విను నా మాట బంగారు బాట

విను నా మాట బంగారు బాట - Sakshi


చేపని ఇవ్వడం కంటే చేపలు పట్టడం నేర్పడమే మంచి పని.

 నిజమే... పది రూపాయలు ఇవ్వడం సులువు.

 పరుల కోసం పది నిమిషాలు కేటాయించడం మాత్రం చాలా కష్టమైన పని.

 కాని ఓ హెడ్‌కానిస్టేబుల్  ఆ పని చేశాడు.  యువతకు ఉపాధి

 అవకాశాలు కల్పిస్తూ... అందరి మనసులు గెలుచుకుంటున్నాడు.


 

కానిస్టేబుల్ ఉద్యోగం రాగానే డి.జి.రామమూర్తి తల్లిదండ్రులు ‘హమ్మయ్య...’ అనుకున్నారు. కాని మన కానిస్టేబుల్ నిశ్చింతగా అక్కడితో ఆగిపోలేదు. ఇంకా ఏదో చేయాలన్న తపన.  చదువుకున్నన్నాళ్లు సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో ట్యూషన్లు చెప్పుకుంటూ ప్రతిక్షణం విద్యార్థుల మధ్యన గడిపిన జ్ఞాపకాలు ఉద్యోగంలో చేరినా అతన్ని వదల్లేదు.



ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూనే తనకున్న మిమిక్రీ కళతో సెలవు రోజులన్నీ పాఠశాలల్లో, కళాశాలల్లో గడపడం మొదలుపెట్టాడు. ఇలా ఇరవైఏళ్ల నుంచి రామమూర్తి విద్యార్థుల గదుల్లోకి, వారి మస్తిష్కాలలోకి వెళ్లి ఏం చేశాడు? ఏం సాధించాడు? అదే మాట అడిగితే... ‘‘ఏవో నాలుగు మంచి ముక్కలు చెబుతాం, వినండి అంటే ఎవరికి నచ్చుతుంది? ఏదో ఒక ఆకర్షణ లేకపోతే గంటల తరబడి నేను చెప్పే కబుర్లు ఎవరు వింటారు?  అందుకే ‘మిమిక్రీ’తో అందర్నీ ఓ చోట కదలకుండా కూర్చోబెట్టగలిగాను.



ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి, కష్టాల్లో ఎలా నిలబడాలి... ఇలా ఒక్కో అంశానికి హాస్యాన్ని జోడించి మిమిక్రీ చేసి చెప్పడంలో విజయం సాధించాను. నవ్వులతో మొదలైన నా పాఠాలు ఓ పదిమంది జీవితాలకు బంగారు భవిష్యత్తు ఇచ్చేవరకూ వెళ్లాయి’’ అని ఎంతో గర్వంగా చెప్తారు రామమూర్తి.

 

కూతురు పేరుతో...

 

చిత్తూరు వి.కోట పరిధిలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రామమూర్తి గత ఇరవైఏళ్లుగా మిమిక్రీ పేరుతో విద్యార్థులకు వ్యక్తిత్వవికాస తరగతులు చెబుతూ తనవంతు సేవ చేస్తున్నాడు. ఈ సమయంలో తన కూతురు రేవతికి క్యాన్సర్ వచ్చింది. ఇంజనీరింగ్ చదువుతున్న రేవతి ఆరు నెలలపాటు క్యాన్సర్‌తో పోరాడి మరణించింది.  గత ఏడాది జనవరిలో రేవతి మరణం తర్వాత రామమూర్తి చేసిన మొదటిపని ‘రేవతి ఫౌండేషన్’ స్థాపించడం. ‘‘మా అమ్మాయి ఈడు పిల్లలకు భవిష్యత్తుపై ఎంత బెంగ ఉంటుందో తెలుసు నాకు. అందుకే యువతకు ఉపాధి మార్గాలు వెతికిపెట్టే పనిచేస్తే బాగుంటుంది అనుకున్నాను. దానికి ఆన్‌లైన్ సహకారం తీసుకున్నాను. ఇప్పటివరకూ మా డిపార్ట్‌మెంట్‌లో ఇప్పించిన ఉద్యోగాలతో కలిపి వందకు పైగా యువతకు ఉపాధి అవకాశాల్ని కల్పించగలిగాను’’ అంటున్నారు రామమూర్తి.

 

అందరి సహకారం...

 

రేవతి ఫౌండేషన్ స్థాపించాక జాతీయస్థాయిలో యువతకున్న ఉద్యోగ అవకాశాల గురించి వెతుకులాట మొదలుపెట్టారు రామమూర్తి. ఆ సమయంలో ‘ఐ గెట్ యు’ అనే ప్రైవేటు సంస్థతో పరిచయం ఏర్పడి వారితో కలిసి పనిచేస్తున్నారు. ‘‘ఓ వందమంది యువతకు శిక్షణ ఇచ్చి కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయించడంతో చాలామందికి మా డిపార్టుమెంటులోనే ఉద్యోగాలు వచ్చాయి.



బ్యాంకు, ఇంజనీర్... వంటి డిపార్టుమెంట్‌లలో కూడా అప్లయ్ చేయించాను. నాకున్న కొద్దిపాటి పరిచయాలతో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడం కష్టం. అలాంటి సమయంలో ‘ఐ గెట్ యు’ అని సంస్థ నా గురించి తెలుసుకుని నాకు సహకరిస్తానంది. వారి వెబ్‌సైట్‌లో దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ అవకాశాల సమాచారం ఉంటుంది. ఆ లింక్ మా రేవతి ఫౌండేషన్ సైట్‌కి ఇమ్మని అడిగితే ఒప్పుకున్నారు. ఇక అప్పటినుంచి కొన్ని వేలమంది మా సైట్ ద్వారా ఉద్యోగ అవకాశాల గురించి తెలుసుకుంటున్నారు.



వివరాల కోసం సైట్‌లో ఉన్న నెంబర్‌కి ఫోన్ చేస్తే మా సిబ్బంది వెంటనే వారికి గైడ్ చేస్తారు.  నా ధ్యేయం... చదువుకున్న యువత ఒక్క నిమిషం కూడా సమయం వృథా చేయకూడదు. ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోకూడదు. వారి భవిష్యత్తు కోసం నేను చెబుతున్న పాఠాలకు రేవతి ఫౌండేషన్ ద్వారా బలమైన పునాది పడాలి. వాటిపై వారు నిర్మించుకునే సౌధాలు సమాజానికి ఎంతోకొంత నీడనివ్వాలి’’ అని ముగించారు రామమూర్తి.

 

- భువనేశ్వరి

 

రేవతి ఫౌండేషన్ స్థాపించాక జాతీయ

స్థాయిలో యువతకున్న ఉద్యోగ అవకాశాల గురించి వెతుకులాట మొదలుపెట్టారు రామమూర్తి. ఆ సమయంలో ‘ఐ గెట్ యు’  అనే ప్రైవేటు సంస్థతో పరిచయం ఏర్పడి వారితో కలిసి పనిచేస్తున్నారు.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top