
ఆపండీ..!కస్సాండ్రా లీవెస్క్
ఆధునికతకు, నాగరికతకు స్వేచ్ఛా ప్రతిమలా నిలిచిన అమెరికాలో మూడు శతాబ్దాలుగా బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయి!
పెళ్లీడు
ఆధునికతకు, నాగరికతకు స్వేచ్ఛా ప్రతిమలా నిలిచిన అమెరికాలో మూడు శతాబ్దాలుగా బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయి! అయితే అవన్నీ కూడా చట్టబద్ధమైనవి! ఆ చట్టబద్ధతపై ఇప్పుడు ఓ పద్దెనిమిదేళ్ల అమ్మాయి న్యాయ పోరాటం చేస్తోంది.
కస్సాండ్రా లీవెస్క్ పద్దెనిమిదేళ్ల అమ్మాయి. గత ఏడాది గర్ల్ స్కౌట్‌గా శిక్షణ పూర్తి చేసుకున్న లీవెస్క్, శిక్షణానంతరం బయటి ప్రపంచంలోకి వచ్చిన తన గ్రూపులోని మిగతా అమ్మాయిల్లా జీవితానికి పనికొచ్చే నైపుణ్యాలను నేర్చుకోడానికో, కుకీస్ అమ్మి నాలుగు డాలర్లు వెనకేసుకోడానికో వెళ్లిపోలేదు. ఇంట్లో కూర్చొని ఒక కొత్త చట్టానికి ముసాయిదా (డ్రాఫ్ట్) తయారు చేశారు! పెళ్లికి కనీస వయసును 13 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు పెంచే చట్టం అది. ఆమె ఉంటున్న న్యూ హాంప్‌షైర్ రాష్ట్రంలో ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం ప్రకారం పదమూడేళ్లు నిండిన ఆడపిల్లలు గానీ, మగపిల్లలు గానీ పెళ్లి చేసుకోడానికి ఎటువంటి చట్టపరమైన అభ్యంతరాలూ ఉండవు.అయితే ఈ చట్టాన్ని సవరించి, పెళ్లికి కనీస వయసును 18 సంవత్సరాలుగా నిర్ణయించాలని లీవెస్క్ డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం ఆమె సవరణ బిల్లు డ్రాఫ్టును కూడా తయారుచేసి ప్రభుత్వానికి పంపించారు. అక్కడితో ఊరుకోకుండా, బిల్లుకు రాష్ట్రవ్యాప్తంగా మద్దతు కూడగట్టుకునేందుకు ప్రచారం కూడా చేస్తున్నారు.
పేరెంట్స్ ‘ఎస్’ అంటే చాలు
ఇండియాలో పెళ్లీడు వయసు.. ఆడపిల్లకైతే 18. మగపిల్లవాడికైతే 21. వివాహానికి కనీస వయసు లేకుండా పెళ్లి జరిగితే మన దగ్గర అది చట్టబద్ధం కాదు. పైగా బాల్య వివాహాల నిషేధ చట్టం ప్రకారం అది నేరం కూడా. కానీ అగ్రరాజ్యమైన అమెరికాలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది! న్యూ హాంప్‌షైర్ సహా అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో అక్కడి చట్టాల ప్రకారం మైనర్లు కూడా పెళ్లి చేసుకోవచ్చు. తల్లిదండ్రుల సమ్మతి, జడ్జి అంగీకారం ఉంటే చాలు. అయితే ఈ చట్టాన్ని లీవెస్క్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
‘‘ప్రతి అమ్మాయీ తన పెళ్లి గురించి కలగంటుంది. అయితే ఇలాంటి చట్టాల కారణంగా కొంతమంది అమ్మాయిలు తాము కలలోనైనా ఊహించని విధంగా పెళ్లిచేసుకోవలసి వస్తోంది’’ అని లీవెస్క్ తన డ్రాఫ్టుకు ఒక మాటతో ముగింపును ఇచ్చారు. ఆ తర్వాత ఆమె ఆమెరికా ప్రతినిధుల సభలో తమ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జాకలిన్ సిలీని కలిసి డ్రాఫ్టు కాపీని అందజేశారు. పదహారేళ్లు నిండకుండా పెళ్లి చెయ్యడాన్ని నిషేధించే ఆ సవరణ బిల్లును గత జనవరిలో సిలీ సభ ముందు ఉంచారు. రెండు నెలల తర్వాత మార్చిలో దానిని రిపబ్లికన్‌లు తిరస్కరించడంతో కస్సాండ్రా లీవెస్క్ డ్రాఫ్టు చెత్తబుట్టలోకి వెళ్లిపోయింది.
మైనరు బాలిక గర్భవతి అయినప్పుడు, సైన్యంలో చేరడానికి వెళ్లే ముందే పెళ్లి చేసుకోవాలని మైనరు బాలిక కోరుకున్నప్పుడు ఈ సవరణ చట్టం (లీవెస్క్ సూచించిన చట్టం) అవరోధంగా మారుతుందన్న వాదనతో రిపబ్లికన్‌లు జాకలీన్ సిలీ ప్రతిపాదనను తోసిపుచ్చారు. డేవిడ్ బేట్స్ అనే ప్రతినిధి అయితే.. ‘మైనర్లు మిలటరీలో చేరుతున్నప్పుడు.. మైనర్లు పెళ్లెందుకు చేసుకోకూడదు’ అని ప్రశ్నించాడు!
ఏడు, పదిహేడు.. ఒకటే
అంతర్యుద్ధాలు జరిగే దేశాలలో, మహిళల్ని హీనంగా చూసే దేశాలలో బాల్య వివాహాలు జరగడం కనిపిస్తుంటుంది. అయితే అగ్రరాజ్యమైన అమెరికాలోనూ ఇదే ధోరణి (అది కూడా చట్టబద్ధంగా) కనిపించడం ఆశ్చర్యం కలిగించే సంగతే. ఇద్దరూ మైనర్లు అయితేనే అది బాల్య వివాహం కాదు. ఇద్దరిలో ఒకరు మైనరు అయినా బాల్య వివాహమే. అమెరికాలో జరుగుతున్న మైనర్ వివాహాలలో ఎక్కువగా అమ్మాయిలే మైనారిటీ తీరని భార్యలుగా ఉంటున్నారని నికోలాస్ క్రిస్టాఫ్ అనే కాలమిస్టు ఇటీవల ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రికకు రాసిన వ్యాసంలో ఎత్తిచూపారు.
‘అన్‌ఛెయిన్డ్ ఎట్ లాస్ట్’ అనే బాల్య వివాహాల నిషేధ సంస్థ ‘టైమ్’ పత్రికకు ఇచ్చిన నివేదికను బట్టి 2000–2010 మధ్య కాలంలో అమెరికాలోని 38 రాష్ట్రాలలో పదిహేడేళ్ల వయసు లోపే 1,67,000 మందికి పైగా బాలబాలికలకు వివాహాలు అయ్యాయి! ‘తహిరిహ్ జస్టిస్ సెంటర్’ (ఈ సంస్థ.. మహిళలు, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలపై అధ్యయనం చేస్తుంటుంది) సేకరించిన వివరాల ప్రకారం.. యు.ఎస్.లోని 27 రాష్ట్రాలలో వివాహానికి కనీస వయోపరిమితే లేదు!
అన్‌ఛెయిన్డ్ ఎట్ లాస్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫ్రైడే రెయిస్ ఇక్కడొక ఆసక్తికరమైన వైరుధ్యం గురించి చెబుతున్నారు. యు.ఎస్.లోని చాలా రాష్ట్రాల్లో 18 ఏళ్లు నిండితేనే కానీ న్యాయపరమైన పోరాటం చేయడానికి వీలుకాదు. అలాంటప్పుడు బాల్య వివాహాల బాధితులు విడిపోడానికి కానీ, పిల్లల సంరక్షణకు గానీ కోర్టుకు వెళ్లడం గానీ కుదరని పని. అంటే ఇక్కడ 17 ఏళ్ల వయసు, 7 ఏళ్ల వయసూ ఒకటే. ఏడేళ్ల పిల్లలకి మనం పెళ్లి చెయ్యం కదా. అలాగే పదిహేడేళ్ల పిల్లలకీ చెయ్యకూడదు అని ఫ్రైడే వాదన.
చెక్కు చెదరని పెళ్లి చట్టాలు
అమెరికా అంత పెద్ద నాగరక దేశం కదా? పెళ్లి చట్టాలను ఎందుకు మార్చుకోలేక పోతోంది? ఎందుకంటే ఆ చట్టాలు ఇప్పటివి కాదు. 18వ శతాబ్దానివి. అప్పట్లో చట్టాలు చేసినవాళ్లు విలువలకు, సంప్రదాయాలకు లింకుపెట్టి, తెగేందుకు, కొత్తవి తగిలించేందుకు వీలు లేని విధంగా చట్టాల్ని చేసేశారు. ఆ కాలంలో శారీరక కలయిక చట్టబద్ధమా, చట్టవిరుద్ధమా అన్నది వయసుని బట్టి, సమ్మతిని బట్టి కాక, పెళ్లయిందా లేదా అనే దాన్ని బట్టే ప్రధానంగా ఉండేది. పెళ్లి అయి ఉండడం అనేది అనేక నైతిక సమస్యలకు పరిష్కారం కావడంతో వివాహానికి కనీసం వయోపరిమితి, శారీరక అవసరాలకు అనుగుణంగా నిర్ణయమైపోయింది. ఆ నిర్ణయాన్ని ఇప్పుడు మార్చాలని ప్రయత్నిస్తే సంప్రదాయవాదులు వెంటనే ఎలా ఒప్పుకుంటారు? అదీ కాక, ‘పిల్లలకు ఏ వయసులో పెళ్లి చేయాలో చట్టాలకంటే కూడా తల్లిదండ్రులకే ఎక్కువ తెలుసు’ అనేవాళ్లూ ఉంటారు. అలాంటి వాళ్లలో డో నెజైమ్ ముఖ్యలు. యేల్ లా స్కూల్‌లో ఆయన ఫ్యామిలీ ‘లా’ను బోధిస్తుంటారు.
ఇంకొక లా ప్రొఫెసర్ ఉన్నారు. ఆవిడ పేరు మార్సీ హామిల్టన్. పెన్సిల్వేనియా యూనివర్సిటీలో పాఠాలు చెబుతుంటారు. ‘చైల్డ్ యు.ఎస్.ఎ.’అనే లైంగిక వేధింపుల వ్యతిరేక సంస్థ వ్యవస్థాపకురాలు కూడా. మార్సీ మాటల్లో పెళ్లి ఎంత శక్తిమంతమైనదంటే... మైనర్ బాలిక రేప్‌కు గురైన ఘటనలో నిందితుడు కనుక ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చాలు... ఇక ఎవరూ అతడిపై కేసు వేయడానికి గానీ, వాదించడానికి గానీ ముందుకు రారు. అంతకంటే కూడా వారి దృష్టిలో ఈ తరహా పెళ్లి కేసులు వాదించడానికి కష్టమైనవి.అయితే మన స్కౌట్ గర్ల్ కస్సాండ్రా ఏమాత్రం నిరుత్సాహపడడం లేదు. మరోసారి బిల్లును సభకు పంపడానికి ఆమె సిద్ధమౌతున్నారు.