థైరాయిడ్ సమస్యకు చికిత్స చెప్పండి... | Sakshi
Sakshi News home page

థైరాయిడ్ సమస్యకు చికిత్స చెప్పండి...

Published Tue, Jul 7 2015 10:53 PM

Tell treated to a thyroid problem

నా శ్రీమతి వయసు 56. ఆమెకు థైరాయిడ్ సమస్య వచ్చిందని డాక్టర్లు చెప్పారు. దీనికి హోమియోలో వైద్యం ఉందా? వివరించండి.
 - మోహనరావు, కాళహస్తి

మీరు థైరాయిడ్ సమస్య అన్నారు. కానీ నిర్దిష్టంగా ఆమె ఏ సమస్యతో బాధపడుతున్నారో వివరించలేదు. కాబట్టి థైరాయిడ్ సమస్యలపట్ల మీకు అవగాహన కలిగేలా సంక్షిప్తంగా ఈ విషయాలు తెలుసుకోండి. థైరాయిడ్ గ్రంథి అనేక జీవక్రియలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది టీ3, టీ4 అనే హార్మోన్లను స్రవిస్తుంది. ఈ రెండు హార్మోన్లు ఉత్పత్తి కావాలంటే హైపోథలామస్, పిట్యుటరీ గ్రంథి నుంచి విడుదలయ్యే టీఎస్‌హెచ్ అనే మరో హార్మోన్ థైరాయిడ్ గ్రంథిని ఉత్తేజపరచాలి. ఈ హార్మోన్ల ఉత్పత్తిలో ఐయోడిన్ పాత్ర చాలా ముఖ్యమైనది. ఐయోడిన్ లోపం వల్లకూడా థైరాయిడ్ సమస్యలు వస్తాయి. ఇందులో ముఖ్యమైనవి... 1. హైపోథైరాయిడిజమ్ 2. హైపర్‌థైరాయిడిజమ్ 3. గాయిటర్ 4. థైరాయిడ్ నాడ్యూల్స్ 5. థైరాయిడ్ క్యాన్సర్.
  హైపోథైరాయిడిజమ్: ఈ సమస్యలో టీ3, టీ4 హార్మోన్లు తక్కువగా విడుదల కావడం వల్ల జీవక్రియల్లో తేడాలు వస్తాయి. అలసట, ఏకాగ్రత లేకపోవడం, పొడిచర్మం, మలబద్దకం, శరీరం చలిగా ఉండటం, శరీరంలో నీరు చేరడం, బరువు పెరగడం, మహిళల్లో
రుతుసమస్యలు దీని లక్షణాలు.

హైపర్‌ థైరాయిడిజమ్ : ఈ సమస్యలో టీ3, టీ4 హార్మోన్లు అధికంగా స్రవించడం వల్ల మొదటిదానికి పూర్తిగా వ్యతిరేక లక్షణాలు కనిపిస్తాయి.గాయిటర్ : థైరాయిడ్ గ్రంథికి వచ్చే వాపును గాయిటర్ అంటారు. ఇది చిన్న పరిమాణం నుంచి చాలా పెద్ద పరిమాణం వరకు పెరుగుతుంది. గర్భవతులు గర్భం దాల్చిన మూడో నెలలోగాని, నాల్గోనెలలోగాని థైరాయిడ్ వ్యాధిని నిర్ధారణ చేసే రక్త పరీక్షలు చేయించాలి. ఎందుకంటే మామూలు మహిళలతో పోలిస్తే గర్భవతుల్లో ఈ సమస్య వచ్చేందుకు రెట్టింపు ఆస్కారం ఉంటుంది. దీన్ని ముందుగా గుర్తించకపోతే నెలలు నిండకముందే ప్రసవం కావడం, శిశువు తక్కువ బరువుతో పుట్టడం, బుద్ధిమాంద్యం వంటి సమస్యలను చూస్తాం.

కొన్ని రక్తపరీక్షల ద్వారా థైరాయిడ్ సమస్యలను నిర్ధారణ చేసి, ఒకవేళ థైరాయిడ్‌కు సంబంధించిన ఇబ్బంది ఉంటే హోమియో ప్రక్రియలో మంచి మందులు ఉపయోగించి థైరాయిడ్ గ్రంథి స్రవించే హార్మోన్లలోని అసమతౌల్యతలను సరిచేయవచ్చు. థైరాయిడ్ సమస్యల కోసం ఐయోడమ్, బ్రోమియమ్, థైరాజినమ్, కాల్కేరియాకార్బ్, నేట్రమ్‌మూర్, సల్ఫర్ లాంటి చాలామందులు ఉన్నాయి. అయితే వీటిని అనుభవం కలిగిన హోమియో నిపుణుల ఆధ్వర్యంలో మాత్రమే వాడాల్సి ఉంటుంది.
 
 డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి
 ఎండీ (హోమియో),
 స్టార్ హోమియోపతి, హైదరాబాద్
 
 

Advertisement
Advertisement