హెచ్‌పీవీ వ్యాక్సిన్‌తో సర్వైకల్‌ క్యాన్సర్‌ నివారణ

Survival Cancer Prevention with HPV Vaccine - Sakshi

మీరు తరచూ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ టీకాల ప్రకటనలు చూసి కూడా పట్టించుకోలేదా? మీరు మరోసారి తప్పక ఆలోచించండి. భారతదేశంలో సర్వైకల్‌ క్యాన్సర్‌ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మనదేశంలో ఏటా 1,34,240 సర్వైకల్‌ క్యాన్సర్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇది 2025 నాటికి రెండు లక్షలకు పైగా చేరవచ్చని అంచనా. సర్వైకల్‌ క్యాన్సర్‌ వల్ల ఏటా 72,825 మంది మృత్యువు బారిన పడుతున్నారు. 

సర్వైకల్‌ క్యాన్సర్‌ అంటే...? 
గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్‌) వద్ద వచ్చే క్యాన్సర్‌ను సర్వైకల్‌ క్యాన్సర్‌ అంటారు. ఈ భాగం గర్భాశయానికి కింది భాగంలో ఉండే సన్నటి ప్రదేశం. పేరుకు తగ్గట్టు ఇది గర్భాశయ ముఖద్వారంలా పనిచేస్తుంది. ఇది గర్భాశయాన్ని యోనితో కలిపి ఉంచుతుంది. మిగతా అన్ని క్యాన్సర్‌లతో పోలిస్తే గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్‌ను చాలా సులువుగా నివారించవచ్చు. క్రమం తప్పకుండా స్క్రీనింగ్‌ చేయించడం దీనికి ఉత్తమ పరిష్కారం. సర్వైకల్‌ క్యాన్సర్‌కు చికిత్స కూడా చాలా సులభం. దీన్ని ఎంత ముందుగా గుర్తిస్తే అంత తేలిగ్గా చికిత్స చేయవచ్చు. 

కారణాలేమిటి? 
సర్వైకల్‌ క్యాన్సర్‌కు ముఖ్యమైన కారణాల్లో హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ (హెచ్‌పీవీ) ప్రధానమైనది. ఈ వైరస్‌ సెక్స్‌ ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. దాదాపు సగం జనాభా జీవితంలో ఏదో ఒక సమయంలో హెచ్‌పీవీ వైరస్‌ను కలిగి ఉంటారు. అయితే అందరిలోనూ ఇది సర్వైకల్‌ క్యాన్సర్‌కు దారితీయదు. కేవలం కొంతమందిలోనే క్యాన్సర్‌ను కలగజేస్తుంది. సెక్స్‌లో పాల్గొన్న ప్రతివారికీ హెచ్‌పీవీ వైరస్‌ సోకే అవకాశాలు ఉంటాయి. అయితే తక్కువ వయసులోనే సెక్స్‌లో పాల్గొనడం మొదలుపెట్టిన మహిళల్లో మొదలుకొని, ఎక్కువమంది భాగస్వాములతో సెక్స్‌లో పాల్గొనే వారిలో  హెచ్‌పీవీ సోకే అవకాశం మరీ ఎక్కువ. ఈ వైరస్‌లోనూ అనేక రకాలు ఉంటాయి. సాధారణంగా హెచ్‌పీవీ వైరస్‌ దానంతట అదే నశించిపోతుంది. ఒకవేళ అలా నశించకపోతే అది కొంతకాలం తర్వాత క్యాన్సర్‌కు దారితీయవచ్చు. హెచ్‌పీవీ వైరస్‌తో పాటు పొగతాగడం, ఎయిడ్స్, ఐదేళ్ల కంటే ఎక్కువకాలం గర్భనిరోధక మాత్రలు వాడటం, ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనడం వంటివి కూడా సర్వైకల్‌ క్యాన్సర్‌కు దారితీసే రిస్క్‌ఫ్యాక్టర్లలో కొన్ని. 

నివారణ ఎలా? 
సర్వైకల్‌ క్యాన్సర్‌ నిర్ధారణలో పాప్‌స్మియర్‌ అనేది క్యాన్సర్‌ స్క్రీనింగ్‌కు ఉపయుక్తమైన పరీక్ష. ఇరవయొక్క ఏళ్లు నిండిన మహిళలు మొదలుకొని, సెక్స్‌లో పాల్గొనడం ప్రారంభించి మూడేళ్లు దాటిన ప్రతి మహిళా తప్పనిసరిగా క్రమం తప్పకుండా పాప్‌స్మియర్‌ పరీక్ష చేయించుకోవాలి. అంటే మహిళలందరూ క్రమం తప్పకుండా స్క్రీనింగ్‌ చేయించుకోవడం అవసరం.

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ అంటే..?
శక్తిమంతమైన వైరస్, బ్యాక్టీరియాలను తట్టుకోవడానికి మన శరీరం ‘యాంటీబాడీస్‌’ను తయారు చేస్తుంది. అయితే హెచ్‌పీవీ వైరస్‌ విషయంలో మాత్రం మన శరీరం ఎలాంటి యాంటీబాడీస్‌నూ తయారు చేయదు. అందువల్ల ఒకసారి ఇన్ఫెక్షన్‌ వస్తే అది జీవితాంతం ఉండిపోతుంది. అది సర్వైకల్‌ క్యాన్సర్‌కు దారితీయవచ్చు. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ (టీకా) ఇప్పించడం వల్ల అది శరీరంలో యాంటీబాడీస్‌ను తయారుచేసి హెచ్‌పీవీ వైరస్‌ నుంచి శరీరాన్ని కాపాడుతుంది. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ యోని క్యాన్సర్, గర్భాశయం ముఖద్వారం వద్ద వచ్చే క్యాన్సర్లను నివారిస్తుంది. అమెరికన్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ వారి సిఫార్సు ప్రకారం 11 ఏళ్లు నిండిన ప్రతి ఆడపిల్లకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ ఇప్పించాలి. అయితే తొమ్మిదేళ్లు నిండినవారి నుంచి 18 ఏళ్ల వరకు ఉండే ఆడపిల్లలకు ఈ వ్యాక్సిన్‌ ఇప్పించవచ్చు. ఈ వ్యాక్సిన్‌ను ఆర్నెల్ల వ్యవధిలో మూడుసార్లు ఇప్పించాలి. దీనివల్ల సర్వైకల్‌ క్యాన్సర్‌ను నివారించవచ్చు. 
Dr. Ch. Mohana Vamsy
Chief Surgical Oncologist
Omega Hospitals, Hyderabad
Ph: 98480 11421, Kurnool 08518273001

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top