ఫైబ్రాయిడ్స్‌ తగ్గుతాయా?

Does fibroids subside? - Sakshi

ఫ్యామిలీ డాక్టర్‌

హోమియో కౌన్సెలింగ్స్‌
నా వయసు 42 ఏళ్లు. గత కొంతకాలంగా గర్భాశయంలోని ఫైబ్రాయిడ్స్‌ సమస్యతో బాధపడుతున్నాను. హోమియో చికిత్సతో ఈ సమస్య మళ్లీ తిరగబెట్టకుండా పూర్తిగా నయం చేసే అవకాశం ఉందా?– సుధారాణి, కర్నూలు
గర్భాశయంలో ఏర్పడే కణుతులను యుటెరైన్‌ ఫైబ్రాయిడ్స్‌ అంటారు. ఇవి గర్భాశయంలో ఒకటిగా లేదా చిన్న చిన్న నీటితిత్తులుగా కొన్ని సెంటీమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. గర్భాశయంలో వీటిని ఉనికి, పరిమాణరీత్యా వీటిని మూడు రకాలుగా విభజించవచ్చు.
1) సబ్‌సీరోజల్‌ ఫైబ్రాయిడ్స్‌ 2) ఇంట్రామ్యూరల్‌ ఫైబ్రాయిడ్స్‌ 3) మ్యూకోజల్‌ ఫైబ్రాయిడ్స్‌.
కారణాలు: ఇవి ఏ కారణం చేత ఏర్పడతాయనే విషయం పట్ల  స్పష్టత లేదు. కానీ కొన్ని హార్మోన్లు... ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్‌ హార్మోన్ల ప్రభావం వల్ల ఫైబ్రాయిడ్స్‌ ఏర్పడే అవకాశం ఎక్కువ. రుతుచక్ర సమయంలో, గర్భధారణ సమయంలో ఇవి ఎక్కువగా ఏర్పడతాయి. నెలసరి ఆగిపోయిన స్త్రీలలో ఈ హార్మోన్ల ఉత్పాదన చాలావరకు తగ్గడంతో పాటు ఫైబ్రాయిడ్స్‌ ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది. స్థూలకాయం, వంశపారంపర్యత వంటి అంశాల వల్ల కూడా గర్భాశయ కణుతులు ఏర్పడతాయి.
లక్షణాలు:  అధిక రుతుస్రావం, రెండు రుతుచక్రాల మధ్య వ్యవధి ఎక్కువ రోజులు కొనసాగడం, పొత్తికడుపులో నొప్పి, నడుము నొప్పి, ఫైబ్రాయిడ్స్‌ వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడినట్లే తరచూ మూత్రానికి వెళ్లాలని అనిపిస్తూ ఉండటం, పేగులపై ఒత్తిడి పడితే మలబద్దకం, కడుపుబ్బరం వంటి లక్షణాలను గమనించవచ్చు.
చికిత్స: జెనెటిక్‌ కాన్‌స్టిట్యూషన్‌ పద్ధతి ద్వారా హోమియో విధానంలో యుటెరైన్‌ ఫైబ్రాయిడ్స్‌ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఈ చికిత్స ద్వారా గర్భాశయపు కణుతులను పూర్తిగా తొలగించడమే గాకుండా, శరీరంలోని హార్మోన్లను అసమతౌల్యతను సరిచేయడం వల్ల సమస్యను తేలిగ్గా పరిష్కరించవచ్చు. మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
డాక్టర్‌ శ్రీకాంత్‌ మోర్లావర్‌
సీఎండీ, హోమియోకేర్‌ ఇంటర్నేషనల్, హైదరాబాద్‌

కాళ్ల మీద రక్తనాళాలు ఉబ్బి కనిపిస్తున్నాయి!

నా వయసు 45 ఏళ్లు. కనీసం పది నిమిషాల పాటు నిల్చోలేకపోతున్నాను. కాళ్లు లాగుతున్నాయి. కాళ్లపై నరాలు ఉబ్బి పాదాలు నలుపు రంగులోకి మారుతున్నాయి. దీనికి పరిష్కారం చెప్పండి. – శ్రీదేవి, కొత్తగూడెం
మీకు ఉన్న సమస్య వేరికోస్‌ వెయిన్స్‌. శరీరంలోని సిరలు బలహీనపడటం వల్ల ఏర్పడే సమస్యనే వేరికోస్‌ వెయిన్స్‌ అంటారు. అంటే శరీరంలోని రక్తనాళాలు రంగు మారతాయి లేదా నలుపు రంగులోకి మారతాయి. ఈ వ్యాధి ఎక్కువగా కాళ్లలో కనిపిస్తుంటుంది. సాధారణంగా రక్తం కింది నుంచి గుండెవైపునకు వెళ్లే సమయంలో భూమ్యాకర్షణకు వ్యతిరేక దిశలో రక్త సరఫరా అవుతుండటం వల్ల  రక్తప్రసరణ మందగించడం, కాళ్ల ఒత్తిడి పెరగడం జరగవచ్చు. ఈ క్రమంలో సిరలు (రక్తనాళాలు) నలుపు లేదా ఊదా రంగుకు మారుతాయి. దీనివల్ల కాళ్లలో తీవ్రమైన నొప్పి ఏర్పడి నడవడానికీ వీలు కాదు. మహిళలు, స్థూలకాయులు, వ్యాయామం చేయనివారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
కారణాలు: ∙ముందుకు ప్రవహించాల్సిన రక్తం వెనకకు రావడం ∙కొంతమంది మహిళల్లో గర్భధారణ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పులు ∙ఎక్కువ సేపు నిలబడి చేయాల్సిన ఉద్యోగాల్లో (పోలీస్, సెక్యూరిటీ సిబ్బంది, కండక్టర్, వాచ్‌మేన్, సేల్స్‌మెన్, టీచర్లు వంటి) ఉద్యోగాలలో ఉండేవారికి ఈ సమస్య ఎక్కువ.
లక్షణాలు: ∙కాళ్లలో నొప్పి, మంట, కాళ్లలోని కండరాలు బిగుసుకుపోవడం ∙కొద్దిసేపు నిలబడితే నొప్పి రావడం, దాని తీవ్రత పెరుగుతూ పోవడం ∙చర్మం దళసరిగా మారడం  చర్మం ఉబ్బడం, పుండ్లు పడటం
వ్యాధి నిర్ధారణ: అల్ట్రాసౌండ్, డ్యూప్లెక్స్‌ డాప్లర్‌ అల్ట్రా సౌండ్‌.
చికిత్స:  వేరికోస్‌ వెయిన్స్, వేరికోసిల్‌ వంటి వ్యాధులకు హోమియోపతి చికిత్సలో అనుభవం ఉన్న, పరిశోధనల అనుభవం ఉన్న వైద్యులు చికిత్స చేస్తారు. వ్యాధి తీవ్రతను పరిశీలించి, రోగి వ్యక్తిగత లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఆపరేషన్‌ అవసరం లేకుండానే మంచి మందులు సూచిస్తారు.
- డాక్టర్‌ మురళి కె. అంకిరెడ్డి,
ఎండీ (హోమియో) స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌

మూత్ర విసర్జన సమయంలో మంట!
నా వయసు 28. ఈమధ్య వెంటవెంటనే మూత్రం వచ్చినట్లుగా అనిపించడంతో పాటు మంటగా ఉంటోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. – ఒక సోదరి, విజయవాడ
మూత్ర విసర్జక వ్యవస్థలో వచ్చే ఇన్ఫెక్షన్లను యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌గా పేర్కొంటారు. మహిళల్లో చాలా సాధారణంగా వస్తుంటాయి. వీటిని రెండు రకాలుగా విభజించవచ్చు.
►అప్పర్‌ యూరినరీ టాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌ : ఇందులో మూత్రపిండాలు, మూత్రనాళాలకు ఇన్ఫెక్షన్‌ వస్తుంది.
►లోవర్‌ యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌: ఇందులో మూత్రాశయం, యురెథ్రాలు ప్రభావితమవుతాయి.
కారణాలు: యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌లో దాదాపు 90 శాతం కేసుల్లో ఈ–కొలై అనే బ్యాక్టీరియా ప్రధానంగా కారణమవుతుంది. ఇది పేగుల్లో, మలద్వారం వద్ద పరాన్నజీవిగా జీవిస్తూ ఉంటుంది. సరైన వ్యక్తిగత పరిశుభ్రత పాటించనివారిలో ఈ–కొలై బ్యాక్టీరియా పైపైకి పాకుతూ మూత్రకోశ ఇన్ఫెక్షన్స్‌కు దారితీస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఉండటం కూడా మూత్రవిసర్జనకు ప్రధాన అడ్డంకిగా మారి, దీనివల్ల కూడా బ్యాక్టీరియా త్వరగా అభివృద్ధి చెంది ఇన్ఫెక్షన్‌కు దారితీయవచ్చు. రోగనిరోధకశక్తి తగ్గినవారిలో తరచూ యురినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌ రావచ్చు.
లక్షణాలు: మూత్రవిసర్జనకు ముందుగానీ, తర్వాతగానీ విపరీతమైన మంట ఉండటం, ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రంలో రక్తం పడటం, పొత్తికడుపు వద్ద నొప్పి, చలిజ్వరం, వాంతులు, వికారం
చికిత్స: యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌ను నయం చేయడానికి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యా«ధిలక్షణాలను పరిగణనలోకి తీసుకొని, వ్యక్తి తత్వాన్ని బట్టి హోమి యో మందులను నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో, క్రమం తప్పకుండా వాడితే మంచి ఫలితాలు ఉంటాయి.
- డాక్టర్‌ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ
పాజిటివ్‌ హోమియోపతి, హైదరాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top