ఆటై పాటై

world telugu conference - Sakshi

మూడోరోజూ మురిసింది
♦ భాష, సాహిత్యాభిమానులతో పాల్కురికి ప్రాంగణం కిటకిట
♦  భాషా పరిరక్షణకు అంతా ఏకం కావాలన్న వక్తలు

తెలుగు మహాసభల్లో మూడోరోజు ఆదివారం ప్రధాన వేదిక పాల్కురికి సోమన ప్రాంగణం సాహిత్య, భాషాభిమానులతో కిటకిటలాడింది. వేల సంఖ్యలో తరలివచ్చిన ప్రేక్షకులు మంత్రముగ్ధులై రెండు సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు. ‘మౌఖిక వాజ్మయం భాష’ పేరుతో సాహిత్య సభ అనంతరం సాంస్కృతిక సమావేశం నిర్వహించారు. తొలి సభకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెండో సదస్సుకు మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీటిల్లో పాల్గొన్న సాహితీవేత్తలు భాషకు పట్టం కట్టేందుకు తమ వంతు సూచనలు చేశారు. ఎవరేమన్నారో వారి మాటల్లోనే..

ఇప్పుడు కాకుంటే ఎప్పుడూ చేయలేం
తెలుగు భాష, సాహిత్యంపై అవగాహన, ప్రేమ ఉన్న కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే మన భాష వికసించాలి. లేకుంటే ఎప్పటికీ ఈ ప్రయత్నం విజయవంతం కాదేమో. జన సామాన్యంలో నానిన తెలుగు పలుకుబడులు, సామెతలు, జాతీయాలు కూడా మన పాఠ్యాంశాల్లోకి చేరాలి. పరీక్షాంశాలుగా కూడా వాటిని గుర్తించాలి. అప్పుడే తెలుగు తప్పనిసరి నిర్ణయానికి ఫలితముంటుంది. – వెలిచాల కొండలరావు

జానపద సాహిత్యం కూరాడు కుండలాంటిది..
జానపద సాహిత్యం కూరాడు కుండలాంటిది. దాన్ని మైలపడకుండా చూడాల్సిన బాధ్యత మనందరిది అన్న మాటలను మనం నిజం చేయాలి. తెలుగు, తెలంగాణ నుడికారాన్ని పునరుద్ధరించాలి. జనం నోళ్లలో నానిన వాటిని నేటి తరానికి అందించాలి. మొగులు మెత్తవడ్డది వానొస్తదేమో, నాభికాడ సల్లగుంటే నవాబ్‌తో సవాల్‌ చేయొచ్చు, కడుపు నిండా మాట్లాడుతున్నడు, లోతులు గుంజడం వాడికి అలవాటు... ఇలాంటి ప్రయోగాలు మాటలకే కాదు నిగూఢార్థానికి నిదర్శనం. – నలిమెల భాస్కర్‌

సామెతలను ఈ తరానికి అందించాలి
సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు ఒకటే.. ఒక్క మాట ఎంత గొప్ప అర్థాన్ని తెలుపుతుంది. మన భాషా వికాసానికి దోహదం చేసినవి ఇలాంటి సామెతలు, జాతీయాలే. 24 వేల శ్లోకాలతో ఉన్న రామాయణాన్ని కట్టె కొట్టె తెచ్చె అన్న మూడు పొడి వాక్యాల్లో చెప్పాం కదా. తెలుగు భాషలో 1.25 లక్షల సామెతలున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఏనుగంత తండ్రి లేకున్నా ఏకుల బుట్ట అంత తల్లి ఉంటే చాలు అన్న గొప్ప సామాజిక అంశాలను ప్రతిబింబించే సామెతలు మన భాష ఔన్నత్యాన్ని ఆకాశమంత ఎత్తుకు చేర్చాయి. అందుకే వాటి విలువను గుర్తించాలి. ఈ తరానికి అందించాలి. – కసిరెడ్డి వెంకటరెడ్డి

అంతా ఏకంగా కావలి
తెలంగాణ, కోనసీమ, రాయలసీమ యాసలు వేరైనా మన భాష ఒక్కటే. దీన్ని గుర్తించి రెండు ప్రాంతాల్లో తెలుగు సుసంపన్నం అయ్యేలా అంతా పాటుపడాలి. భాషలో జానపద పాటకు ఎంతో ప్రాధాన్యం ఉంది. దాన్ని గుర్తించాలి. – గోరటి వెంకన్న

మనకు ఏ పాటలు కావాలి..?
రెయిన్‌ రెయిన్‌ గో అవే... మనకెంతో అవసరమైన వానను వద్దనుకునే విదేశీ సంస్కృతి కనిపించే ఆంగ్ల పద్యాలా... వానల్లు కురవాలి వానదేవుడా.. వరిచేలు పండాలి వానదేవుడా అన్న మన పాటలు అవసరమా అన్నది మనం తేల్చుకోవాలి.  – ద్వా.నా.శాస్త్రి

అబ్బురం.. అక్షర గణితావధానం
♦ పదాలు, వాక్యాలు చెప్పగానే అందులోని అంకెల సంఖ్య చెప్పే ప్రతిభ
♦ విభిన్న ప్రక్రియతో ఆకట్టుకున్న పుల్లూరు ప్రభాకర్‌

సాహిత్య అవధానంలో ఇదో సరికొత్త ప్రక్రియ. పదాలు, వాక్యాలను చెప్పగానే వెంటనే అందులోని అక్షరాలను అంకెల్లో చెప్పగలిగే అక్షర గణితావధానం! ఏ పదంలో ఎన్ని అంకెలు.. ఏ వాక్యంలో ఎన్ని.. తెలుగులో ఎన్ని.. హిందీ, ఆంగ్లంలో ఎన్ని.. ఇలా చెప్పగానే అందులోని అంకెలు చెప్పేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు అక్షర గణితావధాని పుల్లూరు ప్రభాకర్‌. ఆదివారం రవీంద్రభారతి ఇందుకు వేదికైంది. ‘వెయ్యిలో ఎన్ని సున్నాలుంటాయి’ అంటే ఎవరైనా  ‘మూడు’ అని సమాధానం చెబుతారు. కానీ ప్రభాకర్‌ ఠక్కున 10 అని చెప్పారు. 

‘వెయ్యిలో  ఎన్ని సున్నాలుంటాయి’ అనే వాక్యంలో మొత్తం 10 అక్షరాలు అంటూ తనదైన శైలిలో చెప్పారు. అనేక మంది ప్రాచీన, ఆధునిక కవుల పేర్లను ప్రస్తావించగానే.. వివిధ భాషల్లో వారి పేర్లలో ఎన్ని  అంకెలొస్తాయో చెప్పేశారు. ఉదాహరణకు  ‘పాములపర్తి వెంకటన రసింహారావు’ తెలుగు, హిందీలో అయితే 14 అక్షరాలు, ఇంగ్లిష్‌లో అయితే  31 అక్షరాలు అని చెప్పి అందరినీ ఆకట్టుకున్నారు.  పదాలు, పేర్లు, వాక్యాలే కాదు.. పాటలను సైతం  అంకెల్లో  చెప్పి మెప్పించారు.

చుట్టూ  కూర్చున్న పృశ్చకులు అడిగిన వెంటనే ఏ మాత్రం తడుముకోకుండా సమాధానాలిస్తూ అందరినీ  సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు. ‘ఆ ^è ల్లని సముద్ర గర్భంలో దాగిన బడబానలమెంతో ’ అని ఓ పృశ్చకుడు పాడగానే.. వెంటనే  20 అంటూ  అక్షరాల సంఖ్య చెప్పేశారు. ఇక శనివారం నిర్వహించిన వివిధ అవధాన ప్రక్రియలను ఆలకించేందుకు వచ్చిన ఆహూతులతో రవీంద్రభారతి  కిక్కిరిసిపోయింది. మినీ ఆడిటోరియం బాగా ఇరుకైపోవడంతో అవధాన కార్యక్రమాన్ని  ప్రధాన ఆడిటోరియంలోకి మార్చారు.

విభిన్నంగా ఉండేందుకే..
మెదక్‌ జిల్లా బెజ్జంకికి చెందిన ప్రభాకర్‌ ఇంగ్లిష్‌ ఉపాధ్యాయుడు. అందరికంటే విభిన్నంగా  ఉండాలనే లక్ష్యంతోనే ఈ సరికొత్త అవధాన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. గత 12 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో ప్రదర్శనలిచ్చారు. ‘‘టీవీలో వచ్చిన ఓ కార్యక్రమం తనను ఈ ప్రక్రియకు ప్రేరేపించింది. సాధారణ మాటలను తిరిగేసి చెప్పే ఆ టీవీ షోను స్ఫూర్తిగా తీసుకొని అంకెల్లో అష్టావధానం ప్రారంభించాను. ఇందుకోసం ఎంతో శ్రమించాల్సి వచ్చింది. అందరిలోకి నేను ప్రత్యేకంగా  ఉండాలనే  లక్ష్యంతోనే ఈ సాధన చేశాను. తెలుగు రాష్ట్రాల్లో  అక్షర గణితావధానిగా ఉన్నది బహుశా నేనొక్కడినే’’ అని సంతోషం వ్యక్తం చేశారు. – పగిడిపాల ఆంజనేయులు

బాల కవులు.. భళా!
♦ కవి సమ్మేళనంలో ఉట్టిపడిన తెలుగుదనం
♦ పాటలు, పద్యాలతో అలరించిన చిన్నారులు

రంగురంగుల పట్టు పావడా, పూలపూల రవికె, నడుముకు వడ్డాణం, జడకు కుచ్చులు, చెంపకు సరాలు, తలలో చేమంతులు, మెడలో ముత్యాల హారం.. పూబంతిలా కదులుతుంటే కాళ్ల మంజీరాల గలగలలు.. నడిచొచ్చే తెలుగుదన మంటే ఇదేనంటూ ఆ అమ్మాయిలు వేదికకు అందం తెచ్చారు! జరీ అంచు తెల్ల పంచె, పొడవు చేతుల లాల్చీ, భుజం మీద ఉత్తరీయం.. మా తెల్లదనంలోనూ తెలుగుదనాన్ని చూడండి అన్నట్లు జారిపోతున్న ఉత్తరీయాలను సర్దుకున్నారు అబ్బాయిలు!! ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆదివారం రవీంద్రభారతిలోని డాక్టర్‌ యశోదారెడ్డి ప్రాంగణం బండారు అచ్చమాంబ వేదికగా సాగిన బాలకవి సమ్మేళనంలో దృశ్యాలివీ.

డాక్టర్‌ సునీతా రామ్మోహన్‌రెడ్డి నిర్వహణలో సాగిన బాల కవి సమ్మేళనం ఆద్యంతం అలరించింది. 80 మందికి పైగా బాలకవులు పాల్గొన్నారు. చక్కటి తెలుగు ఆహార్యంతో చిక్కటి తెలుగు పదాలతో గేయాలను ఆలపించారు. సమ్మక్క సారక్క వంటి సంస్కృతిని, రామప్ప గుడి, గోల్కొండ కోట వంటి చారిత్రక నిర్మాణాలను తమ పాటలతో కళ్లకు కట్టారు. శాతవాహనులు, కాకతీయులు, శ్రీకృష్ణదేవరాయలు, నిజాం నవాబులు, వేమన, పోతన, సోమన, సురవరం ప్రతాపరెడ్డి నుంచి జయశంకర్‌ వరకు, తెలుగు సాహిత్యకారులను పోషించిన రాజులను తలుచుకుంటూ గేయాలు ఆలపించారు. క్రీస్తుçపూర్వం ఐదో శతాబ్దం నుంచి ఉన్న తెలుగు భాష ప్రస్తావనను గుర్తు చేశారు. అశోకుడి కాలాన్ని, మార్కండేయ పురాణాల్లో తెలుగు మాటకు ఆధారాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటినన్నింటినీ పాటల్లో వినిపించారు. ‘చక్కెర కలిపిన పెరుగు తెలుగు, నింగికెగిసింది తెలుగు మకుటం’ అంటూ పాడిన పాట అందరినీ ఆకట్టుకుంది.

నాకు తెలుగంటే ఇష్టం!
రెండో తరగతి చదువుతున్న శ్రేష్ఠ.. ‘నాకు తెలుగంటే ఇష్టం, అందుకే వేమన పద్యాలు నేర్చుకున్నా’ అని మొదలు పెట్టి నాలుగు పద్యాలను ఆలపించింది. అఖిల అనే మరో అమ్మాయి ‘ఆడపిల్ల కష్టాలు, బాల్యం, శ్రమ’ను స్వీయగేయంలో వినిపించింది. భాస్కర్‌ అనే కుర్రాడు కంచుకంఠంతో గేయాన్నాలపించి ఆహూతులందరినీ లేచి నిలబడాల్సిందిగా ఆదేశాన్ని తలపించే వినతితో అందరితో తెలుగు భాషకు, తెలుగు మహా సభలకు వందనం చేయించాడు. అరవై ఏళ్లు నిండిన ముల్లంగి లలితాకళ ‘నాది రెండో బాల్యం’ అంటూ వేదిక మీదకొచ్చారు. తూప్రాన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ విద్యార్థులు ప్రదర్శించిన ‘తెలంగాణ వైతాళికులు’ రూపకం, అర్జున్, జయతీర్థ, రిషిత, హిమశ్రీల ఏకపాత్రాభినయాలు అలరించాయి.  – వాకా మంజులారెడ్డి

గరీబోళ్ల కష్టాలకు కవితాంజలి

‘ఎన్కటి ఎవ్వారం గాదని నేనెమన్న కొత్త పోకటపొయినాన్‌ నయిన గంజిల ఈగోలే ఇదే బతుకు బతకబడితిమి.. గానుగెద్దోల గట్లనే  ఉండబడితిమి... ఇష్టమున్నా లేకున్నా గదే బొంతళ్ల బొర్లబడితిమి .. గంట్లేమంటే కులం హక్కుబాతండ్రి... మేం నోరు తెరిచి అడిగెతందుకు మాకు నోళ్లున్నాయ్‌ బాంఛన్‌.. మా కష్టాలకు కాళ్లూన్నాయ్‌ కాల్మోక్తా... ఈడొచ్చీరాకముందే కొత్తబుట్టింద్దాన్ని ఊరి మీదికిడవాలే.. అది ఏడేడు పట్టాల్దూకి ఆడ నేర్వాలే... ఇష్టమొచ్చినోళ్లు ఇష్టమొచ్చినట్టు యాడికి రమ్మంటే గాడికొచ్చి ఏం జేసినా సావక బతుకుతున్నం నయిన..’

కొలుపులోళ్ల శరీర దోపిడీని, గరీబోళ్ల శ్రమ దోపిడీని, దళితుల ఊరవతలి బతుకులను ప్రపంచ తెలుగు మహాసభల వచన కవితా సదస్సు తడిమి చూసింది! వచన కవులు కొందరు రాజ్యపాలనను వేనోళ్ల పొగిడితే.. ఇంకొందరు రాజ్యహింసపై కన్నెర్ర జేశారు. ఆదివారం ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలోని అలిశెట్టి ప్రభాకర్‌ ప్రాంగణంలో డాక్టర్‌ ఎస్‌ రఘు అధ్యక్షతన బృహత్‌ కవి సమ్మేళనం తొలి సమావేశం మొదలైంది. నిమిషం నిడివి కవితలో కవులు సభికులను మెప్పించారు. ఒక్కో సమావేశంలో 25 మంది కవులకు చొప్పున అవకాశం కల్పించారు.

తొలి సమావేశానికి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చివరి సమావేశం కందూరి శ్రీరాములు అధ్యక్షతన ముగిసింది. వానమామలై వరదాచార్యుల వేదికపై వక్తల ఉపన్యాసాలు, కవులు తెలంగాణ మాగాణ చరిత్ర మూలాలను కళ్లకు కట్టారు. ‘ఇక్కడ పాలపుంతల్ని మించిన జానపద కళలున్నాయి.. ఎవరెస్టు శిఖరాన్ని తాగే యక్షగాన ఒగ్గు కథలున్నాయి’ ఇక్కడ ఎరకల గద్దెలు, బీరప్ప పటాలు బాలసంతుల వలపోతలు, అస్రిత వాయిద్యాల మెరుపులు నాగమ్మ ముగ్గులు బైండ్ల కథలున్నాయి’ అని పాలమూరు కవి వనపట్ల కవిత వినిపించారు.

‘పాలపిట్ట పొట్టనింపుకోవడానికి పొలానికి పోతే పంట పొలాలు బీడులై ఉన్నాయి..అన్నా..రైతన్న నీకు ఉచిత కరెంటు కల్పిస్తున్న కేసీఆర్‌ ఆశయాలను వమ్ము చేయవద్దు’ ‘పట్టణాలపై మోజుతో పల్లెను పొలాన్ని వీడవద్దు’ అంటూ ఓ కవి రైతన్నను తిరిగి పల్లెకు ఆహ్వానించారు. ‘అమ్మ భాషరా ఇది.. కమ్మనైన పెన్నిధి. జోలపాడే, ఊయలూపే లాలి తెలుగురా మనది. తేనె కంటే తీయనైన తెలుగు భాష రా ఇది’ అంటూ మరో కవి తెలుగు మాధుర్య రుచిని చూపారు. ‘అడివి బిడ్డలం మేం ఆదివాసీలం– మానవాళికి మూలవాసులం... శబరి తల్లి వారసులం భద్రాద్రి రామయ్య సేవకులం– భక్త రామదాసు సహాయకులం... గోల్కొండ తానీషాకు వ్యతిరేకులం–కొమురం భీం వారసులం’  అంటూ రాంబాబు అనే కవి పేర్కొన్నారు.
– వర్ధెల్లి వెంకటేశ్వర్లు

వెలుగుతున్న.. తెలుగు మహాసభలు
ఈ తెలుగు బ్రహ్మోత్సవాల సందర్భంగా నగరమంతా ఆనందోత్సాహాలతో నర్తిస్తున్న తరుణంలో, ఈ ఆనందహేలలో ఒక గేయం అంటూ శతావధాని డాక్టర్‌ గౌరీభట్ల మెట్టు రామశర్మ చక్కటి గేయాన్ని ఆలపించారు. ఆదివారం నగరంలోని బొగ్గులకుంట తెలంగాణ సారస్వత్‌ పరిషత్‌లోని శతావధాని కోరుట్ల కృష్ణమాచార్య వేదికపైన జరిగిన శతావధానంలో ఈ సన్ని వేశం చోటు చేసుకొంది.
గేయం:  తెలంగాణా నేల వెలుగు  తెలుగుమహాసభలు తెలంగాణా మట్టి మహిమ తెలుపు తెలుగు మహాసభలు బాసరపురి బాసతల్లి భాసురముగ దీవింపగ కీసరగిరి రామలింగస్వామి కరుణ కురిపించగ యాదశైల నృసింహుడు లాదమునే పంచుచుండ ఆలంపూర జోగులాంబ అలంకారమై నిలువగా తెలంగాణా నేల వెలుగు  తెలుగుమహాసభలు తెలంగాణా మట్టి మహిమ తెలుపు తెలుగు మహాసభలు నగరం నందనవనమై నవనవమై నర్తింపగ పలుకుబడుల సొమ్ముతో ప్రకృతి మాత పులకించగా మన సంస్కృతీ సౌరభాలు మహినంత వ్యాపించగా తెలంగాణా నేల వెలుగు  తెలుగుమహాసభలు తెలంగాణా మట్టి మహిమ తెలుపు తెలుగు మహాసభలు మారన మల్లియరేచన మల్లినాద ధర్మన్నలు పోతన తెలుగన్న భళీ పాలకురికి సోమన్నయూ కాళోజీ సినారేలు కరములెత్తి దీవింపగా తెలంగాణా నేల వెలుగు  తెలుగుమహాసభలు తెలంగాణా మట్టి మహిమ తెలుపు తెలుగు మహాసభలు ఉద్యమ విద్యుత్‌ కిరీటి సద్యోవాక్కుల మేటి కేసీఆర్‌ కళాహృదయ కేతనమై నూతనమై జయశంకర శ్రీకరాత్మ జయమంత్రము నందింపగ తెలంగాణా నేల వెలుగు  తెలుగుమహాసభలు తెలంగాణా మట్టి మహిమ తెలుపు తెలుగు మహాసభలు

పద్యం: షీటీమ్స్‌ కల్పించి కేటుగాళ్లకు దుమ్ము దులిపించి వనితకు దతిని పెంచి సన్నబియ్యంతో అన్నదానం చేసి ఆహార భద్రతను ఆదరించి ఆసరా పథకాన ఆశద్యుతులనించి కళ్యాణలక్ష్మితో కాంతి పెంచి మిషన్‌ భగీరథన్‌ మేలెంచి పాలించి కాకతీయ మిషన్‌ కళలనించి హరితహారంబుతో నేలనలర చేసి ప్రీతికోతలు లేని కరెంట్‌ నిచ్చి జనము నీరాజనము పలక  ఘనకతిమెయి మనతెలంగాణ ప్రభుతయే మాన్యచరిత. రఘురామ శర్మ అనే పృచ్ఛకుడు సీఎం కేసీఆర్‌ తన పాలన తీసుకవచ్చిన పథకాలపైన ముఖ్యంగా స్త్రీల రక్షణ, మిషన్‌ భగీరథపైన వచన గేయం చెప్పాలని కోరటంతో శతావధాని డాక్టర్‌ గౌరీభట్ల మెట్టు రామశర్మ ఒక్క క్షణం కూడా తడుముకో కుండా పద్యం చెప్పి సభికులందరినీ ఆశ్చర్యపరిచారు. సభికులు పెద్ద ఎత్తున చప్పట్లు చరిచి తమ ఆనందం వ్యక్తం చేశారు.

జీవితమే నవలకు ముడిసరుకు – కొలకలూరి ఇనాక్‌
తెలుగు మహాసభలపై మీ స్పందన?
తెలుగు అంతరిస్తోందని చింతిస్తోన్న రోజుల్లో తెలుగు గౌరవాన్ని చాటేందుకు ఈ మహాసభలు ఉపయోగపడతాయని భావిస్తున్నాను.

ప్రపంచ లె లుగు మహాసభలు తెలుగు అభివృద్ధికి ఏ మేరకు ఉపకరిస్తాయి?
ఇవి తెలుగు సాహిత్యానికీ, ప్రాచుర్యానికీ తప్పనిసరిగా దోహదపడతాయి. ఈ పండుగ కేవలం సంబురంగా మాత్రమే కాకుండా భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడే సందేశాన్నివ్వాలి. తెలుగులో అద్భుతంగా రాస్తోన్న కవులు, రచయితలను పాఠకులు ఆదరించాలి, ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. తెలుగు వృద్ధికదే తోడ్పడుతుంది.

ఈతరం రచయితలకు మీరేం చెప్తారు?
భాషాసాహిత్యం ఎరుకను సామాన్యులకు సైతం అనుభవమయ్యేలా ఈ సభలు చేశాయి. ఈ తరం కవులు,  రచయితలు ప్రజల జీవితాలను ప్రతిబింబించే కథలు, నవలలు రాయాలి. అభూత కల్పనలు, ఊహాజనిత ఘటనలూ కొన్ని చోట్ల కనిపించొచ్చుగాక, నవల ముడిసరుకు మాత్రం జీవితమే. సమకాలీన సమాజాన్ని ప్రతిబింబించేవే రాయాలి.

రష్యా అనంతర విప్లవోద్యమ సాహిత్య నేపథ్యం మనదే
కథా సదస్సులో వెల్లివిరిసిన తెలంగాణ కథాకాంతులు

తెలంగాణ గడ్డమీద నుంచి ముంబాయి మొదలు దుబాయి, బొగ్గుబాయిల గుండా నడిచివెళ్ళిన వలస బతుకుల చెమట చుక్కల చేతిరాతల ప్రతులెన్నో బయటపడిన వైనాన్నీ, గరీబోళ్ళ వెట్టినీ, మాలమాదిగల వెలినీ ప్రశ్నించే, తిరస్కరించే, తిరగబడే అస్తిత్వోద్యమ, విప్లవోద్యమ కథలు కదం తొక్కిన పుటలెన్నింటినో తెలుగు మహాసభల్లో భాగంగా తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన కథా సదస్సు తడమింది. ముఖ్య అతిథిగా మంత్రి లక్షా్మరెడ్డి హాజరయ్యారు. బి.ఎస్‌.రాములు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ కథల నేప«థ్యాన్ని నెమరువేసుకున్నారు.

ముదిగంటి సుజాతారెడ్డి మాట్లాడుతూ రజాకార్ల పదఘట్టనలో నలిగిపోయిన తెలంగాణ గడ్డమీద పుట్టిన ప్రతికథా బరువుబతుకుల వ్యథలను ఎత్తిచూపిందేనని అన్నారు. రష్యా అనంతర విప్లవోద్యమ సాహిత్య నేపథ్యం తెలంగాణదేననీ, అయితే ఇల్లిందిల సరస్వతీదేవి రాసిన ‘నీ బాంచన్‌ కాల్మొక్త’ లాంటి కథలను తెలంగాణేతర సమాజం అర్థం చేసుకోకపోవడానికి ఇక్కడి బానిసత్వపు జాడలు తెలియకపోవడమే కారణమన్నారు. శ్రీనివాసులు రాసిన ‘అల్లనేరేడు పళ్ళు’ తొలి దళిత కథ అంటూ తెలంగాణ కథ – సామాజికతల మూలాలను వెతికి ఇచ్చారు సంగిశెట్టి శ్రీనివాస్‌. భాగ్యరెడ్డి వర్మ, ఆవుల పిచ్చయ్య, వట్టికోట ఆళ్వారుస్వామి, భాస్కరభట్ల రామారావు, గూడూరి సీతారాం, జాతశ్రీ లాంటి కథారచయితల సృజనను సదస్సు గుర్తుచేసుకుంది.

తెలంగాణ గ్రామీణ జీవితంలేని కథేలేదన్న పెద్దింటి అశోక్‌కుమార్‌ కథాసాహిత్యంతో ముడివడివున్న తెలంగాణ గ్రామీణ జీవితాన్ని విప్పి చెప్పారు. మార్పులనీ, సంస్కరణలనీ, విప్లవాగ్నులనూ తనలో ఇముడ్చుకున్న తెలంగాణకథ ప్రపంచ ప్రభావంతో వచ్చిన రాజకీయ చైతన్యాన్ని కథల్లో హృద్యంగా మలిచిన తీరును వక్తలు ప్రస్తావించారు. ప్రపంచీకరణ ప్రభావాన్ని గుర్తుచేసే కథలను వెల్దండి శ్రీధర్‌ గుర్తుచేశారు. డంకెల్‌ ప్రతిపాదనలపై వచ్చిన కథలతో పాటు యాంత్రీకరణ, పారిశ్రామీకరణ, పట్టణీకరణ ప్రభావాలను కథలు పట్టిస్తున్న వైనాన్ని సదస్సు చర్చించింది.     – అత్తలూరి అరుణ

హాస్యభరితం.. శతావధానం
చప్పట్లతో మార్మోగిన కృష్ణమాచార్య వేదిక
ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా తెలంగాణ సారస్వత పరిషత్‌ సభాభవనం, మరిగంటి సింగరాచార్యుల ప్రాంగణం శతావధాని కోరుట్ల కృష్ణమాచార్య వేదికపై శతావధాని కోరుట్ల కృష్ణమాచార్య ఆధ్వర్యంలో జరిగిన శతావధానం హాస్యభరితంగా సాగింది. ఆదివారం మూడోరోజు వర్ణణ అంశంపై కార్యక్రమం నడిచింది. 25 మంది çపృచ్ఛకులు 25 రకాల ప్రశ్నలు అడిగి శ్రోతలను ఆనంద పరిచారు. మధ్యలో అప్రస్తుత ప్రసంగికుడు శంకర నారాయణ అడిగిన ప్రశ్నలకు నవ్వులు వెల్లివిరిశాయి. ఈ కార్యక్రమానికి డాక్టర్‌ కావూరి పాపయ్య శాస్త్రి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్‌ గురువు వేలేటి మృత్యుంజయ శర్మ హాజరయ్యారు. çపద్య కవితా గానంతో పృచ్ఛకులు పవన్‌కుమార్, ఓం ప్రకాశ్‌ అలరింపజేశారు.

డాక్టర్‌ పెరుంబుదూరు శ్రీరంగాచార్య మాట్లాడుతూ.. తెలుగు సభలను నిర్వహిస్తూ తెలుగును వెలుగులోకి తీసుకువస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యఅతిథి వేలేటి మృత్యుంజయ శర్మ మాట్లాడుతూ.. 1 నుంచి 12 తరగతుల వరకు నిర్బంధ విద్య అమలు చేస్తూ తెలుగును తప్పకుండా మాట్లాడే విధంగా చేయాలని భావించిన సీఎంకి అభినందనలు తెలియజేశారు. అవధానం అంటే ఆనందం, హేళ, ఆట అని పేర్కొన్నారు. శతావధాని డాక్టర్‌ గౌరీభట్ల రామశర్మ మాట్లాడుతూ తెలుగును వైభవంగా లోకానికి చాటి చెప్పాలని, మన సంస్కృతి వైభవాన్ని దశదిశలా చాటాలని పద్య, గద్య, ఉపన్యాస, కవి సమ్మేళన కార్యక్రమాలు, కళాకారుల వైభవ దీప్తిని వ్యాపింపజేయడానికి ప్రభుత్వ పాలకులు కంకణబద్ధు్దలై ఉన్నారని కీర్తించారు.

గురుకుల విద్యావ్యవస్థపై పృచ్ఛకులు సంతోష్‌ సంధించిన ప్రశ్నకు శతావధాని రామశర్మ ‘గురుకులమ్ములు కల్పతరువులవును..’ అంటూ పద్యం ప్రారంభించారు. ఉపాధ్యాయులపై ఐటీ అధికారుల దాడులపై పద్యం చెప్పాలని కోరగా అందుకు శతావధాని ‘నా సరస్వతీపై లక్ష్మీ యీసుపడెనో’ అంటూ పద్యం మొదలుపెట్టారు. అప్రస్తుత ప్రసంగీకుడు శంకర నారాయణ ప్రతి సందర్భంలో అడ్డుగలుగుతూ శతావధాని జీఎం రామశర్మనుద్దేశించి వేసిన ప్రశ్నలు..  మీరు లింగ నిర్ధారణ బాగా చేస్తారట కదా ప్రశ్నించగా సభలో నవ్వులు వెల్లి  విరిశాయి.

వాల్మీకి తొలుత బందిపోటుగా ఉండి తర్వాత మహనీయుడుగానూ, కాళిదాసు మూర్ఖుడుగా ఉండి అనంతరం మహనీయుడుగా అయ్యారని.. మరి శతావధానిగా ప్రపంచవ్యాప్తంగా పేరు గడించిన మీరు గతంలో ఎలా ఉండేవారని సంధించిన ప్రశ్నకు శతావధాని డాక్టర్‌ గౌరీభట్ల మెట్టు రామశర్మ స్పందిస్తూ.. ప్రతి కవి చోరుడేనని చమత్కరించారు. ఏ కవీ సొంతంగా పదాలను సృష్టించలేరన్నారు. పాత కవులు వాడిన పదాలే అటూ ఇటూ వాడుతూ పద్యాలు çసృష్టిస్తారన్నారు. ‘ప్యాకింగ్‌ కొత్తది... మాల్‌ పాతది’ అని సమాధానం చెప్పగా సభా ప్రాంగణం చప్పట్లతో మార్మోగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు 50 çపృచ్ఛకులు 50 రకాలుగా ప్రశ్నలతో శతావధానం రసవత్తరంగా
సాగేలా చేశారు. – కోన సుధాకర్‌రెడ్డి

నయనానందకరంగా నేత్రావధానం
అబ్బురపరిచిన ‘శిరీష’ ద్వయం

రాజుల కాలంలో ప్రత్యేక గూఢచార వ్యవస్థ ఉండేది. సమాచార మార్పిడికి లేఖలు, రాయబారులుండేవారు. అంతేకాదు ఆ కాలంలో కళ్లు కూడా మాట్లాడేవి. రహస్య సమాచార మార్పిడిలో ఇది కీలక పాత్ర పోషించేది. కాగితాల పై రాసిన రాతలకు కన్నులతో భాష్యం చెప్పగలిగే అద్భుత కళే నేత్రావధానం! దేశంలో చాలా తక్కువ మందికి మాత్రమే పరిచయమున్న ఈ కళను ఖమ్మం జిల్లాకు చెందిన ఇంటర్మీడియట్‌ విద్యార్థినులు ఎస్‌వీ శిరీష, కె.శిరీషలు ఆదివారం రవీంద్రభారతి వేదికపై ప్రదర్శించారు. గురువు కె.ఆదినారాయణ సమన్వయకర్తగా వ్యవహరించారు.  చూపులే అక్షరాస్త్రాలైన వేళ..
ఇద్దరు అమ్మాయిలు వేదికపై ఎదురెదురుగా కూర్చోని ఈ కళను ప్రదర్శించారు.

ప్రేక్షకుల నుంచి ఒకరు తెల్లకాగితంపై ఒక పద్యమో లేక వాక్యమో 20 నుంచి 25 అక్షరాలకు మించకుండా రాసి వేదికపై ఆసీనులైన వారిలో ఒకరికి అందజేస్తారు. ఇద్దరు అమ్మాయిల మధ్య కనీసం ఏడెనిమిది అడుగుల దూరం ఉంటుంది. ప్రేక్షకుల్లోని కొంతమంది రాసి ఇచ్చిన కాగితాన్ని సమన్వయకర్త ఆదినారాయణ తీసుకుని ఇద్దరిలో ఒక అవధానికి అందజేయగా.. ఆమె ఆ కాగితంలోని విషయాన్ని తన కనుసైగలతో ఎదురుగా ఉన్న అమ్మాయికి చేరవేసింది. తర్వాత ఆమె ఆ కాగితంపై ఉన్న విషయాన్ని యథాతథంగా మరో కాగితంపై రాసి ప్రేక్షకులకు వినిపించింది. ఇలా కేవలం తెలుగు పదాలే కాకుండా, ఇంగ్లి్లషు, హిందీ పదాలు రాసిచ్చిన చెప్పేసింది. ‘జయ లలిత, ప్రపంచ మహాసభలు జయప్రదం, చిన్నారులకు అభినందనలు’ వంటి పదాలను అవలీలగా చెప్పి సభికులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. అంతేకాదు బొటనవేలి కదలికలతో చేసే ‘అంగుష్టావధానం’ ప్రక్రియలో ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అనే పదానికి అక్షరరూపం ఇచ్చారు.

రసరమ్యంగా అష్టావధానం
అంతకుముందు ఇదే వేదికపై కొనసాగిన అష్టకాల నరసింహరామశర్మ అష్టావధానం భాషాపండితులను విశేషంగా ఆకట్టుకుంది. వైద్య శ్రీనివాస శర్మ అనుసంధాన కర్తగా వ్యవహరించగా, ఆచార్య వేణు
సమావేశకర్తగా వ్యవహరించారు. కడిమెళ్ల వరప్రసాద్‌(అప్రస్తుత ప్రసంగీకుడు), జగన్నాధ శాస్త్రి (పృచ్ఛకుడు), సంధ్య(దత్తపతి), జయంతిశర్మ (వర్ణణాంశం), విజయలక్ష్మి(సమస్య), వెంకటేశం (అశువు)లు పాల్గొన్నారు.

ఇలా చేద్దాం...!
ప్రపంచవ్యాప్తంగా ఏ భాషాభివృద్ధి్ధకైనా అక్కడి ప్రసార మాధ్యమాలు చేసే కృషి అపారమైంది.. అనితర సాధ్యమైంది. తెలుగు నేల అందుకు భిన్నమేమీ కాదు. మీడియాలో భాçష ఒక్కరి చేతుల్లో సాగేది కాదు. కారణం ఏమైతేనేం ఇటీవలికాలంలో తెలుగు భాష ప్రసార మాధ్యమాల వల్లే ఎక్కువగా సంకరమైపోతోంది. సహజత్వం దెబ్బతిని కృత్రిమత్వం పెరుగుతోంది. ఒకవైపు పత్రికలు, రేడియో, టీవీ తదితర ఎలక్ట్రానిక్‌ మాధ్యమాల విస్తృతి, మరోవైపు అధ్యయన, బోధన భాషగా తెలుగుకు తగ్గుతున్న ఆదరణ.. వెరసి తెలుగుకు తీరని నష్టం కలిగిస్తున్నాయి. ఈ సంధి కాలంలో వస్తున్న కొత్తతరం జర్నలిస్టుల్లో కూడా భాషపై పట్టు, లోతైన అవగాహన ఉండటం లేదు. చక్కని తెలుగు భాషలో రాయడానికి, అలవోకగా మాట్లాడటానికి నిజానికి పాండిత్యం అవసరం లేదు.

జర్నలిస్టులకు నేర్చుకోవాలన్న తపన, తప్పు రాయకూడదన్న కనీస శ్రద్ధ ఉంటే చాలు. తెలుగునాట 80 దశకం చివర్లో దాదాపు అన్ని పత్రికలు ఒక్కపెట్టున జిల్లా అనుబంధ సంచికలను విడిగా తీసుకువచ్చాయి. మండల స్థాయి విలేకరుల వ్యవస్థ ఏర్పడింది. పత్రికలకు వార్తలు రాసే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. వారి వేర్వేరు స్థాయి భాషా నైపుణ్యాల వల్ల ప్రమాణాలు పడిపోయాయి. పత్రికా కార్యాలయాల్లో తప్పుల్ని పరిష్కరించి, భాషను సంస్కరించే వ్యవస్థలు కాలక్రమంలో బలహీనపడ్డాయి. రేడియో, టీవీల్లోనూ ఇదే పరిస్థితి. ఇక ఎఫ్‌ఎమ్‌ రేడియోల్లో జాకీల జమిలి భాష, తెలుగు–ఆంగ్లం కలగలిపే తీరు పరాకాష్ట.

ఇది ఒక పార్శ్వమే! కేరళ సంపూర్ణ అక్షరాస్యత సాధించడంలో ‘మలయాళ మనోరమ’ కృషి అపారం. అలాంటి కృషి తెలుగులోనూ జరగాలి. ఫేస్‌బుక్, వాట్సాప్, ట్వీటర్‌ వంటి సామాజిక మాధ్యమాల ప్రభావం పెరిగింది. ఇది అదునుగా అక్కడ తెలుగు వినియోగ క్రమాన్ని మరింత సరళతరం చేయాలి. పత్రికలు, రేడియో, టీవీ, వెబ్‌సైట్లల్లో తప్పుల్లేని తెలుగు వచ్చేలా మాధ్యమాలు మరింత శ్రద్ధ పెంచాలి. వాడుక భాషను ఎక్కువ వాడాలి. అక్షరాస్యత, భాషాభివృద్ధి కోసం నిర్దిష్టంగా కొంత సమయం, స్థలం వెచ్చించాలి. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం కలసి ప్రతిగ్రామంలోనూ పౌరగ్రంథాలయాలు పనిచేసేలా చూడాలి. దినపత్రికలు అందుబాటులో ఉంచాలి.

– దిలీప్‌రెడ్డి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top