సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌

Special Story On Scene Reconstruction Telugu Movies - Sakshi

పోలీస్‌ చేతిలో గన్‌ ఉంటుంది. గన్‌ మాత్రమే ఉంటుంది. చట్టం ఉండదు. పోలీస్‌ ఒంటిపై డ్రెస్‌ ఉంటుంది. డ్రెస్‌ మాత్రమే ఉంటుంది. చట్టం ఉండదు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోకుండా ఉండటం కోసమే పోలీస్‌కి ఆ గన్‌.. ఆ డ్రెస్‌! కానీ.. క్రిమినల్స్‌ చట్టం చేజారినప్పుడు పోలీస్‌ అయినా.. మామూలు మనిషైనా.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే పరిస్థితి వస్తుంది.   సినిమాల్లో మనం చూస్తున్నదీ.. ‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌లో మనం చూసిందీ ఇదే! ఏదైనా ‘షూటింగ్‌’ వరకూ వచ్చిందంటే.. అందులో కథ ఉంటుంది.. కథ వెనుక వ్యథ ఉంటుంది. అప్పుడు రియల్‌ లైఫ్‌కి, రీల్‌ లైఫ్‌కి తేడా కనిపించదు. కావాలంటే సీన్‌ టు సీన్‌.. రీకన్‌స్ట్రక్షన్‌ చేసి చూద్దాం రండి.

శిశువులుగా మీరు పుట్టి పశువులుగా మారితే! మానవ రూపంలోనే దానవులై పెరిగితే... సభ్యతకీ సంస్కృతికీ సమాధులే కడితే...
‘ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో’ పాటలోని పదాలివి. వేటూరి సుందరామ్మూర్తి కలం చూపించిన ఆవేశం. ‘ప్రతిఘటన’ (1985) సినిమాలోని పాట. నిజమే.. సమాజంలో ఆడవారిపై జరుగుతున్న అత్యాచారాలను చూస్తుంటే... నాడు– నేడు ఈ లోకం ‘దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకం’లానే ఉందనిపిస్తోంది. ఇన్నేళ్లల్లో ఏ మార్పూ లేదు. సినిమా కోసం ఆయన రాసిన ఈ పాట సమాజానికి వర్తిస్తుంది. ఏడేళ్ల క్రితం ‘నిర్భయ’, పది రోజుల క్రితం ‘దిశ’.. మధ్యలో ఎందరో

నిర్భయలు... ఇంకెంతమంది బలవ్వాలి?
దేశవ్యాప్తంగా ఉన్న ఈ ప్రశ్నకు సమాధానం దొరికేది ఎప్పుడు? అంటే ‘గాంధీగారు అన్నట్లు అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా తిరగలిగినప్పుడు’ అంటారు సీనియర్‌ నటి శారద. సమాజంలో జరిగేవి సినిమాలో కనిపిస్తాయి. సినిమాలో కనిపించేవి సమాజంలో జరుగుతుంటాయి. సినిమాకి ప్రేరణ సమాజమా? సమాజంలో జరిగేవి సినిమాకి ప్రేరణా? అంటే చెప్పడం కష్టం. భారత చలనచిత్ర చరిత్రలో సమాజానికి అద్దం పట్టే కథలు ఎన్నో వచ్చాయి. నాటి నుండి నేటి వరకు ‘అత్యాచారం’ నేపథ్యంలో చాలా సినిమాలే వచ్చాయి. కొన్ని చిత్రాల గురించి చెప్పుకుందాం. దిశపై అత్యాచారం జరిపినవాళ్లను ఏం చేయాలి? ‘చంపేయాలి’. ‘ఎన్‌కౌంటర్‌’ చేయడంతో రగిలిన హృదయాలు శాంతించాయి. అయితే ఇది చట్టం చేసింది. ‘రాఖీ’ (2006) సినిమాలో రాకీ (ఎన్టీఆర్‌) చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు. అత్తింటివాళ్లు అతని చెల్లెలిని అమానుషంగా చంపేస్తే, తన చెల్లికి జరిగిన అన్యాయం ఏ చెల్లికీ జరగకూడదనుకుంటాడు. అత్యాచారానికి పాల్పడేవారిని వెంటాడి, పెట్రోల్‌ పోసి, నిప్పంటించేస్తాడు.

తెరపై రగిలిన ఈ మంట ప్రేక్షకుడి మనసులను చల్లబరుస్తుంది. ‘ఇలాంటి అన్న ఉండాలి’ అంటూ రాకీకి అమ్మాయిలందరూ రాఖీలు కడతారు. ఇదే ఎన్టీఆర్‌ ‘టెంపర్‌’ (2015)లో ముందు కరెప్టెడ్‌ పోలీస్‌లా కనిపించి, ఆ తర్వాత పరివర్తన చెందుతాడు. కామాంధుల చేతిలో బలైపోయిన యువతికి న్యాయం చేయడానికి సాక్ష్యాలు సాధిస్తాడు. కానీ సాక్ష్యం తారుమారవుతుంది. ఇక చేసేదేం లేక కోర్టు బోనులో నిలబడి, ‘ఆ అమ్మాయిపై అత్యాచారం చేసినవాళ్లల్లో నేనూ ఉన్నానంటాడు. మమ్మల్ని శిక్షించండి’ అంటాడు. ఆ సీన్‌ చాలా ఉద్వేగభరితంగా ఉంటుంది. నేరం చేయని ఎన్టీఆర్‌ నిందితులతో పాటు జైలుపాలవుతాడు. కానీ
జైలులో దుష్టశిక్షణ చేస్తాడు.

►ఓ 30 ఏళ్లు వెనక్కి వెళ్లి పోలీసాఫీసర్‌ వైజయంతిని గుర్తు చేసుకుందాం. నిజాయతీకి చిరునామా అయిన వైజయంతి అత్యాచారానికి గురైన యువతికి న్యాయం చేయడానికి పడే తపనతో రూపొందిన చిత్రం ‘కర్తవ్యం’ (1990). ఇందులో వైజయంతి పాత్ర చేశారు విజయశాంతి. యువతికి న్యాయం చేయడానికి ఆర్థిక బలం ఉన్న పెద్దవాళ్లను ఢీ కొంటుంది వైజయంతి. అత్యాచారం చేసిన ఆ యువకుడితోనే యువతి మెడలో తాళి కట్టిస్తుంది. అయితే? అత్యాచారం చేసినవాడిని పెళ్లాడాలా? అలాంటి వక్రబుద్ధి ఉన్న వ్యక్తితో జీవితం పంచుకోవాలా? అనేది నేటి ప్రశ్న. 30 ఏళ్ల క్రితం నాటి పరిస్థితులకు ఆ క్లైమాక్స్‌ కరెక్ట్‌ అని చెప్పొచ్చు. ఆ సంగతలా ఉంచితే.. తెరపై వైజయంతి చూపించిన తెగువ ఎందరో స్త్రీలకు ఆద ర్శం. ప్రతి స్త్రీ పోలీస్‌ కానక్కర్లేదు. కానీ వైజయంతిలా ధైర్యంగా ఉండాలి. అలాంటి ధైర్యసాహసాలనే ప్రదర్శిస్తుంది ‘ఆమె’ (1994)లో సుధ పాత్ర. మధ్యతరగతి గృహిణి ఆమె.

కోడలిపై కన్నేసిన భర్తను నరికి, కోడలిని కూతురిగా చేసుకుంటుంది. ప్రేక్షకులు ‘భేష్‌’ అన్నారు. ‘పెళ్లి’ (1997) సినిమా కూడా దాదాపు ఇలాంటిదే. కోడలిని హింస పెట్టే కొడుక్కి విషం పెట్టి, చంపేస్తుంది సుజాత. కోడలికి వేరే పెళ్లి చేస్తుంది. ఒక స్త్రీ ఇంకో స్త్రీని అర్థం చేసుకోవాలన్నది ఈ సినిమాలు చెప్పే సందేశం. తప్పు చేసినది భర్త అయినా, కొడుకు అయినా శిక్షించాల్సిందే అనే మనస్తత్వం ఉన్న ఆడవాళ్లు సమాజంలో ఉంటే సగం నేరాలు తగ్గుతాయేమో! అలాంటి ఆడవాళ్లు సమాజంలో ఉన్నారు.. కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ‘మా  పిల్లల్ని చంపేయండి’ అని బహిరంగంగా చెప్పిన తల్లిదండ్రులూ ఉన్నారు.

►ఇక సాటి స్త్రీని అర్థం చేసుకోనివాళ్లు కూడా సమాజంలో ఉంటారు. ఆ విషయాన్ని ‘పెళ్లి చేసుకుందాం’ (1997) కళ్లకు కట్టినట్లు చూపించింది. అందులో సౌందర్య అత్యాచారానికి గురైతే చుట్టుపక్కల ఆడవాళ్లే హేళన చేస్తారు. అందుకే ‘నువ్వేమి చేశావు నేరం.. నిన్నెక్కడంటింది పాపం’ అని ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి కలం ఆ యువతిని వెనకేసుకొచ్చింది. నిజమే.. అత్యాచారం చేసినవాడు దుర్మార్గుడు. అత్యాచారానికి గురైన యువతి నిస్సహాయురాలు. అందుకే ఆ సినిమాలో సౌందర్యను చేరదీస్తాడు హీరో వెంకటేశ్‌.

►ఇక నేరం చేసినవాడికి ఏ శిక్షా పడకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో చెప్పడానికి ‘పరుత్తివీరన్‌’ (2007) ఒక ఉదాçహరణ. తెలుగులో ‘మల్లిగాడు’ పేరుతో విడుదలైంది.  హీరో కార్తీకి ఇది మొదటి సినిమా. ప్రియమణి అప్పటికే కొన్ని సినిమాలు చేసింది. అల్లరి చిల్లర బ్యాచ్‌తో ఆవారాగా తిరుగుతాడు పరుత్తివీరన్‌ (కార్తీ). ఇంటర్‌ చదువుతుంటుంది ముత్తళుగు (ప్రియమణి). ఇద్దరూ ప్రేమలో పడతారు. చివరికి ప్రియుడి అల్లరి చిల్లర బ్యాచే ఆమె పాలిట కీచకులవుతారు. అత్యాచారం చేస్తారు. చనిపోతుంది. పరుత్తివీరన్‌ పిచ్చివాడైపోతాడు. ఇది క్లైమాక్స్‌. మరి.. అత్యాచారం చేసినవాళ్లు? అంటే.. దర్శకుడు వారి గురించి ప్రస్తావించలేదు. కానీ శిక్ష పడాలని ప్రేక్షకులు కోరుకుంటారు. అది సహజమే కదా. నేరం చేసినవాళ్లకు బతికే అర్హత ఉంటుందా? ఆ కథకు చిత్రదర్శకుడు అమీర్‌ ఆ ముగింపు ఇచ్చాడు. కానీ, మోసం చేసిన స్నేహితులను వదిలిపెట్టకూడదని దర్శకుడు సుకుమార్‌ తాను రాసిన కథలో శిక్ష విధించారు.

పల్నాటి సూర్య ప్రతాప్‌ దర్శకత్వం వహించిన ‘కుమారి 21 ఎఫ్‌’ (2015)కి సుకుమార్‌ కథ అందించి, నిర్మించిన విషయం గుర్తుండే ఉంటుంది. కుమారి (హెబ్బా పటేల్‌)ని ప్రేమిస్తాడు సిద్ధు (రాజ్‌ తరుణ్‌). ఫ్రీ బర్డ్‌లా ఉండే ఆ అమ్మాయి గురించి స్నేహితులు అనుమానం వ్యక్తం చేస్తారు. ఎక్కడో మూల సిద్ధూకి కూడా అనుమానం ఉంటుంది. అయితే అనుమానించాల్సింది స్నేహితులను. చివరికి స్నేహితులే కుమారిపై అత్యాచారం జరుపుతారు. అంతే.. వారిని నరమానవుడు లేని చోట బంధించి, రోజూ ఆహారం తీసుకెళ్లి, వారికి పెట్టి మరీ కొడుతుంటాడు. ఈ చిత్రహింసలు భరించలేమని, ఒకేసారి చంపేయమని వేడుకుంటారు స్నేహితులు. చిత్రహింసలకు గురవుతున్న వారిని చూసి ప్రేక్షకులకు పైశాచికానందమే కలుగుతుంది. ‘ఒకేసారి చంపేస్తే ఏం ఉంటుంది? ఇలా కదా చంపాలి’ అన్నది నేడు సమాజంలో చాలామందికి ఉన్న అభిప్రాయం. అవును.. అమ్మాయి పడిన వేదన ఎలా ఉంటుందో కిరాతకులకు చూపించాలి కదా.

సిద్ధూకి జరిగినట్లే గుణకూ జరుగుతుంది. నమ్మిన స్నేహితుడే గుణ ప్రేయసికి ద్రోహం చేస్తాడు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాతో ఫుల్‌ క్రేజ్‌ తెచ్చుకున్న కార్తికేయ నటించిన చిత్రం ‘గుణ 369’ (2019). ఏడుగురు కిరాతకుల చేతిలో బలైపోతుంది గుణ ప్రేయసి. ఆ ఏడుగురికీ గుణ ప్రాణ స్నేహితుడు అండగా ఉంటాడు. ప్రేయసికి జరిగినది తెలుసుకున్నాక గుణ రగిలిపోతాడు. ఒకరి చేతులు నరుకుతాడు. ఒకరి కాళ్లు నరికేస్తాడు. ఇంకొకరి తలను నరుకుతాడు. మరో స్నేహితుడి కాళ్లూ, చేతులూ రెండు తీసేస్తాడు. తెరపై దాదాపు పది నిమిషాల పాటు ఈ మారణకాండ సాగుతుంది. గుణ చేసిందే కరెక్ట్‌ అంటారు ప్రేక్షకులు. ‘‘దిశ ఘటన తర్వాత ‘గుణ 369’లోని క్లైమాక్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. నా ఫేస్‌తో ఆ వీడియో వైరల్‌ అవుతోంది. నేను మాత్రం ఓ ట్వీట్‌ వేసి ఏం చేయలేకపోయానే అని గిల్టీగా ఫీలయ్యాను’’ అన్నారు కార్తికేయ.

►ఇలా ఎన్నో సినిమాల్లో ‘అత్యాచారాలు’ జరగడం, హీరో లేదా హీరోయిన్‌ ప్రతీకారం తీర్చుకోవడం చూశాం. ప్రతి స్త్రీ తన జీవితానికి తానే ‘హీరోయిన్‌’ అవ్వాలి. ఎవరో వస్తారు? కాపాడతారు? అనుకోకుండా ‘నా రక్షణ నేనే’ అనే భావన పెంచుకోవాలి. తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలకు అలా చెప్పే పెంచాలి. అమ్మాయిలూ... మీ బ్యాగుల్లో పెట్టుకోవాల్సింది ‘ఫేస్‌ పౌడర్‌’ కాదు.. ‘మిర్చి పౌడర్‌ (కారప్పొడి), బాడీ స్ప్రే కాదు.. ‘పెప్పర్‌ స్ప్రే’. ఇవి ఉంటే చాలదు.. ఆపదలో ఇరుక్కున్నప్పుడు సమయస్ఫూర్తితో స్పందించి, 100కి డయల్‌ చేయండి. ఇతర హెల్ప్‌లైన్లు ఉన్నాయని మరచిపోకండి. వీలైనంతవరకూ పోరాడండి. అయితే పోరాడే పరిస్థితులు రాకూడదు. మళ్లీ గాంధీ మాటలను గుర్తు చేసుకుందాం. ఆడది అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరగగలిగినప్పుడే అసలైన స్వాతంత్య్రం వచ్చినట్లు అన్నారు గాంధీ. ఆ రోజు రావాలని కోరుకుందాం.
– డి.జి. భవాని

దుష్టులు ‘నిమజ్జనం’ కావాలి

అత్యాచారానికి గురైతే జీవితం అంతమైపోయినట్లే? ఒకప్పటి సమాజం ఆలోచన ఇలానే ఉండేది. అందుకే ఇక బతకడం అనసవరమని ఆత్మహత్య చేసుకుంటుంది ‘నిమజ్జనం’ సినిమాలో భారతి (శారద). సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువతి ఆమె. మామగారి అస్థికలను నిమజ్జనం చేసేందుకు భర్తతో కాశీ వెళుతుంది. అయితే బండి నడిపేవాడికి ఆమెపై కన్ను పడుతుంది. భర్త లేని సమయం కోసం చూసి, ఒంటరిగా ఉన్న భారతి పై అత్యాచారం చేస్తాడు బండివాడు. భర్తకు మొహం చూపలేక గంగా నదిలో ఆత్మార్పణం చేసుకుంటుంది భారతి. బండివాడికి పశ్చాత్తాపం మొదలవుతుంది. భారతి ఆత్మహత్యకు తానే కారణం అని ఆమె భర్తకు చెప్పి, ఎక్కడైతే భారతిని బలాత్కారం చేశాడో అక్కడే ఆత్మహత్య చేసుకుంటాడు. పశ్చాత్తాపంతో అతను చనిపోయాడు. క్షణికావేశం తప్పులు చేయిస్తుంది. నిండు జీవితాలను బలి తీసుకుంటుంది. అందుకే తప్పు చేసే ముందు దాని ప్రభావం గురించి ఆలోచించాలి.

అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే.. అత్యాచారానికి గురైతే బతికే అర్హత లేదా? ‘‘కానే కాదు’’ అంటారు శారద. ఆమె మాట్లాడుతూ– ‘‘అత్యాచారానికి గురైన స్త్రీ ఎందుకు చనిపోవాలి? అప్పటి ‘నిమజ్జనం’ కథలో ఆ తీర్పు ఉంది కాబట్టి.. అలా జరిగింది. కానీ మన జీవితానికి రచయితలం మనమే. మన తప్పు లేనప్పుడు ఎందుకు చనిపోవాలి? అత్యాచారానికి గురైన స్త్రీలను చిన్న చూపు చూడకూడదు. వాళ్లను బతకనివ్వాలి. ఆ సంగతి అలా ఉంచితే.. మొన్న దిశ విషయంలో దేశవ్యాప్తంగా ఆడవాళ్లందరూ న్యాయం కోరి నడుం కట్టిన తీరు అభినందనీయం. ఈ కట్టు ఇలానే బలమైనదిగా ఉండాలి. దిశ న్యాయం కోసం గొంతెత్తిన స్త్రీలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇవాళ ఇన్ని గొంతులు మాట్లాడాయి కాబట్టి దిశపై అమానవీయ చర్యకు పాల్పడినవారికి శిక్ష పడింది. వాళ్లను అలా కాల్చి పారేయడం కరెక్ట్‌’’ అన్నారు.

మంచి మామ్‌

సవతి తల్లి అంటే కచ్చితంగా సరిగ్గా చూడదనే అభిప్రాయం సమాజంలో బలపడింది. అయితే దేవకిలాంటి మంచి సవతి తల్లి కూడా ఉంటుందని చెప్పిన సినిమా ‘మామ్‌’ (2017). దేవకి (శ్రీదేవి) ఓ స్కూల్‌ టీచర్‌. సవతి తల్లి దేవకి అంటే ఆర్యకు ఇష్టం ఉండదు. అనుకోని పరిస్థితుల్లో ఆర్య అత్యాచారానికి గురవుతుంది. అది తెలుసుకుని దేవకి తల్లడిల్లిపోతుంది. తప్పుడు సాక్ష్యాలతో నిందితులు తప్పించుకుంటారు. అప్పుడు దేవకి వాళ్లను శిక్షించే పనిని చేతుల్లోకి తీసుకుంటుంది. సామూహిక అత్యాచారానికి పాల్పడినవారిని ఒక్కరొక్కరిగా ప్లాన్‌ చేసి తెలివిగా చంపుతుంది. చనిపోయిన వ్యక్తి తాలూకు న్యూస్‌ టీవీలో వచ్చినప్పుడు ఆర్య కళ్లల్లో మెరుపు కనిపిస్తుంది. చివరికి దేవకియే అంతా చేసిందని తెలుసుకుని ‘మామ్‌’ అని అప్పుడు పిలుస్తుంది. అందాల రాశి, అద్భుతమైన నటి శ్రీదేవి నటించిన చివరి చిత్రం ‘మామ్‌’. ఇది ఆమెకు 300వ చిత్రం.

వాళ్లే నిజమైన హీరోలు

నయనతార నటించిన మలయాళ చిత్రం ‘పుదియ నియమమ్‌’ (2016). ‘వాసుకి’ పేరుతో తెలుగులో విడుదలైంది. భర్త, కుమార్తెతో కలిసి హాయిగా జీవితం సాగిస్తుంది వాసుకి (నయనతార). ఓ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌లో ఉంటుందీ కుటుంబం. అదే అపార్ట్‌మెంట్‌లో ఇస్ట్రీ బట్టలు చేసే వ్యక్తి, ఇద్దరు ఆకతాయి కుర్రాళ్లు నయనతారను రేప్‌ చేస్తారు. భర్తకు చెప్పుకోలేక కుంగిపోతుంది. తనకు అన్యాయం చేసినవాళ్లు కళ్లెదుటే దర్జాగా తిరుగుతుంటే తట్టుకోలేకపోతుంది. ఆ సమయంలో సరిగ్గా దీపిక అనే పోలీసాఫీసర్‌ సహాయం దొరుకుతుంది వాసుకికి. ఆమె సహాయంతో ఆ ముగ్గుర్నీ చంపుతుంది. అయితే పోలీసాఫీసర్‌గా గొంతు మార్చి, భర్తే (మమ్ముట్టి) వాసుకికి సహాయం చేస్తాడన్నది క్లైమాక్స్‌.

‘శీలం పోగొట్టుకున్న భార్య’ అంటూ వెలివేయకుండా తానే సహాయం చేస్తున్న విషయాన్ని బయటపెట్టని హుందా భర్త అతను. సమాజంలో ఇలాంటి భర్తలు ఉంటారా? ఉండొచ్చేమో. ఇక దిశ ఘటనపై నయనతార స్పందిస్తూ – ‘‘సినిమాల్లో కనిపించే కొన్ని ఘటనలను నిజం చేసిన నిజమైన హీరోలు తెలంగాణ పోలీసులు. దోషులు శిక్షింపబడిన రోజును నిజమైన న్యాయం చేకూరిన రోజుగా దేశంలోని మహిళలందరూ గుర్తుపెట్టుకోవాలి. న్యాయం చేకూరిందని మనమందరం ఆనందించే కన్నా ఇలాంటి పరిస్థితులపై మన పిల్లలను చైతన్యపరచాలి. ఎడ్యుకేట్‌ చేయాలి. ముఖ్యంగా అబ్బాయిలను.. మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించినప్పుడే మగవారు నిజమైన హీరోలు అవుతారని వారికి చెప్పాలి’’ అన్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top