సాహస మథనం

 life without a life is unbearable

సాహస గాథ

దారి తప్పిన పడవలో ఇద్దరు స్త్రీల 150 రోజుల పోరాటం
సాగరాన్ని మథనం చేసినప్పుడు అమృతం పుడుతుంది.
సాగరం మనిషిని మథనం చేసినప్పుడు సాహసం పుడుతుంది.

48 ఏళ్ల వయసొస్తే మన దేశంలో స్త్రీలు ఏం చేస్తారు? రిటైర్‌ అయ్యామని భావిస్తారు. కూతుళ్ల ప్రసవాలకు సాయం చేయడానికి సిద్ధమవుతారు. మనవలు, మనవరాళ్లతో గడపాలని అనుకుంటారు. సరిగ్గా చెప్పాలంటే జీవితం దాదాపుగా ఒక కొలిక్కి వచ్చింది... ఇంకా ఏం చేయాలి అని నిర్లిప్త పడతారు. కాని జెన్నిఫర్‌ ఆపెల్, తాషా ఫుఆవా అనే 48 ఏళ్ల స్త్రీలు మాత్రం అలా అనుకోలేదు. జీవితం ఇప్పుడే మొదలైంది అనుకున్నారు. సాహసం లేని జీవితం నిస్సారమైనదని, పిప్పి కంటే హీనమైనదవి భావించారు. సముద్రాన్ని సవాల్‌ చేసి జీవితం అంటే థ్రిల్‌ అని నిరూపిద్దామని అనుకున్నారు. కాని వాళ్లు ఒకటి అనుకుంటే సముద్రం ఒకటి చూపించింది. అయినా ధైర్యానిదే అంతిమ గెలుపు అని నిరూపితం అయ్యింది.

ఒహావు నుంచి తహతి వరకు
పసిఫిక్‌ సముద్రం లోతెంతో తెలుసా? 4000 మీటర్ల నుంచి 10 వేల మీటర్లు. మహా మహా ఓడలను, సముద్ర దిగ్గజాలను గడగడలాడించిన మహా సముద్రం అది. అలాంటి సముద్రంలో ఉన్న హవాయి దీవుల్లోని ‘ఒహావు’ దీవి నుంచి ‘తహతి’ దీవి వరకు అంటే 2,700 మైళ్ల దూరాన్ని ఒక పడవలో ప్రయాణించాలని అనుకున్నారు ఇద్దరు మహిళా నావికులు జెన్నిఫర్, తాషా. ఇద్దరికీ సముద్ర యానంలో అనుభవం ఉంది. ఆపెల్‌కు యాభై అడుగుల పొడవున్న మర పడవ ఉంది. ఆ పడవలో దాదాపు 18 రోజులు ప్రయాణించి ఒహావు నుంచి తహతికి చేరుకోవాలని పసిఫిక్‌లోని సుందర దీవులను చూస్తూ వెళ్లాలని వీరి ఆలోచన. నిజానికి ఇలాంటి ప్రయాణాలు ఓడల్లో చేయాలి. పడవలు పనికి రావు. వచ్చినా ప్రమాదాలు ఎక్కువ. అయినా సరే జెన్నిఫర్, తాషా ఈ ప్రయాణానికి సిద్ధమయ్యారు.

మే 3, 2017న మొదలు
అవును. ఆ తేదీనే వాళ్ల ప్రయాణం ఒహావు నుంచి మొదలైంది. ఒక పడవ, ఇద్దరు స్త్రీలు, తోడుగా రెండు పెంపుడు శునకాలు. వాటి పేర్లు ‘జీయస్‌’, ‘వాలెంటైన్‌’. ప్రయాణం మొదలైంది. పది పదిహేను రోజులు బాగానే సాగింది. కాని హటాత్తుగా పడవలోని ఇంజన్‌ సరిగ్గా పని చేయడం మొరాయించింది. అనుకున్న విధంగా ముందుకు పోవడం లేదు. ఏం చేయాలో తోచడం లేదు. మే 30న సముద్ర తుఫాను పడవను ముంచెత్తింది. దాంతో పడవలో ఉన్న కమ్యూనికేషన్‌ వ్యవస్థ దెబ్బ తింది. పడవ పూర్తిగా మనం కోరిన దిశలో ప్రయాణించడానికి పనికి రాకుండా పోయింది. చుట్టూ 16 కోట్ల చదరపు కిలోమీటర్ల మహా పసిఫిక్‌ సముద్రం. మధ్యలో ఎక్కడో చీమ కంటే సూక్ష్మంగా ఒక యాభై అడుగుల పడవ. ఏం చేయాలి? తమ దగ్గర ఉన్న ఫోన్ల నుంచి ప్రమాదాన్ని సూచించే కాల్స్‌ చేయడం మొదలుపెట్టారు. కాని వేటికీ సమాధానం లేదు. ఆ కాల్స్‌ ఎవరికీ అందడం లేదు. చీకటి అవుతూ ఉంది. తెల్లవారుతూ ఉంది. శునకాలు తమ యజమానురాళ్లకు వచ్చిన కష్టాన్ని గ్రహించాయి. అవసరానికి మించిన ఉత్సాహం ప్రదర్శిస్తూ వాళ్లను ఉత్సాహపరుస్తున్నాయి. పడవలో పులుల్లా అటూ ఇటూ తిరుగుతున్నాయి. వాటి ఉనికి తప్ప ఆ ఇద్దరు స్త్రీలకు చుట్టూ ఏ ఉనికీ లేదు. పలకరించే జీవి లేదు. స్పందించే నాధుడు లేడు.

పెద్దల మాట సద్దిమూట
హవాయి దీవుల్లో కాకలు తీరిన నావికులు ఎందరో ఉన్నారు. తమ ప్రయాణాన్ని మొదలెట్టే ముందు ఆపెల్, తాషాలు వారిని సలహాల కోసం కలిసినప్పుడు ‘పసిఫిక్‌తో గేమ్సా’ అన్నట్టు చూశారు. కాని వీళ్ల పట్టుదల చూసి ఒక ముఖ్యమైన సలహా ఇచ్చారు. ‘పడవను అంగుళం కూడా ఖాళీగా ఉంచొద్దు. మీ యాత్ర నెల రోజులకు ఉద్దేశించినదైతే సంవత్సరానికి సరిపడా ఆహారం సిద్ధం చేసుకోండి. మీరెళుతున్నది పసిఫిక్‌ మీద. ఇవాళ బయల్దేరితే రేపేం జరుగుతుందో ఊహించలేము’ అన్నారు. అందుకు తగ్గట్టుగానే ఆపెల్, తాషాలు ఆహారాన్ని పడవలో నింపేశారు. ఆ ఒక్క విలువైన సలహానే వాళ్ల ప్రాణాలు నిలబెడుతున్నాయి. అదొక్కటే కాక తాషా పడవలో వాటర్‌ ప్యూరిఫైర్లను ముందు జాగ్రత్తతో ఏర్పాటు చేసింది. అందువల్ల నీటి సమస్య ఏర్పడలేదు. ప్రాణాలు ఉన్నాయి. ఊపిరి కొట్టుకుంటోంది. రోజులు గడుస్తున్నాయి. డిప్రెషన్‌. హెలూసినేషన్స్‌. మే మొదటి వారం మొదలెట్టిన ప్రయాణం జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్‌ ముగిసి అక్టోబర్‌కు చేరుకుంది. పడవ దాని మానాన అది ఎటో కొట్టుకుపోతోంది. అది పోయి పోయి ఏదో ఒక నేలకు చేరుకుంటుందని ఆపెల్, తాషాల ఆలోచన. కాని ఎంతకీ నేల తగలదే.

ఆశ, నిరాశల మధ్య
ఆపెల్, తాషాలు తమ దగ్గర ఉన్న మొత్తం పది తారా జువ్వలను కూడా దూరంగా షిప్‌ కనిపించినప్పుడల్లా కాల్చి అదృష్టం పరీక్షించుకున్నారు. కాని లాభం లేకపోయింది. షిప్, వెస్సెల్‌ కనిపించిన ప్రతిసారీ ఆశపడటం అవి తమ మానాన తాము వెళ్లిపోవడం... అంతులేని దుఃఖం... కూడగట్టుకోవాల్సిన నమ్మకం... ఈలోపు అనుకోని చుట్టాలొచ్చారు. టైగర్‌ షార్క్స్‌. రెండుసార్లు అవి పడవను చుట్టుముట్టాయి మనిషి వాసనకు. కాని కుక్కలు తమ మొరుగుళ్లతో వాటిని బెదరగొట్టగలిగాయి. లేకుంటే వాటి పంటి మధ్య ఆపెల్, తాషాలు ఉప్పు నీటిని సంతరించుకుని రుచిగా ఆహారం అయి ఉండేవి.

ఆక్టోబర్‌ 24, వెలుతురు
అప్పటికి దాదాపు 150 రోజులు సమీపించాయి. ఆహారం దాదాపు ముగియ సాగింది. లేదంటే పాడైపోవడం మొదలెట్టింది. కుక్కల ఆహారం అయితే ఇక లేనట్టే. మాట ఇద్దరూ మాట్లాడే ఓపికను కోల్పోయారు. ఇక ఇవాళో రేపో చచ్చిపోతామని వారికి అర్థమైపోయింది. ఆ లోపు దూరంగా ఒక చేపల పడవ. తైవాన్‌ వారిది. అంటే తాము ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు? జపాన్‌కి ఈశాన్యంగా 900 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. తైవాన్‌ పడవ కూడా వీళ్లను చూడకుండా వెళ్లిపోయేదే. ఆపెల్‌ తెగించి సముద్రంలో దూకి ఓడ వైపు ఈత కొట్టసాగింది. అప్పటికి గాని పడవ వాళ్లు ఆపెల్‌ని చూడలేదు. వెంటనే వాళ్లు అక్కడకు దగ్గరగా ఉన్న అమెరికా నావీ బేస్‌కు సమాచారం అందించారు. అమెరికా రక్షణ ఓడ ఆఘమేఘాల మీదకు చేరుకుని ఆపెల్‌ను, తాషాను వారి రెండు శునకాలను రక్షించారు. ఓడలోకి చేరుకున్నాక వాళ్లు రెండు ధారలను తనివితీరా తాగారు. ఒకటి: ఆనందంతో పొంగుతున్న అశ్రుధార, రెండు: పడవ సిబ్బంది అందించిన నీటి ధార.

మళ్లీ సాహసానికే
ఆపెల్, తాషా తమ పడవను నడి సముద్రంలో వదిలేశారు. అది ఎప్పటికైనా ఏదో ఒక ఒడ్డుకు చేరుకుని తమకు దక్కుతుందని ఆశ. లేకపోయినా పర్వాలేదు. కొత్త పడవను సిద్ధం చేసుకొని వచ్చే వేసవిలో మళ్లీ సముద్రం మీద పడాలని వారి ఆలోచన. ఇంత జరిగాక? అవును ఇంత జరిగాక. ఊరికే కూర్చున్నా ఎదురుపడి వెళుతున్నా జీవితం తాను ఇచ్చే షాకులు ఇస్తూనే ఉంటుంది. మరి మౌనంగా ఉండి భరించడం ఎందుకు... తిరగబడితో పోలేదా అంటారు వాళ్లు. మనకు ఏదైనా స్ఫూర్తి వస్తున్నదా ఈ కథ చదివితే? ఎందుకు రాదు... ఒక్క సాహసం వేయి తెగింపులకు లంగరెత్తదూ?


సహాయక సిబ్బంది రక్షణ చర్యలు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top