తొలకరి

Funday new story of the week 05-05-2019 - Sakshi

 కొత్త కథలోళ్లు

మణెమ్మ ఉదయం పది గంటలైనా పక్కమీద నుంచి లేవలేక పోతోంది. డిసెంబర్‌ నెల పైగా రేకుల గది. లేచి మాత్రం ఏమి చెయ్యాలి కనుక. ఇద్దరు కోడళ్లు నెలకొకరు చొప్పున్న ఇంత ముద్ద పడేస్తే తినటం తప్ప. వేడి వేడి టిఫిన్‌ తిని ఎన్ని రోజులైనదో. అడిగే వాడు లేడు . డెబ్భై ఏళ్లకే సరైన పోషణ లేక శరీరం నీరసించి పోతున్నది రోజు రోజుకి.‘వుందా పోయిందా ముసల్ది? పదైనా లేవలేదు‘ గది బయట పెద్ద కోడలి గొంతు వినపడింది. ‘లేస్తున్నానమ్మా,‘  బలహీనమైన గొంతుతో జవాబిచ్చింది మణెమ్మ, ‘లే,లే... లేచి మొహం కడుగు’.నీళ్ల టీ పాత బల్ల మీద పెట్టి వెళ్లి పోయింది. లేచి మొహం కడుక్కొని వచ్చేసరికి టీ చల్లారి పోయింది. అదే గొంతులో పోసుకొని చద్దన్నం కోసం ఎదురుచూస్తూ కూర్చుంది. ఇంకో అరగంటకి చద్దన్నం, పాత చింతకాయ పచ్చడి ప్లేటులో వేసి పోయింది కోడలు.రోజూ అదే అన్నం, ఎదో ఒక పచ్చడి. తిని తిని విసుగు వస్తోంది. అయినా చేసేదేమీ లేదు. ఎవరూ అడిగేవారు లేరు. ముసలి మనిషిని ఎవరు భాద్యత తీసుకుంటారు? ఒక్క వృద్ధాప్య  పెన్షన్‌ తీసుకునేటప్పుడు నెలకొక కొడుకు వంతులేసుకొని డ్రా చేసిన డబ్బు జేబులో వేసుకోవటమే తప్ప నెలకొకసారైనా నోరు తీపి చేయాలని అనుకోరు. మణెమ్మ నిట్టూర్చి స్నానానికని లేచింది. వేడినీళ్లు ఏనాడూ నోచుకోలేదు. ఎండలో బకెట్‌ నీళ్లు ఉంచి అవి గోరువెచ్చగా అయ్యాక స్నానం చేస్తుంది. రేకులు ఊడి వేలాడుతుంటాయి ఆ రేకు తలుపుకి. అది ఎక్కడ గీసుకుంటుందేమోనని భయం మణెమ్మకి. ఒక శీల కొట్టియ్యమని ఎన్నిసార్లడిగినా వినిపించుకున్న పాపాన పోరు ఎవరూ. నెలకొక ఒంటి సబ్బు, ఒక బట్టల సబ్బు ఇస్తారు. అంతే  అంతకు మించి ఏమి విదల్చరు.

జీవితమంటే విరక్తి కలుగుతోంది. చావు రాదేమి? యాతన లేని నిద్రలోనే ప్రాణం పోయేలా చూడమని దేవుని కోరుకొని రోజులేదు. మణెమ్మ జీవితం భర్త వున్నంత కాలం బాగానే గడిచింది. అరెకరాల భూమిని ఆయనే చేసేవాడు. పాడి పంట జీవితం ఉన్నంతలో బాగానే గడచి పోయింది. ఇద్దరు కొడుకులని బాగా చదివించాలని చాల ఆశపడేవాడు రమణయ్య. ఆయన ఆశ  నెరవేరలేదు. పెద్ద కొడుకు చిల్లర వ్యాపారం పెట్టుకున్నాడు. రెండోవాడు ధాన్యం కమిషన్‌ బిజినెస్‌  చేస్తున్నాడు. కోడళ్లు మామగారు వున్నంత కాలం నోరు మెదపలేదు. క్రమంగా మణెమ్మ స్థానం  వేప చెట్టు కింద రేకుల గదిలోకి మారింది. ఎప్పుడైనా వరండాలో కూర్చున్నా సూటిపోటి మాటలతో బాధించి లేవగొడతారు. నలుగురు మనవలున్నా వాళ్లని చేరదీయటానికి ప్రయత్నిస్తే ఊరకుక్కల తంతు. పిల్లలకు ‘ముసల్దానా‘ అని వెక్కిరించడం నేర్పారు.మణెమ్మ కొడుకులైనా కొంచం ప్రేమ చూపిస్తారేమోనని ఆశ పడేది. అది ఎంత దురాశో ఆమెకి తెలిసి వచ్చి మౌనంగా ఉండటం అలవాటు చేసుకొంది.  స్నానం కానిచ్చి బయట అరుగుమీద కూర్చుని వచ్చే పోయేవాళ్ళని చూస్తూ కూర్చుంటుంది. అదే ఆమెకి కాలక్షేపం. ‘అమ్మమ్మ‘ అన్న  పిలుపు విని కళ్ళు చికిలించి చూసింది. విజయ, మునసబు కోడలు. తనని ఆప్యాయంగా పిలిచే ఏకైక మనిషి. ఆమె దుస్థితి తెలిసి వీలున్నప్పుడల్లా  ఎదో ఒకటి తినటానికి ఇస్తుంటుంది. రెండు బొబ్బట్లు కాగితంలో చుట్టి మణెమ్మకి తెచ్చిచ్చింది. అడపాదడపా విజయే దేవుడి ప్రసాదమంటూ ఏదో ఒకటి తెచ్చి పెడుతుంటుంది.ఆత్రంగా రెండు బొబ్బట్లు తిన్నది మణెమ్మ. విజయ గ్రామ పెద్ద కోడలు కాబట్టి కోడళ్లు ఏమీ మాట్లాడరు, ‘అమ్మమ్మ, చాల ఏళ్ల క్రితం వాసు అని ఒక పదేళ్ల అబ్బాయి మీ ఇంటి పక్క పోర్షన్‌లో ఉండేవాడు, గుర్తుందా?’ మణెమ్మ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసింది. అవును, ఇరవై ఏళ్ళ క్రితం వాసు తన ఇంటి పక్క పోర్షన్‌లో వుండేవాడు. పదేళ్లు వుంటాయేమో వాడికి. సన్నగా పొడవుగా మౌనంగా ఉండేవాడు. వాసు తలితండ్రులు బస్సు యాక్సిడెంట్లో పోయారు. వాసు తండ్రికి వచ్చిన కంపెన్సేషన్‌ తీసుకొని వాడిని తానే చదివిస్తానని తీసుకొచ్చాడు వాళ్ల బాబాయి. వాసు పిన్నికొక చిన్న బాబు ఉండేవాడు. వాసుని గవర్నమెంట్‌ బడిలో జాయిన్‌ చేసి చేతులు దులుపుకున్నాడతను. వాసు పిన్ని పుట్టిల్లు అదే వూరు. తరచు పుట్టింటికి వెళ్లిపోయేది. వాసు బాబాయ్, పిన్ని వాణ్ణి ఒక్కడినే ఇంట్లో వదిలేసి పోయేవాళ్లు. వాడికి డబ్బులు ఇచ్చేవాళ్లు కాదు. లెక్క ప్రకారం ఇచ్చిన  బియ్యం రోజూ ఒక్కసారి వండుకొనేవాడు. మణెమ్మ కొన్నిరోజులు వాడి అవస్థ చూశాక మూడుపూటలా వాడికి అన్నం పెట్టేది. వాసు వద్దనేవాడు కానీ ఆమె ఊరుకొనేది కాదు. వాళ్ళ పిన్ని ఇంట్లో వున్నా ఆమెకి తెలియకుండా వాడి కడుపు నిండేలా చూసుకొనేది. రెండేళ్ల తర్వాత వాసు మేనమామ వాడిని చూట్టానికి వచ్చాడు.వాడెంత దుర్దశలో వున్నాడో చూసి తనతోపాటు వాడిని తీసుకెళ్లి పోయాడు. వాడి గురించి ఆమెకు ఆ తర్వాత  ఏ సమాచారం లేదు.

విజయ ద్వారా ఆమెకి తెలిసిందేమిటంటే వాసు అగ్రికల్చర్‌ బీఎస్సీ చేశాడు. మేనమామే అతనికి మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడు. వాసు మామగారితో కలసి ఉంటాడు. అతనికి ఇద్దరు పిల్లలు. వ్యవసాయంలో కొత్త కొత్త పద్ధతుల ద్వారా చాల పేరు సంపాదించాడు.‘అమ్మమ్మ,  నీ గురించి అంతా చెప్పాను. విని చాలా బాధ పడ్డాడు. వీలుచూసుకొని వస్తానని చెప్పాడు’ అని చెప్పింది విజయ.మణెమ్మ వాసు కోసం ఎదురు చూడసాగింది. వాసుని చూడాలని ఒక కోరిక, అంతే. అంతకు మించి ఏ ఆశా లేదు. ఆలా వారం గడిచింది. ఒకరోజు మణెమ్మ చద్దన్నం కంచంలో పెట్టుకొని దిగాలుగా కూర్చుని వున్న సమయంలో హఠాత్తుగా వచ్చాడు. పక్కన విజయ వుంది.‘అమ్మమ్మ, ఎవరు వచ్చారో చూడు...’‘ఎవరమ్మా, ఎవరు వచ్చారు?’ అంటూ ప్రశ్నిస్తున్న ఆ వృద్ధురాలిని ఆమె దయనీయ స్థితిని చూసి చలించిపోయాడు. ఏ ఉపొద్ఘాతం లేకుండా ఆమె పక్కన కూర్చుని  ‘నేనమ్మా! వాసుని’ అంటూ ‘నాతో వస్తావా పెద్దమ్మ’ అని అడిగేశాడు. మణెమ్మ ముఖం వెలిగిపోయింది. అంతలోనే దిగాలుగా చూస్తూ  ‘ఎందుకూ పనికిరాని ఈ ముసల్దాన్ని ఏమి చేసుకుంటావు నాయనా! చూపు కూడా ఆనట్లేదు’.. ఆమె కంటినిండా నీళ్లు చెంపల మీదుగా కారసాగాయి. వాసుకి కూడా కంటనీరు వచ్చింది. ఆ రేకుల గది, తీగకు వేలాడుతున్న పాతబట్టలు, పచ్చడి మెతుకులతో వున్న ప్లేట్‌ అవన్నీ చూసి అతని మనసు కదలిపోయింది. వాసు ఒక నిర్ణయానికి వచ్చినవాడిలా విజయతో  అన్నాడు ‘నేను పెద్దమ్మని నాతో తీసుకెళతానమ్మా’ అంటూ లేచి బయటకు వెళ్ళాడు.గుమ్మం దగ్గిర ఆగి తన చేతిలో వున్న ప్యాకెట్‌ విజయకు అందిస్తూ ‘ఇంకా ఇక్కడ వస్తువులు ఏమీప్యాక్‌ చేయకండి. నేను వాళ్ళ కొడుకులను అడిగి వస్తాను.’

విజయ ‘అమ్మమ్మ, లే, లేచి చీర మార్చుకో’ మణెమ్మకి  అంతా కలలా వుంది.  ‘వెళ్లు    అమ్మమ్మ, నీ కష్టాలు తీరినట్టే. ఆయన నాకు ముందే అన్నీ చెప్పారు.’ మణెమ్మ ఒక్క నిమిషం అనుకుంది తనలో తాను. ‘వెళతాను, ఇంత దుర్భర జీవితం కంటే వెళ్లిపోవడమే నాకు విముక్తి. వాసు ఇంట్లోనే వున్న కొడుకులను పిలిచాడు బయటకు. తనని తాను పరిచయం చేసుకొని అన్నాడు, ‘నేను పెద్దమ్మను నాతో మా వూరు తీసుకెళదామని అనుకుంటున్నాను. మీకేమీ అభ్యతరం లేదుగా’‘ఎన్నిరోజులు’ పెద్దకొడుకు ధిలాసాగా అడిగాడు.‘మీరు అనుమతిస్తే  ఎన్ని రోజులైనా చూసుకుంటాను.’‘మళ్ళీ ఎందుకు మాకీ సంత, మీరే చూసుకోండి సచ్చిందాకా’ చిన్న కోడలు అన్నది. వాసు ఆ నలుగురుకేసి చూశాడు. ఒక వృద్ధురాలి పట్ల వాళ్లు చూపుతున్న అమానవీయ ప్రవర్తన చూసి ‘రాక్షసులు ఎక్కడో వుండరు’ అనుకొంటూ ‘చాల థాంక్సండీ’ అంటూ మణెమ్మ దగ్గరికి వెళ్లాడు.  అప్పటికి ఆమె రెడీ అయింది.ఇన్నోవాలో ఆమెను సౌకర్యంగా కూచోబెట్టి, డోర్‌ వేశాడు. విజయ వైపు తిరిగి నమస్కరిస్తూ ‘మీ సహాయానికి చాలా థాంక్స్‌ అమ్మా!  మీకు వీలున్నప్పుడు తప్పకుండా మా ఇంటికి రండి’ అంటూ కారులో కూర్చున్నాడు. దూసుకుపోతున్న కారును చూస్తూ ‘ముసల్దానికి ఎంత అదృష్టం పట్టింది’ నిరసనగా అనుకుంటూ కూర్చున్నారు కొడుకులు,  కోడళ్ళు. జీవితంలో కారెక్కి ఎరుగదు మణెమ్మ . ‘పడుకుంటావా అమ్మ’ అన్న వాసుతో ‘లేదు నాయనా కూర్చుంటా‘ అని జవాబిచ్చింది. ‘ముందు టిఫిన్‌ చేద్దాం’ అరగంట తరువాత మంచి హోటల్‌ ముందు అపి ఆమె దిగటానికి సాయం చేశాడు. రెస్ట్‌ రూమ్‌ దగ్గరవున్న ఆమెకి డబ్బులు ఇచ్చి జాగ్రత్తగా తీసుకెళ్లమని చెప్పాడు. ‘అమ్మా! ఏం తెప్పిచమంటావు?’ ‘నీ ఇష్టం నాయనా’ రెండు ఇడ్లీ, దోస, వడ ఇద్దరికీ తెప్పించాడు. ఎన్ని రోజులైందో అటువంటి టిఫిన్‌ తిని ఆమె తినే విధానమే చెబుతోంది. టీ తాగాక ప్రయాణం మొదలైంది, మణెమ్మ నిద్రలోకి జారుకుంది. ఎన్ని గంటలు గడిచాయో  కారు వాసు ఊళ్లోకి ఎంటర్‌ అయ్యాక మెలకువ వచ్చింది మణెమ్మకి. అంత కమ్మటి నిద్ర జీవితంలో ఎరుగదు. కారు వాసు ఇంటిముందు ఆగింది. తడబడుతూ దిగుతుండగా లలిత వచ్చి ‘నెమ్మదిగా దిగండి అత్తయ్య‘ అంటూ చేయి అందించింది. ఇంటి ముందు పెద్ద పెద్ద అరుగులతో ఆ మండువా లోగిలి ఎంతో అందంగా వుంది. మెట్లు ఎక్కేముందు కాళ్లు కడుక్కోటానికి పంపు వుంది. శుభ్రంగా కాళ్ళు కడుక్కొని చెప్పులక్కడే విడిచి ఇంట్లోకి వెళ్ళింది. ఆమెని సోఫాలో కూర్చోబెట్టి మంచి నీళ్లు తేవడానికి లోపలి వెళ్లింది లలిత.

ఆమె తల్లి తండ్రి వాళ్లని వాళ్లు పరిచయం చేసుకున్నారు. వాళ్లు ఎంతో ఆదరంగా ‘మీకిక్కడ ఏ ఇబ్బందీ ఉండదు. మేము మీకు తోడుగా ఉంటాం’ అన్నారు. అంత మర్యాదతో కూడిన మాటలు విని ఎన్ని ఏళ్లు గడిచాయో! మణెమ్మని హాలుకి ఆనుకొని వున్న గదిలోకి తీసుకెళ్లింది లలిత. ‘ఈ రోజు నుంచి ఇది మీ గది అత్తయ్య! మీరు కొంచంసేపు రెస్ట్‌ తీసుకోండి. నేను భోజనాలు ఏర్పాటు చేసి వస్తాను’ అంటూ వెళ్లింది. మణెమ్మ గది అంతా కలయ చూసింది. నీటుగా ఉన్న పక్క, దాని పక్కనే బాటిల్‌తో  నీళ్లు,  గ్లాసు వున్నాయి. బాత్రూం తలుపు తీసి చూసింది. ఎంతో నీటుగా వుంది. జయమ్మ వచ్చింది. ‘నా పేరు జయమ్మ, మిమ్మల్ని కనిపెట్టుకొని వుండమన్నారమ్మా వాసు సర్‌.. అమ్మా! రండి, భోజనానికి’ అంటూ కిచెన్‌ పక్కన వున్న పెద్ద హాల్లోకి దారితీసింది. వాసు మణెమ్మ పక్కన కూర్చొని ఆమె మొహమాటపడకుండా చూశాడు.భోజనాలు అయ్యాక .లలిత  మణెమ్మని ఆమె గదిలోకి తీసుకెళ్లింది.  ‘అత్తమ్మా! ఆటచ్డ్‌ బాత్రూం వుంది. మీ బెడ్‌ పక్కనే స్విచ్‌ బోర్డు వుంది. మీరు ప్రతిసారీ లేవకుండా మీ అబ్బాయి ఈ ఏర్పాట్లు చేశారు. బాగా అలిసిపోయింటారు, రెస్ట్‌ తీసుకోండి‘.. మణెమ్మ అనుకోకుండా తనకు పట్టిన అదృష్టాన్ని తలచుకుంటూ మంచం మీద పడుకుంది. అయినవాళ్లు దురాగతానికి పదేళ్లుగా  గాయపడిన ఆమెకి శారీరకంగా, మానసికంగా ఏదో తెలియని ప్రశాంతత మనసంతా పరచుకోగా, మెల్లగా నిద్రలోకి జారుకుంది. ఏ కలతలేని ప్రశాంతమైన నిద్ర. చీకటి పడుతుండగా మెలకువ వచ్చింది. వెంటనే లేవకుండా అలాగే కూర్చుండిపోయింది. పనమ్మాయి జయమ్మ వచ్చి ‘లేచారమ్మా! రండి మొహం కడుక్కుందురుగాని’ అంటూ మొహం తుడుచుకోవటానికి టవల్‌ అందించింది. పొగలు గక్కుతున్న టీ లలిత తెచ్చిఇచ్చి పక్కనే కూర్చుని, ‘బాగా అలిసిపోయినట్టున్నారు అత్తమ్మా! కాసేపాగి వేన్నీళ్లతో స్నానం చేయండి. అలసట పోతుంది.. జయమ్మ, కాసేపాగి అమ్మ స్నానం చేస్తారు. దగ్గరు వుండు’ అని చెప్పింది.

మణెమ్మకి క్రమంగా ఆ ఇంట్లో వాతావరణం అలవాటయింది. ఒక పద్ధతిలో మనుషులు ప్రవర్తించే విధానం, ముఖ్యంగా తనను సొంత తల్లిలా వాసు చూసే విధానం , కోడలు, ఆమె తల్లి తండ్రులు చూపే గౌరవం ఇదంతా కలో నిజమో అన్న సందేహం కలిగేది. పదే పదే పిల్లలు చాల ప్రేమతో ‘నానమ్మ’ అంటూ పిలవడం ఎంతో సంతోషం కలిగించేది. మణెమ్మకి కొత్త జీవితం మొదలైంది. పదిహేను రోజుల తర్వాత ఆమెకి కొంత బలం వచ్చిందని అనిపించాక రెండు కళ్లకి కేటరాక్ట్‌ ఆపరేషన్‌ చేయించాడు వాసు. జయమ్మని పూర్తిగా ఆమె సేవ కోసం నియమించాడు. ఆమెకి బలమైన ఆహారం ఇచ్చే బాధ్యత లలిత తీసుకుంది. ఒక వృద్ధురాలికి ఇవ్వాల్సిన గౌరవం, ప్రేమ, ఆదరం అన్నీ ఆ ఇంట్లో లభించాయి. మణెమ్మలో చాలా మార్పు వచ్చింది. శారీరకంగా, మానసికంగా కూడా.మణెమ్మకి రోజులు హాయిగా గడిచి పోతున్నాయి ఆ మధ్య రెండు వెడల్పాటి బంగారు గాజులు, మెళ్ళోకి  ఒక గొలుసు చేయించాడు వాసు. ‘వద్దు నాయనా! నాకెందుకీ ఖరీదైన నగలు’ అని వారించినావినకుండా లలిత చేత ఆమె మెళ్లో వేయించాడు. అప్పుడప్పుడు మణెమ్మకి మళ్లీ వాసు తనని ఆ రేకుల గదికి పంపించినట్టు పీడకలలు వస్తుండేవి. అది కల నిజం కాదు అని సమాధాన పడేది. వాసు ఎప్పుడు పొలం పనులలో తీరిక లేకుండా ఉండేవాడు. ఒక్కోరోజు అందరూ కలసి ఆటవిడుపుగా పొలంలో భోజనాలు చేసేవారు. పొలంలోనే ప్రత్యేకంగా నిర్మించిన పర్ణశాలలాంటి పాక దగ్గిర గడిపేవాళ్లు.ఆ రోజు మాత్రం ఉదయం పది గంటలప్పుడు ఇంట్లోనే వున్నాడు వాసు. వంటింట్లో జయ వాళ్లు కూరలు తరుగుతూ ఉంటే కుర్చీలో కూర్చుని కబుర్లు చెబుతూ కూర్చోడం అలవాటయింది. తన అనుభవాన్ని ఎంతో గౌరవించే లలిత అంటే మణెమ్మకి ఎంతో ఇష్టం. వాసు, లలిత హాలులో  తన గురించి మాట్లాడుకోవడం వినిపించి, ఆలకించసాగింది.‘అమ్మతో జర్నీ గురించి చెప్పావా’ ‘లేదు, నాకంటే మీరు చెప్తేనే బావుంటుందేమో’‘సరే, సాయుంత్రం నేనే చెబుతాను. కావాల్సిన బట్టలు, ఇంకా ఏమేమి అవసరమో జాగ్రత్తగా సర్దు, సరేనా’లలిత సరేనంది. ‘అన్నీ లిస్ట్‌ రాసి పెట్టా , అలాగే సర్దుతాను’...వాసు బయటకు వెళ్ళాడు. వాళ్ళ మాటలు విన్న మణెమ్మ కలవరపడిపోయింది. నెమ్మదిగా లేచి గదిలోకి వెళ్ళింది. ఎందుకో హఠాత్తుగా అంతులేని నిస్సత్తువ ఆవరించింది. ఆలోచిస్తూ పడుకుంది.. అవును, వాళ్లు మాత్రం ఎన్ని రోజులు తన భారాన్ని మోస్తారు? తన ఆరోగ్యం బాగు చేశారు. కళ్లకు ఆపరేషన్‌ చేయించి కళ్లు కనపడేలా చేశారు. ఇంకా చివరి వరకు తన భారాన్ని మోయాలనీ ఆశపడటం దురాశ కాదా? మణెమ్మ ఎన్నో యాతనలు అనుభవించిన మనిషి. అందుకే ఆ దుఃఖం నుంచి త్వరగానే కోలుకుంది. లేచి మొహం కడుక్కొని బయటకు వచ్చింది. తన మనసులోని భావాలని బయటపడకుండా శతవిధాలా ప్రయత్నం చేస్తూ, పదే పదే ఆ ఇంటి పరిసరాలను, మనుషులను తరచి తరచి  చూడసాగింది. ఎందుకంటే అటువంటి మంచి మనుషులను తాను ఇక ఈ చరమ దశలో చూడలేదు కనుక.

భోజనానికని వచ్చిన వాసుని తదేకంగా, తనివితీరా చూడసాగింది. భోజనం అయ్యాక గదిలోకి వెళ్లిపోయింది మణెమ్మ. పొంగుకు వస్తున్న దుఃఖాన్ని ఎలాగో ఆపుకొంటోంది. వాసు లోపలికి  వచ్చి మంచం పక్కన కుర్చీలో కూర్చున్నాడు. లలిత కూడా వచ్చి అతని వెనకే వచ్చి నిల్చుంది. ‘అమ్మా! నీతో కొంచం మాట్లాడాలమ్మా!’ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని నెమ్మదిగా అన్నాడు. ‘ఇప్పుడు నీ ఆరోగ్యం బాగానే ఉంది కదమ్మా, జర్నీ చేయగలవు కదా? వచ్చే కన్నీరుని ఆపుకొంటూ కళ్ళుదించుకొనే తలవూపింది మణెమ్మ. ‘అయితే టికెట్స్‌ కన్‌ఫర్మ్‌ చేస్తాను’ ఎక్కడికి అని అడిగే ధైర్యం లేక ‘అలాగే నాయనా..’ అని అటుండగానే ఆమె కండ్ల వెంట నీరు కారసాగింది. భార్యాభర్తలిద్దరూ కంగారుపడిపోయారు ,  ‘ఎందుకమ్మా, ఏమైంది? నీ కిష్టం లేకపోతే వద్దు’... ‘లేదు నాయనా, వెళతాను. ఇంకా నువ్వే చివరి వరకు చూడాలని దురాశ లేదు నాకు’ వాసుకి అర్థం కావటానికి  కొంత సమయం పట్టింది. నవ్వుతూ ఆమె పక్కన కూర్చుని.. ‘నేను మామయ్య అత్తయ్య వాళ్లోతో నిన్ను కూడా కాశీ ప్రయాణానికని ఫ్లైట్‌ టికెట్స్‌ బుక్‌ చేయటానికి అడిగాను’.. ‘కాశీకా?..’ నమ్మలేనట్టుగా అతనికేసి చూస్తూ అడిగింది.‘అవును,  నిన్ను ఎప్పుడూ ఆ రేకుల గదికి , ఆ రాక్షసుల దగ్గరికి ఎప్పటికీ పంపను. నువ్వు కోరుకుంటే తప్ప’.మణెమ్మ కదిలిపోయింది నిలువెల్లా, ‘నేను నీకేమి చేశానని నాకింత అదృష్టం కలగచేశావు   నాయనా?’‘అమ్మా! నిన్ను తీసుకు రావటం చాల ఆలస్యం చేశాను.. అమ్మా, ఆ రోజుల్లో నువ్వు చూపిన దయ, పెట్టిన అన్నమే నన్ను బతికించింది. నేను జీవితంలో ఎవరికైనా రుణపడ్డానంటే అది నీకు, తర్వాతమామయ్యకు, లలితకు మాత్రమే..’  .మణెమ్మ తన ముడతలు పడిన చేతులతో వాళ్ళిద్దరి చేతుల్ని  కళ్ళకద్దుకొంది. భార్యాభర్తలిద్దరికీ కనుల నీరు వచ్చింది. వాసు అన్నాడు ‘అమ్మ, ఈ రోజు చెబుతున్నాను.. నువ్వు నాకు బరువుకాదు. నీకుసేవ చేసే అదృష్టం నాకు కలిగించు’.. రెండు చేతులూ జోడించి అంటున్న భర్తలోని మానవీయతను చూస్తూ పులకించిపోయింది లలిత.
  

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top