నేలకు దిగిన నక్షత్రాలు

Adishankaracharya Life history In Sakshi Funday

ఆదిశంకరాచార్యుల జీవితచరిత్ర  

‘‘అన్నింటి కంటే గొప్ప సంపద తపస్సు. భౌతిక సంపదలను తక్కువ విలువతో మదింపు చేయవచ్చు. ఈ సంవత్సరం బొత్తిగా ఆదాయం లేదండీ అని రాజుకు పన్ను ఎగవేయవచ్చు. కానీ తపస్సంపద అటువంటిది కాదు. ఆ సంపద గడించిన వారి అనుమతి లేకుండానే అందులోని ఆరోవంతు భూమినేలే రాజుకు చేరిపోతుంది. మా తపస్సులన్నీ ప్రభువుల క్షేమాన్ని, రాజ్య సంక్షేమాన్ని ఆశించేవే. రాజాస్థానాల కన్నా సాధనలో తరించడమే మాకు అధిక ప్రీతినిస్తుంది. అందులోనూ మావంటి బ్రహ్మచారులకు భోగాలపై ఆసక్తి నిషిద్ధం. దయచేసి వెళ్లిరండి’’ చెప్పాడు శంకరుడు. ‘‘స్వామీ! మన ప్రభువు కవి పండిత పక్షపాతులు. మీ గురించి విన్నారు. మీ పాద రేణువులను శిరస్సున దాల్చాలని వారి అభిలాష. ఇది భద్రగజం. సకల శుభలక్షణాలూ కలిగినది. మీకోసం ప్రత్యేకంగా ప్రభువులే ఎన్నిక చేసి పంపారు. అందుచేత తమరు కాదనకుండా...’’

‘‘మంత్రివర్యా! మూడు వేళల్లోనూ స్నాన సంధ్యావందన అగ్నిహోత్రములే మాకు కర్తవ్యమని వేదశాసనం. ఈ ఏనుగులతోనూ, గుర్రాలతోనూ, పల్లకీలతోనూ పనిలేదు. అదీకాక నాకు వృద్ధురాలైన తల్లి ఉంది. ఆమె ఈ ఊరిని విడిచి రాదు. ఆమెను విడిచి రాజసభలకు నేను రాలేను. ధర్మమార్గాన్ని విడిచిపెట్టని ప్రభువుకు ఇవే మా ఆశీస్సులు అని సందేశం అందించండి.’’ ఆ ప్రసంగాన్ని అక్కడితో ముగించి లేచి, అగ్నికార్యం నెరవేర్చడానికి ఉద్యుక్తుడయ్యాడు శంకరుడు. చేసేది లేక మంత్రి తన పరివారంతోనూ భద్రగజంతోనూ కలిసి తిరుగుముఖం పట్టాడు. అప్పటి వరకు గడప వెనుక నిలబడి కొడుకు మాటలు వింటున్న ఆర్యాంబ సంతోషించింది. లోనికి వెళ్లి నీటి కడవతో ఇంటి బయటికొచ్చింది. ఎడమ వైపు సందులోనికి తిరిగి ముందుకు సాగింది. అక్కడ పచ్చిక మేస్తున్న కపిలగోవు పృష్టాన్ని తాకి నమస్కరించింది. 

సురభీకృత దిగ్వలయం సురభి శతైరావృతం సదా పరితః 
సురభీతి క్షపణ మహాసురభీమం యాదవం నమత

కొడుకు రచించిన శ్లోకాన్ని ఆర్యాంబ వల్లెవేస్తోంది. ఆ సురభిగోవుకు ఏం తోచిందో ఏమో ఆమెను వెంబడింది. కుడివైపున పశ్చిమాభిముఖుడైన శ్రీకృష్ణుని ఆలయం ఉంది. ఆలయ గోపురానికి నమస్కరించి గో సమేతంగా ఆర్యాంబ పూర్ణానదీ తీరం వైపు అడుగులు వేసింది. శంకరుడు తిరిగి ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆమె ఉత్సాహంగా ఉంటోంది. భర్తకు దూరమైన తర్వాత కఠిన నియమాలతో శరీరాన్ని శుష్కింప చేసుకుంటూ వచ్చిందామె. కొడుకు గురుకులంలో ఉన్నంత కాలం ఎలా బతికిందో ఏమో కానీ, అతడు తిరిగి వచ్చిన తరువాత లేని సత్తువ తిరిగి వచ్చినట్లుంది. అందరూ కొడుకు గుణగణాలను పొగుడుతుంటే ఆమెకు ఆత్మానందం మరింత పెరిగి, తనపై తనకు శ్రద్ధ తగ్గింది.

కొడుకేం చేస్తున్నాడు... ఎవరితో మాట్లాడుతున్నాడు... ఏమిటి రాస్తున్నాడు... సూర్యాగ్నులను ఆరాధించడంలో పెద్దల త్రోవకు ఏ విధంగా మెరుగు పెడుతున్నాడని పరిశీలించడమే ఆమెకు నిత్యకృత్యంగా ఉంది.
తండ్రి కాలం నాటి దుర్గాలయం అర్చకత్వపు బాధ్యతలు జ్ఞాతుల చేతుల్లోనే ఉండనిచ్చాడు శంకరుడు. కానీ ఆలయం బాగోగులు చూసుకోవడంలో మాత్రం ఏమరడం లేదు. తండ్రి శిష్యులకు, పరిసర గ్రామాల్లోని అనేకులకు తానే గురువయ్యాడు. పండిత వంశం పేరు నిలబెట్టాడు. తమ కులదైవమైన శ్రీకృష్ణునికి అంకితంగా కొడుకు రచిస్తున్న శ్లోకాలంటే తల్లికి ప్రాణం. ఆ శ్లోకాలనే పదేపదే పాడుకుంటూ ఆమె నడుస్తూ ఉంది.  పూర్ణానది హోరు దగ్గరవుతోంది. నదిపై నుంచి వచ్చే చల్లని గాలి జ్యేష్ఠమాస భానుని భుగభుగల నుంచి ఉపశమనం కలిగిస్తోంది.

పచ్చిక దాటి నదీతీరంలోని ఇసుకలో కాలుపెట్టేసరికి ఆర్యాంబకు పాదాలు చురుక్కుమన్నాయి. తడబడుతూ నడుస్తోంది. కొద్దిదూరం నడిచిందో లేదో ఆమె కళ్లు తిరిగి కుప్పకూలింది. నియమాలతో శుష్కింప చేసుకున్న ఆమె దేహం ఎండ వేడిమికి తాళలేకపోయింది.అప్పటి వరకు అనుసరించి వస్తున్న సురభి ఆమె ముఖాన్ని ఆప్యాయంగా నాకడం మొదలుపెట్టింది. రేవులోని స్త్రీలు సాయం కోసం వచ్చారు. ఈలోగా ఇంటిలోని శంకరునికి ఈ వార్త తెలిసింది. పరుగు పరుగున వచ్చాడు. అప్పటికే తల్లికి తెలివి వచ్చింది. మెల్లగా లేవడానికి ప్రయత్నిస్తోంది. శంకరుడు తల్లికి చేయందించి, మెల్లగా నడిపించుకుంటూ ఇంటికి చేర్చాడు. వడదెబ్బ నుంచి తేరుకోవడానికి కావలసిన ఉపచారాలు చేశాడు. వృద్ధాప్యంలో తల్లి పడుతున్న కష్టం చూసి చలించిపోయాడు. పూర్ణానదీ తీరానికి వెళ్లి ఆ నదీమ తల్లిని అనేక స్తోత్రాలతో కీర్తించాడు. అతడి ప్రార్థనలకు మెచ్చిన నదీదేవత స్త్రీరూపం ధరించి ఎదుట సాక్షాత్కరించింది.

‘‘శంకరా! రేపటి ఉదయానికి నీ అభీష్టం నెరవేరుతుంది’’ అని వరమిచ్చింది. వాన లేదు, వరద లేదు. ముందస్తుగా ఏ సంకేతాలూ లేకుండా పూర్ణానదీ మహాప్రవాహం స్వచ్ఛందంగా తన మార్గం మార్చుకుంది. ఈ సన్నివేశం కాలటి ప్రజలను విస్తుపోయేలా చేసింది. ఇది శంకరుని చర్య అని తెలిసిన తరువాత వారి ఆనందానికి మేరలేదు. ఇప్పుడు పూర్ణానది శంకరుని పెరటి వాకిలిని ఒరుసుకుని ప్రవహిస్తోంది. కృష్ణాలయ ప్రాకారాన్ని కౌగిలించి ఆక్రమించింది. ఆలయ ముఖద్వారం ముంగిట ముగ్ధలా తలవంచి నిలిచిపోయింది.

సంతోషంలో ఆర్యాంబకు రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి. ఈ సంఘటన జరిగిన కొద్దిరోజులకు...రెండు జాముల పొద్దెక్కిన వేళలో... కాలటి గ్రామంలో కోలాహలం బయలుదేరింది. మహారాజు పరివార సమేతుడై వస్తున్నాడు. గ్రామవాసులంతా ఆయనను వెంబడించి వస్తున్నారు. అల్లంత దూరంలోనే ఏనుగు దిగి పాదరక్షలు, అంగరక్షలు విడిచిపెట్టాడు మహారాజు. శంకరుని శిష్యులు పాఠం వల్లెవేయడం ఆపి లేచి నిలబడ్డారు. మహారాజు నేరుగా శంకరుని వద్దకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు. ‘‘రాజశేఖర వర్మ అభివాదం గ్రహించండి’’ అన్నాడు. ‘‘వంశాభివృద్ధిరస్తు’’ అన్నాడు శంకరుడు. మనసులో ఉన్న కోరిక నోరు తెరిచి అడగకుండానే వరంగా లభించినందుకు రాజశేఖరుడు పొంగిపోయాడు. ‘‘స్వామీ ధన్యోస్మి!’’ అంటూ మరోసారి నమస్కరించాడు.

శంకరుడు ఆదరంతో కుశల ప్రశ్నలు వేశాడు. మహారాజును ఇంటిలోనికి ఆహ్వానించాడు. రాజశేఖరుడు సుఖాసీనుడై, ‘‘మహానుభావా! నేను నాటకకర్తను. తమరు దయతో నా నాటకాలు పరిశీలించి గుణదోషాలు తెలియచెప్పాలని విన్నపం’’ అన్నాడు. శంకరుడు అనుమతించగా పరివారం ఆ నాటకాల ప్రతులను లోనికి తీసుకువచ్చారు. బంగారు నాణేలను ఉంచిన పళ్లెరాలలో ఉన్న మూడు నాటకాల ప్రతులను అక్కడ ఉంచి వెళ్లిపోయారు.రాజశేఖరుడు ఆ నాటకాలను అక్కడక్కడా చదివి వినిపించాడు. ‘‘రాజా! నీ నాటకాలు అతి రమ్యంగా ఉన్నాయి. దోషాలు లేవు. నా మనసుకు ఆహ్లాదాన్ని పంచాయి. ఇందుకు ఏం వరం కావాలో కోరుకో’’ అన్నాడు శంకరుడు. ‘‘వీటిని మీరు స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చేయండి’’ అన్నాడు రాజశేఖరుడు బంగారు నాణేల వైపు రెండు చేతులతోనూ చూపిస్తూ.

శంకరుడు ప్రసన్నంగా నవ్వాడు. ‘‘బ్రహ్మచారిని నేనేం చేసుకోను వాటిని? మా గ్రామ ప్రజలందరికీ పంచి పెట్టించు. మరో వరం కోరుకో’’ అన్నాడు. ‘‘తమరు ముందుగా ఇచ్చిన వరమే. వంశోద్ధారకుడైన పుత్రుడు కావాలి’’ అన్నాడు రాజశేఖరుడు. ‘‘తథాస్తు. దేవతా ప్రీతికోసం పుత్రకామేష్టిని నిర్వహించు. త్వరలోనే నీకు పుత్రోదయం అవుతుంది’’ అని శంకరుడు యాగ విధానాన్ని మహారాజుకు బోధించాడు. శంకరుని దయాగుణాన్ని కీర్తిస్తూ మహారాజు రాజధానికి మరలిపోయాడు. బంగారు నాణేలను మహారాజ బహుమానంగా అందుకున్న కాలటి గ్రామ ప్రజలు శంకరునికి జేజేలు పలికారు. కొడుకు సాధిస్తున్న విజయాలను చూసిన ఆర్యాంబ పుత్రోత్సాహం రోజురోజుకీ రెట్టింపవుతూనే ఉంది.

కలియుగం ప్రవేశించి 2,603 సంవత్సరాలు గడిచాయి. శ్రీప్లవ నామ సంవత్సరం ప్రవేశించింది. శంకరునికి పదేళ్లు నిండి పదకొండో ఏడు నడుస్తోంది. కొడుక్కి తొందరగా పెళ్లి చేయాలని తల్లి మనసు ఆరాటపడుతోంది. ‘మా అబ్బాయికి మంచి సంబంధం ఏదైనా ఉంటే చెప్పండి’ అని కనిపించిన వాళ్లందరినీ అడుగుతోందామె. అప్పుడే తొందరేమిటని ఎవరైనా అడిగితే విసుక్కునేది. ‘ఈ ఏడాది ఎలాగైనా చేసేస్తానండీ మా వాడికి’ అనేది. తల్లి కోరిక అన్యాపదేశంగా శంకరుని చెవిన కూడా పడింది. నవ్వి ఊరుకున్నాడు. భాద్రపదమాసం ప్రవేశించింది. వినాయక చవితి నాటి అర్ధరాత్రి... మూలా నక్షత్రానికి పక్కగా ఉన్న అగస్త్య నక్షత్రం నుంచి ఒక కాంతి పుంజం బయలుదేరి వేగంగా భూమివైపు దూసుకొస్తున్నట్లు కార్తాంతికులు గుర్తించారు.

సూర్యోదయంతో రుషిపంచమి తిథి వచ్చింది. ఆర్యాంబ భక్తిశ్రద్ధలతో పర్వ నియమాలను పాటించింది. అపరాహ్ణవేళలో మాధ్యాహ్నిక సంధ్యావందనంలో భాగంగా.... చిత్రం దేవానాముదగా దనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః... వరించదగిన వెచ్చటి స్నేహాన్ని వర్షిస్తున్న దివ్యచక్షువది. పగటి వెలుగులా నడుమ తెల్లని తారకతో, రాత్రి చీకటిలాంటి నల్లటి పాపతో, అగ్నిలా ఎర్రజీరతో ప్రకాశిస్తున్న పరమాత్మ కన్ను దివిని, భువిని, అంతరిక్షాన్ని నింపుతూ నిండుగా కనిపిస్తోంది. జగత్తుకు చూపునిచ్చే కిరణసైన్యంతో పరమాత్మ ప్రాణికోటి కోసం దాచిపెట్టిన గుప్తసంపదను ప్రదర్శింప చేస్తోంది.– అని శంకరుడు సూర్యోపస్థాన మంత్రాలు చదువుతున్నాడు.

దివ్యతేజంతో వెలిగిపోతున్న అయిదుగురు మహాపురుషులు శంకరుని ఇంటిముందు ఆకాశం నుంచి దిగివచ్చినట్లు కనిపించారు. శంకరుడు ఒక్క ఉదుటన లేచి వెళ్లి, వారందరికీ ఒకేసారి సాష్టాంగ ప్రణామం చేశాడు. అలికిడి విన్న ఆర్యాంబ పూజగదిలో నుంచి బయటకు వచ్చింది. ఎవరో మహర్షులను శంకరుడు వినయంగా ఇంటిలోనికి ఆహ్వానిస్తున్నాడు. వారిలో ఒక్కరిని మాత్రమే ఆర్యాంబ గుర్తు పట్ట గలిగింది. శంకరుని ఉపనయన వేళ పిలవకుండానే భార్యా సమేతంగా వచ్చి, బ్రహ్మోపదేశం చేసిన వ్యక్తి ఆయనే. అందరిలోనూ పొట్టిగా ఉన్న వ్యక్తి. నేడు ఎందుకోసమో మరి... తనతో పాటు నలుగురిని వెంటబెట్టుకుని వచ్చాడు. అర్ఘ్యపాద్యాలిచ్చి శంకరుడు వారందరినీ ఉచితాసనాలపై కూర్చో బెట్టాడు. వారిముందు తాను నేలపై చేతులు కట్టుకుని కూర్చున్నాడు. ఆర్యాంబ వారికోసం పళ్లు తీసుకుని వచ్చి, నమస్కరించి సమర్పించి దూరంగా నిలబడింది.

‘‘శంకరా! ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు అవతరించక పూర్వమే ఈయన మహాలక్ష్మీ స్తుతి చేశాడు. చంద్రునిలో ఉండే వెన్నెల, సూర్యునిలో ఉండే వేడి, అగ్నిలో దహించే శక్తి, దేహంలో ఉండే వైశ్వానరాగ్ని కూడా మహాలక్ష్మియే అంటాడీయన. అటువంటి ఈయన కూడా నీ కనకధారకు ముగ్ధుడయ్యాడు’’ అన్నాడు అందరిలోనూ పెద్దవాడైన మహర్షి. ‘‘అత్రి మహర్షీ! తనలాగే దేవతానుగ్రహం పొందగలడని ముందుగానే తెలిసే కాబోలు... అగస్త్య మహర్షి.... ఈ కుర్రవాడి ఉపనయన వేళ కోరివచ్చి మరీ బ్రహ్మోపదేశం చేశాడు.’’ ఆర్యాంబ తన చెవులను తానే నమ్మలేక పోతోంది. మహాతపస్వులకు సైతం దర్శనమివ్వని మహానుభావులు తన కొడుకు కోసం ఇంతదూరం వచ్చి, ప్రేమ కురిపించడం ఆమె హృదయంలో ఆవేగాన్ని పెంచుతోంది.

‘‘మీరన్నది నిజమే ఉపమన్యూ! అగస్త్య మహర్షి సర్వజీవుల పట్ల సమభావం కలవాడు. ఒకనాడు ఇంద్రద్యుమ్నుడనే విష్ణుభక్తుడు తపస్సు చేసుకుంటుంటే కోరి వెళ్లి.... అతని మేలు కోసమే ఒక శాపంలాంటి వరాన్నిచ్చాడు. ఫలితంగా ఆ మహారాజు త్రికూటాచలంపై గజేంద్రుడై పుట్టాడు. మకరి నోటికి చిక్కి మహావిష్ణువు కరుణ పొందాడు. గజేంద్ర మోక్షం మన అగస్త్య మహర్షి చలవే కదా!’’ అత్రి మహర్షి ప్రశంసించాడు.
‘‘సరే స్వామీ! దధీచీ! ఆ మకర జన్మ ఎత్తిన హూహూ గంధర్వుడు మళ్లీ మీకెక్కడైనా కనబడ్డాడా?’’ ఉపమన్యువు ప్రశ్నించాడు.

‘‘విష్ణుచక్రం మెడకు తాకగానే శాపవిమోచనం కలిగింది. పూర్వరూపం వచ్చింది. కానీ గజేంద్రునిలా మోక్షం పొందలేక పోయానే అనే బాధ వాడిలో ఉండిపోయింది. భక్తుడి పాదం పట్టుకున్న వాడికి భగవంతుడి పాదం తప్పక దొరుకుతుందని విశ్వాసం. అందుకోసం అవసరమైతే మళ్లీ మకరం కావడానికైనా వాడు సిద్ధమే.’’ దధీచి చెప్పిన వింత వృత్తాంతం విన్న అగస్త్యుడు ఇలా స్పందించాడు. ‘‘దధీచి మహర్షీ! దక్షయాగం ధ్వంసమై పోవడానికి మీరిచ్చిన శాపమే కదా కారణం. మీ వచనం పొల్లుపోదు. మీ వంటి మహర్షుల ధిషణ కూడా లోకకల్యాణానికే కారణమవుతుంది. శంకరా! ఇదిగో ఈయన గౌతముల వారు. తాను రచించిన న్యాయదర్శనాన్ని కాదన్నాడని, ఒకప్పుడు వ్యాసునికి సైతం దర్శనం ఇవ్వనని భీష్మించుకున్న వ్యక్తి. జైమిని పట్ల వ్యాసుడెలా వ్యవహరించాడో, ఈయన కూడా వ్యాసుని పట్ల అలాగే ప్రవర్తించి శిష్యవాత్సల్యానికి అర్థం చెప్పాడు’’ అన్నాడు. 

‘‘అసలేం జరిగింది స్వామీ?’’ ఆసక్తిగా అడిగాడు శంకరుడు. అగస్త్యుడు ఏదో చెప్పబోయాడు. అప్పటివరకూ దూరంగా ఉన్న ఆర్యాంబ మెల్లిగా వారి ముందుకు వచ్చింది. చేతులు జోడించి, ‘‘మహాత్ములారా! మీరంతా మా అబ్బాయి పట్ల ఇంత వాత్సల్యాన్ని చూపించడం సంతోషంగా ఉంది. మీరు మాట్లాడుకున్నదంతా చిన్నపిల్లలకు చెప్పే కథల్లాగే ఉన్నా... వాటిలోని అంతరార్థమేమిటో నాకు తెలియడం లేదు. సరే... నా సందేహం ఒక్కటి తీర్చండి’’ అని ఆగింది. ‘‘అడగవమ్మా’’ అన్నాడు అగస్త్యుడు మహర్షులందరి తరఫునా. ‘‘మా శంకరుడికి పదకొండేళ్లు వచ్చేశాయి. అతని వివాహం కళ్లారా చూసి వెళ్లిపోవాలని నా కోరిక. ఎంతోమంది వస్తూనే ఉన్నారు. మా వాడి జాతకం ఇవ్వమని అడిగి తీసుకువెళ్లిన వారే కానీ, మా పిల్లనిస్తాం చేసుకోండని ముందుకు వచ్చిన వాళ్లు లేరు. ఇంతకూ మావాడికి పెళ్లెప్పుడు అవుతుందంటారు?’’ అడిగింది ఆర్యాంబ. తల్లి మనసు గ్రహించిన అగస్త్యుడు ఆమెకు సమాధానం చెప్పడం ప్రారంభించాడు.
-నేతి సూర్యనారాయణ శర్మ

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top