ఇప్పుడు డైలాగ్‌ ఆమెదే

Lady Oriented Special Movies From Bollywood - Sakshi

థప్పడ్‌ అంటే చెంపదెబ్బ. భార్యను చెంపదెబ్బ కొట్టే హక్కు భర్తకు ఉందని సమాజం అనుకుంటుంది. కానీ, చెంపదెబ్బయినా సరే ఎందుకు కొట్టాలి? అని బాలీవుడ్‌లో ఇటీవల వచ్చిన ‘థప్పడ్‌’ సినిమా ప్రశ్నించింది. పురుషాహంకారం మీద చెంపదెబ్బ కొట్టిన సినిమా ఇది. స్త్రీల తరఫున వకాల్తా పుచ్చుకునే హిందీ సినిమాలు ఇప్పుడు గొప్పగా వస్తున్నాయి.

బాలీవుడ్‌ మారింది. స్త్రీ ఆత్మగౌరవాన్ని గుర్తించింది. స్త్రీ, çపురుష సమానత్వ సాధనకు ఆలస్యంగానైనా తనవంతు పోరాటం, అవగాహన కల్పించే ప్రయత్నం మొదలుపెట్టింది. బాలీవుడ్‌లో గత రెండు దశాబ్దాలుగా వస్తున్న సినిమాలే ఇందుకు నిదర్శనం. ‘థప్పడ్‌’ తాజా ఉదాహరణ. చెంపదెబ్బతో తన పురుషాహంకారాన్ని చూపించిన భర్త నుంచి వేరు కావాలనుకుంటుంది ఈ సినిమాలోని కథానాయిక. ఆ ఒక్క చెంపదెబ్బతో తమ మధ్య ఉన్న అనుబంధాన్ని కథానాయిక ప్రశ్నించుకుంటుంది. భార్యాభర్తలు సమానంగా ఉండాల్సిన వివాహ బంధాన్ని చెంపదెబ్బతో కలుషితం చేయడం ఎందుకు? చెంపదెబ్బ కొట్టి భార్య స్థానాన్ని చులకన చేయడం ఎందుకు? ఇదేం కాపురం? తనతో సమానంగా చూడలేని భర్తతో ఒకే కప్పు కింద ఉండడం ఎందుకు? అని విడాకులు కోరుకుంటుంది తాప్సీ. అయితే మొగుడూ పెళ్లాలన్నాక కాపురమన్నాక ఇవన్నీ కామన్‌... మొగుడు కాకపోతే ఎవరంటారు.. అని ఆమె నిర్ణయం చూసి సమాజం ఆశ్చర్యపోతుంది. ‘కేవలం ఒక్క చెంపదెబ్బకు విడాకులా?’ అనే ప్రశ్నకు ‘అవును.. ఒక్క చెంపదెబ్బ కొట్టినా విడాకులే’ అని కథానాయిక తాప్సీ పాత్ర అంటుంది. గృహహింసకు ‘థప్పడ్‌’ ఒక తిరుగు జవాబు.

మారిన ధోరణి
ఇలా స్త్రీల తరఫున మాట్లాడే సినిమాలు పెరిగాయి బాలీవుడ్‌లో. నిన్న వచ్చిన ‘తుమ్హారీ సులూ’, మొన్న వచ్చిన ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’ ఇల్లాలి ఆత్మగౌరవాన్ని సమాజానికి చూపించాయి. ‘తుమ్హారీ సులూ’లో గృహిణిగా సగటు జీవితం గడుపుతున్న కథానాయికను ఏమీ చేతకాదు అంటూ దెప్పిపొడుస్తుంటారు. ఆమె రేడియో జాకీగా మారి తనను తాను నిరూపించుకుంటుంది. ఉద్యోగం పోయిన భర్తకు అదే రేడియో స్టేషన్‌లో క్యాటరింగ్‌ బిజినెస్‌ పెట్టిస్తుంది. ఈ విజయం ఆమె ఆత్మసమ్మానం. శ్రీదేవి నటించిన ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’ చెప్పిందీ అదే. ప్రేమ కన్నా స్త్రీకి ముఖ్యమైంది గౌరవమని. గౌరవం లేని ప్రేమ బానిసత్వానికి బంగారు సంకెలని. ఆ సినిమాలో ‘వంట తప్ప మీ అమ్మకేం తెలుసు?’ అంటూ పొద్దస్తమానం భర్త అవమానిస్తుంటే,  కూతురు ‘పేరెంట్‌–టీచర్‌ మీటింగ్‌కి అమ్మ వద్దు నాన్నా, తనకు ఇంగ్లిష్‌ రాదు. మా టీచర్ల ముందు నాకు ఇన్సల్టింగ్‌గా ఉంటుంది’ అంటూ తనూ అమ్మను రెండు మెట్లు కిందకు తోసి నాన్నకు కిరీటం పెడుతుంది. దీన్ని భర్త ప్రేమ, కూతురి చనువుగా తేలిగ్గా తీసుకొని హాయిగా నవ్వుకోదు ఆమె. అవమానంగా ఫీలవుతుంది. ఆ ఇంట్లో తనకెలాంటి స్థానం కావాలో చెప్పాలనుకుంటుంది. చెప్తుంది.. ఇంగ్లిష్‌లోనే!

ప్రపంచం వినాలి.. ‘ఏం కావాలి నీకు?’ 
అడుగుతుంది తల్లి తన బిడ్డను. ‘ఈ ప్రపంచమంతా నా పాట వినాలనుకుంటున్నానమ్మా’ సమాధానం ఇస్తుంది కూతురు. ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’ సినిమాలోని డైలాగ్‌ అది. ఆడపిల్లకు లక్ష్యం ఏంటి.. తలవంచుకొని అనుసరించక? ఆడపిల్లకు సంగీతం, డాన్స్‌ ఏంటి.. ఇంటిపనులు చూసుకోక? వంటి మూస ఆలోచనలతో కొట్టుకుపోతున్న తండ్రికి ఆడపిల్లా మనిషే అని చెప్పే ఓ కూతురి కథ ఈ సినిమా. ఇక ప్రోత్సహించే తండ్రులు ఉంటే ఆడపిల్లలకు ఆకాశమే హద్దు అని చెప్పిన సినిమా ‘దంగల్‌’. ఆ సినిమాలో తండ్రి తన కుస్తీ ఆటను కుమార్తెలకు పంచి వస్తాదులుగా నిలబెడతాడు. అలాగే ప్యాషన్‌ ఉంటే క్రీడలలో కృషి చేయాలనుకునే మహిళలకు పెళ్లి, పిల్లలు అడ్డంకే కాదు అని నిరూపించాయి ‘మేరీ కామ్‌’, ‘పంగా’ సినిమాలు.

‘నో’ అంటే ‘ఎస్‌’ అని కాదు
ఆడవాళ్లను సెక్సువల్‌ ఆబ్జెక్ట్స్‌గా చూపించిన ఒకప్పటి హిందీ సినిమాయే మహిళలకూ మెదడుంటుంది వాళ్ల అభిప్రాయాలకూ గౌరవమివ్వాలని గ్రహించింది నేడు. ‘పింక్‌’ లాంటి సినిమాలను నిర్మించింది. కట్టుబొట్టు తీరుతో స్త్రీని అంచనా వేయడం, జడ్జ్‌ చేయడం ఆపండి... ఆమె శరీరం మీద హక్కు ఆమెదే... భార్య అయినా, గర్ల్‌ ఫ్రెండ్‌ అయినా వేశ్య అయినా సరే.. ఒకసారి ఆమె ‘నో’ అన్నదంటే ‘నో’అనే అర్థం ..అని ‘పింక్‌’ సినిమా చెప్పింది! ఆడవాళ్ల మాటలకు వేరే అర్థాలు లేవు. కాదంటే అవునని కాదు.. స్పష్టంగా కాదు అనే.. అంటూ  సమాజం మెడలు తిప్పి మరీ చూపించిన మూవీ ‘పింక్‌’.

పరువు హత్య.. పరువు చేటు
కులం, మతం, ఆస్తి, అంతస్తును లెక్క చేయకుండా పెళ్లి చేసుకుని ‘పరువు తక్కువ పని’ చేసిందని.. అందుకు ఆమెను చంపే హక్కు తమకు ఉందని భావించే పెద్దలను తీవ్రంగా నిలదీసిన సినిమా ‘ఎన్‌హెచ్‌ 10’. అలాగే చైల్డ్‌ అబ్యూజ్‌ని మన దేశం కడుపులో పెట్టుకొని ఎలా దాచుకుంటుందో చూపించిన సినిమా ‘హై వే’!

ప్రయాణం ఆపొద్దు.. 
ఆడపిల్లకు పెళ్లే జీవిత పరమావధి కాదు. అది జీవితంలో ఒక భాగం మాత్రమే. ఒకవేళ పరిస్థితులు తలకిందులై అనుకున్నది జరక్కపోతే కుంగిపోయి నాలుగు గోడలకే పరిమితం కావాల్సిన పనిలేదు. కొత్త దారి వెదుక్కొని దర్జాగా ఆ దారెంట నడవచ్చు అని చూపిస్తుంది ‘క్వీన్‌’. ఆత్మవిశ్వాసం హ్యాండ్‌ బ్యాగ్‌లో కాదు  మైండ్‌లో ఉంటుంది.. ఆలోచనలతో బయటకు వస్తుంది.. కార్యాచరణలో కనిపిస్తుంది...అని చెప్తుందీ సినిమా. అందుకే ప్రతి మహిళ జీవితంలో ఒక్కసారైనా సోలోగా ప్రయాణించాలి అని ఈ సినిమా గురించి రాసిన రివ్యూలో చెప్పాడు ఒక రైటర్‌. ప్రయాణాన్ని మించిన పుస్తకం ఉంటుందా లోకజ్ఞానానికి! ఇవి మారిన బాలీవుడ్‌ ట్రెండ్‌కు కొన్ని ట్రైలర్స్‌ మాత్రమే. పురుషుడు వంట చేస్తే ఆర్ట్‌.. స్త్రీకైతే బాధ్యత అని ఒక సినిమాలో డైలాగ్‌. ఆర్ట్‌ అయినా.. బాధ్యత అయినా స్త్రీ, పురుషులిద్దరికీ సమానమే అన్న ప్రాథమిక సూత్రాన్ని ఆమోదించదగ్గ నిజాన్ని చూపిస్తున్న బాలీవుడ్‌కు థ్యాంక్యూ. – సాక్షి ప్రతినిధి

చపాక్‌... ఇంకొన్నిఇవి కాక స్త్రీ సాధికారతను ఫోకస్‌ చేసిన సినిమాలూ ఉన్నాయి. వారసత్వ వ్యాపారాలకు రబ్బర్‌స్టాంప్‌ యజమానులుగా కాక స్వంత శక్తితో అంట్రపెన్యూర్స్‌ కాగలరని ‘బాండ్‌ బాజా బారాత్‌’, నిశ్శబ్దాన్ని ఛేదించకపోతే నష్టపోయేది స్త్రీలే అని వర్క్‌ ప్లేస్‌ హెరాస్‌మెంట్‌ను ఎదుర్కోవడానికి మహిళలకున్న చట్టపరమైన ఆయుధాలను తెలియజెప్పిన ‘ఇన్‌కార్‌’, ‘సెక్షన్‌ 375’,  మోసాన్ని మోసంతోనే జయించాలన్న ధైర్యాన్నిచ్చే ‘ఇష్కియా’, అవతలి వ్యక్తి యాసిడ్‌తో కసి తీర్చుకున్నా మనోనిబ్బరం మసి కాలేదని నిరూపించిన ‘చపాక్‌’, సైన్యంలోనూ, దేశరక్షణ కోసం చేసే స్పైలోనూ, దేశ ప్రతిష్టను పెంచే సైన్స్‌లోనూ మహిళలు ముందున్నారని ‘రాజీ’, ‘మంగళ్‌యాన్‌’ తో చెప్పింది బాలీవుడ్‌.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top