రెండు ఆత్మల సంభాషణ

Story Of Kent Haruf Book Our Souls At Night - Sakshi

కొత్త బంగారం

అమెరికా, కొలరాడోలో ఉన్న హోల్ట్‌ అన్న ఊళ్ళో– సెడర్‌ స్ట్రీట్‌లో యేడీ, లూయిస్‌ ఎదురుబొదురు ఇళ్ళలో ఉంటారు. ఇద్దరూ 70ల్లో ఉన్నవారు. జీవిత భాగస్వాములని కోల్పోయినవారు. ఎన్నో ఏళ్ళగా అక్కడే ఉన్న వారిద్దరూ కేవలం పరిచయస్థులు. స్నేహితులు కారు. యేడీ కొడుకూ, లూయిస్‌ కూతురూ వేరే ఊళ్ళల్లో ఉంటారు.

ఒకరోజు యేడీ, లూయీస్‌ ఇంటికి వచ్చి ‘మనిద్దరం ఎంతోకాలంగా ఒంటరిగానే గడుపుతున్నాం. రోజైతే ఎలాగో గడిచిపోతుంది. రాత్రుళ్ళు గడవడమే కష్టం. మనం పక్కపక్కన పడుకుని కబుర్లు చెప్పుకుంటుంటే నిద్ర పడుతుంది. భౌతిక సంబంధం కోసం అడగడం లేదు. నా లైంగికేచ్ఛ ఎప్పుడో పోయింది’ అంటుంది. ఆమె కేవలం ‘తోడు’ కోసమే చూస్తోందని అర్థం చేసుకున్న లూయీస్‌ ఆశ్చర్యపడినప్పటికీ, ఆ ప్రతిపాదనని అంగీకరిస్తాడు.

అతను మొదటిసారి యేడీ ఇంటి వెనక ద్వారం నుండి లోపలికి వస్తాడు. ‘ఎవరేమనుకున్నా నేను పట్టించుకోనని నిర్ణయించుకున్నాను. జీవితాంతం పట్టించుకుంటూనే ఉన్నాను. ఇకముందు కాదు. నీవు యీ సందునుండి వస్తే, మనమేదో తప్పు చేస్తున్నామనిపిస్తుంది’ అని యేడీ చెప్పిన తరువాత ముఖద్వారం నుండే రావడం ప్రారంభిస్తాడు లూయిస్‌.

వారి మధ్య స్నేహం, సాహచర్యం ఏర్పడుతూ ఉండగా– కోల్పోయిన తమవారి గురించీ, తాము చేసిన తప్పుల గురించీ మాట్లాడుకుంటారిద్దరూ. తమ గతాలనూ, సుఖదు:ఖాలనూ పంచుకుంటూ– వయస్సు పైబడిన ఏకాకులిద్దరూ ఓదార్పు పొందుతారు. అయితే, ఆ చిన్న ఊరి నివాసులు చెవులు కొరుక్కుంటారు. స్నేహితులు వారి మొహంమీదే వారి సంబంధం గురించి ఆటపట్టిస్తారు.
యేడీ కొడుకు జీన్‌ను అతని భార్య విడిచిపెట్టినప్పుడు, ఆరేళ్ళ తన కొడుకు జేమీని తల్లి వద్ద వేసవి సెలవులు గడపటానికి దింపుతాడు జీన్‌. తనకు వారసత్వంగా రావల్సిన తల్లి డబ్బుకోసమే లూయీస్‌ తల్లిని మభ్యపెడుతున్నాడనుకుని లూయీస్‌ను ఏవగించుకుంటాడు. 

‘నాన్నా, నీకు యేడీ అంటే ఇంతిష్టం అని తెలియదు. యీ వయస్సులో నీకు తోడు దొరికినందుకు సంతోషంగా ఉంది. ఎవరేమనుకుంటే నీకేమిటి!’ అని, లూయీస్‌ కూతురు మాత్రం తండ్రిని సమర్థిస్తుంది. 
జేమీతో అనుబంధం పెంచుకున్న లూయీస్‌ ‘జేమీకి ఒక కుక్క అవసరం. మనిద్దరి ముసలాళ్లతోనూ, ఫోన్లో ఆటలతోనూ ఎంతసేపని గడపగలడు!’ అంటూ కుక్కను తెస్తాడు. ఇద్దరూ జేమీని క్యాంపింగ్‌కీ, రెస్టరెంట్లకూ తీసుకెళ్తుంటారు.

జీన్, భార్యా రాజీపడి– ఒకటైన తరువాత, జీన్‌ కొడుకును తీసుకుపోతాడు. తల్లి లూయీస్‌తో తెగదెంపులు చేసుకుంటే కానీ జామీని చూడనివ్వనంటాడు. కొడుకు మాటలకు లొంగిపోయి, జేమీని చూడ్డానికి వెళ్ళినప్పుడు యేడీ నడుం ఎముక విరుగుతుంది. మనవడిని రోజూ చూడ్డానికి పక్కనే ఉన్న రిటైర్మెంట్‌ హోమ్లో చేరుతుంది. లూయీస్‌ తన దైనందిన జీవితాన్ని యథావిధిగా కొనసాగించవల్సి వస్తుంది. ఇక తన శరీరం తనకు సహకరించదని అర్థం చేసుకున్న యేడీ ఆఖర్న లూయీస్‌కు ఫోన్‌ చేస్తుంది. తిరిగి క్రమంగా ఫోన్‌ సంభాషణలు మొదలవుతాయి.

ఈ ‘అవర్‌ సౌల్స్‌ ఎట్‌ నైట్‌’లో రచయిత కెంట్‌ హారుఫ్‌ ప్రధానంగా లూయిస్‌ మీదే దృష్టి కేంద్రీకరిస్తారు. డైలాగులకి కొటేషన్‌ మార్క్స్‌ ఉండవు. బాహ్య గౌరవానికి సంబంధించి, మన కుటుంబ సభ్యులకి మనం ఎంతవరకూ బాకీ పడి ఉండాలి? వృద్ధాప్యంలో కూడా మనకిష్టమైన విధంగా జీవించే హక్కు ఉండదా? వర్తమానంలో జీవితాన్ని ఎంతగా మెరుగుపరచుకోగలం? లాంటి ప్రశ్నలను లేవనెత్తుతుంది పుస్తకం. సరళమైన కథాంశమే అనిపించే నవలికలో గంభీరతా కనిపిస్తుంది. 180 పేజీల యీ నవలను, ‘నాఫ్‌’ రచయిత మరణానంతరం 2015లోప్రచురించింది. హారుఫ్‌ కొలరాడోలో జన్మించారు. ఆయన నవలలన్నీ కాల్పనిక ఊరైన హోల్ట్‌నే ఆధారంగా చేసుకుని రాసినవి.  2014లో క్యాన్సర్‌ బారినపడి మరణించారు. ఈ నవల ఆధారంగా భారతీయుడు రితేష్‌ బత్రా దర్శకత్వంలో ఇదే పేరుతో 2017లో సినిమా వచ్చింది.
 - కృష్ణ వేణి 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top