రోల్డ్‌గోల్డ్‌ నగలతో ర్యాష్‌ వస్తుంటే... | Sakshi
Sakshi News home page

రోల్డ్‌గోల్డ్‌ నగలతో ర్యాష్‌ వస్తుంటే...

Published Wed, Aug 2 2017 11:01 PM

రోల్డ్‌గోల్డ్‌ నగలతో ర్యాష్‌ వస్తుంటే...

హోమియో కౌన్సెలింగ్స్‌

నేను అప్పుడప్పుడూ రోల్డ్‌గోల్డ్‌ నగలు వేసుకుంటుంటాను. ఈ మధ్య వాటిని వేసుకున్న తర్వాత మెడ భాగంలో, చేతులకు దురద, పొక్కులు వస్తున్నాయి. అదే  గోల్డ్‌ నగలు వేసుకుంటే ఏమీ కాదు. దీనికి కారణం ఏమిటి? హోమియోలో  పరిష్కారం చెప్పండి.
– సునీత, హైదరాబాద్‌

మీరు చెప్పిన కారణాలతో చర్మ శోధ రావడం వల్ల కలిగే ఈ పరిణామాన్ని డర్మటైటిస్‌గా చెప్పవచ్చు. ఇలా జరిగినప్పుడు చర్మం ఎర్రబారి దురద, మంట వస్తాయి. ఇది శారీరకంగా సమస్యగా పరిణమించడంతో పాటు మానసికంగానూ కుంగదీస్తుంది. డర్మటైటిస్‌ను వివిధ రకాలుగా విభజించవచ్చు. అవి...

కాంటాక్ట్‌ డర్మటైటిస్‌ : దీన్ని స్పర్శ చర్మశోధగా చెప్పవచ్చు. ఇందులో చర్మంపై  సాధారణంగా గులాబి లేదా ఎరుపు దద్దుర్లు వస్తాయి. దురద కూడా ఉంటుంది. ఇది చికాకు, అలర్జీని కలిగిస్తుంది. మీరు చెప్పినట్లుగా ఆభరణాలు, రబ్బరు తొడుగులు దీనికి కారణమవుతాయి. అలాగే కొన్ని రకాల పరిమళ ద్రవ్యాలు, జుట్టు రంగులు(హెయిర్‌డై), చర్మ సంబంధిత ఉత్పత్తుల వల్ల కూడా ఇది సంభవించవచ్చు.

నుమ్యులార్‌ డర్మటైటిస్‌ : ఇందులో మచ్చలు నాణెం ఆకృతిలో ఎరుపు ఫలకాల్లా ఉంటాయి. ఇది సాధారణంగా కాళ్లు, చేతులు, భుజాలు, నడుముపై కనిపిస్తుంది. ఇది స్త్రీలతో పోలిస్తే పురుషుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఇది 55 నుంచి 65 ఏళ్ల మధ్య వారిలో ఎక్కువ.

ఎగ్జిమా : ఇది కూడా ఒక రకమైన డర్మటైటిస్‌. క్రానిక్‌ స్కిన్‌ ఇన్‌ఫ్లమేషన్‌ని ఎగ్జిమా అంటారు. ఎగ్జిమాలో చర్మం ఎరుపుదనంతో కమిలినట్లుగా కనిపించడం, కొద్దిగా పొరలుగా తయారవ్వడం, వాపు, దురద దీనిలో ప్రధాన లక్షణాలు. ఎగ్జిమా బయటపడేప్పుడు మొదట చర్మం కమిలినట్లగా ఎరుపురంగుకి మారుతుంది. తర్వాత పొక్కుల్లా వచ్చి, అవి క్రమంగా నీటిపొక్కుల ఆకృతిని సంతరించుకుంటాయి.

సెబోరిక్‌ డర్మటైటిస్‌ : ఇది పిల్లల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా ముఖం, తల మీది చర్మంపై ఎరుపు లేదా పసుపు రంగులో చర్మం కమిలినట్లుగా కనిపిస్తుంది. ఇంకా కనుబొమల సమీపంలో, ముక్కుకు ఇరుపక్కలా వ్యాపిస్తుంది. ఇది అధిక ఒత్తిడి వల్ల రావచ్చు.

కారణాలు : ∙రోల్డ్‌గోల్డ్‌ నగలు ∙కొన్ని రకాల మందులు వాడటం వల్ల ∙జుట్టు కోసం వాడే రంగులతో ∙ఇక బ్యాక్టీరియా, ఫంగల్‌ ఇన్ఫెక్షన్లతో కూడా డర్మటైటిస్‌ రావచ్చు.

చికిత్స : డర్మటైటిస్‌కు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. యాంటీమోనియమ్‌ క్రూడమ్, అపిస్‌ మెల్లిఫికా, రస్టాక్సికోడెండ్రాన్, సల్ఫర్‌ వంటి మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి.
డాక్టర్‌ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో)
స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌


ముక్కులు బిగదీసుకుపోయి వాసనలు తెలియడం లేదు
నా వయసు 28 ఏళ్లు. నాకు గత ఆర్నెల్లుగా తుమ్ములు, ముక్కుకారవడంతోపాటు ముక్కులు బిగదీసుకుపోతున్నాయి. వాసనలు తెలియడం లేదు. చాలా మంది డాక్టర్లను కలిశాను. సమస్య తగ్గినట్టే తగ్గి, మళ్లీ వస్తోంది. హోమియోలో దీనికి పరిష్కారం చెప్పండి.
– రవికిరణ్, కోదాడ

మీరు ‘అలర్జిక్‌ రైనైటిస్‌’ అనే సమస్యతో బాధపడుతున్నారు. మీకు సరిపడనివి తగిలినప్పుడు (దుమ్ము, ధూళి, పుప్పొడి, ఘాటు వాసనలు) మీకు అలర్జీ మొదలవుతుంది. దాంతో ముక్కులోని రక్తనాళాలు ఉబ్బినట్లుగా అయి, ఆగకుండా తుమ్ములు రావడం, ముక్కు బిగదీసుకుపోవడం వంటివి కనిపిస్తాయి.

లక్షణాలు : ఆగకుండా తుమ్ములు రావడం, ముక్కుకారడం వంటి లక్షణాలే గాక... వాటిని నిర్లక్ష్యం చేస్తే సైనస్‌లకు ఇన్ఫెక్షన్‌ సోకి తలబరువు, తలనొప్పి వంటివి కనిపించవచ్చు. ముక్కుపొరలు ఉబ్బడం వల్ల గాలి లోపలికి వెళ్లక వాసనలు కూడా తగ్గిపోతాయి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే మున్ముందు సైనసైటిస్, నేసల్‌ పాలిప్స్, వంటి పెద్ద పెద్ద సమస్యలూ వచ్చేందుకు అవకాశం ఉంది. వ్యాధి నిర్ధారణ కోసం ఎక్స్‌–రే, సీటీ స్కాన్‌ వంటి పరీక్షలు చేయించాల్సి ఉంటుంది.

నివారణ : ∙అలర్జీ కారకాలకు సాధ్యమైనంత దూరంగా ఉండటం ∙సరైన పోషకాహారం తీసుకోవడం ∙ముక్కుకు సంబంధించిన వ్యాయామాలు చేయడం ∙చల్లిని వాతావరణానికి దూరంగా ఉండటం, ∙పొగతాగే అలవాటుకు దూరంగా ఉండటం.

చికిత్స : హోమియోలో వ్యక్తిగత లక్షణాలనూ, మానసిక స్వభావాన్ని బట్టి కాన్స్‌టిట్యూషన్‌ చికిత్స ఇవ్వవచ్చు. దీనివల్ల వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. క్రమక్రమంగా వ్యాధి తీవ్రతను తగ్గిస్తూ పోయి, అలా సమస్యను పూర్తిగా తగ్గించవచ్చు. అనుభవజ్ఞులైన హోమియో నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటూ ఉంటే అలర్జిక్‌ రైనైటిస్‌ పూర్తిగా తగ్గుతుంది. హోమియోలో ప్రక్రియ ద్వారా దీన్ని పూర్తిగా నయం చేయవచ్చు.
డాక్టర్‌ ఎ.ఎం. రెడ్డి, సీనియర్‌ డాక్టర్,
పాజిటివ్‌ హోమియోపతి, హైదరాబాద్‌


రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ తగ్గుతుంది
నా వయసు 58 ఏళ్లు. నాకు రెండు చేతుల్లోని కీళ్లు నొప్పిగా ఉండటం, కీళ్లవద్ద ఎర్రగా మారడం జరిగింది. నాకు తగిన సలహా ఇవ్వండి.
– ఫణీంద్ర, కాకినాడ

మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఒక ఆటో ఇమ్యూన్‌ డిసీజ్‌. అంటే తన వ్యాధి నిరోధక శక్తి తన పట్ల ప్రతికూలంగా పనిచేయడం. సాధారణంగా యాభైఏళ్లు పైబడిన వాళ్లలో ఈ నొప్పులు మొదలవుతాయి.

ఈ వ్యాధి ఉన్న వారిలో లక్షణాల తీవ్రతలో చాలా రకాల మార్పులు కన్పిపిస్తుంటాయి. వ్యాధి యాక్టివ్‌ స్టేజ్‌లో ఉన్నప్పుడు అలసట, ఆకలి లేకపోవడం, లోగ్రేడ్‌ జ్వరం, కీళ్ళలో, కండరాల్లో నొప్పులు, కీళ్లను సరిగ్గా కదపలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా కీళ్లనొప్పులు ఉదయాన్నే లేవగానే అత్యధికంగా ఉండి కొద్దిగా శరీరం కదిలించిన తర్వాత అదుపులో ఉంటాయి. సాధారణంగా చేతుల్లో కాళ్లలో రెండు వైపులా ఒకే కీళ్ళు ప్రభావితమవుతాయి. కీళ్లు ఎర్రగా, వేడిగా మారి విపరీతమైన నొప్పితో బాధిస్తాయి. వ్యాధి దీర్ఘకాలంగా మారినప్పుడు కీళ్లలోని మృదులాస్తి, ఎముకలు దెబ్బతినడం వలన వేళ్ళు వంకర్లు పోవడం పూర్తిగా కదలికలు ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటినే ‘డిఫార్మిటీస్‌’ అంటారు.

రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ని నిర్ధారించడానికి ఏ ఒక్క పరీక్ష సరిపోదు. రక్తపరీక్షలతో పాటు ఇతర వైద్య పరీక్షలూ చేయించాల్సి ఉంటుంది. ఆటో ఇమ్యూన్‌ సమస్యలలో చికిత్స చెయ్యడానికి హోమియోపతిలో మయాజ్మాటిక్‌ ప్రిస్క్రిప్షన్‌ ఇస్తారు. సాధారణంగా వాడే పెయిన్‌ కిల్లర్స్, స్టెరాయిడ్స్‌ వల్ల నొప్పి నుండి తాత్కాలికంగా ఉపశమనం లభించడం లేదా కొన్నిసార్లు అస్సలు ప్రభావమే లేకపోవడం జరుగుతుంది. పైగా ఈ మందుల వలన డిఫార్మిటీస్‌ని నివారించలేం. హోమియోపతి మందుల ద్వారా ఈ వ్యాధిని పూర్తిగా నియంత్రించి నొప్పులను పూర్తిగా తగ్గించడం మాత్రమే కాకుండా డిఫార్మిటీలు రాకుండా నివారించవచ్చు.
డాక్టర్‌ టి. కిరణ్‌ కుమార్, డైరెక్టర్, పాజిటివ్‌ హోమియోపతి, విజయవాడ, వైజాగ్‌

Advertisement
 
Advertisement
 
Advertisement