
ఎంతకాలం గడిచినా కొంతమంది మానసికంగా పరిణతి సాధించలేరు. అంతా బాగానే ఉన్నా, కొందరికి సమాజంలో ఎలా ప్రవర్తించాలో, తోటివారితో ఎలా నడుచుకోవాలో తెలియదు. అందరిలో పెద్దగా అరవటం, ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేక, అభాసుపాలవటం మొదలైన లక్షణాలు పరిణతిలేని వారిలో కనిపిస్తుంటాయి. మెచ్యూరిటీ అందరిలో ఒకే సమయంలో ఒకే రకంగా జరగకపోవచ్చు. ఇది నిర్ణయాలు తీసుకొనే శక్తి, ప్రజ్ఞ, స్పృహ, వయసు మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇది లేదని బాధపడి న్యూనతకు గురయ్యేకన్నా పరిణతి ఎలా సాధించవచ్చో తెలుసుకొని దాన్ని ఫాలో అవ్వటం మంచిది. మీరు మెచ్యూర్డ్ పర్సన్ అవునో కాదో తెలుసుకోవాలంటే ఈ క్విజ్ పూర్తిచేయండి.
1. ఎవరినీ అర్థం చేసుకోకుండా చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తుంటారు. మీరనుకన్నది జరగకపోతే తీవ్ర నిరాశకు గురవుతారు.
ఎ. కాదు బి. అవును
2. మీ బలాలు బలహీనతనలు గుర్తించగలరు. మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా మీ సహనాన్ని కోల్పోరు.
ఎ. అవును బి. కాదు
3. ఎవరైతే నాకేంటి, ఇతరులను నేనెందుకు లెక్క చేయాలి? అనే అహంభావం మీలో ఉంటుంది.
ఎ. కాదు బి. అవును
4. ఎలాంటి విషయాన్నైనా రిసీవ్ చేసుకోగలరు. అందరి మర్యాదలు మీకు లభిస్తుంటాయి.
ఎ. అవును బి. కాదు
5. ఎలాంటి పరిస్థితుల్లోనూ నైతిక విలువలను మరచిపోరు. అబద్ధం, దొంగతనం, మోసం మొదలైనవాటికి దూరంగా ఉంటారు.
ఎ. అవును బి. కాదు
6. చేసిన పొరపాట్లను వెంటనే ఒప్పుకోరు. ఇతరులకు మీ వల్ల అసౌకర్యం కలిగితే క్షమాపణలు అడగటం మీకిష్టం ఉండదు.
ఎ. కాదు బి. అవును
7. జాగ్రత్తగా, హుందాగా ఉండాల్సిన సమయాల్లో ఎలా ఉండాలో, సరదాగా ఉండాల్సినప్పుడు ఎలా ప్రవర్తించాలో మీకు తెలుసు.
ఎ. అవును బి. కాదు
8. మీ కష్టాలకు ఇతరులను కారకులుగా భావిస్తారు. వారివల్లే మీకు నష్టం జరిగిందని చెప్తుంటారు.
ఎ. కాదు బి. అవును
9. మిమ్మల్ని మీరు ఎప్పటికీ కించపరచుకోరు. ఆత్మ గౌరవం మీకుంటుంది.
ఎ. అవును బి. కాదు
10. బాధ్యతాయుతంగా ఉంటారు. మీరు నిర్వర్తించవలసిన పనులను ఎప్పటికీ మరచిపోరు. విశాలదృక్పథంతో ఉంటారు.
ఎ. అవును బి. కాదు
‘ఎ’ లు నాలుగు దాటితే మీలో పరిణతి పూర్తి స్థాయిలో ఉండదని అర్థం. ‘ఎ’ లు ఏడు దాటితే మీరు మెచ్యూర్డ్ పర్సన్. చుట్టూ ఉన్న సమాజం, పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటుంటారు. జ్ఞానం సంపాదించుకోవటానికి ప్రయత్నిస్తుంటారు. ‘బి’ లు ‘ఎ’ ల కన్నా ఎక్కువగా వస్తే జీవితంలో మీరింకా పరిణతి సాధించలేదనే చెప్పాలి. దీనివల్ల ఎక్కడకు వెళ్లినా మీకు ఇబ్బందులు తప్పవు. డోన్ట్ వర్రీ పరిణతి అందరిలో ఒకేరకంగా ఉండదు. ఇది లెర్నింగ్ ప్రాసెస్. అనుభవాలను సోపానాలుగా చేసుకోండి. చేసిన పొరపాట్లను మళ్లీ చే యకుండా ఉండండి. ‘ఎ’ లను సూచనలుగా తీసుకోండి.