న్యూయార్క్‌లో తెలుగు ప్రగతి | Special Story About Pragathi Yadhati In Family | Sakshi
Sakshi News home page

న్యూయార్క్‌లో తెలుగు ప్రగతి

Jun 23 2020 12:20 AM | Updated on Jun 23 2020 5:06 AM

Special Story About Pragathi Yadhati In Family - Sakshi

షేక్‌స్పియర్‌ సంభాషణలు బ్రిటిష్‌ వాళ్లే బాగా పలుకుతారా? ఒక తెలుగు అమ్మాయి పలకలేదా? పలకగలదు అని నిరూపించింది ప్రగతి. అదీ న్యూయార్క్‌లో. అక్కడి రంగస్థలం మీద ఇప్పుడు మెరుస్తున్న సంతకం ప్రగతి. ఆమె రచయిత్రి. కవయిత్రి. నాట్యకారిణి. స్త్రీకి విధించే మూసకట్టు పరిధిని ఛేదించగలిగితే అంబరానికి ఎగరొచ్చు అని ఎగిరి చూపిస్తోంది ప్రగతి.

‘‘చదువుకున్నామా, ఉద్యోగంలో చేరామా, పెళ్లి చేసుకున్నామా.. ఈ విధంగానే చాలా మంది ఆలోచనలు సాగుతుంటాయి. నా జీవితమూ ఇంతేనా .. అనుకున్నప్పుడు నాలో ఉన్న తృష్ణ ఏంటో కనుక్కోవాలనే మథనం మొదలైంది. ఆ అన్వేషణే నన్ను న్యూయార్క్‌ థియేటర్‌ వైపు నడిపించింది’’ అంటారు ప్రగతి. నాలుగేళ్ల వయసు నుంచి భరతనాట్యం, కథక్‌ నృత్య రీతులను ఔపోసన పట్టారు. పదహారేళ్లకు అరంగేట్రమ్‌ ఇచ్చి శాస్త్రీయ నృత్యకారిణిగా పేరుతెచ్చుకున్నారు. బాలీవుడ్, టాలీవుడ్‌ సినిమాల్లోనూ నటించారు. విభిన్న అంశాలలో తన ప్రావీణ్యాన్ని వివరిస్తూ– ‘‘నేను, చెల్లెలు వెన్నెల ఏది నేర్చుకోవాలన్నా నాన్న యాధాటి కాశీపతి (సీనియర్‌ జర్నలిస్ట్‌), అమ్మ పుష్పలత అడ్డుచెప్పలేదు. న్యూయార్క్‌కి పై చదువుల కోసమే వెళ్లాను.

అక్కడ పాశ్చాత్య నృత్యరీతులైన బెల్లీ డ్యాన్స్, హిప్‌హాప్, బ్యాలె అండ్‌ జాజ్, లాటిన్‌ బాల్‌రూమ్‌ డ్యాన్స్‌.. వంటివన్నీ నేర్చుకున్నాను. ఆ సమయం లో స్నేహితుల ద్వారా అక్కడి ప్రపంచ నాటక రంగాన్ని చూసే ఛాన్స్‌ దొరికింది. అక్కడి థియేటర్‌ ఆర్ట్‌ చూశాక నా ఆలోచనలే మారిపోయాయి. ఆ కళలో ఒదిగిపోయే కళాకారులు అందులో ప్రాణం పెట్టడం చూశాను. ఎన్నాళ్లుగానో వెతుకుతున్న పెన్నిధి కాలికి తగిలినట్టనిపించింది. అంతే, మరేమీ ఆలోచించకుండా లీ స్ట్రాస్‌బెర్గ్‌ థియేటర్‌ అండ్‌ ఫిల్మ్‌ ఇన్సిట్యూట్‌లో చేరిపోయాను. ఆ తర్వాత ఎమ్‌సీఎస్‌ థియేటర్‌లో ఆర్టిస్ట్‌కి కావల్సిన మెలకువలన్నీ నేర్చుకున్నాను. న్యూయార్క్‌లో బంధువులున్నా వారికి నేనెక్కడున్నానో కూడా చెప్పలేదు. చాలా రోజులు గ్రాండ్‌ సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌లో తలదాచుకున్నాను అక్కడైతే ఖర్చు తక్కువ అవుతుందని. ఆర్థికసమస్యలు ఎప్పుడూ మనల్ని వెనకడుగు వేసేలా చేస్తాయి. కాకపోతే మన లక్ష్యం ముందు అవి ఎప్పుడూ ఓడిపోతాయి.

చేసినవీ... రాసినవీ..
న్యూయార్క్‌ థియేటర్‌ ఆర్ట్‌లో షేక్‌స్పియర్‌ నాటకాల్లో ఎక్కువ నటించాను. ఇండియాకు వచ్చే ముందు చేసిన ‘7’ అనే నాటకం నాకు బాగా గుర్తింపు తెచ్చింది. ప్రపంచంలోని ఏడు దేశాల్లోని ఏడుగురు మహిళల గాథల్ని ఈ నాటకంలో చూపించారు. అందులో 27 ఏళ్ల ముక్తార్‌మై అనే పాకిస్తాన్‌ మహిళ పాత్ర పోషించాను. ముక్తార్‌మై కొన్ని బలీయమైన పరిస్థితుల కారణంగా ఆత్మహత్య చేసుకుందామనుకుంటుంది. అలాంటి ముక్తార్‌మై నిలదొక్కుకొని అదే ఊళ్లో ఓ పాఠశాలను స్థాపించి ఆదర్శంగా నిలుస్తుంది. ఆ పాత్ర నన్ను అమితంగా ఆకట్టుకుంది. ఆ నాటకంలో నా పాత్ర చూసినవాళ్లు చాలా మెచ్చుకున్నారు. ‘సెవన్‌’ నాటకం ప్రపంచంలో మహిళల మీద ఇన్ని దారుణాలు జరుగుతున్నాయా అనే విషయాలు నాకు అర్థమయ్యేలా చేసింది. నేను రాసిన నాటకం ‘హూజ్‌ టు బ్లేమ్‌’ ఇండియన్‌ సమాజం గురించిన రాసిన స్టోరీ. మన కుటుంబాల్లో ఆడపిల్లలకు మానసిక సమస్య ఉంటే అది బయట పెట్టరు.

పిల్లలకు పెళ్లి అవదనో.. తమను అంటరానివాళ్లుగా చూస్తారనో..’ రకరకాల భయాలు. ఇప్పుడు డిప్రెషన్‌ కారణంగా సెలబ్రిటీలు సైతం ఆత్మహత్యలు చేసుకుంటున్న కథనాలు వింటున్నాం. డిప్రెషన్‌ను ఎలా డీల్‌ చేయాలో మనలో చాలా మందికి తెలియదు. రకరకాల మానసిక సమస్యలను ఎలా డీల్‌ చేయాలో ఆ నాటకంలో చూపించాను. మనసులో ఏ భావాలు కలిగినా రాయడం నాకు చిన్నప్పటి నుంచి ఓ ఆలవాటు. బహుశా మా నాన్నగారి నుంచే ఆ అలవాటు వచ్చి ఉంటుంది. అలా ఇప్పటికి చాలా కవితలు రాసాను. తెలంగాణ యాసలో ‘ఫొటో’ పేరుతో నవల రాశాను. మా పనిమనిషి కూతురు లచ్చిమి లైఫ్‌ను ఆధారంగా తీసుకొని రాసిన ఈ నవలలో కొంత ఫిక్షన్‌ జోడించాను. ఇప్పుడు నాటకం మీదే దృష్టంతా.

స్త్రీకి శరీరం మాత్రమే లేదు..
న్యూయార్క్‌లో ఆర్టిస్టుగా సెటిల్‌ అయిపోతాను అనుకున్నాను. కానీ, నాన్న చనిపోవడంతో ఇండియా వచ్చాను. అప్పుడు గతంలో నాతో ఆయన చెప్పిన మాటలన్నీ గుర్తుకు వచ్చాయి. ‘ఇండియాలో మరాఠీ, బెంగాళీయులు నాటకరంగాన్ని బతికించుకున్నారు. తెలుగులో అంత ఇంప్రూవ్‌మెంట్‌ లేదు’ అనేవారు. నాన్న మాట నిలబెట్టడం కోసం ఒంటరిగా ఉన్న అమ్మకు తోడుగా ఇక్కడే ఉండాలనుకున్నాను. ఆర్టిస్టుగా రాణించే అవకాశం ఉన్న పాత్ర రావడంతో తెలుగులో ‘స్క్రీన్‌ ప్లే’ మూవీ చేశాను. పదమూడున్నర నిమిషాల సీన్‌ని సింగిల్‌ టేక్‌లో చేశాను. మహిళల సమస్యల మీద చేసిన ఈ చిత్రం గత మార్చిలో రిలీజైంది. స్త్రీకి శరీరం మాత్రమే కాదు మెదడు, మనసు, బుద్ధి, ఆత్మ ఉంటాయి. ఈ ముఖ్యమైనవన్నీ వదిలేసి కేవలం ఇక్కడ తెరపై స్త్రీ శరీరానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వటం వల్ల చాలా మంది ఆర్టిస్టుల నటన కృత్రిమంగా, అసంపూర్ణంగా ఉంటోంది. ఒక పాత్ర పోషించటం అంటే కేవలం శరీరాన్ని చూపటమే కాదు ఆ పాత్ర ఆత్మను, అంతరాత్మను ప్రేక్షకుల ముందు పరచటం. దీని వల్ల వినోదాన్ని మించి జీవితానికి అర్థం, అందం, చెప్పలేని ఆనందం లభిస్తాయి. అలాంటి ఆనందాన్నిచ్చే ఆర్టిస్టుగా నిలిచిపోవాలన్నదే నా లక్ష్యం’’ అని ప్రగతి యాధాటి వివరించారు. – నిర్మలారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement