శారీ స్కూల్లో చేరుదామా!

special  story to  saree  - Sakshi

ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌

చాలా ఏళ్లకు పూర్వం చీరను ఆడవారు, మగవారు ఇద్దరూ ధరించేవారు. రానురాను చీర అనే పదం ఆడవారు  కట్టుకునే వస్త్రంగా మారిపోయింది.

చీర కట్టు అంటే కేవలం చీర కట్టేనా?అందులో ఎన్ని రకాలు?తమిళ కట్టు, అస్సామీ కట్టు, గుజరాతీ కట్టు, మార్వాడీ కట్టు, బెంగాలీ కట్టు, తెలుగు కట్టు... ప్రతి ప్రాంతానికి ఈ చీరకట్టు ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తుంది. ఒకప్పుడు పండుగలు, శుభకార్యాల సమయంలో పెద్దవాళ్లు కచ్చాపోసి చీర కట్టేవారు. అంటే రెండు కాళ్ల మధ్య నుంచి తిప్పుతూ కట్టేవారు. ప్రస్తుతం ఆ చీర కట్టు బాగా తగ్గిపోయింది. అంతేనా?... అసలు చీర కట్టే తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే చీరలకు గత వైభవం తీసుకురావాలనుకున్నారు బెంగాల్‌కు చెందిన దబోండిని టాగూర్‌. బెంగాల్‌లో స్త్రీ సాధికారత కోసం పాటుపడుతున్నా దబోండిని బీరువాలో వెనక్కు వెళ్లిపోయిన చీరలను మళ్లీ ముందుకు తీసుకురావాలని సంకల్పించారు.  ఏడు గజాల చీరలు లేదా తొమ్మిది గజాల చీరల సంస్కృతిని ఒక ఫ్యాషన్‌గా ప్రచారం చేస్తున్నారు. చీర కట్టును పైజమా మోడల్‌లో రెడీమేడ్‌గా కుట్టి ధరించే పద్ధతిని ప్రచారం చేస్తున్నారు. వీటిని కట్టుకోవడం వల్ల ఫెమినైన్‌ అప్పీల్‌ ఉంటోందని, కట్టుకోవడం సులువుగా ఉంటోందని చెబుతున్నారు అమ్మాయిలు. టాగూర్‌ కృషితో చాలామంది ఆధునిక మహిళలు పైజమా మోడల్‌లో చీరలు కట్టుకుంటున్నారు. 

కలిసిన చేతులు
పుణేకు చెందిన నికాయతా అనే పారిశ్రామికవేత్త దబోండినితో చేతులు కలిపారు. చీరకు ప్రచారం తేవడానికి ముందుకు వచ్చి తొమ్మిది గజాల చీరను రెడీమేడ్‌గా కట్టుకుని ఆ కట్టుకు ప్రచారం తేవడం ప్రారంభించారు. ఆధునిక వస్త్రధారణ కేవలం వందేళ్లుగా వచ్చిన విధానం కాని చీర కట్టు వందల ఏళ్లుగా ఉందని అంటారామె. ఇలాంటి వారిని చూసి దబోండిని మరింత ఉత్సాహంగా ముందుకు అడుగులు వేస్తున్నారు. మూడు నాలుగు సంవత్సరాలుగా ‘ఇండియన్‌ డ్రేపింగ్‌ కంపెనీ’ ద్వారా అనేక వర్క్‌షాపులు నిర్వహిస్తున్నారు. చరిత్రలో మన చీరల విధానం చూపిస్తూ, ప్రతి వర్క్‌షాపులోనూ, చీరల వస్త్రధారణ గురించి వివరిస్తున్నారు. 

అన్ని ప్రాంతాల రీతులు
చీరకట్టును అధ్యయనం చేయడానికి దబోండిని టాగూర్‌ దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ఆయా ప్రాంతాల చేనేతలు, కట్టువిధానం గురించి తెలుసుకుంటున్నారు. ఏ వాతావరణానికి ఏ వస్త్రాలు ధరిస్తున్నారో పరిశీలించారు. భారతదేశ వ్యాప్తంగా ఎన్నో అందమైన చీరకట్లు ఉన్నాయి అంటారామె. కేవలం శుభకార్యాల సమయంలో మాత్రమే కాకుండా, నిత్యం ధరించడానికి ఆసక్తి చూపేలా వీటిని చేయాలనుకుంటున్నారు టాగూర్‌. ప్రస్తుతం పట్టణాలలో మహిళలు కేవలం వివాహాది శుభకార్యాలలో మాత్రమే చీరలు ధరిస్తున్నారు. వీరిని ఆకర్షించడమే టాగూర్‌ ప్రధాన ఉద్దేశం. నికాయతా కూడా ఈ విషయాన్ని నలుగురిలోకి తీసుకురావాలని నిశ్చయించుకున్నారు.  భారతదేశంలో అనాదిగా చీరను శుభకార్యాలలో తప్పనిసరిగా ధరించేవారు. గిరిజన మహిళలు కట్టెల కోసం అడవులకు వెళ్లే సమయంలో చీరను గోచీలా కట్టి, భుజాల మీద ముడి వేసి కట్టేవారు.  తీర ప్రాంత మత్స్యకారులు పొట్టిగా ఉండే రెండు వస్త్రాలు, పైన ఒకటి, కింద ఒకటి సముద్రంలో తేలికగా కదలడానికి అనువుగా ధరించేవారు. ఇవన్నీ కొంచెం తీర్చిదిద్దుకుంటే మంచి ఫ్యాషన్‌గా మారతాయని దబోండిని, నికాయతాల అభిప్రాయం.  ప్యాంట్, షర్టు వేసుకునేంత స్పీడుగా చీరను కట్టుకునే విధంగా వాటిని రెడీమేడ్‌గా కుట్టి అందుబాటులో ఉంచాలని వీరి ప్రయత్నం. స్కర్ట్‌ వేసుకున్నంత తేలికగా చీరను ధరించేలా రూపొందిస్తున్నారు. ‘మన సంప్రదాయాన్ని విడిచిపెట్టకుండా, ఆధునికతను మేళవిస్తూ చీర కుట్టకునేలా మోటివేట్‌ చేస్తున్నాం’ అంటున్నారు  నికాయతా. 

‘ఫేర్‌వెల్, శుభకార్యాలు వంటి సమయాలలో మాత్రమే నేను చీరకట్టుకునే దానిని. 2016లో వివాహం అయ్యాక, చీర కట్టుకోవడానికి చాలా తిప్పలు పడ్డాను. ప్రతిసారీ ఎవరో ఒకరి సహాయంతో చీరకట్టుకోవడం రానురాను సిగ్గు వేసింది. అందుకే 14 రోజుల పాటు చీర కట్టుకోవడం దీక్షగా నేర్చుకున్నాను. అంతేనా చీరకట్టులో మాస్టర్‌ అయిపోయాను’ అంటున్న నికాయతా, టాగూర్‌ ప్రభావంతో రకరకాల చీర కట్టు విధానాల మీద పరిశోధన ప్రారంభించారు. ఇప్పుడు ఎక్కడకు వెళ్లాలన్నా, రెండు నిమిషాలలో చీర ధరిస్తున్నారు నికాయతా. ఆమె చేసిన నిరంతర పరిశోధనకు ఫలితంగా, ‘శారీస్‌ ఆఫ్‌ ఇండియా’ పుస్తక రచయిత, పరిశోధకురాలు అయిన ఆర్‌టీఏ కపూర్‌ చిస్టీ శారీ స్కూల్‌ వర్క్‌షాపులో ప్రసంగించారు.‘మూడువారాల పాటు నిర్వహించిన వర్క్‌షాపులో యువతులు ఆసక్తిగా వచ్చి పాల్గొన్నారు. ఎంతో కొంత నేర్చుకున్నారు. వారిలో ఆత్మవిశ్వాసం పెరిగింది, ధైర్యంగా చీర కట్టుకోవడం మొదలుపెట్టారు’ అంటారు నికాయతా.దబోండిని, నికాయతా లాంటి చీర అభిమానులు, ఆర్‌టీఏ కపూర్‌ చిస్టీ వంటి రచయితలు చీరకు కల్పిస్తున్న ప్రచారం తీసిపారేయదగ్గది కాదు.ప్రతిదీ తిరిగి వస్తుంది.ఫ్యాషన్‌లో పాతదే కొత్తగా అవతరిస్తుంది. ఇవాళ చీర కొత్త ఫ్యాషన్‌ పుంతను తొక్కడం ఆనందించాల్సిన విషయమే. 
  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top