మనసు తీసిన ఫొటోలు




పదిశోధన




మాటలు అన్ని భావాలనూ వెలిబుచ్చలేవు. కానీ ఫొటోలు  వెలిబుచ్చుతాయి. సంతోషం, దుఃఖం, ఆవేశం, ఆక్రోశం...  దేనినైనా కళ్లకు కడతాయి.  గుండెల్ని మెలిపెడతాయి. అలాంటి కొన్ని గొప్ప చిత్రాలివి...


 


ఆకలి ఎంత వికృతమైనదో తెలిపే చిత్రమిది. సూడాన్‌లో ఆకలితో అలమటించి చావు బతుకుల్లో ఉన్న చిన్నారి. తన ఊపిరి ఆగీ ఆగగానే ఎత్తుకెళ్లి ఆరగిద్దామని ఎదురు చూస్తోన్న రాబందు. దీన్ని చూడగానే మనసు కదిలి చిన్నారిని కాపాడేందుకు సిద్ధమవ్వాలి. కానీ కెవిన్ కార్టర్ అది చేయకుండా ఫొటో తీశాడు. పత్రికలో ముద్రించాడు. అది చూసి ఎందరో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫొటో తీయడం మాని బిడ్డను కాపాడొచ్చుగా అన్నారు. తాను చేసిన తప్పు కెవిన్‌కి అర్థమయ్యింది. కానీ సరిదిద్దుకునే అవకాశం లేదు. దాంతో ఆత్మహత్య చేసుకున్నాడు.


 


2  ఒకప్పుడు ఆ కన్నుల్లో కాంతి ఉండేది. కలలు ఉండేవి. భవిష్యత్తు కోసం ప్రణాళికలు ఉండేవి. కానీ ఒక్కసారిగా కమ్ముకొచ్చిన కరువు వాటన్నిటినీ తుడిపేసింది. నిరాశను, నిస్పృహను, బతుకు భయాన్ని తీసుకొచ్చి కన్నుల నిండా నింపేసింది. సరిగ్గా అప్పుడు తీసిన ఫొటోయే ఇది. ఈమె పేరు డొరొతియా. ఏడుగురు బిడ్డల కడుపులు ఎలా నింపాలో అర్థం కాక అల్లాడుతున్న సమయంలో ఓ ఫొటోగ్రాఫర్ ఈ ఫొటో తీశాడు. ‘ద గ్రేట్ డిప్రెషన్’ తీవ్రతను ప్రపంచానికి చూపిందీ ఫొటో!


 


 3  ప్రపంచంలోనే అత్యంత ఘోర దుర్ఘటనల గురించి ప్రస్తావిస్తే... అన్నిటికంటే ముందు ఉంటుంది భోపాల్ ఘటన. ఓ ఫ్యాక్టరీలో విడుదలైన విష వాయువు కొన్ని వేల మంది ఉసురు తీసింది. వాళ్లలో ఒకడు ఈ చిన్నారి. విషవాయువు బారిన పడి అసువులు బాశాడు. అతడి అంత్యక్రియల సమయంలో ప్రముఖ ఫొటోగ్రాఫర్ రఘురాయ్ తీసిన ఫొటో ఇది. నిజానికి ఈ చిన్నారి ఎవరో అతనికి తెలియదు. అతనికే కాదు... ఇంతవరకూ ఎవ్వరికీ తెలియదు. కానీ భోపాల్ విషాదానికి నిలువెత్తు సాక్ష్యంగా అతడి ఫొటో మాత్రం నిలిచిపోయింది.


 


 4 యుద్ధం వికృతమైనది. ఎనలేని విషాదాన్ని తనతో తీసుకుని వస్తుంది. అందరికీ తలా కాస్త పంచేసి పోతుంది. దానికి ఉదాహరణే ఈ ఫొటో. 1945లో జపాన్ మీద అమెరికా బాంబులు కురిపించింది. ఫలితంగా ఎందరో ప్రాణాలు కోల్పోయారు. అప్పుడే పుట్టిన చిన్నారులు సైతం కన్ను మూశారు. అలా మరణించిన ఓ చిట్టితండ్రిని తన అన్నయ్య వీపునకు కట్టుకుని శ్మశానానికి మోసుకుపోతుంటే ఫొటోగ్రాఫర్ జో ఓ డానెల్ కెమెరా క్లిక్‌మంది. ఈ వేదనాభరిత చిత్రాన్ని మనకి అందించింది.


 


5  అతను జర్మనీ దేశానికి చెందినవాడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కొన్ని కారణాల వల్ల జైలు పాలయ్యాడు. ప్రేమించే భార్యకి, ఏడాది వయసున్న కూతురికి దూరమై కటకటాల వెనక్కి చేరాడు. కొన్నేళ్ల తర్వాత అతను విడుదలయ్యేసరికి కూతురు ఎదిగింది. కానీ తండ్రిని మర్చిపోయింది. అన్నేళ్ల తర్వాత తండ్రి వచ్చి తనను దగ్గరకు తీసుకోబోతే బెదిరింది. దూరంగా జరిగింది. ఆ సందర్భంలో తీసిన ఫొటోయే ఇది. జైలు గోడలు తండ్రీబిడ్డల మధ్య కూడా గోడలు కట్టిన వైనం ఎందరినో కదిలించింది.


 


6 2015, సెప్టెంబర్ నెలలో టర్కీతో పాటు ప్రపంచమంతా ఒక్కసారిగా నివ్వెరపోయింది. కన్నీటితో తడిసి ముద్దయ్యింది. టర్కీలోని బాడ్రమ్ దగ్గర, సముద్ర తీరంలో ఓ రెండేళ్ల పిల్లాడి మృతదేహం ఇసుకలో కూరుకుపోయి కనిపించింది. అది సిరియన్ బాలుడైన అయ్‌లాన్ మృతదేహం. వలసవాది అయిన తండ్రి సిరియన్లపై జరుగుతోన్న దాడులకు భయపడి భార్యని, ఐదేళ్ల పెద్ద కొడుకుని, చిన్న కొడుకు అయలాన్‌ని తీసుకుని పడవలో గ్రీసుకు బయల్దేరాడు. కాసేపటికే పడవ తిరగబడింది. తల్లి, అన్నయ్యతో పాటు అయ్‌లాన్ కూడా కన్నుమూశాడు. కెరటాల తాకిడికి ఒడ్డుకు కొట్టుకొచ్చాడు. ఎన్నో గుండెల్ని మండించాడు.


 


7 ఆయుధం చేపట్టి, బాంబులకు ఎదురొడ్డి, శత్రువుని చీల్చి చెండాడేందుకు ఆవేశంతో ఊగిపోయే సైనికుల గుండెలు కరకుగా ఉంటాయంటారు చాలామంది. అది నిజం కాదు అని నిరూపించిన ఫొటో ఇది. 1995లో, ఓక్లహామా సిటీలోని ఫెడరల్ బిల్డింగ్‌పై బాంబు దాడులు జరిగాయి. 168 మంది చనిపోగా ఎంతోమంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఏడాది వయసున్న ఈ చిన్నారి కూడా ఉంది. రక్తపు మడుగులో ఉన్న పసిబిడ్డను చూడగానే చలించిపోయాడు ఓ సైనికుడు. బిడ్డను ఆర్తిగా చేతుల్లోకి తీసుకుని ఫస్ట్ ఎయిడ్ కోసం పరుగెత్తాడు. ఆ దృశ్యాన్ని ఫొటోగ్రాఫర్ చార్లెస్ పోర్టర్ ఫొటో తీశాడు. పులిట్జర్ ప్రైజునూ సంపాదించాడు.


 


ఏ బిడ్డకైనా తండ్రే తొలి స్నేహితుడు. తొలి మార్గదర్శి. తొలి హీరో. నాన్న అడుగులో అడుగు వేసుకుంటూ ఎదగడం ప్రతి కొడుకు హక్కు. కానీ ఆ హక్కును కాలరాసింది ఇరాక్ యుద్ధం. 2003లో మొదలైన ఈ యుద్ధంలో వేల మంది సైనికులు మరణించారు. అలా మరణించిన ఓ వీరుడి కుమారుడు ఈ అబ్బాయి. తండ్రి అంత్యక్రియలను తన చిట్టి చేతుల మీదుగా జరిపించిన దురదృష్టవంతుడు. సైనిక లాంఛనాలన్నీ ముగిశాక నాన్నను తలచుకుని ఆ పసివాడు వెక్కి వెక్కి ఏడుస్తుంటే.... చెమ్మగిల్లని కన్ను లేదు.


 


9  ప్రేమించే మనిషి... ప్రతిరోజూ కళ్లు తెరవగానే కనిపించే మనిషి... ఒక్కసారిగా కనిపించకుండా పోతే? ఆ శూన్యాన్ని తట్టుకోగలమా? ఆ వెలితిని మరి దేనితోనైనా నింపుకోగలమా? ఆ బాధ మనిషికే కాదు... జంతువుకైనా అలాగే ఉంటుంది. దానికి ఈ శునకమే సాక్ష్యం. బ్రెజిల్‌కి చెందిన క్రిస్టినా మారియో పెంపుడు కుక్క ఇది. ఎంతో ప్రేమగా పెరిగింది. ఆ ప్రేమను పంచిన యజమాని కోసం ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగా ఉండేది. కానీ తన యజమాని ప్రాణం పోవడాన్ని మాత్రం తట్టుకోలేకపోయింది. రోజులు గడిచినా సమాధి దగ్గరే ఇలా శిలలా ఉండిపోయింది.


 


10   ప్రేమతో ముడిపడిన బంధం ఎప్పటికీ వీడదు. మృత్యు ఒడిలో కూడా! 2013, ఏప్రిల్ నెలలో... బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకుసమీపంలో ఉన్న ఓ ఎనిమిదంతస్తుల గార్మెంట్ ఫ్యాక్టరీ కుప్పకూలింది. శిథిలాల కింద ఎంతోమంది సమాధి అయిపోయారు. వాళ్లని వెలికితీసే ప్రయత్నంలో ఈ జంట కంటబడ్డారు. వీళ్లెవరో తెలీదు. వాళ్ల మధ్య ఏం బంధం ఉందో తెలియదు. కానీ... వాళ్ల అనురాగం మాత్రం అర్థమయ్యింది. దాన్నే ఫొటోగ్రాఫర్ తస్లిమా అక్తర్ ఒడిసి పట్టారు. హృదయాలను కదిలించారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top