ఒకే పంట సరికాదు! ఏ పంటైనా దిగుల్లేదు!

The same crop is not correct - Sakshi

ఏడేళ్లుగా దిగ్విజయంగా ప్రకృతి వ్యవసాయం

కరివేపాకుతో ప్రారంభించి.. దానిమ్మ, డ్రాగన్‌ ప్రూట్‌ సాగుకు విస్తరణ

కరివేపాకులో ఎకరానికి రూ. లక్షన్నర నికరాదాయం

పంటేదైనా పండుగేనంటున్న యువ రైతు శ్రీనివాసరెడ్డి

ఘనజీవామృతం, జీవామృతం, నీమాస్త్రం.. వీటితో ఏ పంటలోనైనా నిస్సందేహంగా మంచి నికరాదాయం పొందడం సాధ్యమేనా? అని అంటే.. ముమ్మాటికీ సాధ్యమేనంటున్నారు యువ రైతు శ్రీనివాసరెడ్డి. ఏడేళ్ల అనుభవం ఆయనకు ఇచ్చిన భరోసా ఏమిటంటే.. ఏదో ఒక పంటకే రైతు పరిమితం కాకూడదు. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు పంటల/తోటల సరళిని మార్చుకుంటూ వెళ్లడమే ఉత్తమ మార్కెటింగ్‌ వ్యూహమని అంటున్నారు శ్రీనివాసరెడ్డి. మార్కెట్‌ ఒడిదుడుకుల్లోనూ కరివేపాకు సాగులో.. ఏడాదికి ఎకరానికి కనీసం రూ. లక్షన్నర నికరాదాయం సాధిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఏ పంటనైనా పండించొచ్చన్న భరోసాతో ఈ యువ రైతు గొప్ప ఆశావహ జీవితాన్ని నిర్మించుకోవడంపై ‘సాగుబడి’ కథనం.

ప్రకాశం జిల్లా దర్శి మండలం చలివేంద్ర గ్రామానికి చెందిన రైతు బాదం మల్లారెడ్డి, పద్మల కుమారుడైన శ్రీనివాసరెడ్డి బీకాం చదివి మట్టినే నమ్ముకొని జీవితాన్ని పండించుకుంటున్నాడు. తాతల కాలం నాటి 18 ఎకరాల సొంత భూమిలో ఏడేళ్లుగా మనసుపెట్టి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఆచరిస్తూ ఉద్యాన పంటల్లో స్థిరమైన ఆదాయాన్ని పొందుతున్నారు. పాలేకర్‌ శిక్షణా తరగతుల్లో పాల్గొనడం.. యూట్యూబులో వీడియోలు చూడటం, ప్రకృతి వ్యవసాయ పుస్తకాలు చదవడం ద్వారా నేలతల్లి ఆరోగ్యమే రైతు, దేశ సౌభాగ్యమని గుర్తించి తదనుగుణంగా ధైర్యంగా ఏడేళ్ల క్రితమే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఐదెకరాల్లో కరివేపాకు, 11 ఎకరాల్లో దానిమ్మ, ఎకరంలో డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు చేస్తున్నారు. కివీ పండ్ల సాగుపై తాజాగా దృష్టిసారిస్తున్నారు.

కరివేపాకులో ఎకరానికి రూ. లక్షన్నర
ఎకరంలో ఏడేళ్ల క్రితం కరివేపాకు నాటి జీవామృతం, ఘనజీవామృతంతో సాగు ప్రారంభించిన తొలి ఏడాదే సత్ఫలితాలు రావడంతో క్రమంగా విస్తరించారు. ప్రస్తుతం ఐదెకరాల్లో సాగు చేస్తున్నారు. బోదె పద్ధతిలో కరివేపాకు సాగు చేపట్టిన శ్రీనివాసరెడ్డి క్రమంగా పదెకరాలకు విస్తరించారు. అయితే, కరివేపాకుకు మార్కెట్‌ విస్తరించకపోవడంతో గత మూడేళ్లుగా దానిమ్మ వైపు దృష్టి మరల్చారు. కరివేపాకు ఏటా 3 కోతల్లో ఎకరానికి మొత్తం 18 టన్నుల దిగుబడి వస్తుంది. శీతాకాలంలో అత్యధికంగా కిలోకు రూ. 25 ధర పలుకుతుంది. ఎండాకాలంలో హాస్టళ్లు మూతపడతాయి, ఆకు పెరుగుదల ఎక్కువగా ఉంటుంది కాబట్టి అసలు అడిగే వారే ఉండరు. ఏదేమైనా మొత్తంగా సగటున కిలోకు రూ. పది ధర పలుకుతుందని, ఎకరానికి ఏటా రూ. లక్షన్నర వరకు నికరాదాయం పొందుతున్నానని శ్రీనివాసరెడ్డి తెలిపారు. రసాయనిక సేద్యంలో రూ. 50 వేలు అధికంగా ఖర్చవుతుందన్నారు.  

11 ఎకరాల్లో దానిమ్మ సాగు
దానిమ్మలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న శ్రీనివాసరెడ్డిని కొందరు రైతులు దానిమ్మ పంటకు ప్రకృతి వ్యవసాయంలో దిగుబడి రాదని నిరాశపరిచారు. అయితే, నిరాశ చెందకుండా మూడేళ్ల క్రితం 4 ఎకరాల్లో దానిమ్మ నాటాడు. ఏడాదిన్నర క్రితం 3 ఎకరాలు, 2 నెలల క్రితం 4 ఎకరాల్లో దానిమ్మ నాటాడు. రసాయనిక మందులు వాడకుండా జీవామృతం, ద్రావణాలు, కషాయాలతోనే రెండు కోతల్లో ఖర్చులు వచ్చాయి. ఈ దఫా మంచి దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాడు. బోర్లు అడుగంటి, బావి నీరు కూడా చాలకపోవడంతో మూడు కిలోమీటర్ల దూరంలో రెండెకరాలు కొనుగోలు చేసి బోర్లు వేసి పైప్‌లైన్‌ ద్వారా బావిలోకి ఆ నీటిని తరలించి.. బావి నుంచి 18 ఎకరాలకు డ్రిప్‌ ద్వారా నీటి తడులు పెడుతున్నారు.

రైతులకు సూచనలు, సలహాలు
శ్రీనివాసరెడ్డి వద్ద ఆరు దేశీ ఆవులున్నాయి. కరివేపాకుకు 15 రోజులకోసారి జీవామృతం డ్రిప్‌ ద్వారా ఇస్తారు. వారానికోసారి వేపనూనె, నీమాస్త్రం.. 20 రోజులకోసారి ముడినూనెల పిచికారీ చేయడం వల్ల కరివేపాకు మంచి నాణ్యత, రంగు వస్తున్నాయని తెలిపారు. తండ్రి మల్లారెడ్డి ఆవుల సంరక్షణ బాధ్యతలు చూస్తూ కుమారునికి సూచనలు, సలహాలు అందిస్తుంటారు. ఏడేళ్లుగా ప్రకృతి సాగు వల్ల భూసారం పెరిగింది. పొలంలో ఎక్కడ మట్టి తీసి చూసినా తమ విసర్జితాలతో భూసారం పెంచే వానపాములు కనిపిస్తాయి.

ఆవుల మూత్రం, పేడతో తానే కాక ఇతరులకు ద్రావణాలు, కషాయాలు తయారు చేసి ఇస్తున్నాడు. ఎప్పుడూ ఒకే ఉద్యాన పంటపై ఆధారపడటం కన్నా అనేక పంటలపై దృష్టిపెట్టడం రైతుకు శ్రేయస్కరమని ఆయన విశ్వాసం. ఏడాది క్రితం ఎకరంలో డ్రాగన్‌ ఫ్రూట్‌ నాటారు. ఇప్పుడు కివీ పండ్ల సాగుపై దృష్టిసారిస్తున్నానన్నాడు. శ్రీనివాసరెడ్డి వద్ద నుంచి రైతులు స్వయంగా వచ్చి, సోషల్‌ మీడియా ద్వారా కూడా సలహాలు తీసుకుంటూ ఉండటం విశేషం.
– మేడగం రామాంజనేయరెడ్డి ,సాక్షి, దర్శి, ప్రకాశం జిల్లా


డ్రాగన్‌ ఫ్రూట్‌ తోటలో శ్రీనివాసరెడ్డి..          బావిలోకి బోరు నీరు..                 పొలం వానపాముల మయం

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top