కింది మెట్టు

Special Story About Sarayu Mohan In Family - Sakshi

కింది మెట్టు లేకుంటే.. పై మెట్టు ఎక్కలేం. కింద.. మెట్టు లేకుంటే పై నుంచి దిగలేం. ఎగువ ఎక్కువ కాదు. దిగువ తక్కువ కాదు. ‘భార్య ఒక మెట్టు కింద ఉండాలి’ అనే మాటపై ఇప్పుడు నెట్‌లో మెట్లను కూలగొట్టేస్తున్నారు! ‘యానీస్‌ కిచెన్‌’లో ఎప్పటి మాటో అది. ఇప్పుడెవరో పైకి తీసి మంటను రాజేశారు.

రెండేళ్ల క్రితం ఒక శనివారం. సాయంత్రం 7 గంటలు. అమృత టీవీలో ‘యానీస్‌ కిచెన్‌’ కార్యక్రమం మొదలైంది. అప్పటికి మూడేళ్లుగా ప్రసారం అవుతున్న ఆ కిచెన్‌ని హోస్ట్‌ చేస్తున్నది ప్రముఖ మలయాళీ నటి చిత్రా షాజీ కైలాస్‌. ఆ రోజు గెస్ట్‌గా వచ్చినవారు మరో నటి సరయు మోహన్‌. ఇద్దరి మధ్య సంభాషణ మొదలైంది. మధ్య మధ్య ఫలానా వంటను ఎలా చేయాలో ‘యానీ’ చెబుతున్నారు. చిత్ర అసలు పేరు అదే. యానీ! పెళ్లయ్యాక చిత్ర అని మార్చేశాడు భర్త. 
‘‘ఈ భర్తలు ఎందుకు ఇలా చేస్తారు?’’.. యానీ. 
‘‘ఎలా?’’.. సరయు.
‘‘వంట చెయ్యలేరు. చేసిన వంటకు పేర్లు పెడతారు’’.
నవ్వారు సరయు. ‘‘ఏం మాట్లాడకుండా తినడం కన్నా, తింటూ ఏదో ఒక మాట అనడం నయం కదా’’ అన్నారు. 
‘‘అసలు వీళ్లెందుకు భార్యాభర్త ఇద్దరూ సమానం అనుకోరు. హెల్ప్‌ చెయ్యరు. కష్టాన్ని గుర్తించరు’’.
‘‘గుర్తింపు అవసరం లేదు. వాళ్లను అలా వదిలేయడమే బెటర్‌. భార్య భర్త కన్నా ఒక మెట్ట కింద ఉంటే గొడవలే ఉండవు’’ అన్నారు సరయు. 
‘‘ఎస్, కరెక్ట్‌’’ అన్నారు యానీ.

ఇదిగో ఈ ముక్కే ఇప్పుడు సోషల్‌ మీడియాలో దుమారం రేపుతోంది. ‘‘ఒక మెట్టు కిందేమిటి! సరయు అంటే అనొచ్చు. హోస్ట్‌గారు సమర్థించడం ఏమిటి?’’. ట్రోలింగ్‌ మొదలైంది. యానీ మీద, యానీస్‌ కిచెన్‌ మీదా. ఈ లాక్‌డౌన్‌లో రెండు నెలలుగా ఆ ప్రోగ్రామ్‌ రావడం లేదు. లాక్‌డౌన్‌ తర్వాత కూడా రావడానికి లేదని డిమాండ్‌లు ట్వీట్‌ అవుతున్నాయి. మరి ఆరోజే ఎందుకు ఎవరూ ఏమీ అనలేదు.. రెండేళ్ల క్రితం! ఎవరూ సీరియస్‌గా తీసుకుని ఉండకపోవచ్చు. ఇప్పుడెవరో దానిని బయటికి తీసి రాజేశారు. గత వారం రోజులుగా తమపై వస్తున్న విమర్శలకు సరయు మాత్రం స్పందించారు. అప్పటికీ ఇప్పటికీ తన ఆలోచనా తీరు మారింది అన్నారు. భార్యాభర్త సమానం అన్నారు. యానీ మాత్రం ఈ విమర్శలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు లేరు. ‘యానీస్‌ కిచెన్‌’కి గృహిణుల్లో మంచి ఆదరణ ఉంది. ఆ ఆదరణే తన సమాధానం అనుకున్నట్లున్నారు యానీ. 
యానీ కేరళ అమ్మాయి. క్రైస్తవ కుటుంబం. తల్లి మరియమ్మ. తండ్రి జాబీ. ముగ్గురు అక్కలు.. లిస్సీ, మేరీ, టెస్సీ. యానీ ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు తల్లి చనిపోయింది. యానీ తిరువనంతపురంలోని ఆల్‌ సెయింట్స్‌ కాలేజీలో చదువుకుంది. కాలేజీలో ఉండగానే సినిమా ఆఫర్‌ వచ్చింది. ఆమె తొలి చిత్రం ‘అమ్మాయనే సత్యం’ (అమ్మ మీద ఒట్టు) పెద్ద హిట్‌ అయింది. అందులో డబుల్‌ రోల్‌ యానీది. స్త్రీగా, పురుషుడిగా. రెండు మనస్తత్వాల మధ్య గీతను కాకుండా.. దంపతులను మధ్య కలతల్ని మాత్రం ఆమె చెరపదలచుకున్నట్లున్నారు. ‘యానీస్‌ కిచెన్‌’లో ఆమె ప్రబోధించే సర్దుబాటుకు అదొక్కటే కారణంగా కనిపిస్తోంది.

నేను మారాను
అవి రెండేళ్ల క్రితం నాటి అభిప్రాయాలు. ఇప్పుడు నా ఆలోచనలు మారాయి. కొత్తకొత్త స్నేహితులు, కొత్త ప్రదేశాలకు ప్రయాణాలు అందుకు కారణం కావచ్చు. భార్య భర్తకంటే ఒక మెట్టు కిందే ఉండాలి అనే మాటను వెనక్కు తీసుకుంటున్నాను. స్త్రీ అయినా, పురుషుడైనా ఆత్మగౌరవాన్ని కోల్పోకూడదు. – సరయు మోహన్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top