స్వాతికి తెలియదు

Importance Of Sharing In Wife And Husband Relationship - Sakshi

మాధవ్‌ శింగరాజు

స్వాతికే కాదు.. సీతకు, శ్వేతకూ తెలియదు. పల్లవికి, ప్రవల్లికకూ తెలియదు. బాధ్యతగా ఆమె పప్పుల్నీ, ఉప్పుల్నీ లెక్కగట్టి మూడు పూటలా ఇంటిని నడిపిస్తున్నప్పుడు.. బాధ్యతగా అతడూ అప్పుల్నీ, తప్పుల్ని ఏరోజు కారోజు ఇంటికి రాగానే చీటీలో రాసి ఆమె చేతిలో పెట్టాలి. నెలకోసారి.. పే స్లిప్‌ చూపించడం కాదు.

గైస్‌.. ఒక రూపాయి అప్పు చేసేముందు ఆమెకు ఫోన్‌ చేసి చెప్పండి.. ఫోన్‌కి పది రూపాయలు అవుతున్నా సరే! ఒక సంతకం పెట్టే ముందు ఆమె అనుమతి తీసుకోండి.. ఆమె కోసం మీరు కొనబోతున్న శ్వేత సౌధపు అగ్రిమెంట్‌ కాగితాలైనా సరే.

ఉదయం ఆఫీస్‌కి వెళ్లిన నాన్న సాయంత్రం కొత్త కారుతో ఇంటికి వస్తే పిల్లలు వాకిట్లోకి ఒక్క గెంతు గెంతి ‘హే.. కొత్త కారు’ అని కారులోకి దూకి కూర్చుంటారు. మరీ చిన్నపిల్లలైతే వెళ్లి స్టీరింగ్‌ సీట్‌లో కూర్చొని స్టీరింగ్‌ని ‘జుయ్‌జుయ్‌’మని తిప్పుతారు. ‘మనదేనా నాన్నా’.. పిల్లలు అడిగే మొదటి ప్రశ్న. ‘ఎక్కడికెళ్దాం నాన్నా’.. రెండో ప్రశ్న. పిల్లల్ని ఎత్తుకుని బుగ్గలపై ముద్దుపెడుతూ భార్య వైపు చూస్తాడు అతడు. ‘మనదే కారు’ అంటూ ఒక ముద్దు. ‘నువ్వు చెప్పు ఎక్కడికెళదామో’ అంటూ ఇంకో ముద్దు. పిల్లలు అడిగినట్లే ఆమెకూ ఒక ప్రశ్న అడగాలని ఉంటుంది. ‘ఎక్కడిదండీ కారు?’ అని. కానీ అడగదు. అడిగితే, కారు ఎలా ఉందో చెప్పకుండా, కారు ఎలా వచ్చిందో చెప్పమని అడుగుతుందేమిటి’ అని భర్త నొచ్చుకుంటాడేమోనని ఆమె భయం. నొచ్చుకుంటాడన్న భయంతో ఆమె అతడిని చాలానే అడగలేదు. పెళ్లయి ఏడెనిమిదేళ్లు అవుతున్నా ఏ నెలలోనూ జీతమెంత అని భర్తను అడగలేదు. జీతంలో కటింగ్స్‌ ఎన్ని అని అడగలేదు. ఇంట్లోకి ఒకేసారి హైఎండ్‌ ఏసీ, ఫ్రిజ్, వాషింగ్‌మిషన్, టీవీ.. ఇంకా రెండుమూడు ‘చిన్న వస్తువుల్ని’ పిల్లల ఆటబొమ్మల్లా భుజాన మోసుకొచ్చిప్పుడు కూడా భుజం మీద నుంచి బరువును దింపిందే తప్ప, దింపాక పెరిగే వాటి బరువు గురించి అతడిని అడగలేదు. ‘ఈఎమ్‌ఐల్లో తెచ్చా. చిటికెలో అయిపోతాయి’ అని అన్నప్పుడు కూడా ఎవ్రీ మంత్‌ శాలరీ కన్నా, ఎవ్రీ మంత్‌ ఇన్‌స్టాల్‌మెంట్స్‌ ఎక్కువైపోవు కదా’ అని అడగలేదు. అడిగితే అతడు నొచ్చుకుంటాడు.

‘చిన్న వస్తువుల్ని’ ఇంటికి తెచ్చిన కొన్నాళ్లకే ఓరోజు అతడు ఆమె కళ్లకు గంతలు కట్టి కారులో ఓ పెద్ద ఇంటికి తీసుకెళ్లాడు. గంతలు విప్పాక, కళ్లు నులుముకుని చూసి, అప్పుడు మాత్రం అడిగింది, ‘ఎవరిల్లండీ, బాగుంది’ అని! ‘మనదే!’ అనలేదు అతను. ‘నీదే’ అన్నాడు. ‘నీ కోసమే’ అన్నాడు. అతడెప్పుడూ అలాగే మాట్లాడతాడు. మాట్లాడ్డం కాదు, నిజంగానే అతడు చేసేవన్నీ ఆమె కోసమే. చేయాలనుకునేవన్నీ ఆమె కోసమే.  ‘ఇప్పుడున్న ఇంటికే అంత అద్దె కడుతున్నాం. ఈ ఇంటికి ఇంకా ఎక్కువ ఉండదా’ అంది.. కొత్త గోడల్ని, కొత్త తలుపుల్ని, కొత్త కిటికీల్ని తడిమి చూస్తూ. పెద్దగా నవ్వి, ఆమె చుట్టూ చేతులు వేసి గాల్లోకి లేపాడు అతడు. ‘ఇది మన సొంతిల్లు. నీ కోసం, పిల్లల కోసం కొన్న ఇల్లు’ అన్నాడు. ‘ఇకనుంచి మనం అద్దె కట్టనక్కర్లేదు’ అన్నాడు. ‘ఆ కట్టేదేదో మన సొంత ఇంటికి కట్టుకుంటే సరిపోతుంది’ అన్నాడు. కట్టుకున్నది సొంతిల్లు అవుతుంది కానీ, నెల నెలా కట్టేది సొంతిల్లు అవుతుందా! ఆ మాటే ఆమె అనబోయింది. అతడు అననివ్వలేదు. ప్రశ్నలు కట్టిపెట్టు అని ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. అతడి చేతుల్లో ఆమె భద్రంగా ఉంది. ఇంత భద్రత కొత్తింట్లో ఉంటుందా.. పది వేల అద్దెకు బదులు నెలనెలా కట్టే ఇరవై వేల లోన్‌ కట్టవలసిన ఇంట్లో?! అతడు సంతోషంలో ఉన్నాడు. తనకొచ్చిన సందేహాలన్నీ భర్తకూ వచ్చి ఉంటాయి. అయినా సంతోషంగా ఉన్నాడూ అంటే.. తను వేరుగా సందేహపడాల్సిందేమీ లేదు. కుడికాలు లోపలికి పెట్టింది. పిల్లలు ‘ఓ.. ఓ..’ అంటూ కొత్తింట్లోని హాల్లోకి, బెడ్‌రూమ్‌లోకి, కిచెన్‌లోకి, బాత్‌రూమ్‌లోకి, బాల్కనీలోకి పరుగులు తీస్తున్నారు. ఎంత పిల్లల్తో పోటీపడి పరుగెత్తలేని కాలమైనా రోజుల్ని, వారాల్ని దాటి నెల దగ్గరికి వచ్చేస్తుంది. నెల తర్వాతి నెలకూ వచ్చేస్తుంది. ‘కాస్త టైట్‌గా ఉంది గురూ. వచ్చే నెల రెణ్ణెల్ల ఇంట్రెస్ట్‌ కలిపి ఇచ్చేస్తా..’ 

ఆమె వాకిట్లో ముగ్గేస్తోంది. అతడు ఆమెకు వినిపించనంత దూరం వెళ్లి ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. ఆఫీస్‌లోనే కాదు, ఇంట్లో ఉన్నప్పుడైనా ఫోన్‌లో ఏ ఉద్యోగం చేస్తుంటే ఆ మాటలే రావాలి. టెకీ అయితే అదేదో జార్గాన్‌ ఉంటుంది. ఫ్లోచార్టు, డీబగ్, లైఫ్‌ సైకిల్, టెస్టబుల్‌ కోడ్‌.. ఇలాంటి మాటలు రావాలి. డాక్టర్‌ అయితే రిపోర్ట్స్‌ అనీ, ఇన్వెస్టిగేషన్‌ అనీ, మెడికల్‌ హిస్టరీ అనీ రావాలి. జర్నలిస్ట్‌ అయితే ప్రెస్‌మీట్‌ అని, స్కూప్‌ అనీ, లీడ్‌ అనీ ఏవో ఉంటాయి. అవి రావాలి. ఇవేమీ కాకుండా టైట్‌గా ఉందనీ, ఒకేసారి రెణ్ణెల్లదీ ఇచ్చేస్తాననీ అంటున్నాడంటే.. అదీ ముంగిట్లో ముగ్గు పడే వేళ నుంచే కొత్తగా ‘టైట్‌ టాక్‌’ మొదలవుతోందంటే.. ఏనాడూ భార్యాబిడ్డల్తో కలిసి కూర్చుని భోజనం చేసే స్థిమితం కూడా లేని అతడు.. త్వరలోనే త్వరగా ఇంటికి రాబోతున్నాడనే! త్వరగా ఇంటికి వచ్చిన ఆ రాత్రి.. తనని చూసి కేరింతలు కొడుతూ నిద్రమానుకున్న పిల్లలతో కలిసి.. తండ్రీ బిడ్డల్ని చూసి మురిసిపోతున్న భార్యతో కలిసి.. భోజనం చేయబోతున్నాడనే! బయటి నుంచి తను తెచ్చిన ‘ఫుడ్‌ ఐటమ్స్‌’ని అందరి భోజనంలో తలా ఇంత చేర్చి పిల్లలకు, భార్యకు తనే మొదటి ముద్ద తినిపించబోతున్నాడనే! హైదరాబాద్‌లో శనివారం రాత్రి ఇలాగే ఓ కుటుంబం ‘కలిసి భోజనం’ చేసింది! అతడు, ఆమె, ఇద్దరు పిల్లలు. ఆరేళ్లొకరికి. ఏడాదిన్నరొకరికి. టెకీ అతను. చిన్న వయసే. పెద్ద కంపెనీలో పని. పెద్ద జీతం. అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాడు. బిజినెస్‌ చేసి అప్పు తీర్చాలనుకున్నాడు. బిజినెస్‌ కోసం మళ్లీ అప్పు చేశాడు.

బాగా బతకడం కోసం కాదు ఇవన్నీ. ఇంకా బాగా బతకడం కోసం. చివరికి బతకలేక తనను, కుటుంబాన్ని చంపుకున్నాడు! జీతం అప్పును పుట్టిస్తుంది. అప్పును కట్టలేదు. ఒకట్రెండు వాయిదాలైతే జీతం తీర్చేస్తుంది. అప్పుల్ని, వడ్డీల్ని తీర్చే కెపాసిటీ ఎంత పెద్ద జీతానికైనా ఉండదు. ఆ సంగతి అతడికెవరూ చెప్పలేకపోయారా! ఇంత జరుగుతోందని అతడెవరికైనా చెబితేనే కదా! భార్యకు కూడా చెప్పలేదు. చనిపోతూ తండ్రికి రాసిన ఉత్తరంలో మాత్రం చెప్పాడు. ‘స్వాతికి ఇవేవీ తెలియదు నాన్నా..’ అని చెప్పాడు! స్వాతి అతడి భార్య. అతడు నొచ్చుకుంటాడని అతడిని ఏనాడూ ఎందుకు, ఎలా అని అడగని భార్య.. ‘బతకాలని ఉంది స్వాతీ’ అని ఒక్కమాట అని ఉంటే.. బతకలేనంత కష్టం ఏమొచ్చిందో అడిగి తెలుసుకుని ఉండేది. కష్టమో, నష్టమో కలిసే బతుకుదాం అని ధైర్యం చెప్పి ఉండేది. మాటైనా చెప్పకుండా భార్యనీ పిల్లల్నీ తనతో తీసుకుపోయాడు! l

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top