పర్యావరణం ఒక హెడ్‌లైన్‌ కావాలి | Sakshi
Sakshi News home page

పర్యావరణం ఒక హెడ్‌లైన్‌ కావాలి

Published Thu, Feb 9 2017 10:53 PM

పర్యావరణం ఒక హెడ్‌లైన్‌ కావాలి

కృషి

పీఎన్‌ వాసంతి.. వార్తల్లో వ్యక్తి కాదు.  కాని ఆమె గురించి రాయాల్సిన, తెలుసుకోవాల్సిన అవసరం ఉన్న వ్యక్తి! ఎందుకంటే జెండర్‌ గురించి, బాలల గురించి, పర్యావరణం గురించి  మీడియా ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించడానికి 25 ఏళ్ల కిందటే నడుంకట్టారు ఆమె. మంచి మార్పుకి మీడియా పవర్‌ఫుల్‌ టూల్‌ అని పాతికేళ్ల కిందటే గ్రహించి పీజీ స్టూడెంట్‌గా ఉన్నప్పుడే ‘సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌’ అనే ఆర్గనైజేషన్‌ను ప్రారంభించి  ఈ రోజు దానికి డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అందుకే ఆమె గురించి తెలుసుకోవాలి.

వివరాలు...
పీఎన్‌ వాసంతి  ఢిల్లీలో పుట్టి పెరిగారు. ఎమ్‌ఏ సైకాలజీ చేశారు. తల్లిదండ్రులు కూతురుని  సివిల్‌ సర్వీసెస్‌లోకి పంపాలనుకున్నారు. వాసంతికేమో బయటి నుంచి ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే రంగాల్లో పని చేయాలని ఉండేది. సైకాలజీలో ఆమె సబ్జెక్ట్‌ కూడా ‘మీడియా ఇంపాక్ట్‌ ఆన్‌ హ్యుమన్‌ బిహేవియర్‌’. చదువు, ఇష్టం, లక్ష్యం మూడూ  ఆమెను ఊరికే ఉండనివ్వలేదు. ఎమ్‌ఏ ఫైనలియర్‌లో ఉన్నప్పుడే  తోటి విద్యార్థులతో కలిసి  ‘సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ ఆర్గనైజేషన్‌’ను స్టార్ట్‌ చేశారు.  ఇది మీడియాను సెన్సిటైజ్‌ చేసే సంస్థ.

స్ఫూర్తి
వాసంతికి చిన్నప్పుడు  ఇందిరాగాంధి అంటే  స్ఫూర్తి. స్కూల్లో చదువుతున్నప్పుడు ఇందిరాగాంధీని కలిశారు కూడా.  ఆమె ఇతర మహిళలకు ఎలా స్ఫూర్తిగా నిలిచింది,  దేశ విధానాల్లో ఇన్ని మార్పులను ఎలా తీసుకురాగలింది అనే దాని మీద దృష్టిపెట్టారు. తాను అనుకున్న వాటి మీద అధ్యయనం చేస్తూ, పరిశీలిస్తూ దేశమే కాదు ప్రపంచమంతా తిరిగారు. మనకు, పాశ్చాత్యా దేశాలకు మధ్య తేడాలేంటో తెలుసుకున్నారు. ‘మన దగ్గర తోటి మానవుల పట్ల అసలు గౌరవం ఉండదు. ఇక స్త్రీల విషయంలో చెప్పక్కర్లేదు. కాని వెస్ట్రన్‌ కంట్రీస్‌లో  తోటివారికిచ్చే విలువ, గౌరవాన్ని చూస్తే ముచ్చటేస్తుంది. ఒకింత అసూయా కలుగుతుంది.  మన దేశంలో అది కనిపించదని బా«ధపడ్డాను కూడా. బహుశా మన దగ్గరున్న అధిక జనాభా దీనికి కారణమై ఉండొచ్చు. జనం విపరీతంగా ఉండడం వల్ల మనకు మనవాళ్ల విలువ తెలియట్లేదేమో! అయితే అధిక జనాభా కూడా మనకు స్ట్రెంతే. దాన్ని తెలుసుకోలేకపోతున్నాం.’ అంటారు వాసంతి.

కృషి ఎంత?
ఆమె ఈ 25 ఏళ్లుగా జెండర్, పిల్లలు, పర్యావరణ సమస్యలెన్నిటినో  వెలుగులోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా పర్యావరణ సమస్యలు.  మనింట్లోని పెరట్లో వచ్చే మార్పులనే మనం గమనించలేకపోతున్నాం అంటారామె.  ‘మా స్టడీలో వార్తాపత్రికలు, చానెళ్లు లేవనెత్తిన అంశం చాలా ఆసక్తికరంగా ఉంది. మాకు పర్యావరణానికి సంబంధించి కంటెంటే రాదు అంటారు వాళ్లు. దీని మీద పనిచేసే ఎన్‌జీవోలున్నాయి కాని సమస్యలు కాకుండా వాళ్ల ఎజెండానే ఫోకస్‌ చేస్తుంటారు అని కూడా చెప్పారు. అప్పుడు మాకర్థమయిందేంటంటే మీడియాకు పర్యావరణానికి సంబంధించిన కంటెంట్‌ కావాలి. అంటే స్పేస్‌ ఉంది. కంటెంట్‌ ఇవ్వాలి. ఇది పదిహేనేళ్ల కిందటి విషయం. టెలివిజన్‌ ఇండస్ట్రీ అప్పుడప్పుడే బూమ్‌లోకి వస్తోంది. ఆ అవకాశాన్ని తీసుకొని ఒక ఫిలిం ఫెస్టివల్‌ను స్టార్ట్‌ చేశాం. ఇప్పుడు అది ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌గా మారింది. దీనికి సబ్టెక్ట్‌ ‘ఎన్వైర్‌మెంట్‌ అండ్‌ వైల్డ్‌లైఫ్‌’. దీనివల్ల ప్రజలు పర్యావరణంతో మమేకం కావడం మొదలుపెట్టారు.  తమ చుట్టూ ఉన్న పరిసరాలను గమనించడం, వస్తున్న మార్పులను పసిగట్టడం, సమస్యలను గుర్తించడం ప్రారంభించారు. పర్యావరణ స్పృహను తెచ్చుకుంటున్నారు. భవిష్యత్తులో పర్యావరణ సమస్యలకు పరిష్కారాన్నీ వాళ్లే సూచించగలుగుతారు’ అంటారు వాసంతి.

చట్టాలు మాత్రమే.. అమలు?
జెండర్, పిల్లలు, పర్యావరణం విషయం ఏదైనా సరే... వాటి మీద పనిచేయడానికి  ఎన్ని స్వచ్ఛంద సంస్థలున్నా మార్పు రావట్లేదు. కారణం మన బాధ్యతారాహిత్యమే అంటారు వాసంతి. ‘ఏ సమస్య వచ్చినా ప్రభుత్వమే పరిష్కరిస్తుందనుకుంటాం మనం. కాని ప్రభుత్వం ఏం చేçస్తుంది. చట్టాలను మాత్రం తెస్తుంది. ఉదాహరణకు పిల్లల హక్కుల సంరక్షణకు లేదంటే బాలకార్మిక వ్యవస్థ నిర్మూలననే తీసుకుందాం. దానికి  ఓ చట్టం చేసింది ప్రభుత్వం. అమలు చేసేది మనమే కదా. ఇక్కడ  మనమంటే పౌర సమాజం, స్కూళ్లు, కాలేజీలు, యువతరం, టీచింగ్‌ సిస్టమ్, మీడియా. వీళ్లంతా వాళ్ల వాళ్ల విధులను నిర్వర్తించాలి. అందుకే మన ప్రవర్తనలో మార్పు అవసరం’ అని స్పష్టం చేశారు.

ఎలా పనిచేస్తారు?
జెండర్, బాలలు, పర్యావరణం మొదలగు అంశాల మీద  మీడియాకు సమాచారం అందించడానికి, సలహాలు ఇవ్వడానికి సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ వివిధ స్థాయిల్లో పనిచేస్తుంది. ముందుగా మీడియా యాజమాన్యాలతో మాట్లాడుతుంది. చైతన్యపరుస్తుంది.  ఇంకోవైపు మీడియాలో పనిచేసే వాళ్లకు అవగాహన కల్పించడానికి రెగ్యులర్‌గా వర్క్‌షాప్స్‌ నిర్విహిస్తుంది. ఫెలోషిప్స్‌ ఇస్తోంది. మంచి కథనాలకు అవార్డ్స్‌ ప్రదానం చేస్తోంది. అయితే  ఈ సంస్థ దృష్టి పెట్టినవన్నీ  చాలా సీరియస్‌ అంశాలు. టీఆర్‌పీ రేట్‌ను పెంచేవి కావు, కమర్షియల్స్‌తో కాసులు కురిపించేవీ కావు. కాబట్టి వీటి మీద కథనాలు ప్రచురించడానికి, ప్రసారం చేయడానికి మీడియా అంత సుముఖంగా ఉండదు.  ఆ అడ్డంకినీ అధిగమించే పాలసీల గురించీ సంబ«ంధింత అ«ధికారులతో చర్చలు జరుపుతుంది. ‘మా ప్రయాణం సుదీర్ఘమైనది. సమాజంలో తగిన మార్పు, చేతన వచ్చే వరకూ మేము పని చేస్తూనే ఉంటాం’ అంటారు పీఎన్‌ వాసంతి.
– సాక్షి ఫ్యామిలీ

Advertisement
 
Advertisement
 
Advertisement