స్త్రీలోక సంచారం

Woman's Wandering - Sakshi

ఎక్కడ మిస్‌ అయినా.. ఇక్కడ మిస్‌ అవరు!

బోస్టన్‌లోని ‘బకింగ్‌హామ్‌ బ్రౌనీ అండ్‌ నికోలాస్‌’ స్కూల్లో చదువుకుంటున్న 11 ఏళ్ల ఇండో–అమెరికన్‌ విద్యార్థిని ఆష్లీశర్మ తన స్కూల్‌మేట్స్‌ నుంచి విరాళాలుగా సేకరించిన 2000 డాలర్లను (లక్షా 37 వేల రూపాయలు) అక్రమ రవాణా బాధితుల పునరావాసం కోసం హైదరాబాద్‌లోని ప్రజ్వల సంస్థకు అందించింది. 2016లో హైదరాబాద్‌ వచ్చినప్పుడు బాధితులతో కలిసి, ప్రజ్వలలో మూడు రోజులు గడిపి వెళ్లిన ఆష్లీ.. తను కూడా వారికి ఏదైనా చేయాలన్న సంకల్పంతో స్కూల్లోని మొత్తం 400 విద్యార్థులలో 250–300 మంది నుంచి.. 5 నుంచి 100 డాలర్ల చొప్పున పోగు చేసి పంపిందని ప్రజ్వల వ్యవస్థాపకురాలు సునీతాకృష్ణన్‌ తెలిపారు
 ఒకప్పటి పోర్న్‌స్టార్, ప్రస్తుత బాలీవుడ్‌ నటి సన్నీ లియోన్‌ జీవిత కథ ఆధారంగా నేటి నుంచి జీ5 వెబ్‌సైట్‌లో ప్రసారం అవుతున్న ‘కరే¯Œ జిత్‌ కౌర్‌ : ది అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ సన్నీలియోన్‌’ వెబ్‌ సిరీస్‌లో ‘కౌర్‌’ అనే మాటను తక్షణం తొలగించాలని ‘శిరోమణి గురుద్వార ప్రబంధక్‌ కమిటీ’ (ఎస్‌.జి.పి.సి), సిక్కు మహిళా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ‘‘సిక్కు మహిళలకు సిక్కు గురువులు ఇచ్చిన ఎంతో గౌరవప్రదమైన మాట ‘కౌర్‌’. సిక్కు గురువుల ప్రవచనాలను ఆచరించనివారికి కౌర్‌ అనే పేరును పెట్టడం అంటే సిక్కుల మత విశ్వాసాలను అగౌరవపరచడమే’’నని ఎస్‌.సి.పి.సి. ప్రతినిధి దిల్‌జిత్‌సింగ్‌ బేదీ అన్నారు
 కాంగ్రెస్‌ నాయకుడు శశిథరూర్‌ భార్య సునందా పుష్కర్‌ అనుమానాస్పద మరణం కేసులో ఢిల్లీ పోలీసులు థరూర్‌పై చార్జిషీటును దాఖలు చేశారు కనుక ‘సిట్‌’ (స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌) చేత దర్యాప్తు చేయించాలని బి.జె.పి. నాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుత దశలో కోర్టు జోక్యం చేసుకోవలసినంత ప్రత్యేకత ఈ కేసుకు ఏమీ లేదని కోర్టు చెప్పడంతో, మళ్లీ ఒకసారి తను కోర్టును ఆశ్రయిస్తానని, పట్టువిడవబోనని స్వామి అంటున్నారు
 భర్త, అత్తగారు కలిసి తన చేత బలవంతంగా ఉల్లి, వెల్లుల్లిని తినిపించే ప్రయత్నం చేస్తున్నారని గుజరాత్‌లోని మెహ్సానా జిల్లా కడి గ్రామానికి చెందిన 25 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వామి నారాయణన్‌ను ఆరాధించే ఆ యువతి.. తన భక్తివిశ్వాసాలకు విరుద్ధమైన ఆహారాన్ని ఎలా తినగలనని ఆ ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేయడంతో పోలీసులు వెంటనే ఆ భర్తను, అత్తగారిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపారు
 బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా తన బాయ్‌ఫ్రెండ్‌ నిక్‌ జోనాస్‌ను పెళ్లి చేసుకునే విషయంలో ఎలాంటి స్పష్టతా ఇవ్వకుండా నర్మగర్భమైన సమాధానాలతో అభిమానుల్ని ముప్పుతిప్పలు పెడుతున్నారు. ‘ప్రస్తుతం మేమిద్దరం ఒకర్నొకరం అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం’ అని కొన్ని నెలలుగా చెబుతూ వస్తున్న ప్రియాంక.. తాజాగా ఇప్పుడు.. ‘పెళ్లి అనే భావనను నేనెంతో ఇష్టపడతాను’ అని మాత్రం చెప్పి, అసలు సంగతిని తప్పించేయడం ఆమె ఫ్యాన్స్‌ను నిరాశానిస్పృహలకు గురిచేస్తోంది
 ముప్పై ఆరేళ్ల వయసుకే తనువు చాలించిన బాలీవుడ్‌ పూర్వపు నటి మధుబాల జీవితకథను ఆమె చెల్లెలు మాధుర్‌ బ్రిజ్‌ భూషణ్‌ సినిమాగా తీయబోతున్నారు! మధుబాల బయోపిక్‌ను తీసేందుకు మునుపు ఎంతోమంది నిర్మాతలు ముందుకు వచ్చినప్పటికీ మధుబాల పాత్రకు న్యాయం జరుగుతుందో లేదోనని సంశయించి, హక్కులు ఇచ్చేందుకు నిరాకరించిన భూషణ్‌.. చివరికి తనే సినిమా తీయాలని నిర్ణయించుకుని, ఈ ఏడాది చివరికల్లా నటీ నటుల్ని ఎంపికను పూర్తి చేసే లక్ష్యంతో పని ప్రారంభించారు
 ఇంఫాల్‌లో వీధి పక్కన వ్యాపారం చేసుకునే వారిని తరలించేందుకు మణిపూర్‌ ప్రభుత్వం చేసిన రెండో ప్రయత్నం కూడా విఫలమై, మహిళా వర్తకులంతా అధికారులపై తిరగబడ్డారు. ఇంఫాల్‌లోని స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ సమీపంలో తమకు మార్కెట్‌ ప్రాంగణాన్ని నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ, అది పూర్తయ్యేవరకు తాము ఇక్కడి నుంచి వెళ్లిపోయే ప్రసక్తే లేదని ‘మణిపూర్‌ రోడ్‌సైడ్‌ ఉమెన్‌ వెండర్స్‌ అసోసియేషన్‌’ తేల్చి చెప్పింది
 కత్రీనా కైఫ్‌ ఈ ఏడాదిగా కూడా ఎప్పటిలా.. ఇంగ్లండ్‌ శివార్లలోని ఒక గ్రామంలో తన కుటుంబ సభ్యులతో కలిసి బర్త్‌డేని జరుపుకుంటున్నారు. నేడు 36వ యేట అడుగు పెడుతున్న కత్రినా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో.. ‘ప్రకృతి ఒడిలో, ప్రశాంతమైన వాతావరణంలో తల్లిదండ్రులు, తోబుట్టువుల మధ్య పుట్టిన రోజు జరుపుకోవడం బాగుంటుంది’ అని అన్నారు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top