మిడతల సముద్ర యాత్ర!

Locust Attack Again on Mumbai From Omen - Sakshi

ఒమెన్‌ నుంచి ముంబై వైపు ఈ నెల 12న బయలుదేరిన మిడతల దండు..

17న చేరుకునే అవకాశం  

దక్షిణాది రాష్ట్రాలకూ పొంచి ఉన్న మిడతల ముప్పు  

16 రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం

జూన్‌ 22 – జూలై 17 మధ్యలో రాజస్థాన్‌కు భారీగా మిడతల తాకిడి

సాధారణంగా తూర్పు ఆఫ్రికా నుంచి ఇరాన్, పాకిస్తాన్‌ మీదుగా మన దేశం (రాజస్థాన్, పంజాబ్‌ సరిహద్దు ప్రాంతం)లోకి గాలి వాటున ఎడారి మిడతల దండ్లు వస్తూ ఉంటాయి. అయితే, ఈ ఏడాది అసాధారణంగా ఎన్నో రెట్లు ఎక్కువగా మిడతలు పుట్టుకొచ్చినందున ఇప్పుడు సముద్రం వైపు నుంచి కూడా మిడతల దాడి ప్రారంభం అయ్యింది. అరేబియా మహాసముద్రం మీదుగా మిడతల దండు నేరుగా మన దేశంలో పశ్చిమ తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ(ఎఫ్‌.ఎ.ఓ.) ఈ విషయమై కొద్ది నెలలు ముందే హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో తొలి దండు ఒమెన్‌ దేశం నుంచి జూన్‌ 12న అరేబియా మహాసముద్రం మీదుగా ఆకాశ మార్గాన భారత్‌ వైపు బయలుదేరిందని ఎఫ్‌.ఎ.ఓ. తాజా బులిటెన్‌లో తెలిపింది. ఈ దండు ప్రయాణం సజావుగా కొనసాగితే జూన్‌ 17 నాటికి మహారాష్ట్ర సముద్ర తీరప్రాంతానికి చేరుకోవచ్చని ఎఫ్‌.ఎ.ఓ. పేర్కొంది. వాతావరణం అనుకూలించకపోతే మిడతలు సముద్రంలో పడి మరణించ వచ్చు కూడా అని తెలిపింది. 

ఒమెన్‌–ముంబై మధ్య 1,566 కిలోమీటర్ల దూరం ఉంది. మిడతల దండు ఇంత దూరం ఏకబిగిన తిండీ తిప్పలు లేకుండా, అలసట లేకుండా ఎగరగలుగుతుందా? అసాధ్యం కాదని చరిత్ర చెబుతోంది.
మిడతలు గంటకు 16–19 కి.మీ. ప్రయాణించగలవు. మిడతల దండ్లు 5 నుంచి 130 కి. మీ. లేదా అంతకన్నా ఎక్కువ దూరం ఎగరగలవు. మిడతల ప్రయాణ వేగం గాలుల వేగంపై ఆధారపడి ఉంటుంది.
మిడతల దండు అనేక రోజుల పాటు ఆకాశంలోనే ఉండి గాలి వాటున ప్రయాణించ గలదు. ఆ సమయంలో అతి తక్కువ శక్తిని మాత్రమే ఖర్చు చేయగల ఒడుపు మిడతలకు తెలుసునట. 300 కి.మీ. వెడల్పు ఉండే ఎర్ర సముద్రాన్ని తరచూ అలవోకగా దాటేస్తుంటాయి.
1954లో వాయువ్య ఆఫ్రికా నుంచి బయలుదేరి బ్రిటన్‌ చేరుకున్నాయి. 1988లో పశ్చిమ ఆఫ్రికా నుంచి కరిబియన్‌ చేరాయి. 5 వేల కి.మీ. దూరాన్ని కేవలం పది రోజుల్లో మిడతల దండులు చేరుకున్నాయి.
తూర్పు ఆఫ్రికా, ఒమెన్, ఎమెన్‌ తదితర దేశాల్లో కుప్పలు తెప్పలుగా గత 70 ఏళ్లలో ఎరుగనంత ఎక్కువ సంఖ్యలో మిడతలు పుట్టుకొస్తున్నాయి. కాబట్టి, అక్కడి నుంచి నేరుగా అరేబియా మహాసముద్రం మీదుగా మన దేశంలోని పశ్చిమ తీర ప్రాంతానికి మిడతల దండులు తాకే ముప్పు ఉంది. అక్కడి నుంచి గాలులు అనుకూలిస్తే దక్షిణాది రాష్ట్రాలపై కూడా వచ్చే కొద్ది వారాల్లో మిడతలు దండుయాత్ర చెయ్యొచ్చు.
అటు రాజస్థాన్‌ నుంచి కూడా ఇంతకు ముందుకన్నా ఎక్కువ సంఖ్యలో మిడతల గుంపులు దక్షిణాది వైపు రావచ్చు. ఎఫ్‌.ఎ.ఓ. ఎప్పటికప్పుడు మిడతల స్థితిగతులపై బాధిత దేశాలకు సమాచారం ఇస్తూ ఉంటుంది. జూన్‌ 22 నుంచి జూలై 19 వరకు రాజస్థాన్‌ మీదుగా మిడతల దండయాత్ర మరింత ఉధృతం కాబోతున్నదని, సర్వసన్నద్ధంగా ఉండాలని ఎఫ్‌.ఎ.ఓ. భారత ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా 16 రాష్ట్రాలను హెచ్చరించినట్లు సమాచారం. మిడతల నియంత్రణకు ట్రాక్టర్లు, ఫైరింజన్లతోపాటు డ్రోన్ల ద్వారా వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పురుగుమందులు పిచికారీ చేస్తున్నాయి. పరిస్థితి తీవ్రత దృష్ట్యా హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

వేపనూనె పిచికారీ చేయాలి: స్వామినాథన్‌

ప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త డా. ఎమ్మెస్‌ స్వామినాథన్‌ సహా పలువురు శాస్త్రవేత్తలు రైతులు రసాయనాలు పచికారీ చేయవద్దని సూచిస్తున్నారు. మిడతల రాకకు ముందు రోజుల్లో పంటలపై వేప నూనె కలిపిన నీటిని పిచికారీ చేయాలని డా. స్వామినాథన్‌ ఇటీవల ట్వీట్‌ చేశారు. వేప నూనె వాసన, రుచికి పంటలను మిడతలు తినకుండా వెళ్లి పోతాయి. అంతేకాదు, వేప నూనె పోషకంగా కూడా పంటలకు పనిచేస్తుందన్నారు.  
మిడతల దండును మట్టుబెట్టేందుకు పురుగుమందులు చల్లిన ప్రాంతాల్లో విషతుల్యమైన మిడతలు చచ్చి పడి ఉంటాయి. కాబట్టి, కనీసం వారం రోజుల వరకు పశువులు, కోళ్లు అటువైపు వెళ్లి విషతుల్యమైన మిడతలను తినకుండా రైతులు జాగ్రత్తపడాలి.   
ఎడారి మిడతలు దండు కట్టక ముందు బాల్య దశలో సాధారణ స్థితిలో ఉన్నప్పుడు రాత్రి వేళల్లో ఎగురుతాయి. పెరిగి పెద్దయి దండులో చేరిన తర్వాత పగటి పూట ఎగురుతాయి.  చెట్లు, పంటలపై వాలి రాత్రి పూట కూడా ఆకులు, కంకులు తింటూనే ఉంటాయి. రైతులు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండి, ప్రభుత్వాల సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ గండం గట్టెక్కాల్సిన సీజన్‌ ఇది.       

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top