ఒక బొమ్మ అంటే వెయ్యి మాటలకు ప్రతీక... అంటారు ఫ్రెంచి ఆర్టిస్టు సంధి షిమ్మెల్ గోల్డ్. ఆమె ఒక అసాధారణ ఆర్టిస్టు.
ఒక బొమ్మ అంటే వెయ్యి మాటలకు ప్రతీక... అంటారు ఫ్రెంచి ఆర్టిస్టు సంధి షిమ్మెల్ గోల్డ్. ఆమె ఒక అసాధారణ ఆర్టిస్టు. గోల్డ్ కళాకృతులు అమెరికా, యూరప్, ఆసియాలోని వివిధ ప్రైవేట్, కార్పొరేట్ ఆఫీసులలో గోడలపై మనోహర దృశ్యాలను ఆవిష్కరిస్తాయి, మ్యూజియంలో శాశ్వతస్థానాన్ని సంపాదించుకున్నాయి.
‘‘నా కళాకృతులు మన సమాజంలోని సౌందర్యంతో కూడిన అబ్‌సెషన్‌ని ప్రతిబింబిస్తాయి. కాగితాలను నేను కొత్తరకంగా ఊహించుకుని, కొత్త బొమ్మలుగా రూపొందిస్తాను. ఈ బొమ్మలలో వేలకొలదీ కాగితపు ముక్కలు వచ్చి కూర్చుంటాయి. అవన్నీ ఒకే పరిమాణంలో ఉండవు. కాగితపు ముక్కలు సాదావి కాకుండా బొమ్మలు, అక్షరాలతో నిండినవి ఉంటాయి. వాటిని ఒకచోట చేరిస్తే అచ్చంగా మొజాయిక్‌లాగ ఉంటుంది. ఈ పేపర్ టైల్స్ పూర్తిగా ఒక కొత్త బొమ్మను రూపొందిస్తాయి.
అవి కొత్తకొత్త భావాలను పలుకుతాయి’’ అంటారు గోల్డ్. కాగితం మీద కాని కాన్వాస్ మీద కాని రేఖాచిత్రాలు చిత్రించి వాటిమీద కాగితపు ముక్కలను అతికించి చిత్రవిచిత్రమైన కళాకృతులు చేయడంలో గోల్డ్ మంచి నేర్పరి. మనుషులలో ఉండే రకరకాల భావాలను మాత్రమే కాకుండా, ప్రపంచంలో ఎక్కడైనా ఉపద్రవాలు జరిగినప్పుడు సైతం వాటిని తన బొమ్మలలో చూపుతారు గోల్డ్. సామాజిక స్పృహ ఉన్న గోల్డ్ తన మనసును, తాను తయారుచేసే బొమ్మలలో ప్రతిబింబిస్తున్నారు.