ఏఎస్‌పి ఎట్‌ ఎల్‌బ్రస్‌!

 Radhika said reached target asp Chittoor

రక్షక శిఖరం

ఆమె లక్ష్యం ముందు ‘ఆడదానివి నువ్వేం చేస్తావ్‌’ అంటూ చిన్నబుచ్చే మాటలు చిన్నబోయాయ్‌. ‘ఆడపిల్లవి... నీకు పర్వతారోహణలెందుకు లేమ్మా... చక్కగా ఉద్యోగం చేసుకో’’ అనే తరహా మాటలు ఆమె పట్టుదల ఎదుట తడారిపోయాయ్‌. ఆమే చిత్తూరు జిల్లా ఏఎస్పీ జీఆర్‌ రాధిక. వృత్తి జీవితమైనా, వ్యక్తిగతమైనా వందశాతం శక్తియుక్తులని వెచ్చించడమే ఆమె విజయరహస్యం. లక్ష్యం చేరుకోవడం ఆలస్యం కావొచ్చు... ప్రయత్నమంటూ చేస్తూ ఉంటేనే కచ్చితంగా లక్ష్యాన్ని చేరుకుంటామని చెబుతారు చిత్తూరు ఏఎస్పీ రాధిక. ఆమెది కడప. తండ్రి కాలేజీ అధ్యాపకుడు. చిన్నప్పటి నుంచి చదువులో చురుకే. ఎప్పుడూ ఫస్ట్‌ ర్యాంకే. స్నేహితులతో కలిసి చిన్నప్పుడు సెలవుల్లో చుట్టుపక్కల కొండల్నీ గుట్టల్నీ ఎక్కడం ఆమెకు ఇష్టం. ఇదే ఇప్పుడు అభిరుచి అయింది. ‘రాళ్లూ రప్పల్లో ఏముంటాయ్‌ నీ పిచ్చిగానీ..’ అనే వాళ్లు చుట్టుపక్కల వాళ్లు. చిన్నగా నవ్వి వాటిని వదిలేసేదాన్ని’’ అని చెబుతారు ఏఎస్పీ రాధిక. ఇంగ్లిష్‌లో పీజీ పూర్తిచేసి కొంతకాలం అధ్యాపకురాలిగా పని చేశారు. అప్పట్లోనే అనంతపురానికి చెందిన వేణుగోపాల్‌రెడ్డితో పరిచయం ప్రేమగా మారింది. కులాలు వేరైనా ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. భర్త వ్యాపారరీత్యా అనంతపురంలో ఉంటారు. అప్పుడే ఆమెకు ఐపీఎస్‌పై ఆసక్తి పెరిగింది. విజయం తృటిలో చేజారింది. నిరాశ చెందలేదు. పట్టువీడలేదు. పోలీసుశాఖలోకి వెళ్లే ఇతర అవకాశాలపై దృష్టిసారించారు. గ్రూప్‌వన్‌ పరీక్ష రాసి 2007లో డీఎస్పీగా ఎంపికయ్యారు. గ్రేహౌండ్స్‌లో కొన్నాళ్లు పనిచేశారు. తరువాత నెల్లూరు పట్టణ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. కరీంనగర్‌తోపాటు హైదరాబాద్‌లోని అప్పాలో సేవలందించారు. అనంతరం పదోన్నతిపై ఆదిలాబాద్‌ ఏఎస్పీగా, తరువాత చిత్తూరు ఏఎస్పీగా బదిలీ అయ్యారు.

పోలీసులకు పర్వతారోహణ...
కెరీర్‌తోపాటూ ఆమె పర్వతారోహణ ఆసక్తీ అంతకంతకూ పెరుగుతోంది. ఐదేళ్ల కిందట మానససరోవర్‌ యాత్రకు వెళ్లారు. అక్కడ రాధికతోపాటు వచ్చిన వారందరూ గుర్రాలెక్కినా ఈమె మాత్రం కాలినడకతోనే 5100 మీటర్ల ఎత్తుకు చేరుకున్నారు. చిన్నప్పటి నుంచి ఆమెతోపాటు పెరుగుతూ వచ్చిన పర్వతారోహణ ఆసక్తికి తగ్గట్టు అప్పుడే ఓ గొప్ప అవకాశం దొరికింది. ఆమెతోపాటు నడుచుకుంటూ వచ్చిన ముంబైకి చెందిన దీప్తి పర్వతారోహణ గురించి.. దానికి ఇచ్చే ట్రైనింగ్‌ గురించి వివరించింది. దీంతోపాటు నాటి అడిషనల్‌ డీజీపీ పోలీసు అధికారుల కోసం ప్రత్యేక పర్వతారోహణ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో అత్యుత్తమ ప్రతిభ చూపారు రాధిక. ఆమె ప్రతిభను డీజీపీ రాజీవ్‌ త్రివేది ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. జమ్మూకశ్మీర్‌లోని జవహర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటెనీరింగ్‌ అండ్‌ వింటర్‌ స్పోర్ట్స్‌ సంస్థలో శిక్షణకు పంపారు. శిక్షణ అందుకున్నాక తన సామర్థ్యాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు. హిమాలయాల్లోని జన్‌స్కార్‌ రేంజ్‌లో ఉన్న 5380 అడుగులున్న గోలెస్‌కాగ్రి పర్వతాన్ని వారంరోజుల్లో అధిరోహించారు. ‘ఆ పర్వతారోహణే నాపై నాకు నమ్మకం కుదిర్చింది’ అంటారు రాధిక. కున్‌ సైతం తలవంచింది.

అదే ఉత్సాహంతో 7077 మీటర్ల ఎత్తున్న కున్‌ పర్వతారోహణకు వెళ్లాలనుకున్నారు. ‘ఎంత పోలీసైనా ఇద్దరు పిల్లలున్న ఆడవాళ్లకు సాధ్యమా’ అన్నారు చుట్టుపక్కలవారంతా. ఎప్పటిలాగే ఓ చిరునవ్వు విసిరి, పట్టించుకోకుండా వదిలేశారు. పట్టువిడవకుండా అధిరోహణకు కావాల్సిన వ్యాయామాలు చేయడం మొదలు పెట్టారు. విపరీతమైన గాలులు, సున్నాకంటే తక్కువ నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, మామూలు కంటే సగం పడిపోయిన ప్రాణవాయువు.. సహచరులందరూ మధ్యలోనే చేతులెత్తేస్తున్నారు.. ఇవేమీ ఆమె పట్టుదలను ఆపలేకపోయాయి. కనీసం సవాల్‌ విసరలేకపోయాయి. ఆమె మాత్రం శిఖరాగ్రానికి చేరుకున్నారు. తెలుగురాష్ట్రాల నుంచి ఆ ఘనతను అందుకున్న తొలిమహిళగా రికార్డును నెలకొల్పారు.

ప్రపంచంలోని అన్ని పర్వతాలను ఎక్కాలనుంది..
ఎవరెస్ట్‌ ముగిసింది.. వాట్‌ నెక్ట్స్‌ అనే కొశ్చన్‌. తరువాత యూరప్, రష్యాలోని అతిపెద్ద శిఖరమైన ఎల్‌బ్రస్‌. లక్ష్యం అదే. దాని కోసం మరింత కష్టపడింది. మొత్తం 15 మంది సిబ్బందితో ప్రయాణం మొదలు. మొదట రష్యా చేరుకుంది. శిఖరం ఉత్తరం వైపు నుంచి అనుమతి లేదంది ప్రభుత్వం. దక్షిణం వైపు నుంచి ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా పర్వతాన్ని అధిరోహించలేదని చాలామంది చెప్పారామెకు. కొంచెం కష్టంతో కూడుకున్న పని. అయినా ఆమె తల వంచలేదు. అనుకున్నది సాధించింది. ఈ సెప్టెంబర్‌ 8న ఎల్‌బ్రస్‌పై భారత పతాకం రెపరెపలాడించింది.

ఆమె ధైర్యానికి ఎవరెస్ట్‌ దాసోహమంది!
కున్‌ పర్వతారోహణ తరువాత ఎవరెస్టే తన లక్ష్యంగా పెట్టుకున్నారు రాధిక. మొదట్లో సొంత ఖర్చులతో పర్వతారోహణకు వెళ్లేవారు రాధిక. తరువాత ఆమె పట్టుదల, కృషి చూసి తెలంగాణ ప్రభుత్వం చేయూతనిచ్చింది. ఆ సాయంతోనే ఎవరెస్ట్‌ ప్రయాణం మొదలు పెట్టారామె. తొలుత నేపాల్‌ రాజధాని కాఠ్మాండూకు వెళ్లారు. అక్కడ భూకంపం రావడంతో పర్వతారోహణకు రెండు రోజుల పాటు అనుమతించలేదు. ఆ తరువాత టిబెట్‌లోని లాసా మీదుగా చైనాలోని తొలి బేస్‌ క్యాంప్‌కు చేరుకున్నారు. అక్కడ చైనా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఎలాగోలా అనుమతి సాధించుకున్నాక 8850 అడుగుల ఎవరెస్ట్‌ను గత సంవత్సరం మే 20న అధిరోహించారు. సుమారు 36 రోజులు పట్టింది ఆమె ఎవరెస్ట్‌ శిఖరాన్ని చేరుకునేందుకు. యాత్రలో అడుగడుగునా ప్రతికూల వాతావరణం. రోజుల తరబడి మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చేది. అడుగడుగునా తీవ్రగాలులతో పోరాడాల్సి వచ్చేది.
- గాండ్లపర్తి భరత్‌రెడ్డి, సాక్షి, చిత్తూరు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top