రజనీగంధ ఫూల్ తుమ్హారే... | Sakshi
Sakshi News home page

రజనీగంధ ఫూల్ తుమ్హారే...

Published Sun, Aug 23 2015 10:52 PM

రజనీగంధ ఫూల్ తుమ్హారే...

సంగీతం / యోగేష్
 

అందరికీ ఈ పాట గుర్తుండే ఉంటుంది. బాసూ చటర్జీ దర్శకత్వం వహించిన ‘రజనీగంధ’ సినిమాలోనిది. అమోల్ పాలేకర్, విద్యా సిన్హా నటించారు. ఈ పల్లవినిగానీ పాటను గానీ వింటే ఇందులో ఉర్దూ ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే దీనిని రాసింది యోగేష్. ఉర్దూ సాహిత్యం నుంచి వచ్చిన మజ్రూ సుల్తాన్‌పురి, హస్రత్ జైపురి, సాహిర్ వంటి గీత రచయితలు ఉర్దూ ప్రయోగం ఎక్కువ చేసేవారు. కాని ఇందీవర్, యోగేష్‌లాంటి వాళ్లు మాత్రం శుద్ధ హిందీని ఎక్కువగా వాడేవారు. యోగేష్‌ది లక్నో. చిన్న వయసులోనే తండ్రి చనిపోవడంతో హిందీ భాష మీద ఉన్న అభిమానంతో బొంబాయి చేరుకున్నాడు. చాలా కాలం పాటల రచయితగా అవకాశం రాలేదు. చివరకు హృషికేశ్ ముఖర్జీ తన ‘ఆనంద్’ సినిమాలో అవకాశం ఇచ్చాడు. అందులో గుల్జార్ వంటి హేమాహేమీలు రాసిన ‘మైనే తేరే లియే హీ సాత్ రంగ్ కే సప్‌నే చునే’లాంటి పాటలు ఉన్నాయి.

కాని యోగేష్ రాసిన ‘జిందగీ కైసి హై పహేలీ’.... ‘కహీ దూర్ జబ్ దిన్ ఢల్ జాయే’... పాటలకు ఎక్కువ పేరు వచ్చింది. ‘ఆనంద్’కు సంగీతం అందించిన సలీల్ చౌధురికి యోగేష్ రచనా శైలి నచ్చడంతో బాసూ చటర్జీకి చెప్పి ‘ఛోటీ సి బాత్’లో అవకాశం ఇప్పిస్తే అందులో యోగేష్ రాసిన ‘నాజానే క్యూ హోతాహై యే జిందగీ కే సాథ్’.... ‘జానేమన్ జానేమన్ తేరే దో నయన్’... పాటలు హిట్ అయ్యాయి. ఆ తర్వాత ‘రిమ్‌జిమ్ గిరె సావన్’... ‘కయి బార్ యూ భి దేఖాహై’... వంటి హిట్ పాటలు ఎన్నో రాశాడు. గాయకుడు ముఖేశ్‌కు ఒకే ఒక్కసారి జాతీయ అవార్డు వచ్చింది. అది యోగేశ్ రాసిన ‘కయి బార్ యూ భి దేఖాహై’... పాటకే. ఇది కూడా ‘రజనీగంధ’ సినిమాలోనిదే. యోగేశ్‌కు ప్రస్తుతం 70 సంవత్సరాలు.
 

Advertisement
Advertisement