బతుకు నుంచి బడికి

IAS Officer Admits Prison Inmates Daughter In International School - Sakshi

మంచి విషయం

సెంట్రల్‌ జైల్లో ఉన్న ఒక పాపను జిల్లా కలెక్టర్‌ స్కూల్లో చేర్పించగానే ఆ స్ఫూర్తితో మరో పదిహేడు మంది చిన్నారుల్ని తమ స్కూల్లో చేర్చుకుని ఉచిత విద్య, వసతి ఇచ్చేందుకు స్కూళ్ల యాజమాన్యాలు ముందుకు వచ్చాయి!

సంజయ్‌ కుమార్‌ అలాంగ్‌.. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ జిల్లా కలెక్టర్‌. ఏటా ఆయన బిలాస్‌పూర్‌లోని సెంట్రల్‌ జైల్‌ తీరుతెన్నుల్ని పర్యవేక్షించేందుకు వెళుతుంటారు. వెళ్లి, ఖైదీల బాగోగులను, వారి వ్యక్తిగత వివరాలను అడిగి తెలుసుకుంటారు. వారికేమైనా సమస్యలున్నాయేమో కనుక్కుంటారు. పోలీసు అధికారులు జైలును సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అని కూడా ఖైదీలను అడుగుతారు!

తల్లి చనిపోయింది.. తండ్రి జైలుపాలు!
సంజయ్‌ కుమార్‌ ఈ ఏడాది కూడా బిలాస్‌పూర్‌ సెంట్రల్‌ జైలుకు వెళ్లారు. అలా వెళ్లినప్పుడు మహిళా వార్డులో కొందరు ఖైదీల మధ్యన కూర్చొని ఒక బాలిక కనిపించింది! ఆ బాలిక పేరు ఖుషీ. ఐదేళ్లుగా జైల్లో ఉంటోంది. అయిదేళ్లుగా అంటే.. దాదాపుగా ఆమె పుట్టినప్పటి నుంచీ! తండ్రి ఏదో నేరం చేసి, ఐదేళ్ల క్రితం జైలు పాలు అయినప్పట్నుంచీ ఖుషీ కూడా అదే జైల్లో ఉంటోంది. ఖుషీ తల్లి ఖుషీ 15 రోజుల బిడ్డగా ఉన్నప్పుడే పచ్చకామెర్లతో చనిపోయింది. ఈ వివరాలన్నీ కలెక్టర్‌కు చెప్పారు జైలు అధికారులు. అప్పటికి ఆయన వెళ్లిపోయారు. ఆ తర్వాత ఖుషీ జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఆమెను ఇంటర్నేషనల్‌ స్కూల్లో చేర్పించారు కలెక్టర్‌ సంజయ్‌ కుమార్‌. నిజానికి అది కలెక్టర్‌ విధులలో భాగం కాదు. అంతరాత్మ ప్రబోధానుసారం ఆయన ఆ బాధ్యతను స్వీకరించారు. 

కలెక్టర్‌ సంజయ్‌ కుమార్‌
ఖుషీ అనేది అసలు పేరు కాదు. చట్ట ప్రకారం ఆమె అసలు పేరును వెల్లడించడానికి లేదు. అలాగే ఆమె ఫొటోను పత్రికల్లో చూపించడానికి లేదు. ఈ జాగ్రత్తలన్నీ కలెక్టర్‌ తీసుకున్నారు. మొదటి రోజు తనే స్వయంగా ఖుషీని స్కూలుకు తీసుకెళ్లి వదిలిపెట్టారు. ఖుషీ ప్రమేయం లేకుండా ఖుషీ జీవితం ఎలా జైలు వైపు అడుగులు వేసిందో, అలాగే ఖుషీ ప్రమేయం లేకుండా ఖుషీ అంతర్జాతీయ పాఠశాల వైపు నడిచింది. జైలు నిబంధనల ప్రకారం మహిళా ఖైదీల మైనర్‌ పిల్లల్ని ఇంట్లో చూసేవాళ్లెవరూ లేనప్పుడు, మరీ చిన్నవారిగా ఉన్నప్పుడు తల్లితో పాటే జైల్లో ఉంచుతారు. ఒకవేళ తల్లి లేని పిల్లలు అయి ఉండి, తండ్రి నేరం చేసి జైలుకు వెళితే అదే జైల్లో మహిళా ఖైదీలతో పాటు పిల్లల్ని ఉంచి, ఆరేళ్ల వయసు వచ్చాక బంధువులకు గానీ, బంధువులు కూడా లేకుంటే ప్రభుత్వ సంరక్షణ గృహాలకు గానీ తరలిస్తారు. ఆ తర్వాత వాళ్లే స్కూల్లో చే ర్పిస్తారు. 

స్కూల్లో తొలి రోజు.. ఖుషీ మర్చిపోలేదు
ఖుషీని స్కూల్లో చేర్పిచాలన్న ఆలోచన వచ్చిన వెంటనే కలెక్టర్‌ సంజయ్‌ కుమార్‌.. ‘‘పెద్దయ్యాక నువ్వేం అవాలని అనుకుంటున్నావు’’ అని అడిగారు. ‘‘పెద్ద స్కూల్లో చదవాలని ఉంది’’ అని చెప్పింది ఖుషీ. వెంటనే ఆ చుట్టుపక్కల ఉన్న పెద్దస్కూళ్లకు సమాచారం పంపించారు. ‘ఇలా ఒక చిన్నారి జైల్లో ఉంది. ఆమెకు అడ్మిషన్‌ కావాలి’ అని అడిగించారు. జైన్‌ ఇంటర్నేషనల్‌ స్కూలు ముందుకు వచ్చింది. ఉచితంగా చదువు చెప్పడం మాత్రమే కాక, ఆమె ఇంటర్‌ పూర్తి చేసేవరకు ఉచితవసతి కల్పిస్తామని తెలిపింది. వెనువెంటనే అడ్మిషన్‌ ప్రాసెస్‌ అంతా చకచకా జరిగిపోయింది. ‘‘తాము చేయని తప్పుకు అన్యాయంగా జైల్లో ఉంటున్న పిల్లల్ని చదివించనన్నా చదివించాలి లేదా వారికోసం మంచి యాక్టివిటీస్‌ని అయినా రూపొందించాలి. అలా కాలానికి వదిలిపెట్టడం సరికాదు’’ అని సంజయ్‌ అంటారు. 

స్కూల్లో మొదటిరోజు ఖుషీకి అనూహ్యమైన ఆదరణ లభించింది. ఎవరో చీఫ్‌ గెస్ట్‌ వస్తున్నట్లుగానే ప్రిన్స్‌పాల్‌ సహా సిబ్బంది అంతా స్వాగతం పలికారు. ఆ అపురూపమైన సందర్భం ఖుషీకి బహుశా జీవితాంతం గుర్తుండి పోతుంది. ఖుషీని ఆయన స్కూల్లో చేర్చగానే, ఆ విషయానికి ప్రాధాన్యం లభించి, సెంట్రల్‌ జైల్లో ఉన్న మరో పదిహేడు మంది చిన్నారులను స్కూల్లో చేర్పించడం కోసం ఎన్జీవో సంఘాలు దరఖాస్తు పెట్టుకున్నాయి! సంజయ్‌ కుమార్‌ ఇచ్చిన ఇన్‌స్పిరేషన్‌ అది. 

బాల్యం తిరిగి రానిది. తిరిగిరాని ఆ బాల్యాన్ని జైల్లో ఉంచి స్వేచ్ఛ లేకుండా చేయడంపై ఇండియాలో ఏళ్లుగా చర్చ నడుస్తోంది. దానికొక ముగింపు రావడం లేదు. అమ్మగానీ, నాన్న గానీ, అమ్మానాన్న గానీ జైల్లో ఉన్నప్పుడు బయటెవరూ లేని పిల్లల్ని జైల్లో ఉంచితే భద్రంగా ఉంటారు కదా అనే వాదన కూడా ఉంది. భద్రత ఉంటే సరిపోయిందా? భవిష్యత్తు ఉండొద్దా? ఆరేళ్లకే ఏం భవిష్యత్తు ఏర్పడుతుంది అనే వాళ్లు ఉన్నారు. ఆరేళ్లకు భవిష్యత్‌ ఏర్పడకపోవచ్చు. అరవైఏళ్ల భవిష్యత్తు ఈ ఆరేళ్ల మీదే కదా ఆధారపడి ఉండేది. ఇప్పుడే కదా ఆలోచనలు వికసించేది. ఇప్పుడే కదా ఆశలు చిగురించేది. ఇప్పుడే కదా జ్ఞాపకాలు స్థిరపడిపోయేది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top