సంచారమే ఎంతో బాగున్నది!

సంచారమే ఎంతో బాగున్నది!


దృశ్యం  డాక్యుమెంటరీ పరిచయం

 

ప్రముఖ దర్శకుడు హిచ్‌కాక్ డాక్యుమెంటరీల గురించి ఒక ప్రసిద్ధ వాక్యం చెప్పి వాటి గొప్పదనాన్ని చెప్పకనే చెప్పారు. డాక్యుమెంటరీ చూడడం అంటే పరిచితమో, అపరిచితమో... ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టడం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ డాక్యుమెంటరీల పరిచయమే... ఈ దృశ్యం.

 

ఫీచర్ ఫిలిమ్స్‌లో డెరైక్టరే దేవుడు.

డాక్యుమెంటరీ ఫిలిమ్స్‌లో దేవుడే డెరైక్టర్.

 - ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్

 

సంచారం అన్నది ఇప్పటి మాట కాదు... ఇప్పటి ప్రయాణం కాదు. జ్ఞానాన్ని వెదుకుతూ చేసిన సంచారం. భవబంధాలను తుంచుకోవడానికి చేసిన సంచారం. దైవాన్ని వెదుకుతూ చేసిన సంచారం. జవాబు దొరకని ప్రశ్నలకు జవాబుల కోసం చేసిన సంచారం. సంచారం అంటే మనల్ని మనం రద్దు చేసుకోవడం. సంకుచిత ప్రపంచం నుంచి సంకెళ్లు లేని విశాల ప్రపంచంలోకి పోవడం.

 సొంత ఆస్తి అనేది లేకుండా, సంచారమనేదే సొంత ఆస్తి అనుకుంటే, అదే అదృష్టమనుకుంటే ఆ అదృష్టం ఎంతమందికి ఉంది? ఈ దేశంలోని ప్రజలే అయినప్పటికీ, ప్రజలుగా గుర్తించబడని సంచార జాతులకు ఉంది. ఆ సంచార జాతులలో ఒకరైన రాజస్థాన్‌లోని కల్‌బెలియాల గురించి తెలుసుకోవాలనుకున్నాడు ప్యారీస్‌కు చెందిన రాఫెల్ ట్రెజ. కల్‌బెలియా లేదా కబేలియా అనేది రాజస్థాన్‌లో ఒక నృత్యరూపకం. ఈ పేరుతోనే ఆ సంచార తెగను పిలుస్తారు. ఇంకా... సపేరా, జోగిర, జోగి అనే పేర్లతో పిలుస్తారు. ఆయన అక్కడెక్కడో నుంచో రాజస్థాన్‌కు వచ్చి, రెండవతరగతి రైలులో ప్రయాణం చేసి, కల్‌బెలియాన్‌లను వెదుకుతూ, వారితో మాట్లాడుతూ, వారి జీవనశైలిని కెమెరాతో చిత్రిస్తూ చేసిన మూడు నెలల ప్రయాణ సారంశమే ‘కోబ్రా జిప్సీ’ డాక్యుమెంటరీ.

   

ఎవరి సంస్కృతి అయినా సరే, సంస్కృతి ఎప్పుడూ గొప్పదే. కల్‌బెలియన్‌ల సంస్కృతి కూడా అంతే. వాళ్ల సంస్కృతీ, సంప్రదాయాలకు ఏ కళాపీఠాలు, గ్రంధరాజాలు పెద్ద పీట వేయకపోవచ్చు. అంతమాత్రాన ఆ సంస్కృతి మనకు పట్టని సంస్కృతి కాదు. అందులో ఒక మార్మిక సౌందర్యం ఉన్నది. ఆ సౌందర్యాన్ని కల్‌బెలియన్‌ల హావభావాల్లో, చిలిపి చేష్టల్లో, నవ్వుల్లో నడకల్లో వెలికి తీశాడు డెరైక్టర్ రాఫెల్. తాను స్వయంగా సంగీత కారుడు కాబట్టి దృశ్యానుగుణమైన సంగీతాన్ని సమకూర్చాడు.



కలబెలియన్‌లలో భిన్నమైన వృత్తులు ఉన్నాయి. కొందరు పాములోళ్లు... పాములు పడతారు. విషాన్ని అమ్ముకొని బతుకుతారు. కొందరు గొర్రెలు కాస్తూ... ఒకచోట ఉండకుండా దేశమంతా తిరుగుతారు. కొందరు పెళ్ళిళ్లకు పేరంటాలకు... నృత్యాలు చేస్తారు. నృత్యాలు నేర్పిస్తారు.



కొందరు గుర్రాలనే జీవికగా చేసుకొని బతుకుతుంటారు....ప్రతి వృత్తిలో వారికి సంబంధించిన అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాలను తమకు తోచిన మాటల్లో చెబుతున్నప్పుడు వారి మాటల్లో ఎక్కడా నిరాశ కనిపించదు. ‘మీరు ఎందుకు అలా?’ ‘మేము ఎందుకు ఇలా?’ అనే ప్రశ్న ఉదయించదు.



ప్రశ్న అడిగితే...జవాబుకు ముందు నవ్వు. జవాబు చెప్పిన తరువాత... అడిగే ప్రశ్న ముందు నవ్వు. ఆ నవ్వు ఉత్త నవ్వు కాదు. జీవితం అంటే లెక్కలు వేసుకోవడం కాదు, లెక్క లేకుండా మనశ్శాంతితో బతకడం అని తెలియజేసే నవ్వు!



ప్రకృతిలో మమేకమైనట్లు కనిపించే కల్‌బెలియాలకు ఆ ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన మూలికలతో వైద్యం చేయడం కూడా వచ్చు. ఒంటె మూత్రంతో వైద్యం చేయడంలో కూడా వీరు నిష్ణాతులు. వాళ్లు చేసే రకరకాల వృత్తులు ఒక ఎత్తు... నృత్యం ఒక ఎత్తు. పుంగి,డోలక్, మోర్చాంగ్, కంజరి... తదితర వాయిద్యాల నేపథ్య సంగీతంలో వారి నృత్యాన్ని చూడడం మరవలేని అనుభవం.

 పురాణాలు, జానపద కథల్లో నుంచి పుట్టకొచ్చిన ఈ పాటలు కేవలం హుషారుకే పరిమితమైనవి కాదు... సందర్భానుసారంగా రకరకాల భావోద్వేగాలతో ఈ పాటలు ప్రేక్షకులను తాకుతాయి.



 పెళ్లి నుంచి చావు వరకు... వివిధ కోణాలలో కల్‌బెలియాల సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటుతుంది ఈ డాక్యుమెంటరీ.

 ఒక సన్నివేశంలో ఒక కుర్రాడు తన నాన్న సమాధిని చూపిస్తూ అంటాడు-  ‘‘ఇది మా నాన్న ఇల్లు’’ అని! ఇలా రకరకాల సన్నివేశాల్లో వారి సహజభావుకత బయటపడుతుంది.



 ఇక కల్‌బెలియన్‌ల పెళ్లిసందడి అంతా ఇంత కాదు... పెద్ద పెద్ద మైకుల్లో పాటలు మోగాల్సిందే. డ్యాన్సులు అదరాల్సిందే. పెళ్లికి అబ్బాయిని ఎలా ముస్తాబు చేస్తారు? అమ్మాయిని ఎలా ముస్తాబు చేస్తారు? అనేది వివరంగా చూపారు. సుమారు రెండువేలకు మందికి పైగా ఒకేచోట గుమిగూడే జాతరను... ఈ డాక్యుమెంటరీతో వివరంగా పరిచయం చేశారు రాఫెల్.



కట్టెలను కొట్టి వాటిని నల్లటి బొగ్గులుగా మార్చే....వృత్తి నైపుణ్యం కావచ్చు, శ్రమ చేస్తూ కూడా నృత్యం చేసే ఉల్లాస సందర్భం కావచ్చు.... ‘లైఫ్ అంటే అతి పెద్ద సెలబ్రేషన్’అనే కల్‌బేలియన్‌ల మార్మిక తాత్వికతను ఈ డాక్యుమెంటరీ ప్రతిబింబిస్తుంది. జిప్సీల సాహసాలను, ప్రకృతితో వారి అనుబంధాన్ని, సంస్కృతిని తెలియజేస్తూ మన ప్రపంచంలోనే కొత్త ప్రపంచాన్ని చూపుతుంది.

   

‘కల్‌బెలియన్‌లు ఇంకా పాత సంప్రదాయాలనే ఎందుకు పట్టుకొని వేలాడుతున్నారు?’ ‘ప్రధాన స్రవంతిలోకి ఎందుకు రావడం లేదు?’ అనే విజ్ఞుల ప్రశ్నకు వారు చెప్పే జవాబు ‘‘ఇవి శివుడు ఆదేశించిన వృత్తులు. వీటి నుంచి దూరమైనామంటే... మాకు శని దాపురించినట్లే... దైవనిర్ణయాన్ని కాదనగల ధైర్యం ఎవరికి ఉంది!’’ అంటారు. ఇదే సమయంలో తమ కానిపా గురువు నేపథ్యంగా కులపురాణాన్ని కూడా నాటకీయంగా వినిపిస్తుంటారు. అయితే ఇప్పుడిప్పుడే కొత్తతరం ఒకటి బడిలోకి అడుగుపెడుతుంది.

 చివరి సన్నివేశంలో ఒక సింబాలిక్ షాట్ ఉంది. ఒక తాత తన దారిలో తాను వెళుతుంటాడు. అతని వెనకాలే నడిచొస్తున్న చిన్నపిల్లాడు... ఉన్నట్టుండి కొత్తదారి కేసి పరుగులెత్తుతుంటాడు. ఏంజరగనుంది అనేది భవిష్యత్ చెప్పనుందిగానీ.... ఈ డాక్యుమెంటరీలో వినిపించే ‘యూ లివ్ ఇన్ మీ’ పాటలా... దృశ్యాలూ మనలో చాలాకాలమే ఉండిపోతాయి.

 - యాకుబ్ పాషా యం.డి

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top