అర్థం పర్థం

అర్థం పర్థం


జీవితం ఎంతకీ అర్థం కాకపోయేసరికి, ఒకాయనకి నిఘంటువు తయారు చేయాలనే కోరిక పుట్టింది. ఒక పండితుడి దగ్గరకెళ్లి ఈ విషయం చెప్పాడు.


‘‘నీకు భాష తెలుసా?’’ అనుమానంగా అడిగాడు ఆయన.


‘‘తెలుసండి. మన సందు చివర గోలీ సోడాలమ్ముతాడు’’.


‘‘నీ మాటలకేమైనా అర్థంపర్థముందా?’’ అని వంకీ కర్ర వేసుకుని వెంటపడ్డాడు పండితుడు. మనవాడు పారిపోయాడు. ఒక ప్రవచనకర్త ఎదురయ్యాడు. ‘‘స్వామీ అర్థానికి అర్థం తెలుసుకానీ పర్థమంటే ఏంటి?’’ అని అడిగాడు. ఆయన కండువాని మెడకి పరపర రుద్ది ‘‘అర్థాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అదే నీకు అర్థమైందంటే నువ్వు అర్థశాస్త్ర నిపుణుడివై యుంటావు. ఇక పర్థమంటే పరమార్థం. మనుషులు ఆత్మల్ని పరమాత్మని ఆశ్రయించినట్టు, అర్థం కానిదే పరమార్థం’’ అని చెప్పాడు.


‘‘పరమార్థమంటే అర్థం కానిదా? అర్థం లేనిదా?’’


‘‘అర్థం కానిదంతా అర్థం లేనిది కాదు. అర్థం లేనిదంతా అర్థం కానిదీకాదు.’’


జ్ఞానులు మాట్లాడుతున్నపుడు అజ్ఞానులు అడ్డుతగలడం సర్వసాధారణం. జ్ఞానం నదిలాంటిదైతే అజ్ఞానం అండర్‌గ్రౌండ్ డ్రెయినేజి. చాపకింద నీరులాగా వెళ్లి జ్ఞానాన్ని కలుషితం చేస్తుంది.


‘‘అడ్డగోలుగా వాదిస్తే వేదం కూడా ఓడిపోతుంది. నామవాచకాలు సర్వనామాలుగా మారుతాయి. క్రియ నిష్క్రియగా మారుతుంది. అన్వయం సమన్వయం, అమ్రేడితంగా మారి పీడిస్తాయి’’


‘‘అయ్ బాబోయ్ మీకు భాష తెలుసా?’’


 ‘‘తెలుసు, బస్టాండ్ సెంటర్‌లో బజ్జీలమ్ముతుంటాడు’’


 ‘‘తలకట్టు చూసి, పదకట్టు తెలుసుకున్న, మీదీ కనికట్టేనా?’’


 ‘‘నీకు పిచ్చిగిచ్చి వుందా?’’ అని పద్యంలో బాదడానికి ప్రయత్నించాడు.


 సీసా మద్యం కంటే, సీసపద్యం ప్రమాదమని మనవాడు గ్రహించి పారిపోతుండగా ఒక పొలిటీషియన్ ఎదురయ్యాడు. జనాలకి దండం పెట్ట్టి ఆయన రెండు చేతులు అతుక్కుపోయాయి. అతుకు వదిలించడానికి డాక్టర్ దగ్గరి వెళుతున్నాడు.


 ‘‘సార్, పిచ్చి అనేది లోకసహజం. అది ఉన్నవాడు లేదనుకుంటాడు. లేనివాడు ఉందనుకుంటాడు. పిచ్చి లేనివాళ్లు పిచ్చాసుపత్రిలో, అది ఉన్నవాళ్లు లోకమనే ఆస్ప్రత్రిలో ఉంటారు.’’


 ఈ వాలకం చూసి నాయకుడికి కొంచెం కంగారు పుట్టింది. ‘‘ఇంతకూ నీకేం కావాలి?’’ భయంగా అడిగాడు. ‘‘పిచ్చికి అర్థం తెలుసు కానీ, గిచ్చి అంటే అర్థమేంటి?’’


 ‘‘అర్థాలు తెలుసుకోవడమంత అనర్థం ఈ ప్రపంచంలో ఇంకోటి లేదు. ప్రజాస్వామ్యమంటే అర్థం తెలియకుండా పాతికేళ్ల నుండి రాజకీయాల్లో ఉన్నా, అన్నీ తెలిసినట్టు నిండుకుండలా ఉంటూ, ఏదడిగినా కుండబద్దలు కొట్టినట్టు చెప్పగలిగితే డోకా ఉండదు. గిచ్చడమంటే ఓటేయడం. నాయకులు ప్రజల్ని ఓటేయించుకుని గిచ్చితే, ఓటుకు డబ్బులడిగి ప్రజలు నాయకుల్ని గిల్లుతారు. ఇంతకీ ఈ అర్థం గోల నీకెందుకు?’’


 ‘‘డి క్షనరి తయారు చేద్దామని’’ ‘‘డికాక్షన్‌కి, డిక్షనరీకి తేడా తెలియని ఆర్డినరీ జనానికి ఎక్‌స్ట్రార్డినరీ అవసరం లేదు’’


 ‘‘అయితే మీక్కూడా ఎంతో కొంత భాష తెలుసన్నమాట’’

‘‘ఎంతో కొంత కాదు, బాగా తెలుసు, పోయిన ఎలెక్షన్లలో నేను పోలింగ్ ఏజెంట్‌గా పనిచేశాను’’ అన్నాడు. జిలేబీకి, గులాబీకి తేడా తెలియని జనం లోకమంతటా ఉన్నారు. మూర్ఖత్వాన్ని మొగ్గలోనే తుంచేయాలి అనుకుని మనవాణ్ణి  వెంట పెట్టుకుని పండితుడి దగ్గరికెళ్లాడు నాయకుడు. ‘‘చేతులు జోడించి ఉన్న నాయకుణ్ని చూసి పండితుడు ముచ్చటపడి ప్రతి నమస్కారం చేశాడు.


‘‘చెప్పులజోడు. కళ్లజోడులుగా ఇది చేతుల జోడు. దీన్ని విడదీయలేదు’’ అన్నాడు నాయకుడు.


‘‘ఇంతకూ మీరిద్దరూ ఎందుకొచ్చారు?’’

‘‘భాష అంటే ఒక వ్యక్తి కాదు ఇద్దరని తెలపడానికొచ్చాం’’ అని చెప్పాడు నిఘంటువు తయరీదారు. మలేరియా వచ్చినోడిలా పండితుడు గజగజ వణికాడు. వంకీకర్రతో నాయకుడి చేతుల మీద ఒక్కటేశాడు. చేతులు విడివిడగానే నాయకుడు ఆనందించి... ‘‘ఆగ్రహం వల్ల అనుగ్రహం లభించడమంటే ఇదే’’ అన్నాడు.


‘‘నువ్వు మూర్ఖుడివా? గీర్ఖుడివా?’’ అన్నాడు పండితుడు.

గీర్ఖుడికి అర్థం తెలుసుకోవడానికి నిఘంటువు బయలుదేరింది.

‘‘మాటల్లోనే కాదు, మీరు చేతల్లో కూడా పండితులే’’ అనుకుంటూ నాయకుడు వెళ్లాడు.

- జి.ఆర్.మహర్షి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top