కింది నుంచి గ్యాస్‌పోతోందా?  

Excessive Consumption Of Salt In Food Is A Cause Of The Gas Problem - Sakshi

కింది నుంచి గ్యాస్‌ పోయే సమస్య కేవలం ఆరోగ్యపరమైనది మాత్రమే కాదు. ఇది సామాజికంగా కూడా చాలా ఇబ్బందికరమైనదే. సమాజంలో గౌరవనీయమైన వ్యక్తులను సైతం నలుగురిలో నవ్వుల పాలు చేస్తుంది. కొన్ని కొన్ని చిన్న సూచనలతో దీన్ని చాలావరకు నివరించవచ్చు. ఆ సూచనలివే... 

సరిపడని ఆహారాలకు దూరంగా ఉండాలి : మనకు సరిపడని ఆహారాల కారణంగా కూడా కింది నుంచి గ్యాస్‌ పోతుంటంది. ఉదాహరణకు కొందరికి పాలతో అలర్జీ ఉంటుంది. వారు పాలు తాగగానే కింది నుంచి గ్యాస్‌ పాస్‌ కావడం మొదలవుతుంది. మనకు సరిపడని ఆహారపదార్థాలను గుర్తించి, వాటికి దూరంగా ఉండటం వల్ల ఈ ముప్పు తప్పిపోతుంది. 

కొన్ని రకాల కూరలకు దూరంగా ఉండండి : చాలామందికి క్యాబేజీ, బీన్స్, కాలీఫ్లవర్‌ వంటివి తిన్నప్పుడు కడుపులో గ్యాస్‌ నిండుతుంది. కింది నుంచి గ్యాస్‌ పోయేవారు మాత్రం ఇలాంటి ఆహారాలకు కాస్తంత దూరంగా ఉండటం లేదా బాగా తగ్గించి తినడం అవసరం. మిగతావారికి ఈ ఆహారాలు చాలా ఆరోగ్యకరమని గుర్తించండి. కేవలం గ్యాస్‌ ఇబ్బందిని తగ్గించుకోవడం కోసం మాత్రమే వీటిని చాలా పరిమితంగా తీసుకోవాలి. 

ఉప్పు తగ్గించాలి : ఆహారంలో ఉప్పు ఎక్కువగా వాడటం కూడా కింది నుంచి గ్యాస్‌పోయే సమస్యకు ఒక కారణం. ఆహారంలో ఉప్పు ఎక్కువగా వాడినప్పుడు అది కడుపు ఉబ్బరం ఎక్కువ కావడానికి దారితీస్తుంది. అందుకే ఉప్పు పాళ్లు ఎక్కువగా ఉండే పచ్చళ్లు, అప్పడాలవంటివి తగ్గించాలి. అలాగే కూరల్లో, పెరుగులో వేసుకునే ఉప్పు కూడా తగ్గించడం మంచిది. 

మలబద్దకం నివారణతో : తగిననన్ని పీచు పదార్థాలు ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. ఇందుకోసం పొట్టుతీయని కాయధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం అవసరం. అలాగే నీళ్లు ఎక్కువగా తాగుతుండాలి. రోజూ కనీసం అరగంటకు తగ్గకుండా వ్యాయామం చేయడం వల్ల మలబద్దకం తగ్గి కింది నుంచి గ్యాస్‌ పాస్‌ కావడం కూడా తగ్గుతుంది. 

చ్యూయింగ్‌గమ్‌ నమలడం మానేయండి : చ్యూయింగ్‌గమ్‌ నమిలే అలవాటు ఉన్నవారిలో అది నమిలే సమయంలో గాలిని ఎక్కువగా మింగడమూ జరుగుతుంటుంది. ఇలా మింగిన గాలే చాలాసందర్భాల్లో గ్యాస్‌ రూపంలో కింది నుంచి పోతూ ఉంటుంది. అలాగే మనం ఆహారాన్ని నమిలి మింగే సమయంలోనూ గాలిని మింగుతూ ఉంటాం. అయితే ఇలా మింగే గాలితో పోలిస్తే చ్యూయింగ్‌ గమ్‌ నమిలే సమయంలో మింగే గాలి మరీ ఎక్కువ. అందుకే చ్యూయింగ్‌ గమ్‌ నమిలే అలవాటు ఉన్నవారిలో గ్యాస్‌ ఎక్కువగా పోతుంటే... వారు ఆ అలవాటు తగ్గించుకోవాలి.  

కృత్రిమ చక్కెరలు / గ్యాస్‌ ఉండే కార్బొనేటెడ్‌ డ్రింక్‌లతో : కృత్రిమ చక్కెరలు/గ్యాస్‌ నిండి ఉండే కూల్‌డ్రింక్స్‌ వంటి శీతలపానియాల వల్ల కూడా కింది నుంచి గ్యాస్‌ పోవడం ఎక్కువగా జరుగుతుంటుంది. మనం శీతలపానియాలు తాగగానే కడుపు ఉబ్బరంగా ఉండటం చాలామంది గమనించే ఉంటారు. ఇలా చేరిన గాలి కూడా చాలా సందర్భాల్లో కింది నుంచి పోతూ ఉంటుంది. అందుకే కింది నుంచి గ్యాస్‌పోయేవారిలో శీతలపానియాలు తాగుతుంటే... ఆ అలవాటును బాగా పరిమితం చేసుకుంటే మంచిది. 

బాగా నమిలి మింగాలి : వేగంగా నమిలి మింగడం కంటే... నెమ్మదిగా, నింపాదిగా నమిలి మింగేవారిలో గాలి లోపలికి చాలా తక్కువగా ప్రవేశిస్తుంది. అదే గబగబా నమిలి మింగుతుంటే కడుపులోకి గాలి ఎక్కువగా వెళ్లి... అది కింది నుంచి పోయే అవకాశం ఉంది. అందుకే మనం తినే ఆహారాన్ని వీలైనంత నెమ్మదిగా, నింపాదిగా నమిలి మింగాలి. అలాగే ఒకేసారి ఎక్కువగా తినడం కంటే... తక్కువ (చిన్న చిన్న) మోతాదుల్లో ఎక్కువ సార్లు తింటుండాలి. 

►ఇక ఆహారంలో కొవ్వులు జీర్ణం కావడానికి చాలా ఎక్కువ సమయమే పడుతుంది. అందుకే జీర్ణమయ్యే వ్యవధి పెరుగుతున్నకొద్దీ కింది నుంచి గ్యాస్‌పోయే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఆహారంలో కొవ్వులను తగ్గించాలి. కొవ్వులు తీసుకున్నప్పుడు ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల కూడా ఈ సమస్యను తగ్గించవచ్చు. 

►స్థూలకాయం ఉన్నవారిలో, ఒంటి బరువు ఎక్కువగా ఉన్నవారిలో కింది నుంచి గ్యాస్‌ పోవడం ఎక్కువ. అందుకే బరువును  అదుపులో ఉంచుకోవాలి.  ఆహారంలో అల్లం, పుదీనా వంటివి గ్యాస్‌ సమస్యను తగ్గిస్తాయి. అందుకే కింది నుంచి గ్యాస్‌పోయే వారు వాటిని ఎక్కువగా వాడటం మంచిది. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top