గరళ సందేశం

A story By Faneeshwaranath Renu - Sakshi

కథాసారం

ఈ కాలిబాటనే పెద్దకోడలు అమ్మోరింటికి వస్తుంది. మరి యెప్పటికీ తిరిగి రాదు! ఇక ఊళ్లో మిగిలిందేమిటి? గ్రామలక్ష్మియే గ్రామాన్ని విడిచి వెళ్లిపోతే! లక్ష్మీదేవి చేత కంటతడి పెట్టించే ఊరు ఒక ఊరేనా!

హరగోబిన్‌కు ఆశ్చర్యం కలిగింది– ఈ రోజుల్లో కూడా సందేశ వాహకుని అవసరం ఉందన్నమాట! నేడు పల్లెపల్లెకూ పోస్టాఫీసు ఉంది. సందేశ వాహకుని ద్వారా సందేశం పంపించాల్సిన పనేముంది?
హరగోబిన్‌ పెద్ద హవేలి విరిగిన ద్వారం దాటుకొని లోపలికెళ్లాడు. పరిస్థితిని పసిగట్టి సందేశం ఏమయివుంటుందో అంచనా వేసుకోగలిగాడు– జరూరుగా ఏదో గోపితమైన సందేశం తీసుకెళ్లాల్సి ఉంటుంది. సూర్య చంద్రాదులకు కూడా తెలియనట్టిది.

‘‘కాల్‌ మొక్కతా పెదరాణీ గారూ!’’
పెద్ద హవేలీ పెద్ద కోడలు హరగోబిన్‌ను చూసింది. కొంతసేపు కూర్చోమని సైగ చేసింది. పెద్ద హవేలి ఒకప్పుడు నౌకర్లూ– చాకర్లూ, కూలీ–నాలీ జనాలతో నిండి ఉండేది. ఈ రోజు పెద్దకోడలు తన చేతుల్తో చాటబట్టి ధాన్యం చెరుగుతూ ఉంది. పెద్దన్నయ్య చచ్చిపోతూనే నాటకమే ముగిసింది. ముగ్గురు అన్నదమ్ముళ్ల మధ్య గొడవలు మొదలయ్యాయి. రైతులు దావావేసి భూమిని దఖలు పర్చుకున్నారు. ముగ్గురన్న దమ్ముళ్లూ ఊరు వదలి పట్నం చేరుకొన్నారు. మిగిలింది పెద్దకోడలే– పాపం! భగవంతుడు మంచివాళ్లకే కష్టాలు కలిగిస్తాడు. లేకపోతే జబ్బు సోకిన గంటలోనే పెద్దన్నయ్య ఎందుకు చనిపోతాడు? పెద్దకోడలు ఒంటిమీదున్న నగానట్రా లాగేసుకొని పంచుకొన్నారు.

హరగోబిన్‌ తన కళ్లతో చూశాడు ద్రౌపదీ వస్త్రాపహరణ లీలను. బెనారసీ చీరను మూడు ముక్కలు చేసుకొన్నారు! కిరాణాకొట్టు ముసల్ది ఎప్పుడు వచ్చి ఇంటిముందు కూర్చుందో, ఏదోదో వాగేస్తుంది. ‘‘అప్పు తీసుకొని తిన్న సరుకేమో తియ్యగా ఉంటుంది. డబ్బులివ్వాలంటే మాత్రం చేదు.’’ పెద్దకోడలు బదులు మాట్లాడలేదు. హరగోబిన్‌ నిట్టూర్చాడు. కిరాణాకొట్టు ముసల్ది వరండా దాటేంతవరకు పెద్దకోడలు ఏమీ మాట్లాడదు. ఇక నోరు మూసుకొని ఉండలేకపోయాడు. ‘‘పిన్నీ, బాకీ వసూలు చేయటంలో నీవు కాబూళీవాణ్ని కూడా తలదన్నగలవు.’’
‘‘నోర్ముయ్‌! పేడె మూతోడా... కాబూళీ పేరెత్తావంటే నీ నాలుక పీకేస్తా.’’
హరగోబిన్‌ నాలుక చాచి చూపించాడు. ముసల్ది తిట్టుకుంటూ వెళ్లిపోయింది.
‘‘హరగోబిన్‌ బాబూ, నీవు ఓ మాట చెప్పిరావాలి. ఈ రోజే. చెప్పు, వెళ్లగలవా?’’
‘‘ఎక్కడికి?’’
‘‘మా అమ్మ గారింటికి.’’
కళ్లనీళ్లు నింపుకొన్న పెద్దకోడలి వైపే చూస్తూ– ‘‘ఇంతకీ సందేశం ఏమిటి?’’
సందేశం చెబుతూ పెద్దకోడలు వెక్కిళ్లు బెట్టి ఏడ్చింది. ‘‘పెదరాణీ గారూ! గుండెను దిటవు చేసుకోండి.’’
‘‘ఇంకా ఎంత గట్టిపర్చుకోమంటావు? అమ్మతో చెప్పు నేను అన్నా వదినలకు సేవచేసి పొట్ట పోసుకుంటానని. పిల్లోళ్ల ఎంగిలి మెతుకులు తిని ఓ మూల పడివుంటాను. ఇంకా ఇక్కడే మాత్రం ఉండలేను. చెప్పు, అమ్మ నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్లకపోతే ఏదో ఒకరోజు మెళ్లో నీళ్లకడవ తగిలించుకొని చెర్లో పడి చస్తానని చెప్పు. ఆకులు అలములు తిని ఎంతకాలం బతగ్గలను?’’ మరుదులూ, తోటి కోడళ్లూ ఎంత కఠినాత్ములు. సరిగ్గా వరికోతల సమయానికి పట్నం నుండి దిగుతారు. పదిహేను రోజుల్లో అప్పులూ సప్పులూ లెక్కేసుకొని తిరిగి వెళ్లేప్పుడు రెండు రెండు మణుగుల బియ్యం, అటుకులు తీసుకెళ్తారు. ఇక తిరిగి చూస్తే ఒట్టు!

పెద్ద కోడలు కొంగుకు వేసిన ముడి విప్పి నలిగిన ఐదు రూపాయల నోటు తీసింది– ‘‘కనీసం దారిఖర్చుకయ్యే మాత్రమైనా జమ చేయలేకపోయాను. తిరిగి రావటానికయ్యే ఖర్చు అమ్మ నడిగి తీసుకో. వస్తే అన్నయ్య నీతో పాటే రావచ్చు.’’ ‘‘పెదరాణీ గారూ! దారి ఖర్చులకు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఈ రోజు పదిగంటల బండికి వెళుతున్నా.’’ పెద్దకోడలు చేతిలో నోటు పట్టుకొని శూన్యదృక్కులతో హరగోబిన్‌ను చూస్తుండిపోయింది. సందేశాన్ని చేరవేసే కార్యాన్ని అందరూ చేయలేరు. మనిషి భగవంతుని ఇంటినుంచి సందేశ వాహకునిగా మారి వస్తాడు. చెప్పిన మాట పొల్లు పోకుండా మదిలో వుంచుకోవాలి.
బండి ఎక్కుతూనే హరగోబిన్‌కు సందేశంలోని ప్రతి మాట మనసులో గుచ్చుకుంటోంది. ఎవర్ని నమ్ముకొని ఇక్కడుండాలి? 

హరగోబిన్‌ పక్కసీటులో వ్యక్తిని అడిగాడు– ‘‘థానా బిహపూర్‌లో బండి ఆగుతుందా లేదా?’’ ‘‘థానా బిహపూర్‌లో అన్ని బళ్లూ ఆగుతాయి’’ విసుగ్గా సమాధానం చెప్పాడు. ఇతడితో బాతాఖానీ పనికి రాదు. మళ్లీ సందేశాన్ని తల్చుకొన్నాడు. మధ్యమధ్యలో ఎక్కడెక్కడేడ్చిందో తనూ ఏడ్వాలా? బండి కటిహార్‌ జంక్షన్‌ చేరగానే మైకులో మాటలు విన్పిస్తున్నాయి. ‘‘హరగోబిన్‌ బాబూ! అమ్మతో చెప్పు, దేవుడు చిన్నచూపు చూశాడని.’’ అతడి కాళ్లు పల్లెవైపు సాగడం లేదు. ఈ కాలిబాటనే పెద్దకోడలు అమ్మోరింటికి వస్తుంది. మరి యెప్పటికీ తిరిగి రాదు! ఇక ఊళ్లో మిగిలిందేమిటి? గ్రామలక్ష్మియే గ్రామాన్ని విడిచి వెళ్లిపోతే! లక్ష్మీదేవి చేత కంటతడి పెట్టించే ఊరు ఒక ఊరేనా!

హరగోబిన్‌ను వూరి వాళ్లు గుర్తుపట్టారు– జలాలాగఢ్‌ వూరి సందేశవాహకుడు ఏ సందేశం తీసుకొచ్చాడో మరి! ‘‘రామ్‌రామ్‌ భాయీ! చెప్పు అంతా క్షేమమే కదా? అటువైపు వానచినుకులు పడ్డాయా?’’
కాళ్లు చేతులు కడుక్కున్న తర్వాత హరగోబిన్‌ను పిలిపించారు. అతడి గుండె వేగంగా కొట్టుకోసాగింది. ముసలి తల్లి అడిగింది – ‘‘చెప్పు బాబూ, ఏదైనా సందేశం?’’ ‘‘నేను నిన్న సరసియా గ్రామమొచ్చాను. ఇంతదూరం వచ్చాను కదా అని మీ దర్శనం చేసుకొని పోదామని.’’ ముసలి తల్లి దిగులు చెందింది. ‘‘నేను బాబుతో చెబుతూనే వున్నాను, వెళ్లి అక్కయ్యను తీసుకురా, ఇక్కడే వుంటుందీ అని. అక్కడ ఇంకా ఏం మిగిలింది?’’ ‘‘లేదు తల్లీ! ఆస్తిపాస్తులకు కొదవేమీ లేదు. పోతే ఆర్భాటాలు లేవు. పెద్దకోడలికి ఊరంతా తన కుటుంబమే.’’

ముసలి తల్లి టిఫిన్‌ తెచ్చి పెట్టింది. పప్పు, అన్నము, కూరలు, నెయ్యి, అప్పడం, ఊరగాయ... 
‘‘ఏమిటి బాబూ, భోంచెయ్యడం లేదు?’’
‘‘తల్లీ కడుపునిండా టిఫిన్‌ తిన్నానుగదా!’’
‘‘అరె, వయసులో వున్న మగాడికి, అయిదు సార్లు టిఫిన్‌ తిన్నా గిన్నెడు కూడు యేమాత్రం?’’
సాధారణంగా సందేహ వాహకుడు కడుపారా తిని, కన్నారా నిద్రపోతాడు. తను ఇక్కడికి వచ్చిన పనేమిటి? తను అబద్ధ మాడటం దేనికి?

రాత్రంతా హరగోబిన్‌ కంటికి కునుకు లేదు. ఉదయాన్నే గుండెదిటవు పరుచుకున్నాడు. తను కేవలం సందేశ వాహకుడు. ఉన్నది ఉన్నట్లు చెప్పడమే తన పని. ముసలి తల్లి దగ్గరికెళ్లి కూర్చున్నాడు.
‘‘అమ్మగారూ, నేను ఈ రోజే వెళ్లిపోతున్నా.’’ ‘‘తొందరెందుకు, రెండ్రోజులుండి వెళ్లు.’’ ‘‘లేదమ్మగారూ, ఈసారికి సెలవిప్పించండి. దసరాకు పెద్దకోడలితోపాటు నేనూ వస్తాను.’’ ‘‘అంత త్వరగా వెళ్లాల్సివుంటే ఎందుకొచ్చినట్లు? కూతురికి పెరుగు–అటుకులు పంపిద్దామనుకున్నా. పెరుగు ఈరోజుకు దొరకదు. కొద్దిగా అటుకులున్నాయి, తీసుకెళ్లు.’’ ముంగిలి దాటి వెళుతూంటే పెద్ద అన్నయ్య అడిగాడు– ‘‘దారి ఖర్చులకు డబ్బుందా?’’ ‘‘మీ ఆశీర్వాదాల వల్ల దేనికీ కొదవలేదు.’’ 

స్టేషన్‌ చేరుకొని హరగోబిన్‌ లెక్కవేశాడు. కటిహార్‌ వరకు టికెట్టు కొనగలడు. ఒకవేళ పావలాకాసు చెల్లకపోతే సైమాపూర్‌ వరకే వెళ్లగలడు. బండిలో కూర్చుంటూనే– తను ఎందుకు వచ్చినట్టు? ఏం చేసుకుని వెళుతున్నట్టు? ఉదయం అయిదు గంటలకు కటిహార్‌ స్టేషనుకు చేరుకున్నాడు. జలాలాగఢ్‌! ఇరవై కోసులు! పెద్దకోడలు ఎదురు చూస్తుంటుంది. మహా వీర విక్రమ బజరంగ్‌ నామం జపిస్తూ నడక సాగించాడు. ఓ పెద్ద గ్రామంలో ఆగి కడుపు నిండా నీళ్లు తాగాడు. చంకలో వున్న పొట్లాన్ని తీసి వాసన చూశాడు. అబ్బ! బాస్‌మతీ అటుకులు. కూతురి కోసం తల్లి కానుక. వద్దు, తాను ఇందులోంచి పిడికెడు కూడా తీసి తినలేడు. పెద్దకోడలికి ఏమని జవాబు చెప్పగలడు. పదిహేను కోసులు! అమ్మతో చెప్పు. ఇక బతకనని చెప్పు. జలాలాగఢ్‌ స్టేషన్‌ సిగ్నల్‌ కనిపిస్తోంది. తను ఆగిపోయాడా లేక నడుస్తున్నాడా?

‘‘పెదరాణీ’’
తాను పక్క మీద పడివున్నాడు. 
‘‘హరగోబిన్‌ బాబూ, నీ వంట్లో ఎలా ఉంది? గుటికెడు నీళ్లు తాగు... నోరు తెరు... ఆ... తాగు, తాగు!’’
‘‘మీరు వూరు విడిచి వెళ్లొద్దు. నేనే నీ కొడుకును. నీవే మా అమ్మవు.’’
పెద్దకోడలు వేడిపాలలో పిడికెడు బాస్‌మతీ అటుకులు వేసి కలిపింది.
సందేశం పంపినప్పటినుండీ ఆమె తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపం చెందసాగింది.

ఫణీశ్వర్‌నాథ్‌ రేణు (1921–1977) హిందీ కథ ‘సందేశ వాహకుడు’ ఇది. 1962లో రాసిన దీన్ని తెలుగులోకి పి.విజయరాఘవ రెడ్డి అనువదించారు. ఫణీశ్వర్‌నాథ్‌ బిహార్‌లో జన్మించారు. ప్రేమ్‌చంద్‌ అనంతర హిందీ సాహిత్యంలో ప్రభావశీల రచయితగా గుర్తింపునొందారు. మైలా ఆంచల్‌ ఆయన ప్రసిద్ధ నవల. బాసు భట్టాచార్య ‘తీస్రీ కసమ్‌’ సినిమాకు రేణు కథ ఆధారం. సందేశ వాహకుడు సంక్షిప్తం: సాహిత్యం డెస్క్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top