పాలేకర్‌ ప్రకృతి సేద్యంపై అధ్యయన కమిటీ

Palekar Learning Committee on Natural Farming - Sakshi

పి.జె.టి.ఎస్‌.ఎ.యు. వైస్‌ ఛాన్సలర్‌ డా. ప్రవీణ్‌రావు సారధ్యం

కమిటీలో మొత్తం 12 మంది వ్యవసాయ నిపుణులు

సుభాష్‌ పాలేకర్‌ ప్రకృతి వ్యవసాయ (ఎస్‌.పి.ఎన్‌.ఎఫ్‌.) పద్ధతి(దీన్ని మొదట్లో ‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’ అనే వారు) ని అనుసరించడం వల్ల ఒనగూడుతున్న ప్రయోజనాలు, ఎదురవుతున్న సవాళ్లపై సమగ్ర అధ్యయనానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. గత కొన్ని సంవత్సరాల నుంచి పాలేకర్‌ నేర్పిన పద్ధతిలో అనేక రాష్ట్రాల్లో చాలా మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న సంగతి తెలిసిందే. 12 మంది వ్యవసాయ నిపుణులతో కూడిన జాతీయ స్థాయి కమిటీని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐ.సి.ఎ.ఆర్‌.) అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ డా. ఎస్‌. భాస్కర్‌ ఇటీవల నియమించారు. 12 మంది వ్యవసాయ నిపుణులతో కూడిన ఈ కమిటీకి ప్రొ. జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ డా. వి. ప్రవీణ్‌రావు సారధ్యంవహిస్తారు.

ఈ ఉన్నత స్థాయి జాతీయ కమిటీలో ఐ.సి.ఎ.ఆర్‌. డీడీజీ డా. ఎస్‌. భాస్కర్‌తోపాటు మోదీపురంలోని భారతీయ వ్యవసాయ వ్యవస్థల పరిశోధనా సంస్థ సంచాలకులు డా. ఎ. ఎస్‌. పన్వర్, జాతీయ సేంద్రియ వ్యవసాయ పరిశోధనా స్థానం సిక్కిం సంయుక్త సంచాలకులు డా. ఆర్‌. కె. అవస్థె, కోయంబత్తూర్‌లోని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం సుస్థిర సేంద్రియ వ్యవసాయ విభాగం అధిపతి ప్రొ. ఇ. సోమసుందరం, ఉదయ్‌పూర్‌లోని ఎం.పి.ఎ.ఎ.టి. సేంద్రియ పరిశోధనా కేంద్రం అసోసియేట్‌ డైరెక్టర్‌ డా. ఎస్‌.కె. శర్మ, పంజాబ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం లుధియానా సేంద్రియ వ్యవసాయ కేంద్రం డైరెక్టర్‌ డా. సి.ఎస్‌. యూలఖ్, అపెడా (ఘజియాబాద్‌) మాజీ సంచాలకుడు డా. ఎ. కె. యాదవ్, కేంద్ర వ్యవసాయ– సహకార– రైతుల సంక్షేమ శాఖ సంయుక్త కారదర్శి, నీతి ఆయోగ్‌ వ్యవసాయ సలహాదారు సభ్యులుగా ఉంటారు. భారతీయ సాగు వ్యవస్థల పరిశోధనా సంస్థ (మోదిపురం) ముఖ్య శాస్త్రవేత్త డా. ఎన్‌. రవిశంకర్‌ మెంబర్‌ సెక్రటరీగా వ్యవహరిస్తారు.

ఇదీ కమిటీ అధ్యయన పరిధి..
1 ఎస్‌.పి.ఎన్‌.ఎఫ్‌. (ఇంతకుముందు జడ్‌.బి.ఎన్‌.ఎఫ్‌. అనేవారు)పై వివిధ రాష్ట్రాల్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో, భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ అనుబంధ సంస్థల్లో, సేంద్రియ వ్యవసాయంపై అఖిలభారత నెట్‌వర్క్‌ ప్రోగ్రాంలో భాగంగా నిర్వహించిన పరిశోధనా ఫలితాలను ఈ కమిటీ సమీక్షిస్తుంది. ఎస్‌.పి.ఎన్‌.ఎఫ్‌.పై భవిష్యత్తులో నిర్వహించే పరిశోధన వ్యూహాలలో చేర్చదగిన అంశాలపై సిఫారసులు చేస్తుంది.
2 సుభాష్‌ పాలేకర్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ (ఎస్‌.పి.ఎన్‌.ఎఫ్‌.) సాగు పద్ధతి బలాలు, బలహీనతలపై కమిటీ అధ్యయనం చేస్తుంది. వ్యవసాయ పరిశోధనా క్షేత్రాలు, రైతుల వ్యవసాయ క్షేత్రాలలో ఫలితాలను అంచనా వేసేటప్పుడు అనుసరించాల్సిన పద్ధతులను సూచిస్తుంది.
3 ఎస్‌.పి.ఎన్‌.ఎఫ్‌.ను దేశవ్యాప్తంగా విస్తృతంగా వ్యాప్తిలోకి తెస్తే భారత దేశంలో భూమి ఆరోగ్యం, ఉత్పాదకత, ఆహార ఉత్పత్తి, జీవనభృతులు, వ్యవసాయ రంగ సుస్థిరత తదితర అంశాలపై దీని ప్రభావం ఎలా ఉంటుందన్నదీ నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తుంది.
4 శాస్త్రీయ సేంద్రియ వ్యవసాయ పద్ధతులతో ఎస్‌.పి.ఎన్‌.ఎఫ్‌. పద్ధతులను సమ్మిళితం చేయడానికి కమిటీ తగిన సూచనలు చేస్తుంది. ఈ కమిటీకి కాలపరిమితి లేదు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top