శ్రమలోనేనా సమానత్వం?

woman who works equally well with men - Sakshi

స్త్రీ శక్తి

చేనేత వస్త్రాల తయారీలో పురుషులతో సమానంగా శ్రమిస్తున్న మహిళలకు సమానమైన వేతనం లభించకపోగా, ఆర్థికంగా ఇక్కట్లపాలైన కొన్ని చేనేత కుటుంబాలను మహిళలే నడిపించవలసి వస్తోంది! ప్రభుత్వం చొరవ తీసుకుని చేయూతనిస్తే తప్ప మహిళా చేనేత కార్మికుల  కష్టానికి గుర్తింపు, గౌరవం, తగిన విలువ లభించని పరిస్థితి నెలకొని ఉంది.

పడుగు పేకల మేలు కలయికతో అందమైన, ఆకర్షణీయమైన వస్త్రాలు రూపుదిద్దుకుంటాయి. అలాగే స్త్రీ, పురుషులు ఇద్దరు ప్రత్యేకశ్రద్ధతో చేనేత రంగంలో తమ శక్తియుక్తులను, వృత్తినైపుణ్యాన్ని మేళవించి అపురూప కళాఖండాలతో వస్త్రాలను తయారు చేస్తారు. అయితే ఇద్దరి శ్రమ సమానమే అయినప్పటికీ మహిళా కళాకారులకు మాత్రం సరైన గుర్తింపు, వేతనాలు లభించడం లేదు. అన్నిరంగాల్లో మాదిరిగానే చేనేత రంగంలో కూడా మహిళలు వివక్షకు గురవుతున్నారు. చేనేత వస్త్రాల తయారీలో 60 శాతం పనులలో స్త్రీల భాగస్వామ్యం కచ్చితంగా ఉంటుంది. ఆ స్థాయిలో వారికి గుర్తింపు రావడం లేదు. వేతనాల్లో కూడా వివక్ష కొనసాగుతోంది. కుటీర పరిశ్రమగా ఈ రోజు చేనేత నిలదొక్కుకుందంటే దాంట్లో మహిళల పాత్రే అధికం. కూలీ గిట్టుబాటు కాక బతుకుదెరువు కోసం మగవారు ఇతర ప్రాంతాలకు వలసపోతే ఇంటి వద్ద ఉండి కుటీర పరిశ్రమను నిలబెట్టుకున్న ఘనత మహిళలదే. పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాల్లో చేనేతలు పేర్గాంచినవి కాగా.. ఈ ప్రాంతాలకు అనుబంధంగా పలు గ్రామాల్లో చేనేత కార్మికులు.. ప్రధానంగా మహిళా కార్మికులు ఆ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు.

ఎనభై ఏళ్ల వృద్ధమహిళలు సైతం జీవనాధారం కోసం రోజువారి కూలీ రూ.100 గిట్టుబాటు కాకున్నా పొట్టకూటి కోసం శ్రమిస్తున్నారు. ఆర్థికపరమైన ఒత్తిళ్లకు తాళలేక భర్త ఆత్మహత్యలు చేసుకుంటే మహిళలే వృత్తిపై ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్నారు. తమ పిల్లల భవిష్యత్‌ను భుజాన వేసుకుని కుటుంబ బాధ్యతను మోస్తూ, ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ ముందుకు సాగుతున్నారు. ఒక్క పోచంపల్లిలోనే చేనేత మగ్గాలు వేసే వారి సంఖ్య 225 వరకు ఉంటుంది. ఇక్కడ సుమారు వెయ్యికి పైగా చేనేత మగ్గాలు ఉన్నాయి. చేనేత వృత్తిలో చీరలు, ఇతర రకాల వస్త్రాలను తయారు చేయడం కోసం మగ్గం నేయడం, అచ్చులు అతకడం, చిటికీలు కట్టడం, ఆసులు పోయడం, కండెలు చుట్టడం, సరిచేయడం, రంగులు అద్దడం, రబ్బర్లు చుట్టడం ఇలా చెప్పుకుంటూ పోతే అన్నిపనుల్లో మహిళల భాగస్వామ్యం ఉంది. సంప్రదాయంగా వస్తున్న చేనేత వృత్తిలో భర్తకు తోడుగా భార్య కచ్చితంగా తన సహకారాన్ని అందిస్తుంది. అయితే మహిళలకు రావాల్సినంత గుర్తింపు, వేతనాలు అందడం లేదు. సహకార సంఘాల్లో సభ్యత్వాలు, గుర్తింపు కార్డులు అందరికీ ఇవ్వడం లేదు. అందుకే మహిళల భాగస్వామ్యంతో కొనసాగుతున్న ఈ పరిశ్రమలో మహిళలకు మరింత ఆర్థిక చేయూతనివ్వడానికి ప్రభుత్వం మహిళా సొసైటీలను ఏర్పాటు చేయాలని చేనేత కళాకారులు కోరుతున్నారు. అలాగే మహిళలకు వృత్తిపరమైన ప్రత్యేక శిక్షణను ఇస్తూ స్వయంకృషితో ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా కృషి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.  

మగ్గమే జీవనాధారం 
భూదాన్‌ పోచంపల్లి మండలం భద్రావతి కాలనీకి చెందిన చేనేత కార్మికురాలు బత్తుల అనితకు మగ్గమే జీవనాధారం అయింది. నిరుపేద చేనేత కుటుంబమైన బత్తుల అంబరుషి, అనిత దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. అనిత భర్త ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో కుటుంబ భారం, పిల్లల చదువులు అనితపై పడ్డాయి. అ«దైర్యపడకుండా తనకు తెలిసిన వృత్తి.. మగ్గాన్ని నమ్ముకుంది. కూలీ మగ్గం నేయగా వచ్చిన ఆదాయంతో పిల్లలను చదివిస్తోంది. ప్రస్తుతం కుమారుడు శివ డిగ్రీ చదువుతుండగా, కుమార్తె పాలిటెక్నిక్‌ చేస్తోంది. అనిత రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుంది. నెల రోజులు కష్టపడి చీరెలు నేస్తే రూ.10వేలు ఆదాయం వస్తుంది. కిరాయి ఇంట్లో ఉంటుంది. 

రెండు రోజులకు నాలుగొందలు
బాల్యం నుంచి చేనేత వృత్తి తెలుసు. మగ్గం నేస్తూ, చిటికీ కట్టడం, ఆసుపోయడం లాంటి పనులు చేస్తాను. ప్రస్తుతం కూలీకి అచ్చు అతుకుతున్నాను. ఒక అచ్చు అతకడానికి రెండు రోజులు సమయం పడుతుంది. దీనికి రూ. 400 కూలీ లభిస్తుంది. ఇలా నెలలో రూ. 4వేల వరకు సంపాదిస్తాను. నా భర్త కూడా చేతకాక, చేతనై కూలీకి మగ్గం నేస్తున్నాడు. ఒకరికొకరం చేదోడువాదోడుగా పని చేసుకుంటూ కాలాన్ని వెళ్లదీస్తున్నాం.
– రాపోలు ప్రమీల, పోచంపల్లి

వృద్ధాప్యంలోనూ తప్పని పని
భర్త, కుమారుడు, ఇద్దరు వివాహిత కుమార్తెలు ఇదీ మా కుటుంబం. అయితే చేతికంది వచ్చిన కుమారుడు తొమ్మిదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో నా భర్త కూలీ మగ్గం నేస్తున్నాడు. నేను కూడా మాస్టర్‌ వీవర్‌ వద్ద రోజువారీ కూలీగా చిటికీలు కడుతున్నాను. నెలంతా పనిచేస్తే రూ. 6 వేల వరకు ఆదాయం వస్తుంది. ఈ వృద్దాప్యంలో కూడా ఇద్దరం పనిచేసుకుంటూనే జీవనాన్ని సాగిస్తున్నాం.
– చిందం భద్రమ్మ, భూదాన్‌ పోచంపల్లి 
– యంబ నర్సింహులు, సాక్షి, యాదాద్రి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top