సురక్షిత దీపావళి | We Must Protect Our Eyes With A Safe Diwali Celebration | Sakshi
Sakshi News home page

సురక్షిత దీపావళి

Oct 25 2019 4:54 AM | Updated on Oct 25 2019 4:54 AM

We Must Protect Our Eyes With A Safe Diwali Celebration - Sakshi

దీపావళి పండగ మనసుకే కాదు... దీపకాంతులతో కళ్లకూ పండగే. రంగురంగుల కాంతులీనుతూ వెలిగే బాణాసంచా, మతాబులు కళ్లను మిరుమిట్లు గొలుపుతాయి. కానీ ఆ సంబరాలూ సంరంభాలూ కళ్లకు ప్రమోదమే గానీ ప్రమాదం తెచ్చిపెట్టకూడదు. సురక్షితమైన దీపావళి వేడుకలతో మన కళ్లను కాపాడుకోవాల్సిన జాగ్రత్తలేమిటో తెలుసుకోండి. పనిలో పనిగా కళ్లతో పాటు ఒంటినీ సంరక్షించుకోండిలా.

జాగ్రత్త
►దీపావళి బాణాసంచాతో గాయం అయ్యేందుకు చర్మానికే ఎక్కువ అవకాశం. కారణం... చర్మం మానవ శరీరాన్నంతా కప్పి ఉంచే అత్యంత పెద్ద అవయవం కావడమే.
►బాణాసంచా కేవలం లైసెన్స్‌డ్‌ షాప్‌లోనే కొనాలి.
►ఇంట్లో ఓ కార్డ్‌బోర్డ్‌ బాక్స్‌ వంటి దాన్లో పెట్టాలి.
►ఆ పెట్టెను మంట తగిలేందుకు అవకాశమున్న కిచెన్, పొయ్యి వంటి వాటికి దూరంగా ఉంచాలి.
►బాణాసంచాను చెల్లాచెదురుగా ఉంచకూడదు.
►సాయంత్రం వాటిని కాల్చే సమయంలోనూ మంటకు దూరంగానే ఉండేలా చూసుకోవాలి.   
►బాణాసంచా కాల్చే సమయంలో వదులైన దుస్తులు కాకుండా బిగుతైనవే వేసుకోవాలి.
►వదులైన దుస్తులైతే అవి వేలాడుతుండటం వల్ల మంట అంటుకొని చర్మం కాలే ప్రమాదం ఉంటుంది.
►నిత్యం నీళ్లు ఎక్కువగా తాగడం చర్మానికి ఎంతో మంచిది. అయితే దీపావళి సందర్భంగా ఆ నిబంధనను మరింత శ్రద్ధగా పాటించాలి. ఎందుకంటే... పొరబాటున చర్మం కాలితే ఆ ప్రక్రియలో చర్మం నీటిని కోల్పోతుంది. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉంటే గాయం తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది.
►బాణాసంచా కాల్చేప్పుడు ఎప్పుడూ ఒకే సమయంలో ఒక టపాకాయను మాత్రమే కాల్చాలి. ఒకేసారి రెండు–మూడు కాల్చడం, పక్క పక్కనే పలురకాల బాణసంచా సామగ్రి పెట్టుకొని వరసగా కాలుస్తూ పోవడం వంటివి చేయకూడదు.
►కాల్చేసమయంలో టపాకాయకు వీలైనంత దూరంగా ఉండాలి. ఫలితంగా మీ చర్మం కూడా దూరంగా ఉంటుంది. దాంతో నేరుగా తాకే మంట, వేడిమి ప్రభావం తగ్గుతుంది.
►కాల్చేప్పుడు టపాకాయ నుంచి మనం దూరంగా ఉండటానికి వీలుగా మోచేతిని వంచకుండా పూర్తిగా సాగదీయాలి. మోచేతిని ఎంతగా వంచితే టపాకాయకు అంత దగ్గరవుతాం.
►టపాసు నుంచి తలను వీలైనంత  దూరంగా ఉంచాలి.
►ప్రమాదవశాత్తు చర్మం కాలితే రగ్గు వంటివి కప్పవద్దు.
►నీళ్ల బకెట్‌ను టపాసులు పేల్చే చోట దగ్గరగా, అందుబాటులో ఉంచుకోండి.  
►గాయానికి తడి టవల్‌ను చుట్టి డాక్టర్‌ వద్దకు తీసుకెళ్లాలి.
►వేడి సోకడం వల్ల చర్మానికి అయ్యే గాయాన్ని మూడు విధాల వర్గీకరించవచ్చు. మొదటిది పైపైన (సూపర్‌ఫీషియల్‌), ఓమోస్తరు లోతుగాయం (మీడియన్‌ డెప్త్‌), మూడో రకం తీవ్రంగా కాలిన గాయాలు (డీప్‌ బర్న్స్‌).
►వీటిల్లో మీడియన్‌ డెప్త్, డీప్‌ బర్న్‌ గాయాల వల్ల చర్మంపై మచ్చ (స్కార్‌) మిగిలిపోయే అవకాశం ఉంటుంది.
►గాయం అయిన వెంటనే కంగారు పడకుండా దానిపై నీళ్లు ధారగా పడేలా చూడాలి. మంట తగ్గేవరకు అలా కడిగి అప్పుడు డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లాలి.
►గాయాన్ని కడగడానికి సాధారణ ఉష్ణోగ్రత ఉన్న నీళ్లను మాత్రమే ఉపయోగించాలి.
►ఐస్‌ వాటర్‌ ఉపయోగించడం మంచిది కాదు.
►డాక్టర్‌ దగ్గరికి వెళ్లేవరకు తడిగుడ్డతో గాయాన్ని కప్పి ఉంచవచ్చు.
►కాలిన గాయలు తీవ్రమైతే ఒక్కోసారి శ్వాస సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కంగారు పడకుండా వీలైనంత త్వరగా డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్లాలి.
►గాయం అయిన సందర్భంలో గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే... ఎట్టి పరిస్థితుల్లోనూ గాయాన్ని రుద్దకూడదు.
►కాలి, చేతుల వేళ్లకు తీవ్రమైన మంట సోకితే అవి ఒకదానితో ఒకటి అంటుకుపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు వాటి మధ్య తడి వస్త్రం ఉంచి డాక్టర్‌ దగ్గరికి తీసుకువెళ్లాలి.
►బాణాసంచా ఎప్పుడూ ఆరు బయటే కాల్చాలి.
►ఇంటి కారిడార్లలో, టెర్రెస్‌పైన, మూసేసినట్లుగా ఉండే ప్రదేశాల్లో కాల్చకూడదు.
►టపాకాయలను, బాంబులను డబ్బాలు, పెట్టెలు, ప్లాస్టిక్‌ బాక్స్‌ల వంటి వాటిల్లో పెట్టి కాల్చడం ఎంతమాత్రమూ తగదు.
►మరింత శబ్దం వస్తుందని కుండలవంటి వాటిల్లో పెట్టి అస్సలు కాల్చకూడదు. టపాకాయతో పాటు కుండ కూడా పేలిపోయి పెంకుల వల్ల గాయపడే ప్రమాదం ఉంది.
►చిన్న పిల్లలను ఎత్తుకొని అస్సలు కాల్చకూడదు.

ఐ కేర్‌
►మరీ తీక్షణమైన వెలుగు, దాన్నుంచి వెలువడే వేడిమి, మంట... ఈ మూడింటి వల్ల సాధారణంగా కన్ను ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. ఇది ప్రత్యక్ష ప్రభావం.  
►ఇక పరోక్షంగా కూడా... సల్ఫర్, గన్‌పౌడర్‌ లాంటి రసాయనాల ప్రభావం వేళ్ల ద్వారా కంటికి తగలడం వల్ల కళ్ల మంటలు, నీళ్లుకారడం వంటి సమస్యలు రావచ్చు.
►తీక్షణమైన వెలుగును నేరుగా చూడవద్దు. దానివల్ల కార్నియల్‌ బర్న్స్‌ రావచ్చు. అందుకే బాణాసంచా కాలేసమయంలో నేరుగా, తదేకంగా చూడవద్దు.
►కొన్ని రకాల బాణాసంచా నుంచి నిప్పురవ్వల వంటివి కంటికి తాకే అవకాశం ఉన్నందున అలాంటి వాటిని కాల్చే సమయంలో... కాల్చగానే వీలైనంత దూరం పోవాలి.
►కాలనప్పడు ఆ పదార్థంపై ఒంగి చూడటం మంచిది కాదు.
►బాణాసంచా కాల్చేసమయాల్లో కంటికి రక్షణగా ప్లెయిన్‌ గాగుల్స్‌ వాడటం మంచిది.
►వెలుగులు, రవ్వలతోపాటు వేడిమి వల్ల కూడా కన్ను ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి బాణాసంచా కాల్చగానే వేడిమి తగలకుండా వీలైనంత దూరంగా వెళ్లడం మంచిది.
►రాకెట్‌ వంటివి పైకి వెళ్లకుండా కంటిని తాకితే దానికి గాయం (మెకానికల్‌ ఇంజ్యూరీ) కూడా అయ్యే అవకాశం ఉంది. గాయం వల్ల ఒక్కోసారి కంటి లోపల రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది.
►డైరెక్ట్‌ మంట కంటికి తగిలి కన్నుగాని, కనురెప్పలుగానిక తాగే అవకాశం ఉంది. ఫలితంగా కార్నియా దెబ్బతింటే శాశ్వత నష్టం సంభవించే అవకాశం ఉంటుంది.
►అలాంటిదే జరిగితే కార్నియల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ తప్ప ఇతర చికిత్సలతో ఫలితం ఉండదు. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలి.
►గాయం ఎలాగైనప్పటికీ ఒక కన్ను మూసి విజన్‌ పరీక్షించి చూసుకోవాలి. చూపులో ఏమాత్రం తేడా ఉన్నా వీలైనంత త్వరగా కంటి డాక్టర్‌ను కలిసి చూపించుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement