ఇతడు

funday horror story:author has twice seen ghost! - Sakshi

 ∙కిర్ర్‌..ర్‌..!

బలహీనమైన గుండె కలవారు ఈవారం ఈ దెయ్యం కథను చదవకపోవడమే మంచిది. ఎందుకంటే.. ఈ కథను రాయడం మొదలు పెట్టాక ఈ రచయితకు రెండుసార్లు దెయ్యం కనిపించింది! ఈ రెండుసార్లూ హైదరాబాద్‌ సిటీ బస్సులోనే ఈ రచయితకు దెయ్యం కనిపించింది. అదికూడా లేడీస్‌ సీట్ల వైపే కనిపించింది! లేడీస్‌ సీట్ల దగ్గర రచయితకేం పని అని మీలో ఎవరికైనా డౌట్‌ రావచ్చు. అది ముఖ్యం కాదు. లేడీస్‌ సీట్ల దగ్గరే దెయ్యం ఎందుకు కనిపించిందన్నది కూడా ముఖ్యం కాదు. అయితే అక్కడ ఆ రెండుసార్లూ రచయితకు కనిపించింది మగదెయ్యమే! చచ్చి దెయ్యాలయ్యాక కూడా ఈ మగవాళ్లు సిగ్గులేకుండా సిటీబస్సుల్లో ఆడవాళ్ల సీట్ల కోసం వెంపర్లాడతారా అని మీలో కొందరికి ఆ దెయ్యం మీద, ఈ రచయిత మీదా అసహ్యం కలగవచ్చు. అలా ఎందుకు జరిగిందన్నది అక్కర్లేని సంగతి. ఎలా జరిగిందన్నది కథలోని సంగతి. 

బలహీనమైన గుండె కలవారు ఈ కథను ఎందుకు చదవకూడదనే దానికి లాజిక్‌ ఏమీ లేదు. కథకూ, బస్సులో కనిపించిన దెయ్యానికీ సంబంధం కూడా లేదు. కథ రాస్తున్నప్పుడు ఇలా జరిగిందని చెప్పడమే రచయిత ఉద్దేశం. కథ చదువుతున్నప్పుడు మీకు ఒక వేళ దెయ్యం కనిపించినా.. అది కూడా కథకు, ఆ దెయ్యానికీ సంబంధం లేని విషయమే అనుకుని మీరు ధైర్యంగా ఉంటే ఫర్వాలేదు. అంత ధైర్యం మనకెందుకులే అనుకున్నవాళ్లు ఈ వారం ఈ పేజీని తిప్పేయడమే మంచిది. 

హైదరాబాద్‌లో ‘49 ఎం’ నెంబరు సిటీబస్సు సికింద్రాబాద్‌–మెహిదీపట్నం మధ్య తిరుగుతుంటుంది. రోజూ ఆ నెంబర్‌ బస్‌లోనే ఆఫీస్‌కి వెళ్తాడు ఈ రచయిత. బంజారాహిల్స్‌లో ఆఫీస్‌. సరిగ్గా ఆఫీస్‌ ముందే బస్టాప్‌. సీటు దొరికితే సౌకర్యవంతమైన ప్రయాణమే.రచయిత అనే జీవి ఫలానాలా ఉంటుంది అనుకుంటే, ఆ ఫలానాలా కచ్చితంగా ఉండడు ఈ రచయిత. అంతేకాదు. అదోలా ఉంటాడు! ‘నేను కొడితే అదోలా ఉంటుందని వాళ్లు వీళ్లూ చెప్పడమే తప్ప నాక్కూడా తెలీదు’ అని ఏదో సినిమాలో మహేశ్‌బాబు అంటాడు. ఈ రచయితక్కూడా తను రచయితనని, రచయితను కాననీ తెలీదు. ఇతణ్ణి చూసినవాళ్లెవరైనా వాళ్లకై వాళ్లు అనుకోవడమే.. దెయ్యంలా ఉన్నాడని. ఆ అనుకునేవాళ్లు కూడా ఇతడు దెయ్యంలా ఉన్నాడని అనుకోరు. దెయ్యం ఇలాగే ఉంటుందేమో అనుకుంటారు. మరి వాళ్లు అనుకుంటున్నట్లు ఇతడికెలా తెలుస్తుంది? తెలియదు. వాళ్లు అనుకుంటున్నారేమోనని ఇతడు అనుకుంటాడు. 

బస్సు స్పీడుగా వెళ్లే ప్రయత్నం చేస్తోంది. మెట్రో ఎక్స్‌ప్రెస్‌ కాబట్టి అది స్పీడుగానే వెళ్లాలి. రోడ్డుపై వాహనాల రద్దీ బస్సును వేగంగా కదలనివ్వడం లేదు. రోడ్డు పై ఎంత రద్దీ ఉందో, బస్సులోపలా అంతే రద్దీ ఉంది! రోడ్డుపై యాక్సిడెంట్‌ను తప్పించడానికి డ్రైవరు బ్రేక్‌ నొక్కిన ప్రతిసారీ బస్సులోపల యాక్సిడెంట్‌ అవుతోంది. ఎవరెవరివో ఎముకలు పుటుక్కుమంటున్నాయి.  రచయిత నిలబడి ప్రయాణిస్తున్నాడు. ఆఫీసు  రెండో మూడో స్టాపుల దూరం ఉందనగా ఇతడికి సీటు దొరికింది. దొరికింది అని ఇతడేం అనుకోలేదు. కండక్టర్‌ చూసి, ‘కోర్చోండక్కడ’ అని ఖాళీ సీటు చూపిస్తే వెళ్లి కూర్చున్నాడు. ‘కూర్చోండి’ అంటే వెళ్లి కూర్చున్నాడు కానీ, అది లేడీస్‌ సీటా, జెంట్స్‌ సీటా అని ఇతడు చూసుకోలేదు. ఎందుకు చూసుకోలేదంటే.. ఆ ఖాళీ సీటు పక్కన కిటికీ వైపు కూర్చొని ఉన్నది స్త్రీ కాదు, పురుషుడు. సాధారణంగా ఇతడు లేడీస్‌ సీటు ఖాళీగా ఉన్నా వెళ్లి కూర్చోడు. కూర్చున్న సేపట్నుంచీ ఇతడి ఆలోచనలు తెగిపోతాయి. తెగిపోయి, లేడీస్‌ ఎవరైనా వస్తారేమో, వాళ్లొచ్చినప్పుడు లేవాలేమో అన్న టెన్షన్‌ మొదలౌతుంది.ఏం ఉన్నా, లేకున్నా మనిషికి టెన్షన్‌ ఉండకూడదని ఇతడు అనుకుంటాడు. అందుకే లేడీస్‌ సీట్లలో కూర్చోవడం కన్నా వెయ్యి కిలోమీటర్లయినా నిలబడి ప్రయాణించడమే సుఖం అనుకుంటాడు. 

సీట్లో కూర్చోగానే తన ఆలోచనల్లోకి తను వెళ్లిపోయాడు రచయిత. స్టాప్‌ దగ్గరపడుతుందన్న ఆలోచన కూడా రానంతగా ఆలోచనల్లో మునిగిపోయాడు. అప్పుడొచ్చిపడింది ఇతడి భుజంపై ఎవరిదో చెయ్యి! తలెత్తి చూశాడు. పక్కనే వచ్చి నిలబడి ఉన్న ఒక మగమనిషి చెయ్యి అది. ‘‘లెయ్‌! లేడీస్‌ సీట్లో ఎందుక్కూర్చున్నావ్‌. లేడీస్‌ నిలబడి ఉన్నారు చూళ్లేదా? లేడీస్‌ నీ దగ్గరకొచ్చి, దండంపెట్టి లెయ్యమని అడుక్కోవాలా’’ అని పెద్దగా అరుస్తోంది ఆ చెయ్యి. అరుస్తోంది ఆ మనిషి నోరే అయినా, అది నోరు అరుస్తున్నట్లుగా లేదు. చెయ్యి అరుస్తున్నట్లుగా ఉంది. అప్పుడు గమనించాడు రచయిత.. అవి లేడీస్‌ సీట్లని. సీట్లోంచి లేచాడు. రచయిత పక్కన, విండో సీట్లో కూర్చొని ఉన్న మనిషి కూడా అరుస్తున్న మనిషివైపు కోపంగా చూస్తూ  సీటు ఖాళీ చేశాడు. ఖాళీ అయిన ఈ రెండు సీట్లలోకి... ఎప్పట్నుంచి నిలబడి ఉన్నారో.. ఆ ఇద్దరు ఆడవాళ్లు వచ్చి కూర్చున్నారు. 

ఆ ఘటన జరిగిన రోజు ర చయిత ఎప్పటిలా ఆఫీస్‌ దగ్గర స్టాప్‌లో దిగలేదు. ఎండ్‌ పాయింట్‌ మెహిదీపట్నం వెళ్లిపోయి.. బస్‌ డ్రైవర్, కండక్టర్‌.. బ్రేక్‌లో టీ తాగుతుంటే వెళ్లి అడిగాడు.. ‘ఎవరతను?’ అని. కండక్టర్‌కి వెంటనే అర్థమైంది.  ‘‘తెలీదు!’’ అన్నాడు. రెండ్రోజుల తర్వాత మళ్లీ అలాంటి ఘటనే ఎదురైంది ఇతడికి. అయితే ఎదురైంది ఇతడికి కాదు. ఎవరో లేడీస్‌ సీట్‌లో కూర్చొని ఉంటే ఎవరో వచ్చి అరుస్తున్నారు.. సీట్లోంచి లెయ్‌మని! ఆరోజు అరచిన వ్యక్తి,ఈరోజు అరుస్తున్న వ్యక్తీ ఒకరు కాదు. రెండోసారి ఈ ఘటన జరుగుతున్నప్పుడు రచయిత నిలబడి లేడు. కూర్చొని ఉన్నాడు. లేడీస్‌ సీట్ల దగ్గర ఒక స్త్రీ నిస్సహాయంగా నిలబడి ఉంది. ఆమె కోసమే ఆ అపరిచితుడు జెంట్స్‌తో గొడవపడుతున్నాడు.ఆమెను పిలిచి తన సీటిచ్చాడు ఇతడు.  ఆమె కూర్చోలేదు! ‘ఇది జెంట్స్‌’ సీటు కదా అంది. ఇతడికి నవ్వొచ్చింది. ‘‘బస్సుల్లో లేడీస్‌ సీట్లు మాత్రమే ఉంటాయి. జెంట్స్‌ సీట్స్‌ ఉండవు. ఇవి అందరికీ కామన్‌’’ అని చెప్పాడు.. మగవాళ్ల వైపు ఉన్న సీట్లను చూపిస్తూ. ఆ రోజు కూడా ఆఫీస్‌ దగ్గర ఉండే స్టాప్‌లో కాకుండా ఎండ్‌ పాయింట్‌లో దిగి, కండక్టర్‌ని అడిగాడు ఇతడు. ఆ రోజు ఉన్నది వేరే కండక్టర్‌. లేడీ కండక్టర్‌. ‘‘మేడమ్‌.. ఎవరతను?’’ అని అడిగాడు. ఆమె వెంటనే అర్థం చేసుకుంది! ‘‘మా కండక్టరే. ‘లేడీస్‌ సీట్లోంచి లేచి, లేడీస్‌కి సీట్‌ ఇవ్వు’ అని గట్టిగా అన్నందుకు ఓ ప్యాసింజర్‌ మా కండక్టర్‌ని బస్సులోనే కొట్టి చంపేశాడు. ఒక్కరైనా అడ్డు రాలేదు. ఈమధ్యే జరిగింది. మనిషి పోయినా మనసింకా డ్యూటీ చేస్తున్నట్లే ఉంది’’ అని చెప్పింది. ఆమె కంట్లో తడిని గమనించాడు అతడు.  

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top