు’’ అని తమ ఇండ్లవైపు వెళ్లిపోయాడు సిలారు.మంట ఆరిపోయి నిప్పురవ్వలు మిగిలాయి.చీకటి కమ్ముకుంది.

‘‘నువ్వు ఇంటికి బొయేట్టుంటే తోడుంటేనే బయల్దేరాది మంచిదిబ్బీ. అమాస్య గడియ లొచ్చేస్తాండాయి. మీవూరి దావలో యాడైనా సమాలిచ్చుకోవచ్చుగానీ అంకాలు మామిడొనం దాటేటప్పుడు మాత్రం ప్రాణం మీది కొస్తాది. ఆడ మర్రిచెట్టు మీద మరాఠీ ఆడదయ్యం శానా యిరుడ్డమైంది, యేషాలేస్తాది. గొంతుచీల్చి రగతం తాగుతాది. మా బోటి మంత్రగాళ్లే తట్టుకోలేరు. పోనీ రాత్రికి మా యింట్లో పండుకోని పొద్దున్నేపోరాదు’’ అని పుల్లయ్య లేచాడు.‘‘సీకట్తోనే రాయారం బోవాల. నాగిరెడ్డి దుడ్లిస్తానన్నాడు. రేప్పొద్దునైతేనే వుంటాడంట. యిత్తనాలకు కసాలగా వుండాది’’ అని–‘‘అరే..ఈ నర్సప్ప ఖయాల్లోబడి మర్చేపోయినా. చెంచయ్యతోట నించి వొకబుట్ట తొమలపాకులు తెమ్మన్నాడు నాగిరెడ్డి. తెల్లార్తోనన్నా బొయ్యి తొమలపాకులు తీస్కోని పరిగెత్తాల. వుత్తచేతుల్తోబోతే యింట్లేకే రానీడు, బోకోపం మనిసి.దయ్యాలని నిల్చిపోతే మనకు జరుగుతదా. పోతా...యెట్టన్నాగానీ....దావలో మావూరోళ్లు యెవురోవొకరు తోడు దొరక్కపోరు’’ అంటూ తనూ లేచి బయల్దేరాడు గోవిందు.

గోవిందు కళ్లు చిట్లించి చూస్తూ వడివడిగా నడుస్తున్నాడు. చీకట్లో ముందర మనుషులెళ్తున్నారో లేదో తెలీడం లేదు. వాళ్లవూరోళ్లు కల్సుకునే నామాలోళ్ల కళ్లం దగ్గరకొచ్చాడు.అక్కడ గుడ్డిలాంతరు వెల్తురులో నులకమంచమ్మీద నిద్రపోతున్న వాళ్ల సేద్యగాడు చెవిటి ఓబయ్య తప్ప మరో మనిషి జాడలేదు. సంశయిస్తూ ముందుకు నడిచాడు.అతనికి దెయ్యాల భయం మొదలైంది.‘యెనకరోజుల్లో ఆడోళ్లంతా చెట్టుకు వురేసుకొనో, బావిలో దూకో సచ్చేవాళ్లేమో. రేత్రైతే సాలు చెట్టు కోటి,  బావికోటి యేడజూసినా దయ్యాలే. ఇవి మనుసులుగా వున్నప్పుటికంటే  సచ్చి దెయ్యాలైనాకే చిన్నప్పబావిగట్టు మీద ఎవరో తెల్లగా కూర్చున్నట్టుంది.వొళ్లు జలదరించింది.అడుగు ముందుకుపడలేదు.పరికించి చూశాడు, అది కొత్తగా బెరడు లేచిపోయిన కానుగచెట్టు మొదలు.ఊపిరిపీల్చుకుని కదిలాడు. నక్కలమడుగు దగ్గరికొచ్చాడు. అక్కణ్ణుంచి దారి వరిమళ్లు వొదిలి తోటల్లో, డొంకలగుండా పోతుంది.‘అమాస్య సీకట్లో  ఈ చెట్టుచేమా, కొండావాగూ మనిసివి కాదు, యేరే శక్తుల రాజ్జెం. యెనక్కిపోదామా’ అనుకుని ఓ క్షణం ఆగాడు.పద్దున్నే ఎట్లైనా రాయవరం పోవాలని గుర్తొచ్చింది.బెరుగ్గానే ముందుకు నడిచాడు.అతనికి పుల్లయ్య చెప్పిన భయానక ఘటనలు గుర్తుకొచ్చిభయమెక్కువైంది. చుట్టూ ఉన్నవి వేరేగా మారి కనబడుతున్నాయి. కొండలు నల్లగా మీదికి లేస్తున్నాయి. నక్షత్రాలు గుచ్చి చూస్తున్నాయి. చెట్లు నల్లనిజుట్టు విరబోసుకుని కదుల్తున్నాయి.టెంకాయ తోటల్లోంచి వీస్తున్న కీచురాళ్లతో కలిసి చలికి ఈదురుమంటోంది.మడుగుచుట్టూ కప్పలు, మడుగుపైన అడవిబాతులు, దూరంగా నక్కలు గుంభనగా అరుస్తున్నాయి. చెట్ల సందుల్లో నీడల్లాగా ఏవో ఆకారాలు కదుల్తున్నాయి.

నడుస్తూంటే వెనకాలే ఎవరో వస్తూన్న చప్పుడు.ఎవరో నవ్వినట్టు, అంతలోనే ఏడ్చినట్టు, ఎవర్నో పిలిచినట్లు దగ్గర్లో గుసగుసలు. ఎలాగో మడుగును, ఆపైన బడేసాబ్‌ చెరకుతోటను దాటాడు. అంత చలిలోనూ చెమటలు పట్టాయి.మలుపు తిరిగాక అంతదూరంలో చిక్కగా అంకాలు మామిడివనం కనిపిస్తావుంది.‘ముందుకాలంలో మరాఠీ కుటుంబమొకటి నాటకాలేస్తా తిరగతా ఈవొరొస్తే, వోళ్ల సక్కటి ఆడకూతుర్ని అంకాలొనంలోనే అత్యాచారం జేసినారంట. ఆ పిల్ల ఆణ్ణే సీరతో మర్రిచెట్టుకు ఉరేసుకుని సచ్చిపోయి, దయ్యంగా మారి అమాస్యరేత్రిల్లు ఆ దోవన వొంటరిగా పొయ్యేవాళ్లని రకతం తాగి సంపుతాండాది’అనిచిన్నప్పట్నుంచి వింటున్నది వద్దనుకున్నా గుర్తుకొచ్చింది.అంకాలువనంలోని తాటిచెట్లు, మామిళ్ల మధ్యలో వున్న ఎల్తైన ముసలిమర్రిచెట్టు వికృతంగా అతని కోసం చేతులు సాచినట్టుంది. ఆ పక్కన చెంచయ్య తమలపాకులతోట అతను తప్పించుకోకుండా దడి కట్టినట్టుంది. కుడివైపున నాగమ్మ చెరకుతోట ప్రహరీగోడలాగుంది.ఉన్నట్టుండి గోవిందు నడక ఆగిపోయింది.గుండెలువరసతప్పినాయి.వనం పక్క నుంచి తెల్లని పొట్టి  ఆకారం  ఎగుడుదిగుడుగా అతనికేసి వస్తోంది.దాని గజ్జలు లయగా మోగుతున్నాయి.భయం కమ్మేసి అడుగులు వెనక్కిపడిబాటపక్కన లోతైన ఎండినకాలవలో పడ్డాడు.కాలిమడమ కలుక్కుమంది.‘‘అబ్బా’’ అన్నాడు.చేతులు నేల మీద ఆన్చి తలెత్తి చూశాడు. ఆ ఆకారం బాట మీద నిలబడి అతని వైపే చూస్తోంది.భయం శక్తినంతా లాగేసింది.గోవిందు కష్టం మీద లేచి బాట పైకెక్కి కుంటుతూ నడక సాగించాడు. భయం నుంచి వొళ్లు ఇంకా స్వాధీనంలోకి రాలేదు. ఎడమవైపు తలతిప్పకుండా బాటకు కుడివైపునడుస్తూమర్రిచెట్టును దాటాడు. అంతే, హఠాత్తుగా నడక మళ్లీ ఆగింది.అంకాలువనానికి చెంచయ్య తోటకు మధ్య సందులోంచి మర్రిచెట్టుకు వైపు నుంచి ఒక ఆకారం బాట మీదికి వస్తోంది.ఈసారిమనిషి ఆకారం. ఆడమనిషి. జుట్టు విరబోసుకుంది. వయ్యారంగా దగ్గరికొస్తావుంది.అది మరాఠీ దెయ్యమే, నా పని ఐపోయింది’ అనుకున్నాడు.అతని వెన్ను నిలువునా వణికింది.నక్షత్రాల వెల్తుర్లో చీర తెల్లగా మెరుస్తావుంది.ఆమె కుడిచేత్తో తమలపాకుల వెదురుబుట్ట పట్టుకుంది.ఆమె ఇరవైఅడుగుల దూరంలో బాట మీదికి వచ్చి ఒక్క క్షణం ఆగింది.పలకరింపుగా నవ్వినట్లు పలువరస చీకట్లో తెల్లగామెరిసింది. గోవిందుకు జల్దరింపు తప్ప ఏమీ తెలియడం లేదు. స్థాణువై నిలబడ్డాడు. చూస్తుండగానే ఆమె విసురుగా అటువైపు తిరిగి వాళ్లవూరి వైపు నడవసాగింది.అతను కళ్లప్పగించి చూస్తూ నిలబడ్డాడు.ఆమె డొంకలోకి తిరిగింది.రెండు నిమిషాల తరువాత కదలిక తెచ్చుకొని అతనూ డొంకలోకి నడిచాడు.రెండు పక్కలా చెట్లతో డొంక  పైకప్పులేని పొడవాటి గుహలాగుంది. ఆమె అంతదూరంలో నిద్రలో నడిచేవాళ్లలాగ నడుస్తోంది. బుట్ట నడుం మీద పెట్టుకోడంతో  ఆమె నడక ఉయ్యాల ఊగినట్టుంది.ఆమె మలుపు తిరిగింది. అతను డొంకదాటి తిరిగాక ఆమె కనబడలేదు. ‘బాట వొదిలేసి పోయింటాది. తోటలకా పక్క వాగు, వాగవతల తుమ్మచెట్లలో పాడుబడిన యెర్రంరాజు కొట్టాలు. అది పెద్ద దయ్యాలకొంప. ఆడికి పోయుంటుంద’నుకున్నాడు.‘‘ఈపొద్దు నా మీద దేవుడి దయూండాది, మరాఠీరాచ్చసి యెట్లో నన్ను సూడలేదు. సూసింటే ఆణ్ణే సచ్చుండేవాడిని’ అనుకుని కుంటుకుంటూ బాట వెంటబడి ఊరికేసి తిరిగాడు.

కాలీడ్చుకుంటూ గోవిందు ఇల్లు చేరేసర్కి అలివేలు నులకమంచం మీద కొడుకును నిద్రపుచ్చుతా వుంది. ఆమెను చూడగానే అతనికి ఒక్కసారిగా నిస్సత్తువ వచ్చి గోడకానుకుని జారి కూర్చుండి పోయాడు.శరీరం వణుకుతావుంది.అలివేలు గాభరగా దగ్గరికొచ్చి చెంప మీద చెయ్యి వేసి చూసి–‘‘జొరంగా వుండాద...యేమయ్యిండాది’’ అనడిగింది.గోవిందు తనకు భార్యతో మాటల్లేవన్న విషయమే మర్చిపోయిఆయాసపడుతూ జరిగిందంతా చెప్పాడు.అతని వైఖరి చూసి అతని వెనకాలే లోపలికొచ్చిన ఎదురింటి గంగమ్మత్త అంతా వినింది.అలివేలు ఏదో చెప్పబోయే లోపలే గంగమ్మత్త గాభరగా ముందుకొచ్చి–‘‘గోయిందు జూసొచ్చింది యెవుర్ననుకుండావ్‌?’ అంకాలు తోట్లో వుండే మరాఠీదెయ్యాన్ని. అదెట్నో ఈణ్ణి సూళ్లేదు. సూసింటేరగతంగక్కోని ఆణ్ణే పడిపోయుండేవోడు. అది ఈపూట యాడికోపేరంటానికి బోతావుంది. ఈడు బతికి పోయినాడు’’ అని తెగేసి చెప్పి, తలుపు దగ్గరకెళ్లి–‘‘వొరే మహేసూ నువ్వు బేగిపొయ్యి జంగప్పసోమిని బిల్చుకోనిరా...మంత్రమేసి తాయెత్తు గడతాడు...మంగా పసుపునీళ్లు గలపవే...నేను ఆంజనేస్సావమి కుంకం దెస్తా. మల్లేరమ్మ బండారుగుడా వుండాది’’ అంటూ బయటున్న వాళ్లకి అరిచి చెప్పి తన  ఇంటివైపు పరుగెత్తింది.అలివేలు భర్తవైపు చూసి పకపకా వ్వింది.గోవిందు అయోమయంగా చూశాడు.‘‘నువ్వు అంకాలొనం కాడ జూసింది నన్నే. మరాఠీదయ్యన్ని గాదు, మల్లేరమ్మ చెల్లెల్నీ గాదు. తొమలపాకుల కోసం బొయినా. నవ్వు నా మీద అలిగుండావని, మాట్లాడవని ఆడ పలకరించలా’’ అనిమూలనున్న తమలపాకుల బుట్టను చూపించింది.ఆమె తలస్నానం జేసుండడాన్ని, కట్టుకున్న సన్నపూల తెల్లచీరను అప్పుడు చూశాడు గోవిందు.‘‘నీకేమైనా మతిబోయిండాదా, ఆడికి వొక్కదానివే యింతరాత్రా పొయ్యేది. యేమన్నా అయ్యుంటే’’ ఆందోళనగా అడిగాడు నిటూరుగా కూర్చొని,గోవిందుకి ఇంకా వణుకు తగ్గలేదు.‘‘నాకేం బయం. ఆ దయ్యంనన్నేంజేస్తాది... నువ్వు తెల్లార్తో లేచి రాయారం నాగిరెడ్డి దెగ్గిరికి బోవాలనుకున్నావుగనా... మీయక్క జెప్పిందిలే.... తొమలపాకులు లేకుండాబోతే ఆయన నీతో మాట్లాడతాడా... అందుకే’’ అంటూ  చిన్నగా నవ్వి అలివేలు అతని వీపు మీద చేత్తో రాసి, వాళ్లిద్దరి మధ్యా తగవుకు ఇక తావులేకుండా, అతని తలను తన గుండెలకు మృదువుగా హత్తుకుంది.
- డా.కే.వి.రమణారావు 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top