నాడు రిక్షావాలా... నేడు రాష్ట్రపతికి అతిథి!

నాడు రిక్షావాలా... నేడు రాష్ట్రపతికి అతిథి!


విజయం

రిక్షా కార్మికుడిగా మొదలైన ఆయన ఇప్పుడు సాక్షాత్తూ భారత రాష్ట్రపతి నివాసంలో అతిథి. ఇరవై ఏడేళ్ళ క్రితం ఢిల్లీలో ఈ బ్రిటిష్ కాలపు భవనాలను అబ్బురంగా చూస్తూ తిరిగిన ఆయనకు ఇది ఊహించని అనుభవం. హర్యానా వాసి అయిన 51 ఏళ్ళ ధరమ్‌వీర్ కాంబోజ్ ఈ స్థాయికి రావడం వెనుక ఎంతో కృషి ఉంది. ఎంతోమందికి ఉపయోగపడే యంత్రాన్ని రూపొందించిన పట్టుదల ఉంది.

 

ధరమ్‌వీర్ కథ అచ్చంగా ఓ సినిమా కథలా ఉంటుంది. హర్యానాలోని యమునా నగర్ ధరమ్‌వీర్ సొంత ఊరు. ఒకానొక దశలో కన్నకూతురి స్కూల్ ఫీజు కూడా కట్టలేని దుర్భర స్థితిలో గడిపారు. భార్యాబిడ్డల్ని పోషించలేక, తండ్రితో మాటా మాటా రావడంతో, 23 ఏళ్ళ వయసప్పుడు 1986లో ధరమ్‌వీర్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. ఢిల్లీకి చేరిన ఆ యువకుడు రిక్షా కార్మికుడిగా మారాడు. కానీ, 1987లో ప్రమాదానికి గురవడంతో తప్పనిసరై, ఇంటికి తిరిగి వెళ్ళాల్సి వచ్చింది.అప్పుడు కొన్ని నెలల పాటు మంచానికే పరిమితమవ్వాల్సి వచ్చింది. అప్పుడే ఓ ఆలోచన ఆయన మెదడును తొలిచేసింది. రైతులైన తాము గ్రామాల్లో పండించే పండ్లు, కూరగాయలు, ఔషధ మొక్కలకు ఆట్టే లాభం రావడం లేదనీ, అదే గనక వాటిని ప్రాసెస్ చేసి, ప్యాకేజ్ చేస్తే లాభం వస్తోందని ఢిల్లీలో ఉండగా ఆయన గమనించారు. ఆ ఆలోచన జీవితాన్నే మార్చేసింది.

 

ప్రమాదం నుంచి కోలుకోగానే రైతులతో మాట్లాడడం మొదలుపెట్టారు. సేంద్రియ వ్యవసాయంలో అనేక రకాల ప్రయోగాలు చేశారు. చివరకు రూపొందించిన ఫుడ్ ప్రాసెసింగ్ యంత్రం ఘన విజయం సాధించింది. గంటకు 200 కిలోలకు పైగా టమోటాల నుంచి గుజ్జు తీసే యంత్రమది.కలబంద, ఉసిరి, నేరేడు లాంటి వాటి నుంచి, అనేక ఇతర ఔషధమూలికల నుంచి రసం తీయడానికీ, వాటిని రకరకాల ఉత్పత్తులుగా తయారు చేయడానికి కూడా ఉపకరించే ఆ యంత్రమే ఇప్పుడు ఆయనను దేశ ప్రథమ పౌరుడికి అతిథిని చేసింది. రాష్ట్రపతి భవన్ అతిథులుగా ఎంపిక చేసిన అయిదుగురు నవీన ఆవిష్కర్తల్లో ఒకరిని చేసింది.

 ‘‘ఈ యంత్రాన్ని తయారుచేయడానికి నాకు 11 నెలలు పట్టింది.‘నేషనల్ ఇన్నొవేషన్ ఫౌండేషన్’కు చెందిన అధికారులు 2008లో నేనుంటున్న దామ్లా గ్రామానికి వచ్చి, యంత్రం ఎలా పనిచేస్తుందో చూశారు’’ అని ధరమ్‌వీర్ చెప్పుకొచ్చారు. ఆ ప్రయత్నం ఫలించి, గుర్తింపు తేవడంతో ఈ నెల ఒకటి నుంచి ఇరవై రోజుల పాటు రాష్ట్రపతి భవన్‌లో అతిథిగా గడుపుతున్నారాయన. ధరమ్‌వీర్ రూపొందించిన యంత్రం ద్వారా పువ్వుల నుంచి, ఔషధ మొక్కల నుంచి సారం తీసి, జెల్ లాగా కూడా చేయవచ్చు.‘‘హోలీ రంగుల కోసం మా అమ్మ పువ్వులు సేకరించడం, వాటి నుంచి రసం తీయడం లాంటి నా చిన్ననాటి సంగతులు ఇప్పటికీ గుర్తే’’ అంటూ ఔషధ రసాలు తీయడం వెనుక తనకున్న ఆసక్తికి కారణాన్ని ఈ అయిదుపదుల సృజనశీలి తెలిపారు. చెరుకుగడల పిప్పి సాయంతో పుట్టగొడుగులు పెంచి, రికార్డు స్థాయి దిగుబడి సాధించారు. టేప్ రికార్డర్ మోటార్‌ను వాడుతూ, బ్యాటరీ ద్వారా పని చేసే స్ప్రేయింగ్ యంత్రం, అలాగే క్రిమికీటకాలను పట్టుకొనే మరో సాధనం లాంటివి కూడా రూపొందించారు.

 

ఆయన ఈ ప్రయోగాలు చేస్తున్నప్పుడు చాలామంది ఎగతాళి చేశారు. కానీ, ఇవాళ నవ్విన నాపచేనే పండింది. ఈ యంత్రాల కోసం ఇప్పటికే విదేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. ‘‘కెన్యాలోని ఓ సంస్థకు ఇలాంటి 20 యంత్రాలు సరఫరా చేస్తున్నా’’ అని ధరమ్‌వీర్ చెప్పారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి, పదో తరగతి పైన చదువుకోలేకపోయిన ఆయన బడిలో చదువుకుంటున్నప్పుడే సైన్స్ ఎగ్జిబిషన్లలో ఎమర్జెన్సీ లైట్ తయారు చేశారు.ఆ దశ నుంచి గంటలో 100 కిలోల కలబందను ప్రాసెస్ చేసే యంత్రాన్ని రూపొందించే స్థాయికొచ్చారు. అది బాయిలర్‌గా, స్టెరిలైజర్‌గా, కుకర్‌గా రకరకాలుగా ఉపయోగపడుతుంది. దాంతో, బియ్యం ఉడికించవచ్చు. టొమేటా కెచప్ చేయవచ్చు. మసాలా దినుసులు, పండ్ల నుంచి పొడి తీయవచ్చు.

 

ఈ ఉత్సాహవంతుడి కృషిని గమనించి హర్యానా ప్రభుత్వం ఇప్పటికే తమ హిసార్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బోర్డ్ సభ్యుడిగా కూడా ఆయనను నియమించింది. అనేక అవార్డులూ వచ్చాయి. అయితే, ఒకప్పుడు తిట్టిన తండ్రి ఈ ఘన విజయాలను కళ్ళారా చూడలేకపోయారని ఆయన ఇప్పటికీ బాధపడుతుంటారు. తిండికి గడవని రోజుల నుంచి ఇవాళ నెలకు రూ. 50 వేలు సంపాదిస్తూ, కనీసం పాతికమందికి పైగా ఉపాధి కల్పించే దశకు చేరుకోవడం ఆయన ఘనత.తాను పెద్దగా చదువుకోకపోయినా కొడుకును కంప్యూటర్ ఇంజనీర్‌నూ, కూతుర్ని ఎం.బి.ఎ. పట్టభద్రురాలినీ చేశారు. అలోవెరా షాంపూలూ, చూర్ణాలు, జెల్, ఫేస్‌ప్యాక్, ఉసిరికాయ జ్యూస్, లడ్డూ, బర్ఫీ లాంటివి తన కుమారుడు ప్రిన్స్ పేరు మీద తయారు చేస్తున్నారు. ఉత్తరాదిన ఈ ఉత్పత్తులు జోరుగా అమ్ముడవుతున్నాయి. భార్య సహకారం వల్లే ఇదంతా సాధ్యమైందంటున్న ధరమ్‌వీర్ సానుకూల దృక్పథం, కఠోర పరిశ్రమ, ఏదైనా సరే నేర్చుకోవాలన్న తపన తన బలాలంటున్నారు. విజయ సాధకులకు కావాల్సినవేమిటో ఇక వేరే చెప్పాలా?     - మహతి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top