చెత్త పుస్తకం

Engineering Shubhashree Parameswaran - Sakshi

కొత్త సందేశం 

శుభశ్రీ పరమేశ్వరన్‌ ఇంజనీరింగ్‌ చదివారు. ఐటీ రంగంలో పది సంవత్సరాలు పనిచేశారు. ‘లెట్స్‌ టాక్‌ ట్రాష్‌’ పుస్తకం ద్వారా జీరో వేస్ట్‌ గురించి ప్రచారం చేస్తున్నారు. వృథాను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రవర్తించాలని  ఆచరణ ద్వారా చూపుతున్నారు.

‘‘మనమంతా పరిశుభ్రమైన వాతావరణంలో ఆరోగ్యంగా జీవించడానికి అనుసరించవలసిన మార్గాలను అందరికీ తెలియచేయాలని సంకల్పించాను. బొమ్మల ద్వారా తేలికగా అర్థం చేసుకోగలుగుతారని భావించాను. చిన్న చిన్న బొమ్మలు వేసి, వాటి కిందే ఆ బొమ్మలకు సంబంధించిన సందేశం రాసి, పుస్తకంగా తయారు చేశాను’’ అన్నారు శుభశ్రీ సంగమేశ్వర.

రెండేళ్లుగా బొమ్మల సందేశం
బెంగళూరుకు చెందిన శుభశ్రీ రెండు సంవత్సరాల క్రితం ఉద్యోగరీత్యా హైదరాబాద్‌ వచ్చి స్థిరపడ్డారు. మన ముందు ముందుతరాల వారు ఏయే మార్గాల ద్వారా చెత్తను తగ్గించేవారో బొమ్మల ద్వారా చూపుతున్నారు ఆమె. ‘లెట్స్‌ టాక్‌ ట్రాష్‌’ అనే తన  పుస్తకంలోని బొమ్మల్ని, సందేశాలను పిల్లలకు, పెద్దలకు అందరికీ అర్థమయ్యే రీతిలో వేశారు శుభశ్రీ. ‘‘నేను బి.టెక్‌ పూర్తి చేశాక, ఐటీ శాఖలో దశాబ్దకాలం పనిచేశాను. ఇంత చదువుకుని, యాంత్రికంగా జీవించడం నాకు నచ్చలేదు. నా వల్ల సమాజానికి ఎంతో కొంత ఉపయోగం ఉండాలని భావించాను. ‘జీరో వేస్ట్‌’ గురించి ప్రచారం చేయాలని నిశ్చయించుకున్నాను. ఇందుకు సంబంధించి రెండు సంవత్సరాలుగా బొమ్మలు వేయడం ప్రారంభించాను’’ అని చెప్పారు శుభశ్రీ. అందులో ఆమె వృథాను అరికట్టేందుకు ప్రతిరోజూ తనకు వచ్చే చిన్న చిన్న ఆలోచనలను బొమ్మలుగా వేశారు

సీసాల్లో తెచ్చుకునేవారు
ఈ పుస్తకం ద్వారా తాను పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని కాని, తనను తాను ప్రదర్శించుకోవాలని కాని అనుకోవట్లేదంటారు శుభశ్రీ. ‘‘సుమారు ముప్పై సంవత్సరాల క్రితం వరకు ప్రతి ఇల్లు జీరో వేస్ట్‌గా ఉండేది. అంటే.. వీసమెత్తు కూడా వృథా ఉండేది కాదు. ఈ విషయం నేటితరం వారికి తెలియకపోవచ్చు కాని, నాటితరం పెద్దవాళ్లకి బాగా తెలిసి ఉంటుంది. పాలను గాజు సీసాలలో అమ్మేవారు. మన దగ్గర ఉండే ఖాళీ సీసాలను పాల కేంద్రంలో ఇచ్చి, అక్కడి నుంచి నిండు సీసాలు తెచ్చుకునేవారు. ప్లాస్టిక్‌ బ్యాగులలో చెత్తను తీసుకువెళ్లడమనేది ఆ రోజుల్లో ఎవ్వరికీ తెలియదు. ఏ ఇంట్లోనూ బయట పడేసేంత చెత్త కనిపించేది కాదు. మార్కెట్‌కి వెళ్లేటప్పుడు వారి వెంట సంచి తప్పనిసరిగా ఉండేది. ప్లాస్టిక్‌ కవర్లు కనిపించేవి కాదు. ఆ రోజుల్లో జీవన విధానం అంత శుభ్రంగా ఉండేది’’ అంటారు శుభశ్రీ. 

ఏదీ వృథా అయ్యేది కాదు
గతంలో వస్త్రాలతో చేసిన సంచీలు, మళ్లీమళ్లీ వాడుకునేలాంటి వస్తువులనే ఎక్కువగా ఉపయోగించేవారు. గాజు సీసాలలో, స్టీలు పాత్రలలో వస్తువులను నిల్వ చేసుకునేవారు. పాతబడిపోయిన వస్త్రాలను ఇల్లు శుభ్రం చేయడానికి వినియోగించేవారు. బొగ్గులు కాలిన బూడిదతో గిన్నెలు తోముకునేవారు. వేప పుల్లలతో పళ్లు తోముకునేవారు. వాడకానికి పనికిరావు అనుకునే వస్తువులను మాత్రమే బయట పడేసేవారు. ఇంత పద్ధతిగా మన పూర్వీకులు జీరో వేస్ట్‌ జీవితాలను గడిపారు.. అంటూ తను గతంలో అమ్మమ్మల ఇంట్లో చూసిన విశేషాల గురించి చెప్పారు శుభశ్రీ.

‘చెత్త’గా మారిపోయాం
రోజులు మారాయి. ఇళ్లన్నీ ప్లాస్టిక్‌ వస్తువులతో నిండిపోతున్నాయి. ఒక్క ఫోన్‌ కాల్‌ లేదా ఒక్క యాప్‌ ద్వారా ప్లాస్టిక్‌ కవర్లలో భోజనం ఇంటికి వస్తోంది. భోజనం పూర్తయ్యాక అన్ని కవర్లను బయట పడేస్తున్నారు. ప్రస్తుతం పట్టణాలలో ప్రతి మనిషి రోజుకి ఒకటిన్నర కిలోల చెత్తను బయటపడేస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. దీని గురించే చెబుతూ‘‘పది లక్షల జనాభా ఉన్న పెద్ద నగరాలలోని విషయం ఇది. చెత్త పెరగకుండా నియంత్రించడంలో  నగరాలు చురుకుగా వ్యవహరించడం లేదు. వాతావరణం కలుషితమవడం గురించి అందరూ బాధ్యతగా ఆలోచించాలి’’ అంటున్న శుభశ్రీ... భూమిని కాపాడటానికి తనవంతు బాధ్యతగా ‘లెట్స్‌ టాక్‌ ట్రాష్‌’ తో తొలి అడుగు వేశారు.

పాత పద్ధతులే ఆరోగ్యం
‘‘చిన్నప్పటి నుంచి మా అమ్మ, అమ్మమ్మ వాళ్లు ‘జీరో వేస్ట్‌’తో ఎంత సాధారణ జీవితాన్ని గడిపేవారో గమనించాను. స్టీలు క్యానుల్లో నూనె తెచ్చేవారు. పాత హార్లిక్స్‌ సీసాలు, బోర్న్‌విటా సీసాలను సరుకులు వేయడానికి ఉపయోగించేవారు. ఆ సీసాలు సుమారు 40 సంవత్సరాలుగా ఇంట్లో ఉండటం గమనించాను. ఆ పద్ధతులనే ఈ తరం వారు కూడా అనుసరించి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి’’ అంటున్నారు శుభశ్రీ. అమెరికన్‌ సింగర్‌ లారెన్‌ నిర్వహిస్తున్న బ్లాగ్‌ను రెండు సంవత్సరాలుగా ఫాలో అవుతున్నారు శుభశ్రీ. ‘‘లారెన్, బెన్‌ జాన్‌సన్‌ల నుంచి ప్రేరణ పొందాను’’ అంటున్న శుభశ్రీ, తన ప్రణాళికకు ‘‘స్కెచ్‌ బుక్‌ ప్రాజెక్ట్‌’’ విధానం అనుసరిస్తున్నారు. ‘‘జీరో వేస్ట్‌ను ప్రతిబింబించేలా క్యారికేచర్‌లు వేయడం ద్వారా ప్రజలలో చైతన్యం తీసుకురావొచ్చనే ఉద్దేశంతో ఈ విధానం ఎంచుకున్నాను’’ అంటున్నారు.
–  వైజయంతి పురాణపండ

మూడు సూత్రాలు
ప్లాస్టిక్‌ సీసాలలో నీళ్లు తాగడం మానేయాలి, ప్లాస్టిక్‌ స్ట్రాలు నిషేధించాలి, ప్లాస్టిక్‌ బ్యాగులను తిరస్కరించాలి.
బాత్రూమ్, కిచెన్, వార్డ్‌రోబ్‌ వంటి ప్రదేశాలలో ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయం చూడాలి.
ప్రయాణాలలో పసిపిల్లలకు సంబంధించిన వస్తువులను కూడా జీరో వేస్ట్‌గా చూసుకోవాలి. ముఖ్యంగా డిస్పోజబుల్‌ డయాపర్స్, ప్లాస్టిక్‌ బొమ్మలను నివారించాలి.

మా అమ్మాయి కూడా..!
నా వరకు నేను వేస్ట్‌ను బాగా తగ్గిస్తున్నాను. ఇంటికి ఏ ప్లాస్టిక్‌ వస్తువు తేవాలన్నా బాగా ఆలోచిస్తాను. స్ట్రాలు, ప్లాస్టిక్‌ కవర్లు తీసుకోను, బిస్కెట్లు, చిప్స్‌ వంటివి అస్సలు కొనను. ఎక్కడకు వెళ్లినా నా వెంట వాటర్‌ బాటిల్‌ ఉంటుంది. ప్రయాణాల్లో నా పరంగా ఎక్కువ చెత్త రాకుండా జాగ్రత్తపడుతున్నాను. మా నాలుగేళ్ల అమ్మాయి కూడా నన్ను అనుసరిస్తోంది.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top