డీడీ కెమెరాకు లేడీ లెన్స్‌

special story to camera women - Sakshi

ఇంకొక గాజు తెరను మహిళలు భళ్లున బద్దలు కొట్టారు!  ‘లైన్‌మన్‌’ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి  కోర్టు నుండి ఆదేశాలు తెచ్చుకున్నారు. విద్యుత్‌శాఖలోని  2,553 జూనియర్‌ లైన్‌మన్‌ ఉద్యోగాల కోసం  తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 16న నోటిఫికేషన్‌  విడుదల చేసింది. అయితే కేవలం పురుష అభ్యర్థుల  దరఖాస్తులను మాత్రమే స్వీకరించే విధంగా ఆ సాఫ్ట్‌వేర్‌  తయారై ఉండటంతో మహిళలు దరఖాస్తు చేసుకునే  అవకాశం లేకుండా పోయింది. దీనిపై మహిళా  అభ్యర్థులు కోర్టుకు వెళ్లి, దరఖాస్తుకు అనుమతి  తెచ్చుకున్నారు (దరఖాస్తుకు ఇవాళ్టితో గడువు ముగుస్తోంది). ఈ నేపథ్యంలో... ముప్పై ఏళ్ల క్రితమే  ‘మెన్‌’ పోస్టుల సామ్రాజ్యంలోకి తన అప్లికేషన్‌ని  బాణంలా సంధించిన ఓ కెమెరా ఉమన్‌  ఇన్‌స్పైరింగ్‌ స్టోరీ ఇది.

‘మెన్‌’ అనే పేరున్న పోస్టుకి అప్లై చేసుకుంది! దూరదర్శన్‌లో చేరి, కెమెరాఉమన్‌గా క్లిక్‌ అయింది. మనిషికి జెండర్‌ గానీ, పనికి జెండర్‌ ఏంటీ అంటూ...మూడు దశాబ్దాలుగా వీక్షకులకు విశ్వదర్శనం చేయిస్తోంది జయశ్రీ పూరి.

ముప్పై రెండేళ్లనాటి మాట! అప్పుడామె వయసు 23. దరఖాస్తు చేసిన ఉద్యోగం పేరు కెమెరామన్‌. అప్పటి వరకు మన దేశంలోని  ఆ పోస్టులో ‘ఉ’ అనే అక్షరం లేదు. ఆ రంగం మగవాళ్లదే. అందుకే ఆ ఉద్యోగం పేరు ‘కెమెరామన్‌’. నోటిఫికేషన్‌లో కూడా కెమెరామన్‌ పోస్టుకు ఇంటర్వ్యూ అనే ప్రచురించారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్‌ అయిన తర్వాత ఆమెకు ఆఫర్‌ లెటర్‌ ఇచ్చేటప్పుడు తలెత్తింది సందేహం. ఒకఉమన్‌కి ‘కెమెరామన్‌’ డిజిగ్నేషన్‌ ఇవ్వవచ్చా? అని. అదేమీ పట్టించుకోలేదు జయశ్రీ పూరి. ఆఫర్‌ లెటర్‌ రాగానే వెళ్లి దూరదర్శన్‌లో కెమెరాఉమన్‌గా ఉద్యోగంలో చేరారు జయశ్రీ పూరి. 

అసలేమీ తెలియకుండానే!
‘‘ఆ ఇంటర్వ్యూకి ఒక అమ్మాయి రావడాన్ని ఆశ్చర్యంగా చూశారు ఇంటర్వ్యూ బోర్డులో ఉన్న వాళ్లు. వాళ్లను అంతకంటే ఆశ్చర్యపరిచిన విషయం.. నా సమాధానం. ‘నీకు కెమెరా గురించి క్షుణ్ణంగా తెలుసా?’ అని అడిగారు. ‘నాకేమీ తెలియదని, నేర్చుకోవాలనే కోరిక బలంగా ఉందని, నేర్చుకుని నైపుణ్యంతో పని చేస్తాననీ’ చెప్పాను. ‘నువ్వేం చదివావు?’ అని అడిగారు నా సర్టిఫికేట్స్‌ చూస్తూ. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేస్తున్నానప్పటికి. నా చదువుకు సంబంధం లేకపోయినా, పేపర్‌లో వచ్చిన ప్రకటన చూసి ఆసక్తితో వచ్చానని చెప్పాను. ఉద్యోగం ఇచ్చారు’’ అని అప్పటి రోజుల్ని గుర్తు చేసుకుంటారు జయశ్రీ. ఇప్పుడామెకి 55 ఏళ్లు. ఉద్యోగంలో చేరిన తొలి రోజులను ఎవరు మాత్రం మర్చిపోగలరు? ‘‘నాకు ఈ ఫీల్డ్‌ అస్సలే తెలియదు. ఉత్సాహం కొద్దీ కెమెరాతో పనిచేయడంలో ట్రైనింగ్‌ తీసుకుని ఉద్యోగంలో చేరిపోయాను. స్టూడియోలో అడుగుపెట్టిన తొలి క్షణాలు నాకు ఇప్పటికీ గుర్తే. హాలీవుడ్‌ సినిమా సెట్టింగ్‌కంటే తక్కువగా ఏమీ లేదనిపించింది’’ అంటారీ కేరళ కెమెరాఉమన్‌.

పది కిలోల బరువైన ఉద్యోగం
ఇరవై మూడేళ్ల అమ్మాయి, సన్నగా, నాజూగ్గా ఉన్న అమ్మాయి సుమారు పది కిలోల వీడియో కెమెరాతో కుస్తీ పడుతుంటే కొందరు ముచ్చటగా చూసేవాళ్లు. మరికొందరు జాలి చూపేవారు. ఆ కెమెరా బరువును తాము మోస్తూ ఆ అమ్మాయికి కొంచెం రిలీఫ్‌ ఇద్దాం అనుకున్న వాళ్లూ ఉండి ఉంటారు. రకరకాల సానుభూతులు వ్యక్తం అయ్యేవి. అయితే ‘షేమ్‌’ అన్న  మాటను జయశ్రీ ఊహించలేదు. ఆ మాట విన్న రోజును మర్చిపోలేనంటారామె.సులభ్‌ ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపకుడిని ఇంటర్వ్యూ చేయాల్సిన అసైన్‌మెంట్‌ అది. జయశ్రీతో పాటు మరో అసిస్టెంట్‌ కూడా ఉన్నాడు. ఇంటర్వ్యూ ఇచ్చే పెద్దాయనకు ఓ పీఆర్‌వో కూడా ఉన్నాడు. పెద్దాయనకు సమయం ఎంతో విలువైనది. ఆ సమయంలో తమకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఎప్పుడు వీలవుతుందో తెలుసుకోవాలి. అది తెలుసుకోవడానికే పీఆర్‌వో వెంట నడుస్తూ ఉన్నారు జయశ్రీ, ఆమె అసిస్టెంట్‌ కెమెరామన్‌. అతడితోపాటు లిఫ్ట్‌లో అడుగుపెట్టింది జయశ్రీ. ఆమె కెమెరా.. అసిస్టెంట్‌ కెమెరామన్‌ దగ్గరే ఉంది. అతడు లిఫ్ట్‌ బయటే ఉన్నాడు. అప్పుడు అడిగాడు పిఆర్‌వో.. కెమెరాపర్సన్‌ ఎవరు అని. నేనే అంది జయశ్రీ. ‘షేమ్‌’ అని అన్నాడతను! ఆ మాట ఆమెను బాణంలా తాకింది. షేమ్‌ అనడంతోపాటు మరోమాట కూడా అన్నాడా పిఆర్‌వో. ‘‘చూడండి మేడమ్‌! కెమెరాపర్సన్‌కి బిడ్డలాంటిది కెమెరా. ఒక సంగీతకారుడికి సంగీతవాద్యం బరువు కాకూడదు. అలాగే మీకు కెమెరా కూడా. ముందు మీరు కెమెరాను మీ బిడ్డను ప్రేమించినట్లు ప్రేమించండి. ఆ తర్వాత మాత్రమే దాంతో మీరు అద్భుతాలు చేయగలుగుతారు’’ అన్నాడాయన. ఆ మాటలు అప్పటికి జయశ్రీని షాక్‌కు గురి చేశాయి. కానీ అవే వేద వాక్యాలు అయ్యాయి ఆమెకు. ఆ క్షణం నుంచి ఆమెను డ్యూటీలో కెమెరా లేకుండా చూసిన వారు లేరు. 

స్టాఫంతా సోదరిలా ఆదరించారు
ఇది మగవాళ్ల ప్రపంచం అనే అభిప్రాయం సహజమే. అప్పట్లో ఇన్నేసి టెలివిజన్‌ చానళ్లు లేవు, దూరదర్శన్‌ ఒక్కటే ఉండేది. ఎక్కడ ప్రోగ్రామ్‌ కవర్‌ చేయడానికి వెళ్లినా మగవాళ్లే ఉండేవారు. అలాగని మహిళ అయిన కారణంగా జయశ్రీపై ఎటువంటి వివక్షా ఉండేది కాదు. ఒక సోదరిలాగా ఆదరించేవారు. ‘‘ఆఫీస్‌లో అసైన్‌మెంట్‌లు వేయడంలోనూ మహిళ అయిన కారణంగా నాకు తక్కువ చేయలేదెప్పుడూ. కీలకమైన సంఘటనలు కూడా కవర్‌ చేశాను. 2004లో హిందూ మహాసముద్రంలో వచ్చిన సునామీని కవర్‌ చేశాను. నాగపట్టణమ్‌ వెళ్లి బాధితుల వ్య«థలను షూట్‌ చేశాను. రాష్ట్రపతి భవన్‌ ముందు రాజ్‌పథ్‌లో రిపబ్లిక్‌ డే పెరేడ్‌లను కవర్‌ చేశాను. ఎర్రకోట బురుజు మీద ప్రధాని ప్రసంగాలనూ కవర్‌చేశాను. వాటితోపాటు మాజీ ప్రధాని వాజ్‌పేయి నుంచి ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ వరకు వారి ప్రత్యేకమైన ఈవెంట్స్‌ను షూట్‌ చేసే అవకాశం నాకు వచ్చింది’’ అంటారు జయశ్రీ. 

కష్టపడటంలోనే అందం ఉంది
‘‘మనం ఏ ప్రొఫెషన్‌లో అడుగుపెట్టినా సరే, ఆ ప్రొఫెషన్‌ మీద ప్రేమను పెంచుకోవాలి. అందులో మన వంతుగా నూటికి నూరు శాతం అవుట్‌పుట్‌ ఇవ్వాలి. అలా శ్రమించినప్పుడు అనేక అవాంతరాలు వాటికవే దూరమై పోతాయి. మహిళలు ఈ ఫీల్డ్‌లో పని చేయడం కష్టం అంటుంటారు. ఎండలో తిరగడం వల్ల చర్మం కమిలిపోతుందని, గ్లామర్‌ పోతుందని కూడా వింటుంటాను. నా మట్టుకు నేను నా ఉద్యోగంలో చెమట చిందే వరకు పని చేయడమే అసలైన గ్లామర్‌ అనుకుంటాను’’ అన్నారు జయశ్రీ.

టెన్షన్‌ పెట్టరు.. టెన్షన్‌ పడనివ్వరు
ఉద్యోగంలో చేరిన కొద్ది నెలలకే పెళ్లి చేసుకున్నాను. నా ఉద్యోగం ఎలాంటిదో తెలుసుకునే నాతో జీవితం పంచుకున్నారు కాబట్టి నా భర్త నుంచి ఎటువంటి ఇబ్బంది రాలేదు. పైగా నేను డ్యూటీలో ఉన్నంత సేపు ఇంటి గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేకుండా నాకు సపోర్ట్‌ ఇస్తున్నారు. నేను అవుటాఫ్‌ స్టేషన్‌ వెళ్లాల్సినప్పుడు మా అమ్మాయిలిద్దరి బాధ్యత ఆయనే చూసుకుంటారు.
– జయశ్రీ పూరి, సీనియర్‌ కెమెరాఉమన్‌ 
– మంజీర

ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర సహోద్యోగినితో కలిసి  నవ్వులు చిందిస్తూ జయశ్రీ (ఎడమ వైపు) 
కలామ్‌ ఇంటర్వ్యూను షూట్‌ చేస్తున్న జయశ్రీ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top