'అమ్మ ఇంటికి వచ్చిన రూపం ఇప్పటికీ గుర్తే'

'అమ్మ ఇంటికి వచ్చిన రూపం ఇప్పటికీ గుర్తే' - Sakshi


అమ్మ  అమృతమూర్తి-3

 

మాది ఒక మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. నాన్నగారి మొదటి భార్య అనారోగ్యంతో చనిపోయింది. అప్పుడు వాళ్లకు ఆరు సంవత్సరాల బాబు ఉన్నాడు. ఆ సమయంలో అమ్మను నాన్న రెండో వివాహం చేసుకున్నాడు. అప్పుడు నాన్నకి 35 సంవత్సరాలు, అమ్మకు 13 సంవత్సరాలు. మా అమ్మను చేసుకోవడం మా నాన్నమ్మకు ఇష్టంలేదు. ఎందుకంటే కట్నం ఎక్కువ రాలేదని, తను చెప్పిన అమ్మాయిని చేసుకోలేదని. అందుకే నాన్నమ్మ బాబాయి వాళ్ల దగ్గరే ఉండేది.



అమ్మ 16వ యేట అన్నయ్య పుట్టాడు. 18వ యేట నేను పుట్టాను. అంటే ఇరవై ఏళ్ల కల్లా పెళ్లి అవడం, పిల్లలు పుట్టడం అన్నీ జరిగిపోయాయి. నాన్న సారా తాగేవాడు. నెలలో సగం రోజులు తాగుతూనే ఉండేవాడు. మా పెద్ద అన్నయ్య చెడు సావాసాలకి అలవాటుపడి ఇంట్లో నుండి వెళ్లిపోయాడు. చాలాచోట్ల వెతికించాం కాని ప్రయోజనం లేకుండా పోయింది. అలా సాగుతున్న మా జీవితంలో ఒక భయంకరమైన సంఘటన చోటు చేసుకుంది. నాన్న తాగుడికి బానిస అయ్యాడు. దానికి తోడు అన్నయ్య వెళ్లిపోవడం నాన్నను బాగా కుంగదీసింది. ఆ మనోవేదనతో నాన్న విషం తాగి చనిపోయాడు.  అప్పుడు అన్నయ్య ఏడవ తరగతి, నేను ఆరవ తరగతి చదువుతున్నాము. ఒకసారిగా అమ్మ జీవితం శూన్యం అయ్యిపోయింది. ఇంటిచుట్టూ అప్పులు ఉన్నాయి. ఇంట్లో చిల్లిగవ్వ లేదు. బంధువుల సహాయంతో నాన్న కర్మకాండలు పూర్తిచేయించింది అమ్మ. తెల్లారే అప్పుల వాళ్లు ఇంటి ముందు కొచ్చారు. అమ్మ ఎద్దులు, ఎడ్లబండి అమ్మి కొంత అప్పు తీర్చింది. అప్పటికి మాకు మూడున్నర ఎకరాల పొలం ఉంది. కాని పంట చేతికి రాలేదు. అప్పుడు చూడాలి... మా బంధువుల వెటకారాలు, ఎత్తిపొడుపులు. చాలామంది ‘ఇక ఈమె పొలం పండించినట్లే’ అనుకున్నారు. ‘పొలం కౌలుకు ఇస్తారా’ అని కూడా అడిగారు. కాని అమ్మ తనే స్వయంగా పండించుకుంటానని చెప్పేసింది. ఆ సమయంలో మాకు తినడానికి బియ్యం, కప్పుకోటానికి దుప్పట్లు కూడా లేని పరిస్థితి. దేవుడి దయ వల్ల మా అమ్మమ్మ, తాతయ్య అమ్మకు చేదోడుగా ఉన్నారు.



ఒకరోజు మిర్చి తోటకు కాలువ నీళ్లు పెట్టడానికి అమ్మ రాత్రి అక్కడే వుండవల్సిన పరిస్థితి వచ్చింది. ఆ టైమ్‌లో నేను, అన్నయ్య మాత్రమే ఇంట్లో ఉన్నాము. అర్ధరాత్రి 12గంటలకు తడిసిన బట్టలతో, పార పట్టుకుని అమ్మ ఇంటికి వచ్చిన రూపం ఇప్పటికీ నాకు గుర్తుంది. ఇలాంటి సందర్భాలు ఎన్నో. అస్సలు చదువుకోని అమ్మకు మమ్మల్ని చదివించాలని చాలా ఆశగా ఉండేది. అందరూ ‘ఆడపిల్లలకి చదువు ఎందుకు పెళ్లి చేసేయక’ అనేవారు. కాని అమ్మకు చదువు విలువ తెలుసు కాబట్టి మమ్మల్ని ప్రోత్సహించి చదివించింది. అన్నయ్య డిగ్రీ, నేను ఎంసీఏ పూర్తి చేశాం.  అన్నయ్య వ్యవసాయం వైపు వెళ్లాడు. నాకు జాబ్ వచ్చింది కాని మ్యాచ్ సెటిల్ అవడం వల్ల వదిలేశాను. నాకు ఒక బాబు. అమ్మ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషం అమ్మ జీవితంలో ఎల్లప్పుడూ ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.

 

- తిరుపతమ్మ (పద్మ కూతురు), తల్లాడ,

 ఖమ్మం జిల్లా   పద్మ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top